తెలికడలి సుడులలో -2

    11
    5

    [box type=’note’ fontsize=’16’] విశ్వనాథ విరచిత రామాయణ కల్పవృక్ష కావ్యంలోని కొన్ని పద్యాల పరిచయం డా. మైథిలి అబ్బరాజు సాహిత్య వ్యాసం “తెలికడలి సుడులలో-2“. [/box]

    [కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం నుంచి కొన్ని పద్యాల పరిచయం, నాకు చేతయినట్లుగా తేలిక కోసం సంధులను విడదీసి రాస్తున్నాను. అర్థమవుతుంది తప్ప యతిప్రాసలు, గణాలు పొసగవు. మన్నించాలి]

    యజ్ఞ సంరంభం

    అక్కడి యజ్ఞాన్నీ , ఏతెంచిన వసంతాన్నీ సరిపోల్చినవి నాలుగు పద్యాలు. వసంతం- కొత్త ఆశల ఆవిష్కారం, యజ్ఞమూ అందుకోసమే. ఆపైన రాముడు నవ్య ఫలమై వచ్చినదీ వసంతం లోనే-నవమి రోజున.

    కోకిలను చేసిన వర్ణన – ఒక సీసం, ఒక గీతం.

    అది అచ్చం యజ్ఞకర్త కి మల్లే ఉంది – ఇట్లా.

    హోమం చేసేప్పటి పొగ కళ్ళలోకి చొచ్చితే అవి ఎఱ్ఱనైనట్లు -కోకిల కన్నులెఱ్ఱన.

    కోకిల పర్ణాలు భుజించీ , యజ్ఞకర్త [పరిమితంగా సాత్త్వికంగా ] యజ్ఞ నియమానుసారం భుజించీ – ప్రకాశించారు.

    ముక్కుతో చిగురాకులను మీటుతోంది. యజ్ఞకర్త ‘జుహువు ‘ [మోదుగు కర్ర తో చేసిన పరికరం ] తో ద్రవ్యాలను నింపి పట్టుకున్నాడు. చిగురాకుల రంగూ ఆ జుహువు రంగూ పోల్చదగినవి.

    కోకిల పంచమస్వరం – చక్కగా సుస్వరంగా సామవేదం చదవటం.

    నల్లటి రెక్కల శరీరపు కోకిల – నియమం వలన మలినమై ఉన్న వస్త్రాలు కర్తవి …

    సీ. ఎఱ్ఱనౌ నేత్రమ్ములు ఇష్టి వేళ అనల ధూమ సంతానములు తూఱినట్లు

        ఆకులు తినుట దీక్షాకాల భోజన నియమతీవ్రత చేత నెగడినట్లు

        చివురాకు ముక్కున చిమ్ముట జుహువు తో పాత్రాదికమ్ములు పట్టినట్లు

        పంచమస్వరము స్తోభలు చక్కగా చూచి సామగానమ్ములు సదివినట్లు

     గీ.  రేకులు ఈకల నలుపు ధరించినట్టి

         నియమ వస్త్ర మాలిన్యంబు నెఱయునట్లు

         సప్తతంతు మహాకార్య సమయమందు

         కర్త వోలిక కోకిల కానుపించె.

    (ఇష్టి, సప్తతంతువు : యజ్ఞము

     నెగడు : వర్ధిల్లు, ప్రకాశించు

     స్తోభ : సామవేదం చదివే మధ్యలో వచ్చే కాకుస్వరం

     నెఱయు : నిండు, వ్యాపించు )

    మరొక సీసం- ఇట్లా

    సీ. ప్రతి రసాలకుంజంబు పచ్చిపిందెలతోడ నెలమసలిన కాంత వలెనె తోచె

        ప్రతి నిస్వనత్ బంభరము యజ్ఞదక్షిణకై ఏగు బ్రాహ్మణునట్లె తోచె

        ప్రతి మల్లెపూవు సవ ప్రేష్ఠ హవిరర్థ సుగృహీత లాజల చొప్పు తోచె

        ప్రతి చిన్ని పూదోట పలిత దోహద ధూపముల యజ్ఞవాటికవలెనె తోచె.

    (బంభరము: తుమ్మెద

     ప్రేష్ఠము : శ్రేష్టమైన

     హవిస్సు : హోమద్రవ్యము

     లాజలు : పేలాలు

     పలితము : బూడిద వన్నెది)

    పచ్చి పిందెలు వేసిన ప్రతి మామిడి గుబురూ నెలతప్పి ఉన్న స్త్రీ లాగా ఉంది.

    రొద చేసే ప్రతి తుమ్మెదా యజ్ఞ దక్షిణకోసమై వెళ్ళే బ్రాహ్మణుడికి లాగా ఉంది. [హడావిడిగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు కాబోలు ]

    ప్రతి మల్లెపూవూ యజ్ఞం లో వ్రేల్చేందుకు ఎంచుకున్న మేలిరకపు పేలాలకి లాగా ఉంది…

    పలిత దోహద ధూపములు : . దోహదం అంటే 1. కొన్ని చెట్లు పూసేందుకు చేసే ప్రక్రియ . మాళవికాగ్నిమిత్రం లో అశోకవృక్షం పూసేందుకు మాళవిక ఆ దోహదక్రియను చేస్తుంది. అందెలతో పారాణి తో అందం గా అలంకరించిన పాదం తో ఆ చెట్టును తన్నటమే అది.

    1. గర్భిణి కి వచ్చే వేవిళ్ళనూ దోహదం అని అంటారు

    ఈ రెండు అర్థాలనూ ఈ వాక్యం లో అన్వయించుకోవచ్చు.

    ఆ బూది రంగు పొగలు దోహదాలవుతూన్న యజ్ఞవాటిక – ప్రతిచిన్ని పూదోట.

    చమత్కారం ఇక్కడ-

    గీ. మాధవుడు సవప్రీతుడన్ మాట కలిమిని

       ఎల్ల రీతుల సాగింపనేమొయనగ

       తాను తద్ధితరూపమాధవుడు వచ్చె

       దీప్త మఖ యోగ్యనిర్వర్షత్ ఇష్టమూర్తి.

     (మఖము: యజ్ఞము)

    మాధవుడు [ విష్ణువు, వసంతుడు ] – సవప్రీతుడు [ సవము అంటే యజ్ఞమనీ పూతేనె అనీ రెండు అర్థాలు. విష్ణువుకూ వసంతుడికీ విడివిడి గా ] అనే మాటను ‘ ఎల్ల రీతుల సాగింపనేమొ ‘ అనగా – తద్ధిత రూప మాధవుడు వచ్చాడు. మాధవుడి తనమంతా నింపుకొని వచ్చాడు , మాధవుడయిపోయి మరీ వచ్చాడు. [ విభక్తి తో అంతమయే శబ్దాలకు వచ్చే ప్రత్యయాలు తద్ధిత ప్రత్యయాలు.]

    వర్షం కురిసి యజ్ఞానికి ఆటంకం కాకుండా వెలిగిపోతూ వచ్చాడు. ఇష్టదైవమయి [ రఘువంశపు ఇలవేలుపు రంగనాథుడు ] ఇష్టం తోటి.

    ***

    యజ్ఞ ప్రయత్నాలు మొదలైనాయి.

    ఋష్యశృంగుడి ఆజ్ఞ రాజు కి విధాయకం, ఆ వెనకను ప్రజలందరికీ.

    ఎవరు ఏవేళ వచ్చి పడినా వారెంతమంది అయినా అందరికీ అన్నం పెట్టాలి. తుష్టిగా పెట్టాలి. సుష్టుగా పెట్టాలి. విసుగు కూడదు, కోపం గా విదిలించటం కూడదు.

    అన్నశాంతి .

    ఉ. పల్లెల నుండి యజ్ఞమని వచ్చినవారికి ఎల్లవేళలన్

         పిల్లయు మేకయంచు అనక పెట్టవలెన్ సకల అన్నభక్ష్యముల్

         కొల్లలు కాగనై, విసువు కొంటయు కోపము మై విదల్చుటల్

         చెల్లగ రాద్, ఎవ్వరయి చేరిన అన్నము పెట్టువేళలన్.

    (కోపము మై: కోపం తో .మై అనేది కూడా కొన్ని సందర్భాలలో తృతీయావిభక్తి ప్రత్యయం గా ఉపయోగించబడుతుంది)

    ఎవరెవరిని పిలవాలి ?

    అందరినీ.

    పిలిచినవారందరినీ ఆదరించాలి.

    వధూవరుల తలిదండ్రులకు ముందే పరిచయం ఉంటే ఒక జంట పెళ్ళి కి మరొకరు వెళ్ళి ఉండటం జరగచ్చు. అదొక ముచ్చట.

    ఇక్కడ – ఆహ్వానించవలసినవారిలో ప్రథముడుగా జనకమహారాజు చెప్పబడుతున్నాడు.

    ఆయన ‘ చిరకాలబంధువు ‘ అట. అది ఎప్పటి చుట్టరికమో ! అరుణి శిష్యుడు అష్టావక్రుడికి శిష్యుడు, త్రయీవిద్య గట్టి చిగురులు తొడిగి రాణించే ఆ సీమ విదేహాన్ని ఏలే వెలుగు …’ విదేహములేలు జోతి ‘ ! ధర్మచరణకు ఆటపట్టయిన వంశమే ఆయన – అవును ఆ విదేహ ధరాధిపతులందరూ ‘ జనకులే ‘ , ఎప్పటినుంచో. ఆయనను నువే వెళ్ళి పిలవాలి, ఎవరినో పంపటం కాదు.

    అమ్మవారిని కన్న తండ్రో, కనబోతూ ఉన్నాడో మరి – అంతకన్న ముఖ్యులెవ్వరు !

    ఉ. ఆ చిరకాలబంధువు అహర్పతి శిష్యుని శిష్యుడున్ త్రయీ

         శ్రీ చివురొత్తి రక్తిగొను సీమ విదేహములు ఏలు జోతి ధ

         ర్మచరణంబు మేల్కొలమునౌ జనకున్ పిలువంగనౌను నీ

         వే చని పిల్చుట ఒప్పు మఱి ఏరినొ పంపుట యొప్పునే యటన్.

    (త్రయీ విద్య : మొదటి మూడు వేదాలు

     అహర్పతి : సూర్యుడు

    జనకుని గురువు అష్టావక్రుడు. ఆయన గురువు అరుణి అనే నామాంతరం గల ఉద్దాలకుడు .ఉద్దాలకుడు అష్టావక్రునికి మేనమామ కూడా. {ఉద్దాలకుడికి తనకే తెలియకుండా పుట్టిన కొడుకు శ్వేతకేతువు. ఆ కథను దగ్గుపల్లి దుగ్గనామాత్యుడు రచించాడట } అహర్పతి అనేది ఎట్లా పొసగుతుందో నాకు అర్థం కాలేదు . పెద్దలెవరైనా చెబితే తెలుసుకుంటాను )

    కాశికాధిపతి ని పిలవమని చెప్పేప్పుడు విశ్వనాథ వారి వైశ్వనాథీయమంతా , శివకేశవాద్వైతం గా పరీమించి కనిపిస్తోంది.

    ఉపనిషత్ లలో విహరించే వేదాంత పురుషుడు, వివిధ ప్రళయకాలాలలో అపహరించబడిన బ్రహ్మవిద్యను మళ్ళీ మళ్ళీ వెనక్కి తేవటం లో ప్రవీణుడెవరో , వాడు – ఆ పుంజ్యోతిస్సు…

    ప్రళయకాలాలలో ఆమహాసముద్రాల అలలుప్పొంగి బడబానలం ప్రజ్వరిల్లి

    పృథివి ని నీళ్ళలో ముంచెత్తినప్పుడు , ఆ జలధికి లొంగని మట్టి ముద్ద ఒకటి – దాని అవతల ఒకడుంటాడు ఎప్పుడూ – ఆ పట్టణం కాశి. ఆ పురాధీశుడిని, నీ ప్రియమిత్రుడిని, గౌరవంతో ఆహ్వానించు.

    ‘పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగు’ అనే పోతన్న గారి పద్యం ఇక్కడ గుర్తొస్తుంది.

    వేదాలను ఎత్తుకుపోయే సోమకాసురుడిని జయించేది మత్స్యావతార విష్ణువు, ప్రళయకాలాలలో ఏ ఒత్తిడీ తగలని నిసుగు వటపత్రశాయీ ఆయనే – ఆ రెండు సందర్భాల నూ కాస్త అటూ ఇటూ గా విశ్వేశ్వరుడికి అన్వయిస్తున్నారు – ఆ అభేద ప్రతిపత్తి ని ఆత్మ లో దర్శించిన మహాకవి , వ్యావహారికం గా శివుడి వైపుకు నీవారపు ముల్లు అంత ఎక్కువ మొగ్గేవారు .( వారి పూర్వులు కాశీ నుంచి విశ్వేశ్వరలింగాన్ని తెచ్చి వారి స్వగ్రామం నందమూరులో ప్రతిష్టించారు )

    మొత్తానికి – రాముడుద్భవించబోయేందుకు, విశ్వేశ్వర ప్రతినిధి యై కాశీ రాజు రావాలి, అంతే.

    క.       బృహదారణ్యోపనిషత్

              విహరత్ వేదాంత పురుషు వివిధ ప్రళయ

              ప్రహరత్ హృత దహరవిద్యా

               ముహుః ఆహరణ ప్రవీణ పుంజ్యోతిస్సున్.

    చ. ప్రళయ పయోధి వీచి బడబాశిఖి ధూతము పొంగి ధాత్రి నీ

        ళ్ళుల మునిగించుచో, జలధిలోగొనజాలని మట్టిముద్ద అ

        వ్వలన్ ఒకడుండు నిత్యమగు పత్తనము, ఆ అవనీశున్ సాదృతిన్

        పిలువుము మానవేంద్రు ప్రియమిత్రము స్నిగ్ధుని కాశికాపతిన్.

    (ప్రహరము : వేళ

    హృతము : అపహరింపబడినది

    దహరవిద్య : ఛాందోగ్య ఉపనిషత్ లో చెప్పబడిన బ్రహ్మ విద్య. సాధకుడు తన హృదయ కుహరం లోని బ్రహ్మం పైన దృష్టి నిలుపుతాడు. దహరము అంటే చిన్నది అని.

    ముహుః : మాటిమాటికి

    ఆహరణము :తెచ్చుట, లాగుట

    శిఖి: అగ్ని

    ధూతము: కదిలినది, ఎగసినది

    పత్తనము : పట్టణము

    సాదృతి : స + ఆదృతి : ఆదరం తో )

    అటూ ఇటూ చెదరని ఆ దాశరాజు గుహుడిని పిలువు.రాజ్య వర్తకమంతా అతని అధీనం లో ఉంది. గుణవంతుడు, కల్మషం లేని వాడు …అంత మాత్రమే కాదు, నువ్వు ధైర్యవంతుడివి కనుక చెబుతాను – పవిత్రములైన ఊహలు కాక వేరొకటి రాని సంస్కృతికి అతడు ఆటపట్టు – నువే పిలవాలి సుమా !

    ఇదంతా దశరథుడికి చెబుతూ ఉన్నది వశిష్ట మహర్షి.

    దాశరాజు నిష్కాలుష్యం తో రాఘవులకు ఏమి పని పడుతుంది ? పడవచ్చు. అందుకే ధైర్యవంతుడివి కనుక చెబుతున్నానని అంటున్నాడు

    (దశరథుని ధైర్యం చెడేరోజు ఒకటి వచ్చినప్పుడా గుహుని నైర్మల్యం దాశరథికి ఊరట ఇవ్వబోతుంది )

    చ. నిభృతుడు దాశరాజు గహునిన్ పిలువన్ వలె, రాజ్యవర్తక

        ప్రభువతడు అంతెకాక గుణవంతుడు నిష్కలుషుండు నీవు ధీ

        విభవుడవు అవుట చెప్పెద , పవిత్రములు ఊహలు కాక ఆ ఎదన్

        ప్రభవము కాని సంస్కృతికి పట్టు అతడు, ఆతని నీవె పిల్వుమీ.

    (నిభృతుడు: దృఢమైన వాడు)

     ***

    అంతా వచ్చి చేరారు అయోధ్యకు.

    ఇక్కడ ఒక గంభీరమైన వర్ణ చిత్రాన్ని గీసి చూపెడతారు.

    సముద్రం మధ్యలో బడబానలం , దాని చుట్టూ నీటి తరగలు – వేటి లక్షణం వాటిదిగానే నిలిచినట్లుగా- ఆహూతులైన రాజుల బలాలను తన లో ఇముడ్చుకొన్నది అయోధ్యానగరం. హద్దులకు లోబడి ఒదిగినా ఆ సేనల కాంతులు తరిగినది లేదు ,వాటికి అవతల తన దైన మహిమ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది – ” స్వీయమహిమలు పెనుకాల్వలు గాగ నూగగన్ ”

    చ. ఉడుకుల అంచులన్ జలములుబ్బి తరంగల నొత్తుచున్ సము

        ద్రుడు బడబాగ్ని వోలె సరితూగి అయోధ్య సమస్తరాజులన్

        కడుపున దాచె తత్ బల ముఖంబులు హద్దులకు ఒత్తి తత్ ప్రభల్

        మడగక ఉండ స్వీయమహిమల్ పెనుకాల్వలు కాగ ఊగగన్

    (మడగు : వంగు )

    యజ్ఞానికి వచ్చినవారిని అయోధ్యాప్రజలు నెత్తిమీద పెట్టుకు చూశారు. ఎంత రాత్రివేళ తలుపు తట్టినా చిటికలో

    వచ్చి తీస్తారు. కొంచెంమంచినీళ్ళిస్తారా అంటే ఏకం గా మజ్జిగ తెచ్చి పెడతారు. అరుగుల మీద పడుకుంటామంటే తమ మంచాలూ పక్కలూ తెచ్చి వేస్తారు [సామాన్య సంసారులన్నమాట – తమకూ అతిథులకూ సరిపడేటన్ని మంచాలూ పరుపులూ లేవన్నమాట ] . అక్కా, పిల్లకు అన్నం వేళ దాటుతోందంటే అప్పటికప్పుడు వండి భోజనం పెడతారు.

    సీ. చని ఎంత ప్రొద్దు వేళను తల్పు తట్టిన చిటికెలో వచ్చి తీసెదరు తలుపు

        మంచి తీర్థమ్మును కొంచెమిత్తురే అన్న తియ్యని మజ్జిగ తెచ్చి ఇత్తురు

        అరుగుల నిదురింతుమన్నచో తాము నిద్రించు మంచము ప్రక్క తెచ్చి ఇత్తురు

        అప్ప ! పిల్లకు వేళ తప్పు భోజనమునకు అన వండిపెట్టుదురు అప్పుడపుడె.

     ***

    యజ్ఞపు సంతర్పణల ముచ్చట్లు ఇట్లా…రెండు దశాబ్దాల కిందటి వరకూ తెలుగిళ్ళ బంతి భోజనాలు ఉండిన పద్ధతిలో.

    విస్తరి మీదికి వంగిపోయి వద్దంటే వడ్డించటం మాని ఉందురేమో వంటవాళ్ళు – వంగేందుకు వీపూ పొట్టా రెండూ సహకరించటం లేదు జనానికి – చేతులు అడ్డం పెట్టినా వడ్డించేసి వెళ్ళిపోతే, తినలేకా పారేయకూడదు కనుకా కష్టపడి పదార్థాలు తింటున్నారు.

    ఉ. విస్తరి మీద వంగబడ వేయక మానెదరేమొ సూదకుల్

        విస్తరి పైని వంగుటకు వెన్నును వంగదు పొట్ట వంగదున్

        హస్తములడ్డముంచినను ఆగక వడ్డన చేతురు అన్నియును

        కస్తిగ అట్లె తిందురు అవు కాదనలేక క్రతుప్రసాదముల్

     (సూదకులు: వంటవారు

     కస్తి: దుఃఖము, కష్టము)

    ఈ పద్యానికి ఏ వివరణా అక్కర్లేదు – ” తిన్న కడుపులూ ఎన్నగా ఎడదలూ ఉబ్బిపోయినాయట…”

    సీ. ఇపుడె గుండిగ దింపి ఇగురబెట్టితి పొడిపొడులాడు ఈ అన్నమును తినుండు

        పూర్ణమ్ము లేకుండ పునుకులుగా వేసితిమి కరకరలాడు తినుడు వీని

        కాలుచున్నది కాబోలు క్షీరాన్నము ఇదె దొన్నెలను తెచ్చి ఇత్తునుండుడు

        ఇది గడ్డపెరుగు మీరిక కొంచెం వేసికొనవలె చలువ చేయును కదండి

    గీ. అనుచు బతిమాలి బతిమాలి అవనినాథ

       సూదకులు కొల్లలుగ తెచ్చి చూఱ ఈయ

       అన్నమును ఆదరంబున తిన్న కడుపులు

       ఎన్న ఎడదలు ఉబ్బిపోయెదరు జనుల్

    ఆ  సమారాధన ద్రవ్యాలు అన్నీ శ్రీరంగశాయి సేవకోసమైనట్లు- సౌందర్యభరితంగా రెండు పద్యాలలో.

     అన్నపురాసులు వనమాలలు కట్టేందుకు రాశిపోసిన సన్నజాజుల్లాగా

     పల్చని ఖర్జూరపు చాపల మీద పెట్టిన పప్పుముద్దలు – చందనం లాగా

     ఎఱ్ఱడాలు వచ్చేలాగా వేయించిన అప్పడాలు పునుగూ కుంకుమా లాగా

     వంగ వడియాలు వేసి కాచిన పులుసు ఘుమఘుమలు – ఒలికిన అత్తరులలాగా

     ఆ వంట ఇంటిలో దినుసులు అన్నీ – రాఘవుల ఇలవేల్పు రంగనాథస్వామి వారి పవళింపుసేవ కోసం భద్రపరచిన సంబారాల లాగా.

    సీ. అన్నంపు రాసులు చిన్న తోమాలెలకై సన్నజాజులు పోసినట్లు

       సన్న ఖర్జూరపు చాపలపై సూపరాసులు గంధమ్ము తీసినట్లు

       ఎఱ్ఱవాగుగను వేయించిన అప్పడములు పునుగు కుంకుమ కుప్పవోసినట్లు

       వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపులు అత్తరులు ఒల్కించినట్లు

    గీ. రాఘవుల ఇలవేల్పు శ్రీ రంగనాథ

       ప్రభువు పవళింపు సేవకై భద్రపఱచి

       నట్టిసంభారమనగ మహానసంబు

       ద్రవ్యములు పొల్చె దశరథ క్రతువు వేళ.

    (తోమాలె: ఆకులు, పువ్వులు కలిపి కట్టిన దండ

    సూపము : ముద్ద పప్పు

    చోష్యము : పులుసు

    మహానసము : వంట ఇల్లు )

    వంట బావుంది. ఆదరంతో వడ్డించటం మరీ బావుంది. ఇదివరకు చేసుకున్న పుణ్యం ఇట్లా పండి అందటం ఇంకా చాలా బావుంది…పొగిడేందుకు జనానికి మాటలు చాలటం లేదు.

    క. పాకము రమ్యము ఆదర

       పాకమ్మది రమ్యతరము ప్రాక్ సుకృత పరీ

       పాకమ్ము రమ్యతమమని

       వాకులకందని పొగడ్త అట్టుదురు జనుల్

    (ప్రాక్: మునుపటి)

     [బాలకాండము – ఇష్టిఖండము]

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here