[box type=’note’ fontsize=’16’] డా. ఏనుగు నరసింహారెడ్డి రచించిన “తెలంగాణ రుబాయిలు” పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. సిహెచ్.సుశీల. [/box]
[dropcap]”అం[/dropcap]తము లేని ఈ జగమంతా పురాతన పాంథశాల, అతిథి గృహం” అనే తాత్విక పాదాలు వినగానే ఉమర్ ఖయ్యాం, దువ్వూరి గుర్తుకు వస్తారు. రూబాయిలు గుర్తుకు వస్తాయి. పార్సీ నుండి ఉర్దూలోకి భాషాంతరీకరణ జరిగి, మిగిలిన భారతీయ భాషల్లోకి వచ్చిన రుబాయిలు దాశరథి కలం నుండి ప్రవహించి, తిరుమల శ్రీనివాసాచార్య రాతల్లో పరవళ్ళు తొక్కింది. విప్రలంభ శృంగారం, మార్మికత, స్త్రీల పట్ల ఆరాధనాభావం వంటి అంశాలు రూబాయిలలో ఉండటం, మధుర భక్తికి సూఫీ భావాలకు పోలికలు ఉండటం, తన ఆనందాలను వేదనలను మరుగు లేకుండా కవి వెల్లడించడం వల్ల, ప్రేయసి పట్ల వియోగం వంటి భావాలు వెల్లడి చేయటం ఇత్యాది కారణాల వల్ల (మధుకలశం, పానశాల వంటి) రూబాయిలు తెలుగు వారిని ఆకర్షించాయి. ఆదిభట్ల, సామల సదాశివ, పటేలు అనంతయ్య, భూదేశ్వరరావు మొ. వారి రచనలూ ఉన్నాయి.
నాలుగు అనే అర్థం కలిగిన అర్బా అనే అరబిక్ పదం నుంచి ‘రుబాయి’ అనే పదం ఏర్పడింది. ‘రుబాయి యాత్’ అనేది బహువచనం. ముక్తక ప్రాయమైన రుబాయీ ఒక పార్సీ ఛందస్సు పేరు. అదే కవితా ప్రక్రియ పేరుగా మారింది. దీనిని హిందీలో ‘చౌపదీ’ అని కూడా అంటారు. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి 1, 2, 4 పాదాలకు రదీఫ్, కాఫియాల నియమం ఉంటుంది. మూడవ పాదానికి ప్రత్యేక నియమమేమీ ఉండదు. రుబాయిలో నాలుగు పాదాలు కలిపి ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి. నిర్దిష్టమైన చందస్సులో రదీఫ్, కాఫియాలను పాటిస్తూ ఒకే భావాన్ని వ్యక్త పరచడం, ముఖ్యంగా ‘చమత్కారాన్ని’ సాధించటం ఆకర్షణీయం అంటారు పెన్నా శివరామకృష్ణ – ‘తెలుగు గజళ్ళు రుబాయిలు’ అన్న పుస్తకంలో ( ప్రచురణ: ప్రపంచ తెలుగు మహాసభలు 2012 తిరుపతి.)
గజల్, రుబాయిలకు కొన్ని పోలికలు ఉన్నా, ఛందో నియమాలు భిన్నంగా ఉంటాయి. అలాగే రుబాయిలు మొట్టమొదట తాత్విక చింతన వంటి భావాలతో అవతరించాయి. తర్వాత సామాజిక అంశాలు తదితరమైన విషయాలపై కూడా రుబాయిలు రచించబడ్డాయి.
డా. ఏనుగు నరసింహారెడ్డి తెలుగు సాహితీ లోకానికి చిరపరిచితులు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పనిచేసిన ఈయన ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసిన నరసింహారెడ్డి ఎక్కువగా రుబాయిల ద్వారానే పాఠకుల ప్రశంసలందుకున్నారు. రాష్ట్రోద్యమ కాలంలో చాలామంది వలెనే నరసింహారెడ్డి కూడా వచన కవిత్వం, పాటలు రాశారు. తర్వాత రుబాయిలు కొన్ని రాయటం, నేటినిజం, వన్ ఇండియాలో ప్రచురింపబడడం, కొన్నాళ్ళకి ఆంధ్రప్రభలో వరుసగా వంద రుబాయిలు ఆదివారం సంచికలో రావడం జరిగింది. పాఠకుల నుండి మంచి స్పందన రావడంతో మరో రెండు వందలు, అలా మూడేళ్ళ పైన ధారావాహికంగా రాసారు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో.
నరసింహారెడ్డి రుబాయిల గురించి – “కొత్త పోలికలతో సరికొత్తగా వ్యక్తీకరించడం వీరి రుబాయిలలో ఒక ప్రత్యేకత.ప్రచ్ఛన్న హితబోధ, అదృశ్య ఆత్మబోధ, సున్నిత అధిక్షేపం ఈ రుబాయిలలోని అంతస్సారం. వస్తు వైవిధ్యం అపారం. స్వయం సమగ్రత, సరళత, సుబోధకతల సాకారం” అంటారు పెన్నా శివరామకృష్ణ ముందు మాటలో.
“కోరుకొని ఇటకొచ్చినామా? మనకు తెలియదు
కోరినంతనె వెళ్ళగలమా? మనకు తెలియదు నటన బాగా చేయవోయీ!
పాత్రధారి ఎప్పుడు వేదిక ఎటుల దిగుదుమొ మనకు తెలియదు'”
~
“ఎక్కడ బయలుదేరి ఎక్కడికి చేరావు
ఎవరికోసం నడిచి ఎవరిని చేరావు
తుది మొదలు లేని వలయంలో ప్రయాణమా
ఎప్పుడు మొలిచి ఏ దారిలో ఎటకు చేరావు”…..
ఆద్యంతాలు లేని ఈ విశ్వం, ఎక్కడ నుండి ఎక్కడకు ప్రయాణిస్తున్నాడో తెలుసుకోలేని నరుడి గురించి రాసిన పై రుబాయిలలో “నిరాశా, నిస్పృహలు” చెప్పడం లేదు కవి. జీవితం చాలా చిన్నదని, అశాశ్వతమన్న ఎరుక మాత్రమే కనిపిస్తోంది. కథా రహితమైన ముక్తకప్రాయమైన ఇలాంటి రచనలలో భావసాంద్రత, అర్థచమత్కారం ఉంటే అందం మరింత యినుమడిస్తుంది.
“రాయి మీద దెబ్బలేస్తే చప్పుడైతది
నిప్పుమీద నీళ్ళుబోస్తే చప్పుడైతది
సులభంగా పోదు జీవి ప్రాణం కూడ
మరణించేటప్పుడు చూస్తే చప్పుడైతది”
~
“ఎప్పుడైనా పాట ఆపేయవచ్చు
ఎన్నడైనా ఆట మానేయవచ్చు
వేసిన వేషం నప్పడమే ముఖ్యం
ఎట్లనైన కాడి ఎత్తేయవచ్చు”
~
“అటునుండి ఇటు నెట్టుతున్నదీ లోకం
ఇటు నుండి అటు తోస్తు ఉన్నదీ లోకం
లోలకం ఐతిమా లోబర్చుకుంటది
నటన నేర్చీ నవ్వుతున్నదీ లోకం”
~
వాస్తవ ప్రపంచాన్ని, జీవితాన్ని అధ్యయనం చేసిన, విశ్లేషించిన పరిణత, భావ సాంద్రత ఈ పై రుబాయిలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంపుటిలో ముఖ్యంగా తాత్వికత పునాది మీద నిర్మించిన సౌధాలు ఎక్కువ. నిజాయితీతో నిర్మొహమాటంగా వ్యక్తీకరించిన నరసింహారెడ్డి స్వచ్ఛమైన తాత్విక భావాలు ప్రస్ఫుటంగా వెల్లడించే రుబాయిలివి.
“కన్ను మూత పడుతుంది నిదుర ఎలా ఆపను
గళం మూతపడుతుంది స్వరం ఎలా ఆపను
నిన్న మొన్ననే కదా నడకలోతులు తెలిసె
సమయం వెళ్ళిపోతుంది ఎలా ఎలా ఆపను”
~
తాను రాయాలనుకున్న, వ్రాయగలిగిన వానిని రాయకుండానే సెలవంటూ వెళ్లిపోతానేమోనని, తన మదిలో అల్లిబిల్లిగా అల్లుకున్న భావోద్వేగాలను వెల్లడించడానికి సమయం సరిపోతుందో లేదో నన్న ఉద్వేగం, లేదా పని ఒత్తిడి వల్ల రాయలేక పోతానేమోనన్న ఆవేదన కనిపిస్తుంది. ఈ స్థితి ‘సెన్సిబుల్’ కవికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. తరలిపోతున్న కరిగిపోతున్న కాలాన్ని ఆపలేని అశక్తతతో కూడిన ఆవేదన ఇది.
“దేవుని గుడిలోనూ ఉండాలనుకోను
రాజమహల్లోనూ వుండాలనుకోను
వినడానికీనూ, వినిపించడానికీ
బడితప్ప దేన్లోనూ వుండాలనుకోను”
~
“విహంగమై ఎగరాలని అనుకుంటాను
తాపసినై నిలవాలని అనుకుంటాను
ఆత్మ గుసగుసలను అవధరించుట కొరకు
ఒంటరిగా ఉండాలని అనుకుంటాను”
~
“దీపం వెలగాలంటే వాయువు కావలసిందే
దీపం ఆరాలన్నా వాయువు కావలసిందే
హెచ్చుతగ్గుల వ్యవహారం నిర్ధారిస్తయి
కానీ ప్రాణం ఉన్నా పోయినా వాయువు కావలసిందే”..
~
మనిషి జీవితం, జీవితంలోని క్రమ పరిణామం – ఇది ఒక సహజ చక్రభ్రమణం కదా! ఏమీ చేయలేం, కాలాన్ని దానంతట దాన్ని సాగిపోనివ్వడం తప్ప అంటారు కవి. లోక పరిశీలన, లోతైన అధ్యయనం చేసిన అనుభవం కన్పిస్తోందీ రచనలో.
“అడుగు తీసి అడుగు వేస్తే ఎన్ని ఊహలు
కన్నుమూసి కనుతెరిస్తే ఎన్ని ఊహలు
రెప్పపాటున ఆరిపోవు దీపమేకని
క్షణం వచ్చి క్షణం పోతే ఎన్ని ఊహలు”
~
“బాల్యం దోసిట్లోంచి జారిపోతుంది
యవ్వనం ఒడి నుండీ జారిపోతుంది
కాలాన్ని నిలుప కసరత్తులెన్ని చేయి
చిలుక ఈ చెట్టు నుండి ఎగిరి పోతుంది”
~
“పుట్టిన ఊరును వదిలిపోతం
పెరిగిన పట్నము వదిలిపోతం
ముందు వెనుకల ముచ్చటే కానీ
నడిచిన నేలను వదిలి పోతం”
~
“నేను లేని నాడూ చరిస్తుంది లోకం
నువ్వు లేని నాడూ నడుస్తుంది లోకం
మనమంతా వచ్చి పోవు బాటసారులం
మనం లేనినాడూ నడుస్తుంది లోకం”
~
“ఇక్కడ రాకముందు ఎక్కడి వారము
అక్కడ లేకముందు ఎక్కడి వారము
మనకే తెలియని తుది మొదలు
జాడ మనది యాడను లేనప్పుడు మనమేడి వారము”..
~
దైన్యం వ్యథ రుజ మృత్యు తదితర బాధలు ఉన్నాయని తెలిసి కూడా, తనకి ‘అంతం’ లేదు అనుకోవడం ఎంత అవివేకం! పామరులు, పండిత ప్రకాండులు భౌతికకాయం నుండి విడివడి వడివడిగా ఎక్కడికో పయనమై పోవటం సత్యం కదా! కాలం మారినా, తరాలు మారినా మానవ మనస్తత్వం మారలేదు. తనకు తాను సృష్టించుకొన్న భ్రమలో బ్రతుకుతుండడమే విచారకరం అన్న భావం, బాధ స్పష్టపరుస్తున్నారు కవి.
“కొనడానికి ఎవరి సరుకు కాలమన్నది
నిలపడానికెవరి సొత్తు కాలమన్నది
అందరికీ సమమైనది కాలమొక్కటే
ఎవడాపితే ఎపుడాగెను కాలమన్నది”
~
“నవల చివర పేజీ రాసే ఉంది
కవిత ఆఖరి పదం పలికే ఉంది
శిల్పంలో బహు నేర్పరి సుమా తను
కథ కడపటిముగింపు తెలిసే ఉంది”
~
కీర్తి కాంక్షలు అశాశ్వతాలు. వాటికి లొంగిపోవడం అవివేకం. కీర్తి కోసం వెంపర్లాడుతూ పరమానందభరితమైన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించే లేకపోవడం ఒక విషాదం. సెలవంటూ వెళ్లి పోయే సమయం దగ్గరపడుతోంది అన్న సత్యాన్ని తెలుసుకుంటే దుఃఖమే ఉండదు. ఈ రుబాయిలను పరిశీలిస్తే నరసింహారెడ్డి గారి ఒకానొక అన్వేషణ, సత్యం కోసం పరిశీలించే పరిక్రమించే దృక్పథం కనిపిస్తుంది. ఊహలు, భ్రమలు, ఉత్తుత్తి కబుర్లతో పేజీలు నింపే ఆర్భాటం లేకుండా తాత్విక దృష్టితో చెప్పిన అంతర్గతార్థాలు అయిన, ఆలోచనాత్మక అయిన రుబాయిలు ఇవి. రుబాయి లోని తొలి రెండు పాదాల మధ్య గజల్‌కు అనివార్యమైనట్లు భావైక్యం ఉండాలన్న నియమమేమీ లేదు. రుబాయిలో తొలి రెండు పాదాలు వేర్వేరు అంశాలను సూచించేవి వుండవచ్చు. ఈ వేర్వేరు అంశాల ప్రస్తావన సార్థకం చేసేవి మలి రెండు పాదాలు. తొలి రెండు పాదాలకు నాలుగవ పాదానికి సంబంధాన్ని కూర్చేది నిర్ధారించేది మూడవ పాదం. కనుక రుబాయి నిర్మాణంలో కీలకమైనది కనుకనే మూడవ పాదానికి రదీఫ్, కాఫియా మినహాయించినట్లు ఊహించవచ్చు. చివరి పాదంలో సంపూర్ణ స్వతంత్ర వాక్యం ఉండాలి. ఈ నాలుగవ పాదం రుబాయికి ప్రత్యేక ఆకర్షణ.
రుబాయి నిర్మాణ శిల్పాన్ని గూర్చి ఉర్దూభాషా సాహిత్యాలలో నిష్ణాతులైన డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు గమనించదగినవి. రుబాయి రచన ఎంత సులభమో, నిర్మాణం అంత కష్టం. ముక్తక రూపమైన రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక భావం ఉంటుంది. ఆ భావ ప్రసూనం నాలుగు రేకులుగా విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భావం మొగ్గ తొడుగుతుంది రెండవ పాదములో కొంచెం విచ్చుకుంటుంది. మూడవ పాదంలో అసలు విషయం వస్తుంది. హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది – సంగీతంలో ఆరోహణ స్వరంలో గతులు వలే. నాలుగవ పాదం రుబాయి లోనే అతి ప్రధాన భాగం. చమత్కారమంతా ఇందులో ఇమిడి ఉంటుంది. మొదటి పాదములో అంకురించిన భావానికి ముగింపు ఇస్తుంది. ఈ ముగింపు లోనే కవి ప్రతిభ ప్రస్ఫుటవుతుంది. ఒక బిందువులో సింధువును చూపినంత పని అవుతుంది. ఒక రుబాయి రచించడం అంటే కవి సామర్ధ్యానికి ఒక నికషోపలం.
రుబాయి రచనను హృదయపూర్వకంగా స్వీకరించి, ఒక ధ్యేయంగా నరసింహారెడ్డి రాయడం ప్రారంభించారు. వాట్సాప్ గ్రూపులలోనూ, ఫేస్బుక్ లలోను విస్తృతంగా ఈ రుబాయిలు రావడం, స్టేజీల పైన అనేక మంది గాయకులు పాడటంతో నరసింహారెడ్డి గారి రుబాయిలు బహుళ ప్రచారం పొందాయి. కొన్ని ఇంగ్లీషు లోకి, హిందీలోకి అనువదింపబడ్డాయి కూడా. కొన్ని రుబాయిలకు స్వరకల్పన జరగడమే కాక నర్రా వేణుగోపాలరావు, నర్రా ప్రవీణ్ రెడ్డి మొదలైనవారు అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చి యూట్యూబ్ లలోకి చేర్చడంతో వేలాదిమంది చూడటం జరిగింది. మిత్రుల ప్రేరణతో చివరికి 2020లో ఈ రుబాయిలు పుస్తక రూపంలో పాఠకుల కందించారు నరసింహారెడ్డి. మొదట్లో తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ రాయటం కొంతవరకు నిజమే. ఇది ఒక నాంది మాత్రమే. కానీ కొన్నాళ్ళకి తన రుబాయి రచన పరిధి పెరిగి సామాజిక కోణం, మనిషి తత్వం, ప్రపంచ పరిణామం వంటివి విస్తృతంగా రాయటం జరిగింది. తన లోని కవి దృష్టికి సార్వజనీనమైన, సార్వకాలిక దృక్పథం ఏర్పడింది. కొత్త కొత్త వస్తువులను తీసుకొని వ్రాయటం మొదలు పెట్టారు. రుబాయిల లక్షణాల నుండి దాటిపోకుండా, మరింత లక్ష్య లక్షణ సమన్వయంతో, ఇదే ఒరవడి తో, తనలోని కవితాత్మకతను జాగృతం చేసుకొంటూ కొనసాగాలన్నది తన లక్ష్యం అంటారాయన. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ప్రాధమికంగా తనలోని కవిని సజీవంగా మేల్కొపుకొంటూ, సమాజానికి ‘మేలు’ కొలిపే రచనలు చేయాలన్న ఆయన ఆకాంక్ష తప్పక నెరవేరుతుందని ఈ సంపుటిలోని 536 రుబాయిలను చూస్తే తెలుస్తూనే ఉంది. రుబాయి ప్రక్రియనే ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించి , ఆ ప్రక్రియకు మరింత వాడిని, వేడిని కలిగిస్తూ రాస్తూనే వుంటానన్న వారి సంకల్పం ప్రశంసనీయం.
***
తెలంగాణ రుబాయిలు
రచన: ఏనుగు నరసింహా రెడ్డి
పేజీలు: 299
వెల: ₹200
ప్రచురణ, ప్రతులకు:
పాలపిట్ట బుక్స్
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాదు – 500036
ఫోన్: 9848787284
మెయిల్: palapittabooks@gmail.com