తెలంగాణంలో కవితామహోద్యమం

0
10

[14 జనవరి 1959 నాటి ఆంధ్ర – వారపత్రిక స్వర్ణోత్సవ సంచికలో శ్రీ దాశరధి రచించిన ఈ వ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గ[/dropcap]తాన్ని మరిచిపోవడం కొందరికి ఎంత సులభమో, మరికొందరికి అంత కష్ట సాధ్యం. గతాన్ని మరువలేని వాళ్ళల్లో నేనొకణ్ణి. చలనచిత్రం వలె గతాన్ని నా మనోనేత్రం ముందు పలుమారులు ఆడించుకుంటూ దానిలోని దుఃఖాలకు కన్నీరు కారుస్తూ, సుఖాలకు చిరునవ్వు నవ్వుతూ కాలం గడుపుతుంటాను. ఆత్మీయులైన వాళ్ళకు ఆ చలనచిత్రంలోని సొగసులు విడమరిచి చెప్పి ఆనందిస్తాను. ఏ ప్రాంతంలో సారస్వత వికాసం వుండదో ఆ ప్రాంతం వట్టి ఎడారి వంటిది. తెలంగాణలో సారస్వత వికాసానికి, ప్రజా జాగృతి కవితా మహోద్యమం ఎంతగానో తోడ్పడింది.

శతాబ్దాల నుంచి కవితామృత వర్షంతో తడిసి, పచ్చబారి, చిగిర్చి, పూచి, ఫలించిన నేల తెలంగాణము. పోతన, పాల్కూరికి, పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడు, మలినాధనూరి, అనంతుడు, విధ్యానాధుడు పుట్టిపెరిగిన మాగాణము, మన తెలంగాణము. ఆంధ్ర భారతికి శిరోభూషణాలైన గ్రంథాలు వెలసిన నెలవు. ఈ ప్రాంతంలో ఏనాడూ ఆంధ్ర కవితాస్రవంతి ఎండిపోదు. అది జీవనది వలె తరతరాలుగా ప్రవహిస్తూనే వుంది. అయితే భయంకర గ్రీష్మాల తాపం అప్పుడప్పుడూ తప్పలేదు.

నాటి హైదరాబాదు రాష్ట్ర పరిపాలకులు ఆంధ్రమాత నోటికి తాళంవేసి, పరభాషా దాస్యం చేయించారు. ఈ దాస్యం ఇతర ప్రాంతాలలో కంటే చాలా ఎక్కువగా తెలంగాణాలోనే భరించవలసి వచ్చింది. ఈ ఒత్తిడి ఒకందుకు మేలే అయింది. రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలనే కాంక్ష భాషా స్వాతంత్యానికి కూడా దారితీసింది. తెలంగాణలో దుస్థితిలో వుంటే కొందరు జాలిపడడానికి బదులు, హేళన చేయడానికి పూనుకున్నారు. తెలంగాణాలో ఎవ్వరూ తెలుగు మాట్లాడరనీ, తెలుగు వారంతా ఉర్దూలోనే వ్రాస్తారనీ, తెలంగాణలో కవులే లేరనీ కొందరు అంటూ వుండేవారు. ఒకవైపు మత పక్షపాతం గల కరకు రాచరికపు ఉక్కు పాదాలక్రింద నలిగిపోతున్న వాళ్లను తమ సోదరులు అనే ఈ మాటలు మరీ బాధపెట్టినవి. ఈ బాధా పర్యవసానమే తెలంగాణంలోని రాజకీయ సాహిత్యోద్యమాలకు వెన్నెముక యైన స్వర్గీయ శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ కవుల సంచికను ప్రకటించడం, తెలంగాణలోని నలుమూలలలో వున్న మూడువండల యాభై నలుగురు కవుల రచనలను సంపుటీకరించి 1934లో శ్రీ ప్రతాపరెడ్డి గారు ‘గోలకొండ కవుల సంచిక’గా ప్రకటించినారు.

ఈ సంచికకు అనుబంధంగా నూటా ఎనభైముగ్గురు ప్రాచీన తెలంగాణా కవుల పట్టికను కూడా చేర్చారు. ఈ సంచికను గూర్చి శేషాద్రి రమణ కవులలో ఒకరైన ధూపాటి వెంకట రమణాచార్యులు గారు ఇలా వ్రాశారు.

“కాకతీయ నృపాల ఖడ్గధారాంచల

తరళీ కృతంబులౌ తమ్మిపూలు

రెడ్డిభూపతి కార్య రేఖా తపోత్తప్త

లలిత పత్రంబులౌ కలువపూలు

పద్మనాయక వీర బాహార్గళోన్ముక్త

గంధ బంధురములు కలువపూలు

యవన సోదరకళా ప్రవిలంబ విచికిల

పల్ల వావృతములు మల్లెపూలు

కలవు గోల్కొండరాజ్య సత్కవివతంస

పద్య సంచికలో వీని బ్రస్తుతించి

భారతీ కంఠమనా కూర్చు భాగ్యరేఖ

అలగడె ప్రతాపరెడ్డి కత్యనఘమతికి.”

ఈ సంచికను శ్రీ ప్రతాపరెడ్డిగారు: “ఇది యపర పారిజాతంబు, సదయ హృదయ సంతాతానంద సంధాన సాధనంబు” అని వర్ణించారు.

ఈ బృహత్సంచికను ప్రకటించడానికి ప్రతాపరెడ్డిగారు ఎంత శ్రమపడ్డారో ఊహించలేం. తెలుగులో అంత పెద్ద కవితా సంపుటి (Anthology) ఈనాటికి వచ్చి వుండలేదనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ సంచికలోని వారంతా కవులా అంటే కాకపోవచ్చు. కాని, నెల్లాల సదాశివశాస్త్రి, ఒద్దిరాజు సీతారామచంద్రరావు మొదలైనవారి ప్రౌఢ కావ్యఖండాలు దీనిలో చాలా వున్నాయి.

“ద్రాఘిష్ఠాసితరుక్సముజ్వల దదభ్రప్రావృడ భ్రోద్భవ

వ్యాఘోష ప్రతిమాన కక్ఖటరవ ప్రాధ్మాన నిధ్యావశ

భాఘోచ్ఛ్రాయ సమాన ఘుర్జరిత ధాగోత్ఖాత బంహిష్ఠని

ర్మోఘ స్థేమ కవిత్వం” దగ్గర నుంచి

“లలితారావల సద్చలత్ప్రమదరోలంబావృతానూన మంజులతాంతోపచితప్రతీన రసవస్తు స్వాదునీకార నిశ్చల సుస్వాధు పద ప్రయోగ మహిమా సందీపితా మేయ నిస్తుల సారల్య కవిత్వం” దాకా చెప్పగల వారెందరో ఈ సంచికలో కనపడతారు.

ఆంధ్రప్రాంతానికీ, తెలంగాణానికీ తేడా ఏమిటంటే ఆవధానయుగం గడచి, భావకవితాయుగం ఆంగ్ల కవితా ప్రభావంతో ఆంధ్రలో ప్రారంభం అయినట్లు తెలంగాణంలో కాలేదు. ఇక్కడి రచయితలపై ఇంగ్లీషు కవితా ప్రభావం తక్కువ. ఉర్దూ, పారశీక కవితలు ఇక్కడి కవులలో నూతనోత్తేజాన్ని కలిగించలేదు. ఆంధ్రప్రాంతంలోని భావ కవిత్వోద్యమం వలె నూతనోద్యమాన్ని ప్రారంభింపజేయలేదు. ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్యాల పరిధులోనే ఇక్కడి కవులు ఉండిపోయినారు. ఇంతలో దేశం నలుమూలలా స్వాతంత్ర్యోద్యమం వచ్చింది. ఈ ఉద్యమ ప్రభావం సంస్థానాలపై కూడా పడింది. స్వాతంత్రోద్యమానికి అంతర్వాహికగా భాషాభిమానం పెచ్చు పెరిగింది. తెలంగాణంలోని సాహితీపరులకు ఆంధ్రప్రాంతపు కవులలో పరిచయం హెచ్చింది. అయితే ఆంధ్రప్రాంతంలో కవితా కృషి వ్యక్తులకు ఆశ్రయించి జరిగింది.  తెలంగాణంలో అలాగాక, ఉద్యమంగా వ్యాపించింది.

ఈ ఉద్యమం స్వాతంత్యవాంఛగా పరిణమించి తమ ఉనికికే భంగం కలిగజేస్తుందేమో అనే భయంతో ఆనాటి పరిపాలకులు సారస్వత సభలను కూడా జరుపుకోనీయకుండా ఆటంకాలు కలిగించేవారు. క్షుబ్ధ హృదయాలలో బయల్వెడలిన కవితాజ్వాల ఈ ఆటంకాల ఆజ్యానికి మరీ పెచ్చురేగింది. ఎటుచూచిన సభలే, సమావేశాలే, కావ్యగానాలే, గోలకొండ పత్రికా కార్యాలయం నుండి హనుమకొండ వేయి స్తంభాల గుడిలో దాకా అంతటా కవితా గోష్ఠులే. సోదరాంధ్రులతో పరీరంభానికి ఎక్కడలేని తహతహ! మాతృభాషా వికాసం కోసం ఎనలేని కృషి!

దశమాంధ్ర మహాసభా సందర్భంలో యావత్తు తెలంగాణమునకు ఒక సారస్వత సంస్థ ఆవశ్యకతను గుర్తించిన సాహిత్యకులు ఆంధ్ర సారస్వతి పరిషత్తును స్థాపించారు. దీనికి మొదటి అధ్యక్షులు శ్రీ ప్రతాపరెడ్డిగారే. శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి పారసీ కవితానువాదాలు, స్వతంత్ర రచనలు తెలంగాణంలో రాజకీయవాదులకు సైతం కవితపైగల ఆసక్తిని చెప్పక చెప్పుతవి. సారస్వత పరిషత్తు 1943లో ఏర్పడింది. అప్పటినుండి ఇంచుమించు ఏటేటా జిల్లా ప్రాంతాలలో వార్షికోత్సవాలు, సాహిత్యోత్సవాలు జరుపుతూ యువకవులను, రచయితలను ఈ సంస్థ ఎంతహానో ప్రోత్సహించింది. నల్లగొండ ప్రాంతంలో ‘సాహితీ మేఖల’ అనే సంస్థ ఏర్పడి చాలామంది కవులను సృష్టించింది. హైదరాబాదులో ఏర్పడిన ‘సాధన సమితి’ అనే సంస్థ చాలామంది కవులకు ప్రోత్సాహమిచ్చింది. ఈ సంస్థలు ఎన్నో చక్కని కావ్యాలను ప్రకటించినవి.

కవి అగ్నిపర్వతం వంటివాడు. పైకి సాధారణంగానే కనిపించినా, అతనిలో ఎంతో క్షోభ ఉంటుంది. అది ఏ క్షణాన పైకుబికి, శిఖరం పగుల్చుకొని లోకం మీద పడుతుందో చెప్పలేం. పదాలను గుణించుకొంటూ, గణాలను గణించుకుంటా, నిఘంటువులు వల్లించుకుంటూ అతడు సిద్ధంకాడు. అతడు ఆకస్మాత్తుగా లోకం మీద దూకుతాడు. కవితాజ్వాలతో లోకంలో చైత్రమాసపు అరణ్యంవలె మోదుగులు పూయిస్తాడు. కవి ఏనాడూ సంకుచిత మనస్కుడు కాడు. అలా అయిన నాడు అతడు కవే కాడు. కవి కోరేది స్వసుఖం కాదు, పరసుఖం, కవి కోరేది సంకుచితత్వం కాదు, విశాలత్వం; కవికి భయం లేదు; పిరికివాడు కవి కాడు. తాను భావించింది చెప్పింది ఊరుకోడు. హృదయంలోనుంచి ఉప్పొంగివచ్చిన వెచ్చని భావాలు భాషారూపంలో బయలువెడలియే, కవిత అవుతుంది. ఆ కవిత అశేషజనాన్ని కదిలిస్తుంది. స్తబ్ధ హృదయాలలో అగ్నిని రగుల్చుతుంది. తరతరాలుగా మనం మన భుజాలమీద మోస్తున్న గుడ్డిరాచరికపు బరువును నేలకు తోయించుతుంది. మృత్యువుకు జడియనిది కవితయే. అట్టి కవితా మహావజ్రకవచం గల వీరుడు కవి. అతనికి తిరుగులేదు. తెలంగాణంలో అట్టి కవులు అనేకులు వెలసినారు. నైజాం పరిపాలన వర్ధిల్లాలన్న కవి లేడు. ముక్కోటి ఆంధ్రులు కలసిపోరాడన్నవాడు కానరాడు. ప్రతికవి మతపాక్షిక రాజ్యం అంతముందడాన్ని కోరినవాడే. వందలేండ్లనాడు విడిపోయిన అన్నదమ్ములు కలసిపోవాలని పలికినవాడే.

తెలంగాణంలో స్వాతంత్ర్యద్యమంతో కవిత్యోద్యమం కూడా విజృంభించింది. గ్రంథాలయ వార్షికోత్సవ సందర్భాలలో కవితాపఠనం ఉండవలసిందే. పాఠశాలా వార్షికోత్సవంలో కావ్యగానం జరగవలసిందే. పండుగనాడు కవులగోష్ఠి ఏర్పడవలసిందే. రాజకీయ మహాసభల్లో కవుల పద్యాలు మార్మోగవలసిందే. కవిత్వం వినరాని చోటు తెలంగాణంలో ఉండేదికాదు. “గుడిలో, బడిలో, బందిఖానలో, గుడిసెకొంపలో గోపురాగ్రమున” అంతట కవితా ప్రతిధ్వానమే.

నాకు తేదీలు సంవత్సరాలు జ్ఞాపకం లేవు. కాని కొన్నేళ్ళ క్రితం ఓరుగల్లు కోటలో సారస్వత సభలు జరిగాయి. కాకతీయ రాజుల కాలంలో అనేక వైభవాలను అనుభవించి నేడూ అత్యంత శిథిలావస్థలో వున్న కోటలోని విగ్రహాలు తెలుగువాడి గుండెల్లో ఉడుకురక్తాన్ని పరుగులెత్తిస్తాయి. కోటలో సభలు జరిపారు. సభలకుగాను పైన పెద్ద పందిళ్ళు వేశారు. మతోన్మాదులు వాటిని తగులబెట్టారు. తెల్లారి అవే పందిళ్ళలో సాహిత్య సభ. ప్రతాపరెడ్డి గారే అధ్యక్షులు. కవులు గొంతెత్తి పద్యాలు చదివారు. హృదయాలలో పట్టుదలలు హెచ్చినవి. దేశ దాస్య విముక్తికి ముష్ఠిబంధనం బిగించి జనం ముందుకు సాగారు. ప్రజా హృదయాలలో తెగువను, చైతన్యాన్ని కలిగించింది ఆనాటి కవిత.

కవిత చంపకమాలలో చెప్పినా, ఛందస్సే లేని వచనంలో చెప్పినా ఒకటే. చెప్పేవాని శక్తిని బట్టి అది రాణిస్తుంది. శక్తి ఉన్నవాడూ గద్యం వ్రాసినా పద్యం కంటే పట్టుగా వుంటుంది. అశక్తుడు రాసిన పద్యం చక్రాలూడిన బండిలా కదలదు. భావన, శేముషి రెండు సమానంగా కలగలసి కవితగా ప్రవహిస్తే అది ప్రతివాణ్ణి తలములకలుగా ముంచేస్తుంది. ఇంద్రధనుస్సులా ఆలోచన రంగు రంగులుగా, వంపుగా, వయ్యారంగా విరిసి దానివెనక భాష ఆకాశంలా ఆలంబన చేస్తే కవితా సౌందర్యం కమ్ముకొస్తుంది. ప్రతివాడు నేనే ఈ మార్గానికి ప్రారంభకుణ్ని అని విఱ్ఱవీగుతాడు. ఈ ప్రక్రియకు ఆది ఎక్కడ అంతెక్కడ?

ఆకాశానికి కొస ఏమిటి మొదలేమిటి? నేను కొత్త చంధస్సును సృష్టించానంటా డొకడు. అవును అవునని అతని అనుయాయులు తాళాలు కొడతారు. ఏది కొత్త? ఆ ఛందస్సు ఏ చతురశ్రంలోకో త్రిశ్రంలోకో దిగుతుంది. నేనే వచనపద్యానికి నాంది చేశానంటాడు, మరొకాయన. నీవు కాదంటుంది ‘కాదంబరి’. నువు కాదంటుంది ‘మను చరిత్ర’ లోని గద్యం. వాల్మీకి నాటి అనుషుప్పే కాళిదాసూ వాడుకున్నాడు. అయితే కాళిదాసుకు వన్నె తగ్గిందా? ప్రతివాడూ కొత్తవృత్తం సృష్టించుకోవాలని తహతహపడడం అజ్ఞానం. ఉన్న వృత్తాలతో మహా ప్రబంధాలు రాశారు శ్రీనాధుడు. తెలంగాణంలోని కవులు ఈ రభసలో పడక, పెద్దలు వేసిన దారిని తిరస్కరించకుండా అందులోనే నడిచారు. అయితే ఎవడి శక్తికొలది వాడినడక. నాకు విమానం చేతికిచ్చి నడపమంటే నేనేం నడుపుతాను? అలాగే చేతగాని వాళ్ళు చతికిలపడ్డారు. చేతనైనవాళ్ళు సాగిపోయారు.

ప్రతివాడికి ఏదో ధ్యేయం వుంటుంది. ఆ ధ్యేయాన్ని సాధించడానికిపడే ఆవేదన అతని రచనలో కనిపిస్తుంది. నాకు రెండు కోర్కెలుండేవి. వాటిని లక్ష్యాలే అనండి, ధ్యేయాలే అనండి మీ ఇష్టం. మొదటిది హైదరాబాదులో రాచరికం అంతం కావడం, రెండవది; విశాలాంధ్రం ఏర్పడడం. ఈ రెండు కోరికలూ నా జన్మలో తీరవని కొన్నాళ్ళు నిరాశపడ్డాను. అయితే అనుకున్న దానికంటే పదింతలు ముందు ఈ రెండూ ఫలించాయి. ఈ రెంటిని గూర్చే నేను రాసిందంతాను. నేను ఉద్యమోపజీవిని. నాకు ఆరాటపెట్టే సమస్య ఏదో వెంటవుండాలి. ఆ సమస్య నా వ్యక్తిగతమైనది కాగూడదు. అది పదిమంది సమస్యా అయివుండాలి. ఆ సమస్య పదే పదే నా గుండెలోని గాయాన్ని కెలుకుతూ, అనారోగ్యపరుస్తూ, దుఃఖపెడుతూ, ఉద్వేగం పెంచుతూ, పొంగిమా, క్రుంగదీస్తూ ఉండాలి. అప్పుడే ఏమైనా రాయగలను. పందొమ్మిదివందల నలభైఅయిదు నుంచి పందొమ్మిదివందల యాభై ఆరుదాకా పుష్కలంగా నాకు సామాగ్రి దొరికింది. ఇప్పుడు విశాలాంధ్రం వచ్చింది. ఆనందాతిరేకంలో గొంతు మూగపడ్డది. ఇప్పుడు అగ్నిపర్వతం చల్లబడింది. కొన్నాళ్ళు ‘లావా’ పొంగిరాదు మరి!

ఆనాడు నాతోపాటు ‘లావా’ కురిసిన మిత్రులు అనేకులు నాటి కవితోద్యమానికి చేయూత ఇచ్చారు. మిత్రుడు ఆడూరి అయోధ్యరామకవి హృద్రోగంతో కాలధర్మం చెందాడు. చందాల రామకవి కానరావడం లేదు.

సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది. సభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, సన్మానాలు, సత్కారాలు – ఇల్లు వాకిలీ మరచి నెలల తరబడి కవులు ఆ ప్రాంతాలలోనే గోష్ఠులు జరుపుతూ కాలక్షేపం చేసేవారు. అన్నిరకాల కవులు ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరి రచనను విని ఒకరు ఆనందించడం వుండేది. ఒకళ్ళు అగ్నిని కురిపిస్తే, ఒకరు వెన్నెల విరియించేవారు. ఒకరిది గంగా ప్రవాహం అయితే, ఒకరిది సెలయేరు. ఒకరు ఝుంఝూమారుతం అయితే, ఒకరు మలయానిలం. ఒకరు ఇంద్రకార్ముకాన్ని గూర్చి వ్రాస్తే, ఒకరు కార్మికుణ్ణి గురించి వ్రాసేవారు.

ఈనాడు కవితా సన్యాసం జేసిన చాలామంది ఆనాడు వ్రాసేవారు. దేవులపల్లి రామానుజరావు చక్కని కవి. అందుకు ఆయన పచ్చతోరణమే సాక్షి. సిరిప్రగడ భార్గవరావు కమ్మని పద్యాలు వ్రాసి శ్రావ్యంగా చదివేవాడున్నూ. ధవళా శ్రీనివాసరావు ఇటీవల వినపడకున్నా చాలా రాశాడు. పులికాల హనుమంతరావు ఎక్కువగాకున్నా కొంత రాశాడు. గడియారం రామకృష్ణశర్మ కంఠం ఎత్తి కావ్యం ఆలపిస్తే, వేలాది సభాసదులు మంత్రముగ్ధులై వినేవారు.

ఆంధ్రసారస్వత పరిషత్తు వార్షికోత్సవాలు తెలంగాణం నలుమూలలలోని కవులనూ ఒక్కచోటికి చేర్చేవి. ఆ రెండు మూడు రోజులూ భువనవిజయోత్సవా లనిపించేవి. వితరణశీలులైన భాషాభిమానులు వందలాది సారస్వత సేవకులకు భోజనాలు ఏర్పాటు చేయడం, నిద్రలు లేకుండా తెల్లవార్లూ కవితాపఠనం జరుగుతూ వుండడం ఒకనాటికీ మరువరానివి.

జైల్లో సైతం వందలాది జనం ఒక్కచోట చేరి పద్యాలు చదివించుకుని వినేవారు. నిజామాబాదు జైల్లో తెలంగాణోపాఖ్యానం రాశాను. అగ్నిధార, రుద్రవీణ చాలాభాగం అక్కడ రాసినవే. ఎత్తైన కొండమీద జైలు. జైలులో నుంచి చూస్తే ఎఱ్ఱగా పూచిన మొదుగులతో అలంకరించిన అడవి. అడవికి మధ్యగా నిజాం సాగర్ కాలువ. కాలువగట్ల మీద అమాయికంగా ఆడుకునే మేకలూ, మేకల కాపరులూ, నా చుట్టూ ఖైదీలు. అభం శుభం ఎరుగని పల్లెజనం. దయా దాక్షిణ్యాలు లేకుండా గుంపులు గుంపులుగా పల్లెజనాన్ని పట్టుకువచ్చి బంధించారు. తమ కుటుంబాల కోసం వారుపడే ఆరాటం! ఎటుచూసినా నిరాశ! ఇవాళటి ఖైదీలం రేపు రాజులం. ఎంత నమ్మకం!

పోలీసుచర్య తరువాత రాజకీయబాధలు లేవు. విశాలాంధ్రోద్యమం ఉధృతం హెచ్చింది. హైదరాబాదు రాష్ట్రంలో సాహిత్య సభల మీద నిషేధాల బాధ లేదు. అడ్డుతొలగిన నదివలె కవితా ప్రవాహం పరవళ్ళు తొక్కింది. ఆంధ్రప్రాంతం నుంచి కవులనేకులు వచ్చి ఇక్కడి సాహిత్యోత్సవాలలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కవులు ఆంధ్రదేశం నలుమూలలా సంచారం చేశారు.

ఇక్కడ కవిసమ్మేళనాల పద్ధతే వేరు. కవిసమ్మేళనం అవగానే రాత్రి అయినా, పగలైనా, ఉదయమైనా, సాయంత్రమైనా, వేలాది జనం రావలసిందే. ఎంతమంది కవులున్నా వారందరూ కావ్యగానం చేసేదాకా వినవలసిందే. వామమామలై వరదాచార్యులు తమ శ్రావ్య గంభీర కంఠంలో పోతన కావ్యంలో నుండో తన ‘మణిమాల’లో నుండో పద్యాలు చదువుతుంటే, జనం తలలూపుతారు. “కాళోజీ కవి కైతలు వినియు కదలకుందురింకెన్నాళ్ళు?” అంటూ కాళోజీ నారాయణరావు తన గొడవను వల్లించడం, భాగి నారాయణమూర్తి గేయాలు. వెల్దూర్తి మాణిక్యరావు బాలకవిత, లక్ష్మణశాస్త్రి జటిల పద్యాలు, పల్లా దుర్గయ్య చల్లని నడక, కవిసమ్మేళనానికి వన్నె చేకూరుస్తాయి. పొటపల్లి రామారావు తన ‘చీమలబారు’, ‘కాలిబాట’ చదువుతుంటే అతని భావన మనసు ఆకాశాలకు ఎత్తు పోతుంది. ఇక నారాయణరెడ్డి గొంతెత్తితే విద్యార్థుల నుండి విద్యాధికుల దాకా శిరఃకంపం చేయంది తప్పదు. విత్తానికి కాకున్నా, విజ్ఞానవినోదాలకు కవిగోష్ఠులు బాగుంటాయి. ఇటీవల బాగా రాస్తున్న సంపత్కుమార, సుప్రసన్న, మాదిరాజు రంగారావు, జె. బాపురెడ్డి చక్కగా కావ్యగానం చేయగలరు. ఖమ్మం మెట్టు ప్రాంతంలో ఊటుకూరు రంగారావు, కవిరాజమూర్తి ప్రభృతులు నలగొండ ప్రాంతంలో మదోజు సత్యనారాయణ, ధవళా శ్రీనివాసరావు మున్నగువారు, ఓరుగల్లులో బొల్లేటి నౄసింహశర్మ పొట్లపల్లి రామారావు, గద్వాలలో గొట్టముక్కల కృష్ణమూర్తి మున్నగువారు నిర్విరామంగా కవితారచన చేస్తూనే వున్నారు. పుస్తకాలు ప్రచురించబడుతున్నవి.

తెలంగాణా రచయితల సంఘం 1951 లో స్థాపించబడింది. ఈ సంస్థ కవితా వ్యాసంగాన్ని తెలంగాణంలో వృద్ధిపరచడంలో చాలా తోడ్పడిందని చెప్పవచ్చు.

కవిత్వం ఒకరికోసం రాయబడేది కాదనుకుంటాను. అది వసంతోదయంతో ఆమ్రతరుశాఖ వలెను, శరదాగమనంతో వెన్నెల వలెనూ వెలుస్తుంది. నాగరక జాతిలో ఉత్తమకవిత ఉద్భవిస్తుంది. అయితే కవితకు కూడా ఉచ్చదశ, క్షీణదశ ఉంటాయి. ఆంధ్రకవితా చరిత్రలో రాయలకాలం ఉచ్చదశ అయితే, తంజావూరు రాజుల కాలం కొంత క్షీణదశే. వసంత శిశిరాలవలె ఈ ఉచ్చనీచాలు తప్పవు. ఈ శిశిర వసంతాలు ప్రతి జాతి సాహిత్యంలోనే గాక, ప్రతికవి జీవితంలోనూ వస్తాయి. ఒక కవి కొంతకాలం రాస్తాడు. కొంతకాలం రాయలేడు. రాసినా మహోత్కృషంగా వుండదు ఆ రచన. అయితే మనం అనుకోకుండా ఒక్కొక్కడు ఒక ఉత్తమ కవిగా రూపొందుతాడు. అతని రచనలో ఎక్కడలేని వన్నె చిన్నెలు కనిపిస్తాయి. అతడు చేసిన సృష్టి మన సాహిత్యానికి పుష్టిని కలిగిస్తుంది. మనకు నచ్చని సాహిత్యం ఉద్భవిస్తున్నదని కొత్తవారిని తిరస్కరించడం పెద్దవారికి తగదు. పేరు ప్రతిష్ఠలు కేవలం రచనా పాటవం వలనే రావు, అనేక కారణాలుగా వస్తాయి. అవి చాలా కాలం నిలువక పోవచ్చు. ప్రజాదరణ పొందిన ప్రతీది ఉత్తమ రచన అనలేను, ప్రజలు ఆకళించుకోలేని గంభీర రచనలకు ఆదరణ లేకపోయినంత మాత్రాన విలువ తగ్గదు. సృష్ట్యాదినుండీ ఎడతెగకుండా ప్రవహిస్తున్న ఈ కవితావాహిని మనం చంద్రమండలానికి ప్రయాణం కట్టినంతమాత్రాన ఇంకిపోవలసిన ఆగత్యం లేదు. “కవిత లేనినాడు యువత శూన్యంబౌను; యువత లేనినాడు నవత సున్న; నవత లేని నాడు నాగరికత లేదు; నాగరికత లేక నాడు లేదు.”

– దాశరధి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here