తట్ట చెప్పిన తీర్పు

0
8

[dropcap]పా[/dropcap]డిపంటలు బాగా వున్న ఊరు ఒకటున్నది. ఆ ఊళ్లో ఎక్కువ మంది రైతులు వున్నారు. పంటలు చేతికి రాగానే వాటిని అమ్మి రైతులు తమ అవసరాలను తీర్చుకుంటూ వుంటారు. కొంత మంది తీర్థయాత్రలకు కూడా వెడుతూ వుండేవారు. అదే వూళ్లో గణపతీ, అతని భార్యా కాపురముండేవాళ్లు. వాళ్లకు కూడా తీర్థయాత్రలకు వెళ్లాలని కోరికవుండేది. వీళ్ల ఇల్లు కృష్ణానది ఒడ్డున వుండేది. ఇంటికి దగ్గర్లోనే ఒక గుడి కూడా వుండేది. ఆ గుళ్లోని దేముడికి వీళ్లిద్దరూ ఎప్పుడూ దండం పెట్టుకుంటూ వుండేవారు. వీళ్లు పేదవాళ్లు. అప్పుడప్పుడూ పస్తులు కూడా వుండేవాళ్లు. మిగతా వాళ్లు తీర్థయాత్రలకెళ్తూవుంటే వీళ్లు బాధపడుతూ వుండేవాళ్లు. ఆ దేముడు ఎప్పటికి కరుణిస్తాడో అని ఎదురు చూస్తూ వుండేవాళ్లు.

ఊర్లోని భూములు బాగా సారవంతమైనవి. పంటలు బాగా పండేవి. వాటిల్లో ఈ దంపతులు కూలి పని చేస్తుండేవాళ్లు. ఒళ్లు దాచుకోకుండా నిజయితీగా కష్టపడి పని చేసేవాళ్లు. ఆ సంవత్సరం కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు. కూలీలకు కూలీ కూడా బాగా ఇచ్చేవాళ్లు నిజాయితీగా. పంట కాలం వచ్చింది. పండిన పంట చాలా భాగం పొలం యజమానికే సరిపోయింది. పిల్లా జెల్లా ఎవరూ లేరు. ఎన్ని మొక్కలు మొక్కినా, ఎన్ని తాయెత్తులు కట్టించుకున్నా ఒక్క నలుసూ పుట్టలేదు. తీర్థయాత్రలు చేస్తేనన్నా పిల్లలు కలుగుతారేమోనన్న ఆశవున్నది. ‘పిల్లల్లేక పోతే ఎలా, తమ తలకొరివి ఎవరు పెడతారు. తమ తరువాత తమ వంశం నిలబడవద్దా’ అని ఆలోచించుకునే వాళ్లు. ‘ఈ సంవత్సరం ఎలాగైనాసరే తీర్థయాత్రలకెళ్లాలి, తుఫానొచ్చినా, కరువొచ్చినా ఆగేది లేదు. తిండికని అట్టి పెట్టుకున్న గింజల్ని కూడా అమ్మేద్దాం. కూలీ చేయగా వచ్చిన ప్రతి పైసా దాచి పెడదాం’ అనుకుంటూ ఎంతో కష్టపడి మూడు వందల రూపాయల్ని పోగుచేయగలిగారు.

‘మూడు వందల రూపాయిల్నీ తీసుకుని ప్రయాణం చేయడం మంచిది కాదు. చేతులో డబ్బెక్కువ వుంటే దుబారా అయిపోతుంది. పైగా  ఈ సంవత్సరం వ్యవసాయం చేసినట్లే వచ్చే సంవత్సరం కూడా వ్యవసాయం చెయ్యాలి. ఆ పెట్టుబడికి కొంత డబ్బు కావాలి’ అని ఆలోచించారు. ఆ ఊళ్లో వెంకయ్య అనే వ్యాపారి వున్నాడు. అతడు చిల్లర కొట్టు నడుపుతూ వుంటాడు. వీళ్లక్కావలసిన సరుకుల్ని అక్కడే కొనుక్కుంటూ వుంటారు. అందుకని వెంకయ్య దగ్గర కొంత డబ్బు దాచి పెట్టి తీర్థయాత్రలకెళ్దామనుకున్నారు.

పంటల సమయంలో వెంకయ్య బియ్యం వ్యాపారం కూడా చేస్తాడు. ఆ ఊళ్లో రెండస్తుల ఇల్లు వున్నది వెంకయ్యకొక్కడికే. కాబట్టి తమ డబ్బు భద్రంగా వుంటుదని గణపతి దంపతులు భావించారు.

వెంకయ్య ఒక మాదిరి ధనికుడు. కానీ బాగా పిసినారి. దానం చెయ్యటమంటే ఇష్టమే వుండదు. ఎవరికైనా అప్పు ఇస్తే రెండింతలు, మూడింతలు వడ్డీ వేసుకుని డబ్బు వసూలు చేస్తాడు. రైతుల దగ్గర ఎప్పుడూ చాలినంత డబ్బుండదు కాబట్టి వెంకయ్య దగ్గర అప్పుచేయాల్సి వచ్చేది. పైగా ఎన్ని వందలు బాకీ కావాలన్నా ఇవ్వగలిగేవాడు. అందుకని రైతులందరూ అతన్నే నమ్ముకుని అతని దగ్గరే అప్పులు చేస్తూ వుండేవాళ్లు.

గణపతి తన దగ్గరున్న డబ్బులు ఒక వంద రూపాయిలు వెండి నాణాలు ఒక డబ్బాలో పోసి గట్టిగా మూత పెట్టాడు. ఆ డబ్బాను తీసుకెళ్లి వెంకయ్యకిచ్చాడు. దాచమని అడిగాడు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చాక తీసుకుంటానని చెప్పాడు.

“దానికే భాగ్యం. అలాగే దాచి వుంచుతాను” అని వెంకయ్య ఆ డబ్బాను గణపతి చూస్తూ వుండగానే ఇనప్పెట్టలో పెట్టి తాళం వేశాడు.

అనుకున్న ప్రకారం గణపతి దంపతులు తీర్థయాత్రలకు వెళ్లారు. ఆనందంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. రెండు నెలల సమయం పట్టింది. చేతిలోని డబ్బంతా ఖర్చువటం వలన గణపతి వెంకయ్య దగ్గరకెళ్లి తన డబ్బు ఇమ్మని అడిగాడు.

వెంకయ్య ఇనప్పెట్టి తెరిచి గణపతి డబ్బాను భధ్రంగా తీసి అప్పజెప్పాడు. గణపతి ఇంటికి వచ్చి డబ్బాను తెరిచాడు. నివ్వెర పోయాడు. ఎందుకంటే డబ్బాలో వెండి నాణాలకు బదులుగా కంకర రాళ్లున్నాయి.

గణపతి గాభరాపడుతూ గ్రామ పెద్ద దగ్గరకెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంకయ్యను పిలిపించారు. విషయమడిగారు.

“నన్ను పిలిపించారు. అనవసరంగా నా మీద నింద వేస్తున్నారు. గణపతి నాకు డబ్బా ఇచ్చాడు. నేను మరలా అదే డబ్బాను తిరిగి ఇచ్చేశాను. ఆ డబ్బాలోపల ఏముందో నాకేం తెలుసు. అతని ఎదురుగానే  డబ్బాను ఇనపెట్టెలో దాచాను. మరలా అతని ముందే తీసి ఇచ్చాను. కావలిస్తే అతణ్ణే అడగండి. అబద్ధాలు చెప్పి నా ద్దగర డబ్బు గుంజటానికి గణపతే ఎత్తులు వేస్తున్నాడు” అని వెంకయ్య వాదించాడు.

“అబద్ధమాడాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజమే చెప్తున్నాను. భగవంతుని మీద ఒట్టు. డబ్బాలో నేను వంద వెండి రూపాయిలే వుంచాను. కంకరాళ్లు నేను పెట్టలేదు. నన్ను నమ్మండి” అని గణపతి దీనంగా చెప్పాడు.

“రూపాయలు పెట్టానని చెప్తున్నావు. నువ్వు పెట్టిన రూపాయిలు నేను కాజేశానా. నోరు అదుపులో వుంచుకుని మాట్లాడు. కల్లిబొల్లి మాటలు మాట్లాడితే ఎవరూ సహించరు” అని వెంకయ్య గద్దించగానే గణపతి భయపడిపోయాడు.

గ్రామ పెద్దకు కొంచెం కొంచెంగా విషయం అర్థమవుతూ వున్నది. అతను గణపతిని బాగా ఎరుగును. అతడు తన పని తాను చూసుకుంటాడుగాని ఒకళ్ల జోలికి వచ్చే రకం కాదు. పిల్లల చేతిలో కూడా మోసపోయేటంత మెత్తటి వాడు. ఇక పోతే వెంకయ్య మోసగాళ్లకే మోసగాడు. కాని తీర్పు ఎలా చెప్పాలి. వీళ్ల తగాదాలో సాక్షులు ఎవరు లేరు. గణపతి నిజాయితీపరుడే. కానీ నిరుపించాలిగదా అని ఆలోచనతో “మీరిద్దరూ రేపు రండి. తీర్పు రేపు చెప్తాను” అన్నాడు.

గ్రామ పెద్దకొక కూతురున్నది. ఆ అమ్మాయి చాలా తెలివిగలది. పెద్ద పెద్ద వాళ్లను కూడా దారిన పెట్టగలిగిన సమర్థురాలు. ఎంతటి చిక్కు సమస్యకైనా పరిష్కారం చూపటం ఆమెకు చాలా తేలికైన పని. గ్రామ పెద్ద తన తీర్పుల్లో తరచూ కూతురి సలహాలు తీసుకుంటూవుంటాడు. ఇప్పుడీ తగాదా సంగతి కూడా చెప్పాడు.

“నాన్నగారూ మీరు విచారించకండి. దీనికి తీర్పు నేను చెప్పగలను” అన్నది.

మరుసటి రోజు వెంకయ్య గణపతిలు వచ్చారు. వాళ్లతో పాటు వారిద్దరి భార్యలు కూడా వచ్చారు. తీర్పు ఏం చెప్తారో తెలుసుకోవాలని ఇద్దరికీ బాగా కోరికగా వున్నది.

వాళ్లను చూసి గ్రామ పెద్ద కూతురు సంతోషించింది. నాలుగు పెద్ద పెద్ద తట్టలు చెప్పించింది. ఆ తట్టలు మూతవేసి గట్టిగా మూయబడివున్నాయి.

“మీరు నలుగురూ ఒక్కొక్క తట్టను తీసుకుని మోసుకుంటూ మన గుడి దాకా వెళ్ళండి. మరలా అక్కణ్ణుంచి ఇక్కడకు రండి” అని చెప్పింది.

తట్టలు బాగా బరువుగా వున్నాయి. అతి కష్టం మీద వాటిని పైకెత్తుకున్నారు నలుగురూ. వెంకయ్య బాగా లావుగా వుంటాడు. దానకి తోటు పెద్ద పొట్ట. తట్ట మోయలేక రొప్పసాగాడు. అతని భార్య కూడా లావాటి మనిషి. ఆమెకయితే ఏడ్పే వస్తున్నది. ఆమె నెమ్మదిగా మాట్లాడసాగింది.

“బీదవాడి సొమ్ము కాజేయకపోతే ఏమవుతుంది. నీదంతా పేరాశ. ఇప్పుడు చూడు ఎంత కష్టమొచ్చి పడిందో” అన్నది.

“రూపాయలు ఊరికే పోగవుతాయా? వంద రూపాయిలొస్తుంటే ఒక  అరమైలు తట్ట మొస్తే ఏమవుతుంది? రూపాయిలు కావాలంటే ఆ మాత్రం చెమట కార్చినా ఏం ఫర్వాలేదు” అన్నాడు వెంకయ్య.

“నీ చెమట కారిస్తే ఫర్వాలేదు. కానీ పిచ్చిదానిలా నేనూ నీతోపాటు వచ్చి ఇరుక్కుపోయానే” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది.

గణపతి కూడా బరువు మోయటానికి తడబడుతున్నాడు. అతడసలే బలహీనంగావుంటాడు. బాగా బరువులు మోసే అలవాటు అంతగా లేదు. అతని భార్యకి కూడా కాసేపు ఈ తట్ట బరువు దించుకుంటే బాగుండునని వున్నది. కాని దించితే మరలా ఎత్తే వాళ్లు ఎవరూ లేరని భయపడుతున్నది.

“తీర్థయాత్రలు ఏ కష్టం లేకుండా చేసొచ్చాం. ఈ మొసగాడి దగ్గర మన డబ్బెందుకు దాచాలి. ఇంకెవరూ లేరా ఏంటి ఊళ్లో” అన్నది గణపతి భార్య.

“ఇతను ధనవంతుడు గదా, నా వంద రూపాయలకు ఆశపడతాడని ఎందుకనుకుంటాను. భగవంతుడు అంతా చూస్తూనే వుంటాడు. ఇతనికి తప్పకుండా శిక్ష వేస్తాడు. అయినా గ్రామ పెద్ద తీర్పు చెప్పటానికి తట్ట మోయిస్తున్నాడేమిటి?” అన్నాడు గణపతి.

అతి కష్టం మీద తట్ట మోసుకుని నలుగురూ తిరిగి గ్రామ పెద్ద ఇంటికి తిరిగి వచ్చారు. ఈ  విషయం విని ఊళ్లో వాళ్లు చాలా మంది పోగయ్యారు.

తట్టలు దింపగానే దాంట్లోని నలుగురు పిల్లలూ బయటికొచ్చారు. గ్రామ పెద్ద కూతురు ఆ నలుగురు పిల్లలకూ కాగితం ముక్కలు, పెన్సిలు ఇచ్చింది. తట్టలో కూర్చుని మీరు ఏం విన్నారో వ్రాయమన్నది.

ఆ నలుగురు పిల్లలూ తమని మోసిన వారు మాట్లాడిన మాటలు విన్నారు కాబట్టి వాటిని కాగితం మీద వ్రాసి చూపించారు. దాన్ని చదివి గ్రామ పెద్ద అందరికీ వినిపించాడు. అందరూ విన్నారు. తప్పెవరిదో అర్థమవుతున్నది. తీర్పు శుభ్రంగా తెలిసిపోతున్నది. గ్రామం మొత్తం వెంకయ్యను శాపనార్థాలు పెట్టసాగింది. అతడు బొమ్మలాగా నిలబడిపోయ్యాడు. తర్వాత తన ముఖాన్ని క్రిందకి దించుకున్నాడు. ఇదంతా చూసి గ్రామ పెద్ద కూతురు స్థంభం చాటున నిలబడి కిల కిలా నవ్వసాగింది.

హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి, తెలుగు సేత – దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here