టీకా వ్యతిరేకత ఎందుకు – ఒక పరిచయం

3
9

[box type=’note’ fontsize=’16’] టీకా వేసుకోడం గురించి సంశయం/వ్యతిరేకత ఎందుకుంటున్నాయి? అన్న విషయం అర్థం చేసుకునే ప్రయత్నంలో తెలుసుకున్న విషయాలు ఈ వ్యాసంలో పంచుకుంటున్నారు వి.బి.సౌమ్య. [/box]

***

“కోవిడ్ టీకా వేసుకుంటే రెండేళ్ళలో అందరం చచ్చిపోతామని ప్రముఖ ఫ్రెంచి వైరాలజిస్టు అభిప్రాయపడ్డారు”

“ఫుట్బాల్ ఆటగాడు కోవిడ్ టీకా తీసుకున్నాక గ్రౌండులో ఆడుతూ ఆడుతూ గుండె పోటుతో పడిపోయాడు. ఈ టీకా చాలా ప్రమాదకరమట”

“కోవిడ్ టీకాలలో మైక్రోచిప్ ఉంటుంది. మన కదలికలు ట్రాక్ చేయడానికి వాడుతున్నారు. వాటి జోలికి పోవొద్దు!”

“ముంబయిలో కోవిడ్ టీకా వేసుకున్న ఒకాయన అయస్కాంతంలా మారిపోయాడు. ఈ టీకా వేసుకుంటే అంతే”

– ఇలాంటివి అన్నీ కాకపోయినా కొన్నైనా మీరూ ఏ వాట్సాప్ ఫార్వర్డ్ లోనో చదివి ఉంటారు. నేనూ చదివాను. కొన్నింటిని చూస్తేనే “ఎక్కడో తేడా కొడుతోంది” అనిపిస్తుంది. చివరి రెంటికీ అలా అనిపించింది. మొదటి రెండూ చూడగానే కంగారు పుట్టించినా అవి పుకార్లనీ, వాటి వెనుక కథ ఉందనీ factcheck.org, factly.in లాంటి వెబ్సైట్లలో వ్యాసాలు చదివాను. సరే, ఇవన్నీ సోషల్ మీడియా పుకార్లు అనుకుని వదిలేస్తూ వచ్చాను. ఈమధ్య ఒకరోజు మా వీథిలో ఒకావిడ పలకరించింది. పిచ్చాపాటీ మాట్లాడుతూ టీకాల ప్రస్తావన వచ్చింది. దానికి ఆమె తాను “వ్యాధి వచ్చిందని టెస్టులో తెలిస్తే అది ఇంకోళ్ళకి అంటించకుండా జాగ్రత్తపడతాను కనుక టీకా అక్కర్లేదనుకుంటున్నా” అన్నది. నాకు ఈ సమాధానం కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా, “సరే, మంచిదండి” అని వచ్చేశాను. తరువాత ఇంట్లో ఒక సోషల్ మీడియా చర్చ చూశాను – ఫలానా కోవిడ్ వాక్సిన్ పనిచేస్తుందని నాకు నమ్మకం లేదు, కనుక దాన్ని వేసుకోను అని. ఈ రెండూ అయ్యాక మనకి ఓ పక్క రోజూ టీకాల గురించి ఢంకా భజాయించి చెప్తూనే ఉన్నారు కదా… అయినా ఎందుకీ సందేహాలు? నిజంగా టీకాలు ప్రమాదకరమైనవా? ఇలా వద్దు అనుకునే వాళ్ళకి, మీరూ తీసుకోవద్దు అని ప్రచారం చేసే వాళ్ళకీ ఏమిటి మోటివేషన్? టీకాలు వద్దని వాదించేవాళ్ళని ఖండిస్తూ ఎందుకు వాళ్ళ అభిప్రాయాలు తప్పో వచ్చే వ్యాసాలకీ లోటు లేదు. వాళ్ళు కూడా డాక్టర్లు, శాస్త్రవేత్తలూ రాసినవి ఉటంకిస్తూ ఉంటారుగా? అసలు ఇదంతా మనకెందుకు? అంతా టీకా టీకా అనుకోడమే కానీ, అందరం ఎందుకు వేసుకోడం? కావాల్సిన వాళ్ళు వేసుకుంటే పోదా? ఎవరికో ఇష్టం లేదంటే వాళ్ళనొద్దంటే పోయిందిగా?? – ఇలా రకరకాల ప్రశ్నలు మెదిలాయి మనసులో. వాటికి సమాధానంగా ఈ వ్యాసం రాస్తున్నాను.

అసలు టీకా వల్ల ప్రయోజనం ఏమిటి?

టీకా మనకి ఒక రోగం రాకుండా ఆ రోగనిరోధకశక్తి ఇచ్చే మందు అని చెప్పవచ్చు క్లుప్తంగా. అయితే, ఇపుడు ఏదో కారణానికి ఒకరికి ఈ టీకా అభ్యంతరకరం అనుకుందాం. వాళ్ళ గోల వాళ్ళది… వదిలేయొచ్చుగా?

ఒక ఊరిలో ఓ వెయ్యి మంది ఉంటారనుకుందాం. ఇపుడొక మహమ్మారి సర్వత్రా వ్యాపిస్తూ వీళ్ళనీ చేరింది. ఈ మహమ్మారి ఒకరికొస్తే వాళ్ళు సగటున మరో పదిమందికి దాన్ని అంటించే రకానిది అనుకుందాం. మరి ఊళ్ళో ఒకశాతం (అంటే పది మంది) బాగా చిన్నవాళ్ళో, వేరే ఏదో ఆరోగ్య సమస్య వల్ల ఈ‌టీకా తీస్కోలేని వాళ్ళో ఉంటారు అనుకుందాం. ఈ పరిస్థితులలో ఒకరికి వ్యాధి వచ్చిందంటే అక్కడ్నుంచి పది, పది నుండి వంద, వెయ్యికి పోవడానికి ఎంతో కాలం పట్టదు. ఇపుడు ఈ మహమ్మారికి ఓ‌ టీకా వచ్చింది. ఇది సగటున 95% వ్యాధి రావడాన్ని తగ్గిస్తుంది అనుకుందాం. ఏదో కాలానికి ఈ టీకాని అందరూ వ్యతిరేకించారు (ఏం కారణాలుంటాయన్నది తర్వాత చూద్దాం).. ఒకడు తప్ప. వాడొక్కడు టీకా వేస్కోడం వల్ల వాడికి లాభం కానీ ఊరికి కాదు. మిగితా 999 మందీ వ్యాధి బారిన పడ్డానికి, 1000 మంది పడ్డానికి పెద్ద తేడా లేదు. ఇపుడు ఊళ్ళో ఓ ఎనభై శాతం మందికి టీకాలు వేసారు అనుకుంటే, ఇంకా కూడా 240 మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది (1000 లో ఎనభై శాతం అంటే 800. ఇందులో‌ టీకా వచ్చి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవారు 5 శాతం.. అంటే 40. వీళ్ళు కాక 200 మంది అసలు టీకా వేసుకోలేదు కదా. కనుక మొత్తం 240). ఇంకా ఎక్కువమందికి టీకా వచ్చిందంటే – పూర్తిగా సున్నా కాకపోయినా వ్యాధి ఆ ఊరివాళ్ళ మధ్య సోకే అవకాశం ఇంకా ఇంకా తగ్గుతూ పోతుంది. మనం వార్తల్లో వినే సామూహిక రోగనిరోధకశక్తి (herd immunity) వస్తుంది అప్పటికి. కనుక ఈ మహమ్మారి తీవ్రత కూడా చాలా తగ్గుతుంది. కనుక ఒకరో ఇద్దరో కాక వీలైనంత మందిని టీకా తీసుకోమని చెప్పడం ఎందుకు? అంటే ఇందుకు.

అలాగే, ఫలానా టీకా వాడుక ఏ కారణం చేతో తగ్గిన చోటల్లా ఆయా ప్రాంతాల్లో ఆ రోగాలు అకస్మాత్తుగా వ్యాపించడం తరుచుగా జరిగే విషయం. ఉదాహరణకి అమెరికాలో 2019 లో దాదాపు ముప్పై ఏళ్ళలో ఎప్పుడూ లేనన్ని తట్టు/చిన్నమ్మవారు (measles) కేసులు వచ్చాయంట చిన్న పిల్లల్లో. ఈ పెరుగుదలకి ముఖ్యమైన కారణం టీకాలివ్వకపోవడమే అని తేల్చారు. అంటే టీకాల వల్ల కొన్ని వ్యాధులు ఎంతో కొంత అదుపులో ఉన్నట్లే కదా. కనుక, అలా మూకుమ్మడిగా మేము టీకా వేసుకోము అని ఎక్కువ మంది బయలుదేరారంటే సమాజానికి కొంచెం ముప్పు ఉన్నట్లే అనమాట. అందుకనే మరి టీకా వ్యతిరేక ప్రచారం గురించి శాస్త్రవేత్తలూ, ప్రజారోగ్యాధికారులూ గగ్గోలు పెట్టడం.

టీకా వ్యతిరేకతకారణాలు

టీకాల పట్ల వ్యతిరేకత ఇప్పటి సమస్యలా అనిపించవచ్చు కానీ మొదటి టీకా ఇచ్చినరోజు నుండీ ఈ వ్యతిరేకులు ఉన్నారు.

ఇన్నేళ్ళై, ఇపుడు ప్రసార మాధ్యమాలు బాగా అభివృద్ధి చెందినా, టీకా వ్యతిరేకుల ప్రధాన ఆక్షేపణలు ఏం మారలేదని పరిశీలకుల అభిప్రాయం. కొన్ని ప్రధాన కారణాలని చూద్దాం:

౧. మతవిరుద్ధం: టీకాలు ఫలానా మత పద్ధతులకి విరుద్ధం అనీ, శరీరంలోకి టీకాల వల్ల ఏవో బైటి పదార్థాలన్నీ రావడం తమ మతం ఒప్పుకోదనీ వాదించేవారు ఉన్నారు. అయితే, ఏ మతమూ స్పష్టంగా టీకా వ్యతిరేకతని ప్రచారం చేయలేదని పరిశీలకుల అభిప్రాయం. దీనిని ఎదుర్కునేందుకు కొన్ని చోట్ల ప్రజారోగ్య శాఖలు మతగురువులతో కలిసి పనిచేస్తున్నాయి. శాస్త్రం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, గురువు మీద నమ్మకం ఉంది, గురువు టీకా వేసుకొమ్మన్నారు కనుక వేసుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా శాస్త్రం-మతం ఎడ్డెం అంటే తెడ్డెం అని కాక కలిసి పనిచేసి కూడా టీకా వ్యతిరేకతని ఎదుర్కోవచ్చు అన్నమాట!

౨. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం: ఆధునిక సైన్సు అభివృద్ధితో, టీకాల వల్ల ఉన్న ఉపయోగం గుర్తించి ప్రభుత్వాలు కొన్ని టీకాలు అందరూ (ముఖ్యంగా పుట్టిన మొదటి కొన్నేళ్ళలోనే) వేసుకోవాలనడం మొదలుపెట్టాక ఇలా తప్పనిసరి చేయడం వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమంటూ 19వ శతాబ్దంలోనే టీకా వ్యతిరేక సంఘాల వంటివి కూడా ఏర్పడ్డాయి బ్రిటన్, అమెరికా దేశాల్లో! ఇవి ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఇవి చిన్న స్థాయిలో ఉంటే బహుశా వీళ్ళ ఖర్మ అని వదిలేయొచ్చేమో కానీ, వ్యక్తి స్వేచ్ఛ సామాజిక ఆరోగ్యానికి ముప్పు కలిగించే స్థాయికి చేరుకుంటే ఏం జరుగుతుందో పైన ఉదాహరణలో చూశాము కదా!

3.ఫార్మా కుట్ర: టీకాలు ఫార్మా కంపెనీల కుట్ర అనీ, ప్రభుత్వాలు కంపెనీలతో కుమ్మక్కైపోయి మనల్ని మోసం చేస్తున్నాయనీ, మనకి అక్కర్లేదనీ వాదించే వాళ్లకీ లోటు లేదు. అయితే, నేను చదివిన వాటిలో నాకు అర్థమైనది ఏమిటంటే ఫార్మా కంపెనీలు ఆర్థిక ప్రయోజనాలకి కొన్ని “చెడ్డ” పనులు చేసిన ఉదంతాలు ఉన్నాయి కానీ, టీకాల తయారీ/అమ్మకం వల్ల వాటికి వచ్చే సంపాదన/లాభం చాలా తక్కువట. కనుక ఫ్రాడ్ చేయాలనుకునే కంపెనీ ఏదన్నా వేరే మందుల తయారీ వైపుకి చూస్తుందేమో కానీ టీకాల జోలికి పోదు!

౪. టీకాలే అసలు ప్రమాదకరం: టీకాల వల్ల కలిగే రోగాల గురించిన వివాదాలు (ముఖ్యంగా పిల్లల్లో!) చాలా ఉన్నాయి. ఉదాహరణకి కంఠవాతం, కోరింత దగ్గు, ధనుర్వాతం మూడింటికి కలిపి పలుదేశాల్లో పిల్లలకి ఇచ్చే డీపీటీ టీకా, తట్టు, గవదబిళ్ళలు, పొంగు రాకుండా ఇచ్చే ఎంఎంఆర్ టీకా వంటివి పిల్లల్లో ఆటిజం, నరాల సంబంధిత సమస్యలకి కారణమంటూ వచ్చిన పరిశోధనలు సంచలనం సృష్టించి కొంత టీకా వ్యతిరేకతకు కారణమయ్యాయి. కానీ తర్వాత వచ్చిన పలు పరిశోధనలు ఇది నిజం కాదనీ చూపెట్టాయి. కానీ, ఇప్పటికీ ఇంకా ఈ విషయమై ఈ చర్చ కనిపిస్తూనే ఉంటుంది. అంతెందుకు? పోయిన సంవత్సరం తన పిల్లకి టీకాలు ఇప్పించబోతూ నా స్నేహితురాలు కూడా ఇదే విషయమై ఆ టీకా వల్ల ఆటిజం వస్తుందా?, ఎవరో చెప్పారు అని కంగారు పడింది (లాస్టుకి టీకా వేయించింది, అది వేరే విషయం!). ఇక టీకాలను నిలవ చేయడానికి వాడే పదార్థాలు ప్రమాదకరమైనవని కూడా ఒక వివాదం ఉంది. అలాగే పోలియో టీకా దుష్ప్రభావాల గురించి కూడా కొన్ని పరిశోధనా ఫలితాలు ఉటంకిస్తూ ప్రచారం చేశారు గతంలో. వీటికంతా ఇలా అనుకోడానికి ఆధారాలు లేవనే అంటుంది శాస్త్ర రంగం.

ఇక ప్రత్యేకించి కోవిడ్-19 టీకాల విషయానికొస్తే: క్లినికల్ ట్రయల్స్ సరిగా చేయలేదనీ, అసలు ఈ టీకాలు సరిగా పనిచేయవనీ, mRNA పద్ధతిలో చేసిన టీకాలు (pfizer, moderna) మన డీ.ఎన్.ఏ ని మార్చేస్తాయనీ, దీని వల్ల కాన్సర్, వంధ్యత్వం వంటి సమస్యలు వస్తాయని, టీకాలలో ఉన్న అల్యుమినియం ఆల్జైమర్స్ కారకమనీ – ఇట్లా అనేక కారణాలు ప్రస్తావిస్తారు సోషల్ మీడియాలో. అయితే, ఇవన్నీ చాలావరకు తప్పుడు వివరాలతో శాస్త్రీయంగా కనబడేలా చేసి మనల్ని తప్పుదారిపట్టించే వదంతులేనని పరిశోధకుల అభిప్రాయం.

క్లుప్తంగా ఇవీ టీకా వ్యతిరేకతకి ముఖ్య కారణాలు. ఇవి కాక ఇప్పటి కాలానికి నాకు తోచిన మరొక రెండు కారణాలు:

అ) టీకాలు లేని రోజుల్లో మహమ్మారుల విచ్చలవిడి సంచారంతో ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉండేదో మనకెవ్వరికీ అసలు తెలియకపోవడం. మశూచి వంటి వ్యాధులు సృష్టించగల విధ్వంసం ఇపుడు బ్రతికున్న చాలామందికి తెలియదు. టీకాల పనితీరు ఎలాంటిదో, వాటి వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటో, ఊరికే చుట్టుపక్కల చూడ్డం వల్ల మనకి తెలియదు. కానీ శాస్త్రం చదివి అర్థం చేసుకోడానికి ఎంతో కొంత ఆసక్తి, శిక్షణ అవసరం. అది అందరికీ ఉండదు. ఎందుకూ ఈ అనవసరపు ఇంజక్షన్? అని అనిపించడం తేలిక ఇలాంటి పరిస్థితులలో!

ఆ) అసలు శాస్త్ర పరిశోధనల పట్ల, ప్రభుత్వం పట్లా, వ్యవస్థ పట్లా ఉన్న అపనమ్మకం… అంతా వాళ్ళ ప్రయోజనం చూస్తారు, ప్రజలకోసం ఎవరూ ఏం చేయరు అన్న వైరాగ్యం. మిగితా అన్ని కారణాలకీ శాస్త్రంతో సమాధానం చెప్పొచ్చు కానీ అన్నింటికంటే ముఖ్యమైనది – నమ్మకం లేకపోవడం.. ఈ అపనమ్మకమే ఓ పెద్ద మహమ్మారి – దీనికి టీకాలూ చికిత్సలూ లేవు అన్నది నాకర్థమైన ముఖ్యమైన విషయం. పరిశోధనలు ఇలా ఫలితాలు అలా… అని ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, మీరు మూర్ఖులు, ఈ మాత్రం తెలీదు అని ఎద్దేవా చేయడం కానీ ఈ సమస్యని పరిష్కరించవు అని ఈ విషయమై కృషి చేసిన ఇటీవలి రచనలు అన్నింటిలోనూ కనబడే ప్రధాన వ్యాఖ్య. “us versus them” లాగా శాస్త్రవేత్తలు, శాస్త్ర-ప్రియులూ అంతా వాదోపవాదాలు చేయడం వల్ల టీకా వ్యతిరేకులు మారరు అనిపించింది నాకు కూడా ఇవన్నీ చదివాకది

అద్సరేగాని, ఏది నిజం?

ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే – మనకే అన్నీ తెలియక్కర్లేదు… మనం అన్నీ తెలుసుకోనక్కరలేదు. ఈ అంశమై నైపుణ్యం ఉండి, వ్యక్తిగతంగా అలా మనం నమ్మగలిగే ప్రజారోగ్య సంస్థలనో, వెబ్సైటులనో, వ్యక్తులనో (డాక్టర్లు, ఇతర వైద్య/ఆరోగ్య రంగం వారు) అడిగి తెలుసుకున్నా చాలు, అని. అమెరికా లో సీడీసీ వంటి వెబ్సైటులు, కెనడాలో మా ఊరి, రాష్ట్ర, దేశ ప్రజారోగ్య అధికారులు తరుచుగా విడుదల చేసే కరపత్రాలు, వీడియోలు, వాళ్ళ వెబ్సైటులలో ఉంచే సమాచారం, వాళ్ళ ఫేస్బుక్ పేజిలలో షేర్ చేసే సమాచారం – నేను నమ్మి ఫాలో అవుతున్నాను. దేశ/రాష్ట్ర/జిల్లా స్థాయుల్లో మన దేశంలో ప్రత్యేకించి ప్రజారోగ్య శాఖ ఉందో లేదో, వాళ్ళు ఎలా పనిచేస్తారో నాకు అవగాహన లేదు. అయితే, ఏ ఊరికావూరు తమదైన పద్ధతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు అని ఈమధ్య చదివిన ఒక వార్తాపత్రిక వ్యాసం ద్వారా తెలిసింది. ఇండోర్ వంటి చోట్ల జిల్లా/పంచాయత్/వార్డు స్థాయుల్లో కూడా కమిటీలని పెట్టి ప్రజారోగ్యం గురించి, కోవిడ్ టీకాల గురించి అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టారట. ఛత్తీస్‌ఘడ్‌లో స్థానిక ఆదివాసీ పద్ధతిలోని పాటల ద్వారా టీకా ప్రచారం చేస్తున్నారట. ఇలాంటివి ఎక్కడ జరిగినా వార్తల్లో ప్రముఖంగా వస్తే ప్రజలందరికీ అవగాహన కలుగుతుందని అనుకుంటున్నాను. వీరిపాటికి వీరు ప్రపంచం నలుమూలలా ఇలా కృషి చేస్తూనే ఉన్నా టీకా వ్యతిరేకతా, సంశయమూ రెండూ పూర్తిగా పోలేదు. మరెలా?

మరి ఈ టీకా వ్యతిరేకత ని ఎలా మార్చాలి?

ఈ విషయం అసలు పెద్ద టాపిక్. దీనిని గురించి పెద్ద పెద్ద తలకాయలే జుట్టు పీక్కుంటూ ఉంటే నాకేం తెలుస్తుంది? నేను చదివినంతలో నాకు అర్థమైనవి ఇవి:

  1. టీకా భద్రత గురించిన పరిశోధనలకు, అధ్యయనాలకు ఆర్థిక సహకారం నిరంతరంగా ఉండాలి. టీకా వల్ల కలిగే ప్రమాదాల గురించి సమాచారం అందించే వ్యవస్థలు మరింట పటిష్టం కావాలి. నిజంగా ఎవరైనా టీకా వల్ల అనారోగ్యం పాలైతే వెంటనే వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
  2. అందరికీ శాస్త్ర విద్య గురించి, పద్ధతుల గురించి ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తప్పుడు ప్రచారాలని గుర్తించి, వాటి బారిన పడకుండా ఉండగలరు.
  3. ఊరూరా ప్రజారోగ్య శాఖలని పరిపుష్టం చేయాలి. వారికి అన్నిరకాల ప్రజలతో శాస్త్ర విషయాలు మాట్లాడ్డంలో శిక్షణ ఉండాలి. వారి పనిపట్ల ప్రజలకి గౌరవం, నమ్మకం ఉండాలి.
  4. ఇక ఏదన్నా టీకా ఇస్తున్నపుడు ఊరికే నోటి మాటో, ఒక చిన్న సింగిల్ పేజి నో కాక కొంచెం సరళంగా, వివరంగా ఆ టీకా పనితీరు గురించి, దాని సామర్థ్యం/సాఫల్యం గురించి, సైడ్ ఎఫెక్టులు, ఎంత కొంచెం శాతమైనా జరిగే అవకాశం ఉన్న తీవ్ర పరిణామాల గురించి రాసిన డాక్యుమెంటు ఇస్తే బాగుంటుంది. మామూలుగా మా ఊరిలో ఫార్మసీలో ఏదన్నా మందు కొంటే ఇవన్నీ ఇస్తారు – ఓపికుంటే చదూకోవచ్చు కానీ టీకాలకి ఇచ్చినట్లు గుర్తు లేదు. పిల్లల టీకాలకి అసలివ్వలేదు. కానీ, అపనమ్మకాన్ని తొలగించాలంటే ఇది అవసరం అని నేను నమ్ముతున్నాను.

అయితే, ఇందాక ప్రస్తావించిన టీకాలే వ్యాధి కారకాలన్న పరిశోధనల దగ్గరికి ఒకసారి మళ్ళీ వస్తే: అసలు పరిశోధనా ఫలితాలు ఎందుకు అలా పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి? అలా ఉంటే ఎలా నమ్ముతాము? నిజంగా ప్రమాదాలు లేకపోతే ఈ పరిశోధనలు ఎలా ప్రచురితం అవుతున్నాయి? అంతమంది ఎందుకు వ్యతిరేకప్రచారం చేస్తున్నారు? అనిపించవచ్చు. సైన్సు తత్వమే శాశ్వత సత్యమన్నది లేదని నమ్మడం. కనుక, ఇలా ఫలానా టీకా ఫలానా రోగం తెస్తుంది తరహా పరిశోధనలు జరగాలి. మానకూడదు. ఆ ఫలితాలు ఏమి చెబుతున్నాయి? ఎవరు ప్రచురిస్తున్నారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఫలితాలు పైకి కనబడే సంఖ్యల్లోనే నా ఇతర పద్ధతుల్లో విశ్లేషించాలా? – ఇలాంటి అనేక ప్రశ్నలేసుకుంటే కానీ ఒక విషయం గురించి సరైన నిర్ణయానికి రాలేము. మరి ఇదంతా ప్రతి ఒక్కళ్ళం ప్రతి అంశం మీదా చేసుకోలేం కనుక వైద్య ఆరోగ్య విషయాలలో సొంత జ్ఞానం మాని ఆయా వృత్తుల్లో పేరూ, సమ ఉజ్జీల మధ్య గౌరవమూ ఉన్న నిపుణులని నమ్మడం శ్రేయస్కరం అనిపిస్తోంది. అలాగే మనకున్న సందేహాలను మనం తరుచుగా వెళ్ళే వైద్యులని (ఫ్యామిలీ డాక్టర్లుంటే వాళ్ళు) అడిగి తీర్చుకోడం ఉత్తమం – సొంత పరిశోధనల కన్నా.

మొత్తానికి ఈ విషయమై ఇవీ నేను (ప్రస్తుతానికి) తెలుసుకున్న విషయాలు. నేను మొదట్నుంచీ టీకాలు అవసరమనే నమ్మాను – ఇదంతా చదివాక కూడా నా అభిప్రాయం మార్చుకోడానికి ఆధారాలేం కనబడలేదు. అయితే, ఈ వ్యాసం టీకా వ్యతిరేకత కలిగి ఉన్న ఎవరికైనా వేరొక కోణాన్ని పరిచయం చేసి ఉంటుందని భావిస్తాను. ఇక వ్యతిరేకత లేకపోయినా సంశయమో అనుమానమో ఉన్న వారు కొందరైనా అది తొలగించుకునే దిశలో అడుగులు వేయడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుందని ఆశిస్తాను.

ఉపయుక్త పుస్తకాలు/వ్యాసాలు:

  1. Berman, J. M. (2020). Anti-vaxxers: How to Challenge a Misinformed Movement. MIT Press.(ఒక అమెరికన్ ప్రొఫెసర్ సులభ గ్రాహ్యంగా రాసిన పుస్తకం. అమేజాన్ లో కొనుగోలుకి లభ్యం. తప్పక చదవాల్సిన పుస్తకం – ఈ వ్యాసంలో సింహభాగం ఈ పుస్తకం ద్వారా నేర్చుకున్నదే!)
  2. Wolfe, R. M., & Sharp, L. K. (2002). Anti-vaccinationists past and present. BMJ, 325, 430-2.
  3. History of Anti-vaccination Movements (టీకాల చరిత్ర వెబ్సైటు వ్యాసం)
  4. Islam, M. S., Kamal, A. H. M., Kabir, A., Southern, D. L., Khan, S. H., Hasan, S. M., … & Seale, H. (2021). COVID-19 vaccine rumors and conspiracy theories: The need for cognitive inoculation against misinformation to improve vaccine adherence. PloS one, 16(5), e0251605.
  5. Rajeshwari Sahay, Satwik Mishra (2021). How India can combat vaccine hesitancy. ఇండియన్ ఎక్స్ప్రెస్ వారి వెబ్సైటులోని వ్యాసం.
  6. Ontario hopes family doctors can reach those unvaccinated against COVID-19” (కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ వారి వెబ్సైటు వ్యాసం.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here