తెలిసిన బంధాల విలువ

0
8

[dropcap]మ[/dropcap]నిషి జీవన ప్రయాణంలో అన్నీ సాఫీగా సాగవు. అనుకోని మలుపులు. ఒక మలుపు మన దృష్టిని పెంచుతే మరో మలుపు దగ్గర మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేస్తుంది. జీవితంలో ఒక సమస్య తీరిన తరువాత మరో సమస్య వస్తుంది. మనం బ్రతికున్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక చిన్న సమస్య దగ్గరే పోతే మనం మన జీవితాన్నే పోగొట్టుకున్నట్టు. అందుకే సమస్యలను ధైర్యంగా అదిగమించాలి.

సమస్యలతో మమేకమయితే ఎవరైనా ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటారు. ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ఆలోచిస్తే ఆ సమస్యలకు దారి దొరుకుతుందని చెప్పడం సులువే కాని పాటించడం కష్టం. కష్ట సమయాలు ఎప్పుడూ అంతం కావు. దృఢమైన మనస్తత్వం కల వాళ్ళు మాత్రమే వాటిని అధిగమిస్తారు.

అయితే నాది ఏదీ తెలియని పరిస్థితి. సమస్యలకి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాలా లేక దృఢంగా ఎదుర్కోవాలా అని. అయితే నేను దృఢంగా ఎదుర్కోదలచాను. అయితే నా మనస్సు నిలకడగా లేదు. ఏదో అశాంతి. ఏదే చెప్పలేని దిగులు, బాధ. కకావికలమైన మనస్సు. నా జీవితం వేపు తొంగి చూస్తే నా బాల్యం నుండి ఇప్పటి వరకూ ఒకే పంథాలో సాగుతోంది. నా బాల్యమంతా జీవితంలో ఎటువంటి మధురిమలు, తియ్యని అనుభూతులు లేకుండా గడిచిపోయింది.

ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో, అందులో ఎక్కువ సంతానం గల కుటుంబంలో పుట్టిన వాళ్ళ జీవితాలన్నీ ఇలాగే గడిచిపోతాయి. ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి ఆశలు, అభిలాషలు, కోరికలు, కలలు ఉండవా అంటే ఉంటాయి. అయితే అవి నెరవేరే అవకాశం లేనప్పుడు వాళ్ళు నిరాశకి లోనవుతారు. కోరికల్ని మనస్సులోనే అణచి వేసుకుంటారు. మరి కొంతమంది ఆశావాదులు తమకీ మంచి రోజులు రాకపోతాయా అని తమ కోరికల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. దృఢమైన మనస్సు లేని వాళ్ళు నిరాశతో కృంగిపోతారు.

ఎక్కువ సంతానం గల మధ్య తరగతి కుటుంబాల తీరు తెన్నులు ఎలా ఉంటాయంటే అడుగడుగునా లేమితో బాధపడవల్సిందే. అందుకే అంటారు మంద ఎక్కువయితే మజ్జిగ పలచన అని. ఇలాంటి కుటుంబాలు పేదరికంతో సహజీవనం చేస్తున్న కుటుంబాలు. మా తండ్రి సంపాదన కుటుంబ అవసరాలు తీరడానికి సరిపోయేది కాదు. తండ్రికి చేతికి అంది కొచ్చిన అన్నయ్యలు వేన్నీళ్ళకి చన్నీళ్ళు చందాన ఆర్థికంగా ఆదుకునేవారు. సంతానంలో చివర్న పుట్టిన వాళ్ళు ఇటువంటి కుటుంబంలో చాలా దరుదృష్టవంతులు అని నా భావన. ఎందుకంటే మేము సంపాదించి ఇస్తేనే వీళ్ళు బ్రతుకుతున్నారన్న భావన అన్నల్లో ఉంటుంది. అది అందరిలోనూ లేకపోయినా కొంతమందిలో ఉండవచ్చు. అందుకే అన్నల్ని అడగడుగునా ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళని పొగడాలి లేకపోతే వాళ్ళ రుసరుసలు, ఛీత్కారాలు, విసుగుదలలు ఎందుకంటే మా చదువు సంధ్యలు వాళ్ళ దయా ధర్మబిక్ష వల్లే జరుగుతున్నాయి కదా. ఒక విధంగా చూస్తే మాది బానిస బ్రతుకే.

మా వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని, కోరికలు అభిరుచులు అన్నీ చంపేసుకోవాలి. ఇదే మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిన చివర సంతానం పరిస్థితి. అందులోనూ ఇటువంటి కుటుంబాలకి బందువుల రాకపోకలు ఎక్కువగా ఉన్నట్లయితే గోరు చుట్టు మీద రోకటి పోటే. ఒకోక్కసారి అనుకోకుండా బంధువులు వస్తే తిరిగి వండి వడ్డించడానికి బద్ధకించిన తల్లికి పస్తే. ఇలా ఉండేది బందువుల తాకిడి ఉంటే ఇంటి పరిస్థితి.

తాను పస్తులున్నా ఇంటి వాళ్ళ ఆకలి తీర్చే తల్లిని చూస్తే ఒక్కొక్క పర్యాయం బాధ కలిగేది. జాలి వేసేది. అనుకోకుండా వచ్చిన బంధువుల మీద కోపం వచ్చేది నాకు. అందుకే అంటారు తల్లి పిల్లల కడుపు నిండిందా లేదా అని కడుపు చూస్తుంది అని. అలా అని తండ్రి త్యాగం తక్కువది కాదు. తన కష్టాన్ని డబ్బుగా మార్చి ఇంటిని ఆర్థికంగా ఆదుకుంటాడు.

సామాన్యమైన జీవితం. కోరికలు తీర్చుకోవాలన్న తాపత్రయం, ఆనందంగా జీవితం గడపాలన్న ఉబలాటం. అయితే ఇంటి పరిస్థితుల వల్ల మాలో కలిగిన భావోద్వేగాలన్నింటిని, మనస్సు అడుగుపొరల్లో దాచుకొన్న పరిస్థితి.

ఎటువంటి మధురిమలు లేకుండా బాల్య దశ వీడ్కోలు ఇచ్చింది. జీవితంలో అనేక కీలక మార్పులకి అలజడులకి, మానసికంగా శారీరికంగా పరివర్తన చెందే కిశోరావస్థ గడిచిపోయింది. ఈ దశే జీవితంలో కీలకం. జీవితం బాగు పడాలన్నా పాడవ్వాలన్నా ఈ దశే ముఖ్య మంటారు. నా జీవితంలో ఆ దశ వచ్చివెళ్ళింది. ఉత్సాహంతో ఉరకులు వేసే సెలయేరు లాంటి యవ్వన దశ వచ్చింది. అయినా నాలో నిర్వికారమే. ఏ దశలోనూ నాకు ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విశేషతలు లేవు.

హైస్కూలు విద్య పూర్తయ్యాక, ‘మాకు కాలేజీ చదువులు చదివించే స్తోమత లేదు’ అన్నారు ఇంట్లో వాళ్ళు. అలాంటి సమయంలో దేవుడిలా ఆదుకున్నారు మా బావగారు. అతనూ టీచరే. అందుకే తనని టీచరు ట్రైనింగ్‌లో జాయిను చేసారు. ఇప్పుడంటే ట్రైనింగ్‌కి ఎంట్రన్సు, ఆ తరువాత ఉద్యోగానికి ఎన్నో పరీక్షలు. అప్పుడు అలా కాదు ట్రైనింగ్ పూర్తవగానే ఉద్యోగం అంత సునాయాసంగా కాకపోయినా ఉద్యోగం లభించేది. బతకలేక బడి పంతులు అప్పట్లో మాట. బతకడానికే బడి పంతులు అన్నది నేటి మాట.

అయితే నా సమయంలో మాత్రం ఉపాధ్యాయ వృత్తి ఇప్పటిలా ఆర్థికంగా అంత వెసులుబాటు లేకపోయినా, మొదటి రోజుల్లా అంత అర్ధాన్నం కాకపోయినా పరవాలేదు అని అనిపించేది. అక్కయ్యగారింలో భోజనం. చేతి ఖర్చుకి నలుగురు ఐదుగురు పిల్లలకి చదువు చెప్పి నేను సంపాదించుకునేవాడిని.

ట్రైనింగ్ పూర్తయ్యాక ఓ మిషనరీ స్కూల్లో ఉద్యోగం రావడం అదీ బావగారి ప్రయత్నం వల్ల నా అదృష్టమే. అందుకే బావగారంటే నాకు ఎంతో గౌరవం. ఆ తరువాత జీవితం షరా మామూలే. సుమతితో పెళ్ళి. సురేశ్, సుధ పుట్టడం. వాళ్ళ చదువులు.. ఇలా యాంత్రికంగా జీవితం గడిచిపోతోంది.

మా సమయంలో అంతగా ఈ కార్పోరేట్ స్కూళ్ళ చదువులు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మా చదువులు. ఈ కార్పోరేట్ స్కూళ్ళు వచ్చిన తరువాత వాటికి దుంపల బడి అని పేరు వచ్చేసింది. కాని ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళు ఎన్నో ఉన్నత పదవులు సంపాదించారు. ఉపాధ్యాయులు అంకింత భావంతో, నిబద్ధతతో పని చేసేవారు. ఇప్పుడంటే ఉపాధ్యాయుల్లో చాలా మందికి అంకిత భావం తగ్గడం వాస్తవమే.

నేను మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనుకున్నాను. అయితే నా ఆలోచనలను ఆచరణలో పెట్టనిచ్చిందా సుమతి? “అప్పో సొప్పో చేద్దాం. అవసరమయితే పస్తులుందాం కాని మన పిల్లల్ని కాన్వెంట్‌లో చేర్పించవల్సిందే” అంది సుమతి. దానికి ఫలితమే మా పిల్లలకి కాన్వెంట్ చదువులు ప్రారంభం.

పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్ళి తీసుకురావడానికి ఆటో, స్కూలు ఫీజులు, పుస్తకాలు మిగతా ఖర్చులకి నాకు ఎంతో డబ్బ ఖర్చు అయ్యేది. సాధారణంగా ఇలాంటి స్కూళ్ళలో మస్తుగా డబ్బు ఉన్న పిల్లలు చదువుతారు. ఇప్పుడయితే కూలీ నాలీ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివించడానికి పరుగులు తీస్తున్నారు. ఇది వేరే సంగతి.

మస్తుగా డబ్బున్న వాళ్ళు డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెడ్తారు. తమ పిల్లలకి పాకెట్ మనీగా దండిగా డబ్బు ఇస్తూ ఉంటారు. అలా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడ్తున్నా వాళ్ళ పిల్లల్ని చూస్తే నాబోటి వాళ్ళ పిల్లలకి ఈర్ష్యగా ఉంటుంది. అది తమ తండ్రులు అలా ఖర్చు పెట్టడానికి డబ్బు ఇయ్యనందుకు తమ తండ్రుల మీద కోపంగా మారుతుంది. ద్వేషంగా మారుతుంది. తమకు ఖర్చు పెట్టడానికి డబ్బులివ్వనందుకు భావోద్వేగానికి లోనయి తమ కన్న వాళ్ళ మీద పగ పెంచుకుంటారు, అసంతృప్తికి లోనవుతారు.

నా పిల్లల విషయంలో అదే జరిగింది. తమ క్లాసు పిల్లల జీవితాత్తో పోల్చుకుంటే తమదీ ఓ జీవితమేనా అనిపించేది నా పిల్లలకి. తమ అసంతృప్తిని వాళ్ళ అమ్మ దగ్గర వెల్లడి చేసేవారు.

“అలాంటి స్కూళ్ళలో జాయిను చేసిన తరువాత మనం డబ్బుకి వెరవకుండా స్టేటస్ మెయిన్‍టెయిన్ చేయాలి” అనేది సుమతి. “మనం మన తాహతుకి మించిన పరుగులు పెట్టకూడదు” అని నేను అనేవాడిని. “వాళ్ళ పెద్ద పెద్ద కోరికలు మనం తీర్చలేకపోయినా పిల్లల చిన్న చిన్నఅవసరాలయినా తీర్చడం తల్లిదండ్రులుగా మన బాధ్యత” అనేది సుమతి.

నా జీవితం కన్నా నా పిల్లల జీవితాలు మెరుగ్గా ఉన్నాయి అని నేను అనుకున్నానే కాని కాలంతో పాటే నా పిల్లల కోరికలు, అవసరాలు వేరుగా ఉంటాయని గుర్తంచలేకపోయాను. గుర్తించేప్పటికి జరగ వల్సిన అనర్థం జరిగిపోయింది. పిల్లలకి నాకూ మధ్య దూరం పెరగసాగింది. అంతకు పూర్వం నా మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలు తగ్గాయి అని నాకు అనిపించేది ఒక్కొక్క పర్యాయం.

నేనూ కౌమార దశ దాటాను, కాని నాలో ఎటువంటి మార్పు లేదు. నా పిల్లల్లో ఆ దశలో ఎన్నో మార్పులు, కోరికలు, పంతాలు, పట్టుదలలు, మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. మా అబ్బాయి జిమ్‌కి వెళ్తానంటాడు ఒకసారి. మరో పర్యాయం క్రికెట్ నేర్చుకుంటానంటాడు. పికినిక్‌కి వెళ్తానంటాడు. నా దృష్టిలో వాటి అన్నిటికన్నా చదువు ముఖ్యమైనది. “నీవు చదువుకుంటానంటే ఎంతేనా డబ్బు ఖర్చు పెడ్తాను కాని ఇలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు” ఖరాఖండీగా చెప్పేను. అందుకే వాడికి నా మీద విపరీతమైన కోపం. నాతో మాట్లాడం మానేసాడు. “మీకూ నాకూ ఎటువంటి రక్త సంబంధం లేదు” పరుషంగా అన్నాడు.

సురేశ్ మాటలు నాకు ఎంతో మనస్తాపాన్ని కలిగించాయి. బాధ కలుగజేశాయి. ఒంటరిగా కూర్చుని ఏడవాలనిపించేది. అలాగయినా మనస్సు తేలికపడుతుందనుకునే వాడిని. ఆ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నది చిన్న పిల్లయినా సుధ ఒక్కర్తే. మిగతా తల్లి కొడుకు దృష్టిలో నేను ఓ పిసినారిని. అయినా నేను పట్టించుకోలేదు. నెల నెలా నా అవసర ఖర్చులు కూడా తగ్గించుకుని పొదుపు చేసేవాడిని, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు.

హైస్కూలు చదువు పూర్తయ్యాక కాలేజీలో జాయినయ్యాడు సురేశ్. తల్లి ద్వారా తనకి బండి కొనమని అడిగించాడు. అవసరమయితే నా సైకిలు వాడుకోమన్నాను కాని బండి కొనడానికి ఇష్టపడలేదు నేను. దాని మీద ఇంట్లో ఎంత రాద్దాంతం అయింది? అయినా నేను ఏం పట్టించుకోలేదు.

నాతో పూర్తిగా మాటలే మానేసేడు సురేశ్. వాడికి ఏదైనా అవసరమయితే తల్లి రాయబారం ద్వారా తన అవసరాలు తీర్చుకునేవాడు. వాడి ప్రవర్తనకి మొదట బాధ అనిపించినా అదే అలవాటుగా మారిపోయింది. చివరకి తను డిగ్రీ పాసయిన విషయం తల్లికి చెప్పాడు కాని నాకు చెప్పలేదు. మనస్తాపానికి గురయిన నేను ఇలా పెరట్లో చెట్టు నీడ కూర్చుని ఆలోచనా ప్రపంచంలో మునిగి గతాన్ని ఆ తరువాత వర్తమానాన్ని తలుచుకుంటున్నాను.

ఎండ చురుక్కుమనడంతో లేచి ఇంటిలోకి వెళ్తున్న నా పాదాలు ఠక్కున ఆగిపోయాయి. సుమతితో సురేశ్ అంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి. సురేశ్ తల్లికి తనకి సత్యానికి జరిగినదంతా వివరిస్తున్నాడు.

***

“సత్యం! నేను డిగ్రీ సెకెండ్ క్లాసులో పాసయ్యాను” కళ్ళలో ఆనందం నింపుకుని సురేశ్ సత్యంతో అన్నాడు.

“ఈ విషయం మీ నాన్నగారికి చెప్పావా?” సత్యం ప్రశ్న వెంటనే సురేశ్ ముఖం కోపంతో ఎర్రబడింది కందగడ్డలా!

“అతనికి నేను ఎందుకు చెప్పాలి? అతను ఏనాడైనా నన్ను కొడుకులా అభిమానించారా? ప్రేమగా మసులుకున్నారా? నేను అడిగివి కొనిచ్చారా? అందుకే అతనంటే నాకు ఎలర్జీ, కోపం” అన్నాడు సురేశ్.

ఆ మాటలు వినగానే సత్యనికి కోపం తారాస్థాయికి చేరుకుంది. అతని దవడ ఎముక కదలిక బట్టి ఎంత కోపం వచ్చిందో అర్థమయింది. తండ్రి మీద ద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతూ మరో మాట అనబోతున్న సురేశ్ చెంప చెళ్ళుమనిపించాడు సత్యం.

కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతుండగా ఎర్రగా కందిన బుగ్గను తడుముకుంటూ సత్యం వేపు గుర్రుగా చూశాడు సురేశ్.

“సూర్యం మాస్టారు దేవుడు. కొడుకువైనా అతనిలోని మంచితనాన్ని నీవు చూడలేకపోయినా నేను చూశాను. అటువంటి మంచి తండ్రి కడుపున పుట్టిన నీవు మంచి కొడుకుగా ఉండాలి. అంతే కాని ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన ఏంటిరా సురేశ్. మనిద్దరం మంచి స్నేహితులం కాబట్టి బ్రతికిపోయావు. ఇదే మరెవరయినా అయితే రియాక్షను మరోవిధంగా ఉండేది. మాస్టారి గురించి తెలిసిందీ అర్థం చేసుకున్నదీ ఇదేనా! అందుకే అంటారు పెరటి చెట్టు మందుకు పనికిరాదని. అతని గొప్పతనాన్ని గురించి చెప్తాను విను. అటువంటి తండ్రి కడుపున పుట్టిన నీవు చాలా అదృష్టవంతుడివి. అటువంటి అదృష్టాన్ని నోచుకోని దురదృష్టవంతుడ్ని నేను.

పుట్టుకతోనే దురదృష్ణవంతుడ్ని నేను. పుట్టిన వెంటనే తండ్రిని పోగొట్టుకున్నాను. మా అమ్మ ఈ ఇంట్లోని ఆ ఇంట్లోని పాచి పని చేసి నన్ను చదివించేది. అమ్మ కూడా నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. అనాథగా మిగిలిపోయిన నన్ను కొంత మంది జాలి గుండె గల వాళ్ళు ఉండడానికి ఇంత చోటు నిచ్చి రోజుకొకరి ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేసేరు.

తిండికి అయితే కొదవ లేదు కాని చదువుకోడానికి పుస్తకాలు, బట్టలు మిగతా అవసరాలకో? ఇదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడ్తున్న నన్ను సూర్యం మాష్టారు నా గురించి తెలుసుకుని జాలి పడ్డారు. అలా జాలిపడ్డ మనస్సుకంటే దానం చేసే చేతులు మిన్న అన్నట్టు తన అవసరాలను కూడా పట్టించుకోకుండా తనకి తోచినంత సహాయం నా చదువు నిమిత్తం చేసేవారు. ఈ విషయం ఇప్పుడు నీకు చెప్తున్నాను. టెన్తు పాసయిన తరువాత తను జామీనుగా ఉండి బ్యాంకులో తనకి తెలిసిన వాళ్ళ ద్వారా లోను ఇప్పించారు.

లోను రావడం కొంత ఆలస్యమయితే అతను నేను దిగులు పడ్డం చూసి ‘సత్యం ఎందుకు దిగులు పడ్తావు? నేను ఉన్నాను కదా! మా అమ్మాయి పెళ్ళి మిత్తం, మా అబ్బాయి సురేశ్ చదువు పూర్తయ్యాక జీవితంలో వాడు నిలదొక్కుకునే వరకు తన అవసరవుతుందని డబ్బుని ఇబ్బంది వచ్చినా నెల నెలా ఎంతో కొంత వెనకేస్తున్నాను. ఆ చిరు పొదుపే ఇప్పుడు వృద్ధి చెందుతోంది. అందరూ ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చినా అద్దె ఇంట్లోనే గడిపేస్తున్నాను కాని లోను పెట్టి ఇల్లు కొనలేదు’ అన్నారు.

చూశావా? మాస్టరు గారికి తన పిల్లల భవిష్యత్ గురించి ఎంత ఆలోచనో? అటువంటి ఉత్తముడ్ని నీవు అపార్థం చేసుకున్నావు. అతను సహాయం చేస్తాను అన్న విషయం నాకు ఎంతో సంతోషం కలిగించింది. అంత మాట ఈ రోజుల్లో ఎవరు అంటారు? సహయం చేయకుండానే చిలవలు పలువలుగా చెప్పుకునే నేటి మనుష్యులు మాస్టరు గారిలా అండగా నిలబడ్డానికి ఎందరు ముందుకు వస్తారు?

చదువు విషయంలోనే నాకు ఎంతో సహాయం పడిన అతనికి జీవితాంతం ఋణపడి ఉంటాను. తిరిగి అతని దగ్గర సహాయం పొందడం అంటే నాకు చాల ఇబ్బందికరమైన విషయమే. అయితే నా అదృష్టం కొద్దీ లోను శాంక్షను అయి డబ్బు నాకు చేతికి అంది వచ్చింది. మాస్టరు గార్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాలేదు. పై వాడినయిన నాకే మాస్టరు గారు అంత చేస్తుంటే కన్న కొడుక్కి మాష్టారు ఏం చేయరా? చదువుకి అతను ఎంతయినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. నీవు ఏదో అతనికి ఇష్టం లేని పనికి మాలిన వాటి కోసం డబ్బు అడిగి ఉంటావు. అందుకే అతను నిరాకరించి ఉంటారు.” అన్నాడు.

“బండి కొనుక్కుంటాను కాలేజికి వెళ్ళడానికి అని అడిగాను. అది పనికిమాలినదా?”

“కాదు అయితే నీవు అడిగే విధానంలో తేడా ఉంది. ఏం కాలేజీకి వెళ్ళడానికి బండే ఉండాలా? సైకిలు మీద వెళ్ళవచ్చు అన్న మాస్టరు గారి మాటల్లో నాకు తప్పేం అగుపించటం లేదు. మాస్టరు గారి గురించి నీ ఆలోచనా విధానంలోనే తప్పు ఉంది. అతడ్ని అర్థం చేసుకోడంలోనే నీ తప్పు ఉంది. నీలో తప్పుడు భావాలు ఉండబట్టే మీ మధ్య దూరం పెరుగుతోంది అనిపిస్తోంది. మాస్టరు గారు ఈ విషయంలో ఏమీ సాకు చెప్పకపోయినా నేను గమనించాను. అతను మనస్సులో ఎంత కుమిలి పోతున్నారో. ఎంత మధనపడుతున్నారో గమనించాను. “

“మరో విషయం బండి కొని ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు అతను నాతో ‘సత్యం తోపుడు బండి కొన్నావు. వ్యాపారం చేస్తానంటున్నావు. ఈ వ్యాపారంలో ఎన్నో సాధక బాధకాలు ఉన్నాయి. అని తెలుసా?’ అని అడిగారు. తెలుసునన్నట్లు తలూపాను.

“ఆ మధ్య నేను ఈ తోపుడు బండి కూరగాయల వ్యాపారం గురించి ఓ వ్యాసం చదివాను. తోపుడు బండ్ల మీద కూరగాయల్ని పెట్టుకుని వ్యాపారం చేస్తూ జీవితాన్ని ఎలాగో అలాగ నెట్టుకొస్తున్న వ్యాపారులు అప్పుడప్పుడు పోలీసుల, మున్సిపల్ సిబ్బంది ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. తమ సంపాదనలో ఎంతో కొంత వాళ్ళకి మామూళ్ళ రూపంలో చెల్లిస్తున్నా అధికార్ల నుండి ఒత్తిళ్ళే. ప్రభుత్వం వీధి చిరు వ్యాపారుల కోసం చేసిన చట్టం ఆమోదం పొందడం చిరు వ్యాపారులకి ఆనందకరమైన విషయం, దేశం మొత్తం మీద చిరు వ్యాపారులు తమకి మంచి రోజులు వచ్చాయని సంబరపడుతున్నారు. చట్ట పరమైన రక్షణ లభించడంతో ఒత్తిడిలు, దోపిడీ నుంచి బయటపడతామన్న ఆత్మవిశ్వాసం వారిలో కలిగింది. ఆ బిల్లే ‘స్ట్రీట్ వెండార్స్ బిల్’. ఆ బిల్లు అర్థం చిరువ్యాపారుల జీవనోపాధికి, బద్రత, వ్యాపార క్రమబద్దీకరణ.

ఈ చట్టం ప్రకారం వీధి వ్యాపారులకు అర్హత ఉన్న వారికి దృవీకరణ పత్రం జారీచేస్తారు. చట్ట పరమైన అనుమతులతో పాటు నిర్ణీత స్థలాల కేటాయిస్తే వారికి స్థానికంగా ఎదురయ్యే సమస్యలుండవు. అయినా ఈ విషయంలో నీకు చెప్పి నీ ఉత్సాహం దిగజార్చదల్చుకోలేదు. మొదట అనుభవజ్ఞులయిన వ్యాపారుల వద్ద అనుభవ పాఠాలు నేర్చుకో!” అంటూ మాష్టారు నన్ను ప్రోత్సహించారు. మాష్టారి దీవెనల వలన, దానికి నా కష్టాన్ని జోడించి అంచెలంచలుగా ఎదిగి హోల్‌సేల్ వ్యాపారిగా కూడా మారాను. ఇప్పుడు చెప్పు. ఎటువంటి రక్తసంబంధం లేని నా కోసమే మాస్టారు అంత తాపత్రయ పడ్డరే, అటువంటిది కన్న కొడుకు విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోరు? అయితే మళ్ళీ చెప్తున్నాను. ముమ్మాటికి మాష్టార్ని అర్థం చేసుకోడంలో నీదే తప్పు.” అన్నాడు.

సత్యం మాటలు నాలో నిద్రావస్థలో ఉన్న వివేకాన్ని తట్టి లేపాయి. మాట్లాడకుండా అక్కడ నుండి బయలుదేరాను.

“ఒక్క మాట సురేశ్! నీ మీద చేయి చేసుకున్నందుకు క్షమించు.” అన్నాడు సత్యం. మరి ఆ మాటలు వినదల్చుకోలేదు. నెమ్మదిగా ఓ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని నా ప్రవర్తన గురించి విశ్లేషించుకున్నాను. నా తప్పు నాకు తెలిసింది, నా తప్పును విమర్శించే బదులు నాకు వత్తాసు పలికి నీవు కూడా తప్పు చేశావు అమ్మా!” అన్నాడు సురేశ్ సుమతితో.

***

నేను అలా నిలబడి ఆ మాటలు వింటున్నాను. ఒక్కసారి వాళ్ళిద్దరూ నన్ను చూశారు. ఇద్దరి ముఖాల్లో పశ్చాత్తాప భావాలు. ‘నేనెంత తప్పు చేశాను. దిద్దుకోలేనంత తప్పు చేశాను’ అన్న భావం సురేశ్ ముఖంలో అగుపిస్తే ‘మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవల్సిన నేను మీ మీద మనవాడి మనస్సులో విష బీజాలు పడ్డానికి కారకురాల్ని అయ్యాను’ అన్న భావం సుమతి ముఖంలో.

కుటుంబ భవిష్యత్ కోసం నేను ఎంతో ఆరాటపడ్తూ ఎంత కష్టం మీద కొంత సొమ్ము పొదపు చేస్తుంటే అది అర్థం చేసుకోకుండా నా మీద పిసినారి అన్న ముద్ర వేసి నాకు ఎంతో మనస్తాపం కలిగించారు. ఇప్పుడు సత్యం హితబోధ చేసేప్పటికి – నా కుటుంబం దృష్టిలో నేనో దేవుడిని. ఇంత వరకూ నేనెంత చిత్రహింసకి గురయ్యానో వాళ్ళకేం తెలుసు – అని ఆత్మవిమర్శ చేసుకుంటున్న నేను అలా మౌనంగా నిలబడి ఉండిపోయాను. సత్యం చిన్న వాడయినా సురేశ్‌లో మార్పు తేవడానికి ప్రయత్నంచినందుకు సత్యం మీద నాకు మరింత అభిమానం పెరిగింది.

“మీరు అలా మౌనంగా ఉండకండి నాన్నగారూ! మీ మౌనం నేను భరించలేకోపోతున్నాను” సురేశ్ గొంతులో దుఃఖంపు జీర. నా వేపు అడుగులు వేస్తున్నాడు. నేను అలా స్థిరంగా నిలబడి ఉన్నాను. నన్ను సమీపించిన సురేశ్ నా గుండెల మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నాకు దుఃఖం తన్నుకొస్తోంది. ఇన్ని సంవత్సరాల నుండి నా మనస్సులోనే దాచుకున్న ఆవేదన, బాధ ఒక్కసారి దుఃఖం రూపంలో తన్నుకొస్తున్నాయి. ఇక నిగ్రహించుకోలేకపోయాను. నా వయస్సును కూడా మరిచిపోయి. నేను చిన్న పిల్లాడిలా వెక్కుతూ దుఃఖిస్తున్నాను.

కొంత తడవకి నా మనస్సు తేలిక పడింది అనిపించింది. ఇన్నాళ్ళూ నేను అనుభవించిన చిత్తక్షోభకి చరమగీతం నా ఈ ఏడుపు. కొంత తడవ ఒకళ్ళని మరొకరి ఓదార్చుకున్నాం. ఒకరి తప్పులు మరొకరు క్షమించుకున్నాం. మా మధ్య ఇంత వరకూ పెరిగిన దూరం తగ్గపోయినట్టు అనిపించింది.

ఆకాశంలో మబ్బులు తొలగిపోగానే ఆకాశం నిర్మలంగా అయినట్టు నా హృదయ ఆకాశం కూడా నిర్మలంగా తయారయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here