అనేకానేక భావపరంపరలై భాసిల్లిన “తెలంగాణ రుబాయీలు”

0
8

[box type=’note’ fontsize=’16’] “తెలంగాణ రుబాయీలు” వేమన పద్యాల్లాగా జనం నాల్కలమీద నాట్యమాడుతాయని నమ్ముతూ ఈ పుస్తకాన్ని aసమీక్షిస్తున్నారు కవి, విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సాహితీవేత్తల విస్తృత అధ్యయనం విశ్వవ్యాప్తమై మాతృభాషను దాటి పరభాషలోకి ప్రవేశించడం వలన సరికొత్త భావాలను పునికిపుచ్చుకోవడమే కాదు కొంగ్రొత్త సాహిత్య ప్రక్రియలను మాతృభాషలోకి తెచ్చుకోవడం జరిగింది. గజళ్ళు, రుబాయీ ప్రక్రియలను ఫారసీ, ఉర్దూ భాషల నుండి తెలుగు భాషలోకి తెచ్చుకున్నాము. విప్రలంభశృంగారం, మార్మికత, స్త్రీ పట్ల ఆరాధనాభావం మొదలైన అంశాలు రుబాయీల్లో అత్యద్భుతంగా పలికించిన ఉమర్ ఖయ్యూం కవిత్వం తెలుగు కవులను బాగా ఆకర్షించడం వలన ఆ భావాలను తెలుగు ఛందస్సులో వాడుకున్నవారు కొందరైతే, రుబాయీ ప్రక్రియనే తెలుగు ఛందస్సుగా మార్చి నాలుగు పాదాల్లో భావాన్ని వ్యక్తంచేస్తూ 1,2,4 పాదాలలో రదీఫ్, కాఫియాలను పాటిస్తూ ఒకే భావాన్ని చమత్కారపూర్వకంగా వ్యక్తపరిచే వాళ్ళు బహుకొద్దిమంది. 3వ పాదంలో భావ పరిణామ సూచన అగుపిస్తుంది.

రుబాయీ ప్రధానంగా తాత్విక విషయాలు వ్యక్తీకరించడానికి అనువైన ప్రక్రియగా చెప్పుకుంటున్నప్పటికీ సుప్రసిద్ధ కవి డా. ఏనుగు నరసింహారెడ్డి తన “కను”తగిలిన అనేక విషయాలను రుబాయీ ఛందస్సులో చెప్పి మెప్పించగలిగాడు. ఈయన రాసి ప్రచురించిన “తెలంగాణ రుబాయీలు” సంపుటిలో 536 రుబాయీలున్నాయి. నేటి కాలమాన పరిస్థితుల్లో పొడగట్టిన అనేకానేక విభిన్న అంశాలను వస్తువులుగా గ్రహించి రుబాయీల రచన ఎంతో విజయవంతంగా పూర్తిచేశాడీ కవి. వచన కవి అయిన ఏనుగు వారు ఇప్పటికీ నాలుగు వచన కవితా సంపుటాలు, రెండు సాహిత్య విమర్శ పుస్తకాలను, ఆటవెలది ఛందస్సులో “మట్టిపాట” శతకాన్ని ప్రచురించారు. వీరిలోంచి పెల్లుబికే మరికొన్ని భావాల వ్యక్తీకరణకు మాధ్యమంగా “రుబాయీ” ప్రక్రియను ఎన్నుకున్నారు. ఏనుగు వారు ఎప్పుడు ఏ ప్రక్రియలో సాహిత్య సృజన చేసినా, వీరి ఆత్మ అందులో కనిపిస్తుంటూంది. వీరు ఎటువంటి వస్తువునైనా, ఎన్నుకున్న ప్రక్రియలో, అద్భుతంగా పండించే దశలో లోతైన వీరి వ్యూహ నైపుణ్యం గల నిర్మాణ స్పృహ, అకుంటిత దీక్ష దక్షత తోడునీడై చరిస్తాయి. అందుకే “వీరి రుబాయీలు ప్రచ్ఛన్నహితబోధ, అదృశ్యబోధ, సున్నిత అధిక్షేపం” అంతస్సారంగా, అపారమైన వస్తువైవిధ్యంతో, స్వయం సమగ్రత, సరళతతో అలరారుతుంటాయని ప్రఖ్యాత కవి, విమర్శకుడు డా. పెన్నా శివరామకృష్ణ అభిప్రాయపడ్డారు. “రుబాయీలు రాయాలంటే మాత్రాఛందస్సుల ప్రయోగ నిపుణత, శబ్దం మీద అధికారం, చమత్కార సాధనాకుశలత, పాదాల కూర్పులో వ్యూహ నిర్మాణ చతురత” అవసరమని పెన్నావారు వ్యక్తీకరించిన విధంగా పై అంశాలన్నీ పుష్కలంగా నరసింహారెడ్డి రుబాయీల్లో సాక్షాత్కరించాయి అనడంలో ఎట్టి అతిశయోక్తి లేదు..

“హృదయంలో కల్మషాలు విడిచి పెట్టిచూడు | వెలుగులు నివ్వెరపోయే దివ్వెలు ఉంటాయి” అనే కాన్సెప్ట్‌తో కలం పట్టిన కవిగా మనిషిని ప్రేమించడం ఎరిగినవాడు కనుకనే “మనిషిని గాయపరచకు, మళ్ళీ కలవలేం | నీతిని పారేయకు మళ్ళీ కలవలేం | ప్రేమించడంలో మునిగిపో, ద్వేషించలేవ్ | కరుణను జారవిడువకు మళ్ళీ కలవలేం” అంటారు.

అస్తిత్వమే తాత్వికంగా కులమతాల కుళ్ళును, హంగూ ఆర్భాటాల పొంగులను, భేషజాల బేధాలను ఎత్తిచూపుతూ అన్నీ ఈ భూమిమీదనే, పైలోకంలో ఇవి చెల్లవు, కప్పెట్టిన నిజాల గుట్టు విప్పబడతాయి జాగ్రత్త అనే హెచ్చరికతో ఈ రుబాయీ “ఈ కులమూ ఆ మతమూ మాసిపోతవి | ఈ హంగూ ఆర్భాటం సమసిపోతవి | భేషజాలు ఎన్నున్నా నేలమీదనె | పైలోకంలో నిజాలు తెలిసిపోతివి” అంటారు.

మనిషి నేటి సమాజంలో చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మనిషి లోపలొకటి, బయటకు మరొకటి. ఈ కపటనీతి సామాన్యునిలోనే కాదు పెద్దపెద్ద కవిపుంగవుల్లోనూ కనిపిస్తుంటూంది. ఎన్ని నీతిదాయకమైన గ్రంథాలు రాసినా నీతి తప్పే పనులు చేస్తున్నకవికి విలువ ఉండదు అంటూ “ఎన్ని చెప్పినవాడు ఏమిచేసెను చూడు | ఎంతరాసిన వాడు ఏమి గీసెను చూడు | నాభిలోంచి అక్షరామోక్కటీ లేదు | ఎన్ని గ్రంథములెట్లు రాసివేసెను చూడు” అంటారు.

కవిత్వం ఎక్కడ జన్మ తీసుకోవాలో, మరెక్కడ రూపుదిద్దుకోవాలో చెప్పాడు కవి. ‘ఏ కవిత అయినా ప్రజల నాల్కలమీద కాపురం పెట్టాలి. అప్పుడే ఆ కవిత జనం మది గదుల్లో భద్రపరుచబడుతుంది’ అనే భావనతో, “హృది అడుగున జన్మ తీసుకున్నది కైత | ఎదపొదలో రూపుదిద్దుకున్నది కైత | నిలుచుంటది కలకాలం నాల్కలపైన | మదిగదిలో పోతపోసుకున్నది కైత” అంటారు.

తెలంగాణ ప్రాంతపు నీటి వనరులను గూర్చి చెప్తూ “ఎండల్లో చెలమల్లో నీరుండే నేలనాది | వాగుల్లో వంపుల్లో జలదాగే నేలనాది | ఎత్తొంపుల సౌందర్యం ఎంత గొప్పదో చూడు | గుట్టల్లో గట్టుల్లో నీరాగే నేలనాది” అంటూ తెలంగాణ ఎత్తొంపుల సౌందర్యాన్ని గుర్తుచేస్తాడు కవి.

ఈ కవి, “రాజకీయాలు అధికార దాహంతో నీతి, నిజాయితీని విడిచిపెట్టి ఒకపార్టీ మరొక పార్టీతో కలిసేతీరు, విడిపోయే వైనం అన్నీ స్వార్థం కోసమే” అంటూ ఒక రుబాయీ రాసాడు.

“ఆ పార్టీ ఈ పార్టీ కలిసిపోతవి | జెండాలకు రంగులన్నీ వెలసిపోతవి | అధికారం కొరకు గడ్డి కరిచీకరిచి | ఆ వాదం ఈ వాదం సమసిపోతవి” అంటూ అధికారం కోసం గడికరిచే పార్టీల వైనాన్ని ఎత్తిచూపాడు.

నేడు మతాలు చేసే మాయను ఎత్తిచూపుతూ – “ప్రతి కోవెల భక్తులపై కట్టు కథలు కురిపిస్తది | ప్రతి దర్గా పీరీలపై పిట్టకథలు కురిపిస్తది | నిజం పాతిపెత్తడమే మతపెద్దలు చేసే పనులు | ప్రతీ చర్చి ఆస్తికులకు భక్తిసుద్దు కురిపిస్తది” అంటూ మూఢ విశ్వాసాలకు మూలాలు ప్రార్థనాలయాల్లోనే పుడతాయి అనే భావన వ్యక్తపరుస్తాడు కవి.

‘రుబాయీలు రాయడమొక మజాకు కాదు | రదీపూను కాఫియాను అల్లుడుకాదు | పట్టరాని చేప పిల్లలాంటి ఊహలు | మాత్రల్లో పరిగుతీయ సడాకు కాదు” అటూ రుబాయీ రచనలో ఉన్న కష్టాన్ని చెప్పాడు కవి. అయినా ఇందులో ఉన్న అన్ని రుబాయీలు కవి నాభిలోంచి పెల్లుబికి వచ్చినవే. రసజ్ఞతతో నిండినవే. కాలం కంట్లో కనిపించే కల్మషాలను శోధించి రుబాయీ ఛందస్సులో అందించిన ఏనుగు నరసింహారెడ్డి అభినందనీయుడు. ఈ గ్రంథం శీర్షిక తెలంగాణ రుబాయీలే గానీ, ప్రపంచాన్ని చుట్టి అవగాహనించుకొన్న లోకవిజ్ఞత యిందులో పొందుపరచడం జరిగింది. “తెలంగాణ రుబాయీలు” వేమన పద్యాల్లాగా జనం నాల్కలమీద నాట్యమాడుతాయని నమ్ముతూ, ఈ గ్రంథం అందరూ చదువదగినదిగా భావిస్తూ, “రుబాబెరుగని” రూబాయిల కవి అయిన ‘ఏనుగు నరసింహారెడ్డి కలం’ నుండి మరెంతో సాహిత్యం జాలువారాలని కోరుకుంటూ కవిని ప్రశంసిస్తున్నాను.

***

తెలంగాణ రుబాయీలు
రచన: ఏనుగు నరసింహా రెడ్డి
పేజీలు: 299
వెల: ₹200
ప్రచురణ, ప్రతులకు:
పాలపిట్ట బుక్స్
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాదు – 500036
ఫోన్: 9848787284
మెయిల్: palapittabooks@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here