తెలిసొచ్చిన తీయదనం

1
8

[box type=’note’ fontsize=’16’] భాషను, యాసను, సంస్కృతిని కాపాడుకోవాలని చెబుతూ, శాయంపేటలోని యం.జె.పి. పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గాజుల మణికంఠ వ్రాసిన కథ ఇది. [/box]

[dropcap]ఫో[/dropcap]న్‍లో “హలో అన్నా, నీకు గీ ముచ్చట దెల్స? నీ కోడలు జేసిన పనికి మన తెలుగోల్లంతా ఇదేశాల నుంచి యిడ్కత్తాలు” అని అనంగానే రాజయ్య గావరబడ్డడు. ఔనవి గిట్లెందుకు జేసింది? తనకేమవసరం? తెలుగోళ్ళందర్ని ఎందుకు ఏకం జేసింది? గిట్లెన్నో ప్రశ్నలతో ఇంటికి జేర్కున్నడు రాజయ్య.

అసలు జానవి ఏం చేసిందో? ఎందుకు జేశిందో! దెల్వాలంటే ఈ కథ సద్వుర్రి మరి యిగ…..

***

ఎంకటవ్వ, రాజయ్యలది ఒక వ్యవసాయ కుటుంబం. చాలా భూమి ఉంది. ఒక్కడే కొడుకు. విష్ణు. పెద్ద చదువులు చదివిండు. గిపుడేమో లండన్‍లో కొలువుకు కుదురుకున్నడు. గక్కడి పిల్లనే లగ్గమాడిండు. పేరు జానవి. ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టని వారు. కాని ఎప్పుడూ కలత చెందుతూ ఉండేవారు.

ఎంకటవ్వ శాట్ల బియ్యం పోస్కోని ఆకిట్ల కచ్చి జెరుక్కుంటూ కూసుంది. అప్పుడే కైకిలికి బోయొచ్చిన మల్లవ్వ ఆమె దగ్గరకొచ్చింది. “ఏందే! ఎంకటి… పండుగ దగ్గరకత్తాంది. ఊళ్ళున్నోళ్ళంతా మనవండ్లు, మనవరాండ్లు ఎత్కోని తిర్గుతంటే! మీ యింట్కాడేందే సర్లేదు సప్పుడు లేదు” అని అంది. “గదేం లేదే” ఉన్నది ఒకడే కొడుకాయే! సచ్చినా! బతికినా! వాని కోసమే. వాడు రాక ఇయేడ్తోటి పదేండ్లు గావట్టే. యిగ మీ అన్న రాంగనే ఫోన్ జెయ్యమంటతియ్యే మల్లి” అని ఎంకటవ్వ అంటుంటే అల్లు పళ్ళెంల నీళ్ళు దిర్గినట్టే ఆమె కండ్లళ్ళ సుత నీళ్ళు గట్లనే దిర్గబట్టే! ఎంకటి తన కొంగు తోని నీళ్ళు తుడ్సుకుంది. “ఊకె యాద్జేస్కోని బాధ పడకే” అని మల్లవ్వ ఇంటికి పోయింది.

యిదంతా సూరుకింద నుంచి యింటున్న రాజయ్యకు సుతమస్తు బాధన్పించింది. నెత్తికున్న సుట్టబట్ట దీసి, కండ్ల నీళ్ళు తూడ్సుకొని, ఎంకటవ్వ దగ్గర్కొచ్చి, ”నువ్వేం గావరగాకే ఈ యేడు వాల్ని పండుగకు పిల్దం లేవే!” అని అన్నాడు గంపలేపుడ్తోటే బయటకెళ్ళిన కోడిపుంజోలే జప్పున శాట పట్కొని లేశి ఇంట్ల కూర్కి లోపల ఆట్నిబెట్టి, బయట్కచ్చింది ఎంకటవ్వ!

ఫోన్ జేసేముందు జెయ్యాల్న, వద్దా అని ఒకటికి పదిసార్లు సోచా యించ్కొని ఫోన్ కల్పిండు రాజయ్య.

లండన్‍లోని విష్ణు ఇంట్లో ఫోన్ మోగింది. ఆ సప్పుడుకు విష్ణు చిరాకుగా, “జాను! మై డియర్! వేర్ యు ఆర్” అంటూ తన భార్యా జానవిని పిలిచాడు. జావని వచ్చి ఫోన్ ఎత్తింది. నంబర్ జూసి “ఓహ్!డియర్  ఇట్ ఈజ్ యాన్ ఇండియన్ నంబర్. యువర్ పేరెంట్స్ టూ” అంటూ, మళ్ళీ చిరగ్గానే “ఐ హ్యావ్ నో పేషెన్స్ టు స్పీక్ విత్ దెమ్?” అన్నడు.

మాటలు యిన్న గా ముసలోల్లు, కోడలు పల్కరిత్తాంది గావచ్చని, “మంచ్గున్నావా బిడ్డా! పిల్లలు ఎట్లున్నరు” అని ఇద్దరాకం అన్నరు మురిసిపోతూ!… విష్ణు ఫోన్ తీసుకొని హలో అని అన్నాడు.

కొడుకు మాటినంగానే గాళ్ళ సంతోషానికి ఎల్లలు లేవు. “బిడ్డా! యెట్లున్నవు? మంచిగున్నవా? ఈ యేడు ఉగాది పండ్గకు అందరాకం రార్రి” అని ఏడుస్తూ అడిగిల్లు. గప్పుడు విష్ణు ”నాన్న, అమ్మా నేను మంచిగనే ఉన్నా. నేను ఎంత బిజినో మీకు దెల్సుకదా. ఒక గంట లేకపోతే కొన్ని మిలియన్ యూరోస్ నష్టపోతాను. నాకు కుదరదు నాన్న” అన్నడు.

కొడుకు కోటీశ్వరుడైనందుకు సంబుర పడాలా, మాట సుత జెప్పకుండా లగ్గమాడిండని, మమ్ములను పట్టించ్కోవడం లేదని బాధపడాల్న వాళ్ళకు అర్థం కాలేదు. గుండెలో రాయి బడ్డంత పనైంది. గప్పుడే జానవి “వాట్స్ దిస్ ఉగాదీ? విష్ణు. వై వి సెలబ్రేట్ యిట్? ఈజ్ ఇట్ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? అనడ్గింది. భార్య అమాయకత్వం దెల్సుకున్న విష్ణు వాళ్ళ తల్లిదండ్రుల భాదను సుత అర్థం జేస్కోని ”వి ఆర్ గోయింగ్ టూ ఇండియా ఎట్ నౌ” అని అన్నడు.

ఫోన్‍లో ఆ మాటల్ని ఎంకటవ్వ, రాజయ్య విన్నను. కొడుకు యేమన్నడో అర్థంగాక యింకింత బాధపడసాగారు “అమ్మా ఏడ్వకే మేమిప్పుడే పండ్గకు బయల్దేరి అత్తున్నం” అని ఫోన్ బెట్టిండు. వాళ్ళు మస్తు సంబరపడ్డరు.

***

గారోజే పొద్దు గూట్లే సొర్రకముందే ఆల్లంతా ఊరికి జేర్కున్నారు. ఆళ్ళ పిల్లలు, తరుణ్, లోకేశ్‍లు తాతయ్యను జూడంగనే కండ్ల నీళ్ళు బెట్కొని పొయ్యి కౌగిలించుకున్నరు. ఎంకటవ్వచ్చి కాళ్ళకి నీళ్ళిచ్చి “కడ్కొని లోపడిగ” రమ్మంది. యిక్కడ జర్గుతుంది జానవికి యేం సమజైతలేదు. అందరు బువ్వ దిని నిద్రపోయిండ్రు. ఏంకటవ్వ ఏగిలి వారంగనే అందర్ని లేపింది. ఇల్లు అల్కుపూత బెట్టి, సన్నీళ్ళతోనే తానం జేశింది. రాజయ్య విష్ణుని దీస్కొని ఊళ్ళకు వోయిండు.

మావిడికాయలు, యాపపూత దెచ్చిళ్ళు. అటెన్క మళ్ళేటో నోయిళ్ళు జానవి వచ్చి ఎంకటవ్వను “వై యు ద పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్” అని అడ్గింది. జానవి మాటకర్థంగాక కొడుకుని పిల్చి అడ్గుదమనుకుంది. ఇంతలోనే కుమ్మరి కొంరయ్య ఇంటికి కొత్త కుండలను కొనుక్క రాను వొయిన అయ్యగొడ్కులు కుండ పట్కొని ఇంట్లకచ్చిండ్రు. దాన్ని కడిగి కుంకుం, పసుపు, బొట్లు పెట్టి, పసుపు గొమ్మున్ను మామిడాకుతో ఉన్న కంకణం గట్టింది.

కుండలో నీళ్ళు తీసుకొని బెల్లం వేసి గలిపింది. తరువాత యాప్పూత, మామిడికాయలు, మిర్యాలపొడేసి గల్పింది. గప్పుడే అందర్శేతులకు కంకణాలను గట్టింది. ఎంకటవ్వ తర్వాత కోడల్ని దీస్కొని సాయమాను కిందున్న పొయికాడ్కి తీస్కబోయింది. గోధుం పిండితో బచ్చాలను జేయించింది. జానూకే ఏం దెల్వదు గానీ యిక్కడి మనుషుల కష్టం, శ్రమ, జీవనం గూర్చి దెల్సుకొని తనలో తానే నవ్వుకుంది.

యిగ అందరు పోయ్కాడ్కి జేర్కున్నరు. విష్ణు చెక్కపీట మీద ఏనుగు కానుకొని కూసుండు. ఎంకటవ్వ జెప్తాంది గదా… బిడ్డా! మన భాషకు, సంస్కృతి, సాంప్రదాయాలకు వేల యేండ్ల చ్చెరిత్రుంది. కలం, పాట తాళానికి కారణమైంది. పాట ఆటకు పోటెత్తింది. ఆట ఒక జానపదమై ఉర్రూతలూగించింది.

గిప్పుడు కొత్త సంవత్సరం ఐతే జనవరి ఒకటిని జర్పుతాడు. కాని, అదిగాదు. మనకు సంవత్సరాలున్నాయి. చైత్రశుద్ది పాడ్యమి నాడొచ్చే ఉగాదే మనకు కొత్త సంవత్సరం. 60 తెలుగు సంవత్సరాలుంటే ఓటెన్క ఓటి అత్తది. అవి ఒడ్మినాక మల్ల మొదట్నుంచి మొదలైద్ది.

గిప్పుడచ్చింది ’శార్వరి’ సంవత్సరం. గీ శార్వరి మల్లా ఉగాదచ్చే దాంక గీదే ఉంటది. అని అనంగనే, విష్ణు వచ్చిండని దెల్సి పట్నంనుంచి పదిమంది దోస్తుగాళ్ళచ్చిన్లు. రాజయ్య లేశి వాల్ల దగ్గర్కి వొయ్యి గుండిశెంబుతో కాళ్ళకు నీళ్ళిచ్చిండు. అదంతా జూస్తున్న జానవికి “మన తెలుగు ఆచారాలు ఇంత మర్యాదపూర్వకంగా ఉంటాయ”ని ఆశ్చర్యబడ్డది. గాళ్ళందరచ్చి గూసున్నరు.

“మన భాషను కాపాడే బాధ్యత యువత మీద ఆధారబడింది. కానీ మీరు న్యూఇయర్ అంటూ వేలకు వేలు పోగేశి సంబురపడ్తాండ్లు గాని మా అప్పుడు గవన్నీ లెవ్వు. మనది పంచ దోతి గట్లోని పదిమంది గల్సి సంబురంగా ఉగాది పండ్గనే జేస్కునేటోళ్ళం.

ఎన్నో ఏండ్ల చరిత తగరని ఘనత మనది. మీరేమా! అర్థం జేస్కోరాయె! ఏమన్నంటే కొలువు గావాల్నాయే! పరాయి దేశం బొయ్యి బతకాల్నాయే. ఒగప్పుడు మన భాషా పనికిరానిదని మన తెలంగాణ కవులే లేరన్నారు నిజాం. గప్పుడు మనోడు సురవరం ప్రతాపరెడ్డన్న గోల్కొండ కవుల సంచిక పుస్తకం రాయంగనే గది జూసిన నిజాం నోరెళ్ళ బెట్టిండు. ఆధారం లేదన్న మన భాషా, జీవనం, ఆవశ్యకతకు జీవం పోసింది. గలాంటిది మన భాషా గిఫ్ఫుడు మూడు నుంఛి నాలుగో స్థానంలోకి బోయిందిరా. మాట్లాడేటోళ్ళంతా ఇదేశాలు వోతే కాలం అచ్చి మేం జత్తే మమ్లనెవరు కానరాదు గప్పుడు మన భాషేం గావాలే, సంస్కృతేడ పోవాలే!” అని ఎనలేని మమకారంతో కూడిన భాదతో రాజయ్య జెప్పిండు.

తెలుగు యేం సమజ్ గాకపోయిన మామ రాజయ్య కంఠంలోని పలుకులను కండ్లలోని బాధను అర్థం చేసుకుంది జానవి.

ఎట్లున్నోళ్ళు గట్నే గూసున్నరు, ఎంకటవ్వ వోయి పచ్చడునూ బచ్చాలు దెచ్చింది. అచ్చిన సోపతి గాండ్లకు సుత కంకణాలు కట్టి, అందర్కి బొట్టు బెట్టింది. ఉగాది పచ్చడి, తీపి, పులుపు, కారం, వగరు, చేదూ, ఉప్పు, యిల ఆరు రుచులతో, అంటే షట్ రుచులు అని అంటూ, దేవుళ్లకు మొక్కి అందరూ పచ్చడిలా పుచ్చుకున్నారు. గా తరువాత అందరం అన్కొని ఒక్కసారి లేసిండ్రు.

అటెన్కా బయట్కొచ్చి సింతశెట్కింద మంచలేస్కోని అందరాకం గూసున్నరు. గప్పుడే మల్లవ్వొచ్చింది. అందర్ని జూసుడ్తోటే సంబరమాగలే. దబ దబా వోయి సూరు కింద గూసున్న ఎంకటవ్వ ముందుక్వోయి చిన్నగా మందలించింది మల్లవ్వను జూసిన ఎంకటవ్వ “ఏందే మల్లవ్వ గట్ల జూత్తన్నవ్? అందర్నాకం మింగేలా!” అని అంది చిన్నగా నవ్వుతూ అందరచ్చిల్లు గదనే సంబురమా అని అంటూనే! గిప్పుడు పైకం కోసం అందర్నాకం ఇడ్సిపెట్టి యిదేశాలు పోతండ్లు. మన భాషేం గావాలే యాసేడా గల్వాల్నే అంటూ ఆస్ట్రేలియా లున్న తన కొడ్కుని దల్సుకొని కండ్ల నీళ్ళు వెట్కుంది. ఏం జేద్దమే మన గాశారం గట్ల కాలవడ్డది. బాధపడకు నువ్వు సుత యిన్నే ఉండు రా… గద్దెమీద గూసో అని ఎంకటవ్వ రమ్మంది.

జానవి యిక్కడి సన్నివేశాలకు ఫోటోల్దీశి తన మిత్రులకు బంపింది. వాళ్ళకి పండుగ వచ్చిందని పొద్దుగాల్నే యిమానం యెక్కి జానవి మామగారింటికి జేర్కున్నరు. కోయిలరాగాలు, రాగి సంటి, పాలుకోసం లేగ రంకెలు గిట్ల ఎన్నో నచ్చినయంట! గాళ్ళు నా ఫోటోలన్ని అమెరికాలున్న వాల్ల ఇంటోల్లకు బంపిన్రు. గంతే గాళ్ళంతా మన పండ్లకు, సాంప్రదాయాలకు ఆకర్షితులైన్లు.

తెలుగుదనం దెలిసేలా పండుగ మంచిగ జేత్తన్లు అచ్చిన ఇదేశి సుట్టపోళ్ళంతా పోశంపల్లి చీరలు గట్కొని మస్తుగ మర్శిండ్లు. గప్పుడే లేశిన రాజయ్య అందర్నాకం పొలం కాడ్కి తీస్కవోయిండు. ఎడ్లకు మొక్కి పొలాన్ని జాపిచ్చిండు. పశువులను దైవంగా భావించే మన సాంప్రదాయం ఆల్లందర్ని యింకా అచ్చెరువుకు గురిజేశింది. గాళ్ళంతా ఎంతో సంబరంగా పొలంలకు దిగి బొర్రిండ్లు. మోట బాయ్కంద ఒళ్ళు కడ్కొని, మక్క శేనుకాడ్కి వోయిల్లు. గప్పట్కే పొద్దు చిన్నగా గూట్ల పొత్తాంది దబ దబ నడువుండ్రని రాజయ్య అందర్కి శీకటి పడేవరకు ఇల్లు జేర్కొని అందరు సాయమాను కిందున్న గద్దెమీద గూసొని ముచ్చెట్లపెడ్తాల్లు

సోపత్గాల్ల సంబురం జూశిన జానవి ఎంతాగానో సంతోషించి “ఐ యామ్ ప్రౌడ్ టు బి యాన్ ఉమెన్ అండ్ హర్ కల్చర్, ట్రెడిషన్ ఇన్ తెలంగాణ” అని అన్కుంది. గిదంతా జూస్తున్న విష్ణుకి కడుపు పేగు కదిల్నట్టయింది. తల్లిదండ్రుల ఆవేదన భాషపై నున్న మక్కువ దెల్సొచ్చింది. ఆఫీసుకు సెలవులిచ్చిన్లని ఇండియాకొచ్చామని జానవికి దెల్వదని విష్ణు నటిస్తున్నాడు.

“గీ యొక్క కుటుంబమే గిట్లుంటే యావత్ తెలంగాణ మొత్తంల ఎంతమంది ఇదేశాల్లున్న వాళ్ళ బిడ్డలకోసం ఎదురు జూత్తాల్లో అని తలచుకొని గుబులు వడ్డది. వెంటనే విష్ణుని పిల్సి తను అన్కున్నదంతా జెప్పింది. విష్ణు కోపంగా “ఆర్ యు మ్యాడ్! ఇఫ్ వన్ అవర్ అయాం నాట్ దేర్ వి లాస్ మిల్లియన్ కోర్స్. యునో వై వి కేమ్ టు ఇండియా! ద ఆఫీస్ గేవ్ లీవ్స్ ఫర్ ఫై డేస్! ఐ హ్యావ్ నో పేషన్స్ టు హియర్ యువర్ వర్డ్స్, జస్ట్ గో అవే!” అన్నాడు.

జానవి బాధపడి ఇన్రోజులు జర్గిన పండుగకు సంబంధించిన ఈడియోలు, ఫోటోలను వాళ్ళ దోస్తుల నుంచి దీస్కోని ఒక డాక్యుమెంటరీ తయర్జేసింది. దాన్ని లండన్ లున్న తన మిత్రురాలు సాయి బరద్వినికి బంపి నువ్వు పనిజేస్తున్న న్యూస్ ఛానల్లో ప్రసారం జెయ్యమని జెప్పింది. తెల్లారేసర్కి ప్రపంచమంతా దెల్సింది మన తెలుగు గొప్పదనం. యిగ యిదేశాల్లున్నోళ్ళంతా గా రేడియోలు జూశి పరేశానయ్యిర్రు. ఐనోల్లు ఈ పైసల కోసం అందర్నిడ్డి పెట్టి పన్జేత్తంటే, కానోళ్ళకు మన తెలంగాణ గొప్పదనం దెల్సి పండుగ జేస్కుంటున్నారు” అని బాధపడ్డారు. పేగు తీపి యాద్కొచ్చింది అందరికి. గప్పుడు మన తెలుగోళ్ళంతా మూటముల్లె సదుర్కొని పండ్గకు బయలెల్లిన్లు.

తిధులని, వారాలని, పక్షాలని, ఆయనాలు, మాసాలు, ఋతువులు, నక్షత్రాలు, కార్తెలు, రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఉద్యమాలు, సంగ్రామాలు, సభలు ఒకటా రెండా గిట్లా ఎన్నో ఇంకెన్నో! గంత చరిత్రుంది మన భాషకు, యాసకు గట్లాంటి దాన్ని, ఇడ్శిబెట్టి, పైకం కోసం ఇన్నాండ్లు బతికినమా అని అందరాకం అనుకున్రు.

పొద్దుగాల నాల్గెతాంది కోళ్ళను గూట్లకెళ్ళి ఇడ్శిపెట్టి, శీపురు బట్కోని ఆకిలి ఊడ్తాంది. ఎంకటవ్వ గా సప్పుడ్కి రాజయ్యలేశి ఏందే నీ సప్పుడు! అచ్చిన సుట్టపోళ్ళంతా లేత్తరు అని మంచం మీంచి లేస్తూనే అన్నడు. గదేం లేదే గియాల శుక్రారం గదా ఇల్లు అల్కుపూత బెట్టాలగదా గందుకే జప్పున లేశి పన్జేత్తన్నే” అనంది. సరే నేను ఊళ్ళకు వొయ్యొత్తనని జెప్పి పండ్ల పుల్లేసుకుని బయకెల్లిండు.

గప్పుడే ఫోన్ మోగింది. “సూశారకు రాజయ్య తమ్ముడు సమ్మయ్య ఫోన్ ఎత్తిండు. హలో అన్న నీకు గీ ముచ్చట దెల్స. నీ కోడలు జేశిన పనికి మన తెలుగోళ్ళంతా మనల్ని జేరిల్లు, ఆమెది ఇదేశం అయినా మనోళ్ళను ఏకం జేశిందంటే మన భాషా, యాసా గొప్పదనం దెల్సింది కావచ్చే అని ఫోన్ బెట్టిండు. రాజయ్య గావరబడ్డడు. “జానవి గట్లెందుకు జేశింది? తనకేమవసరం? తెలుగోళ్ళందర్ని ఎందుకు ఏకం జేశింది? గిట్ల ఎన్నో ప్రశ్నలతో ఇంట్కి జేర్కున్నడు గప్పుడే మల్లవ్వచ్చి, ఆగే రాజాన్న! మీ బిడ్డా (జానవి) మంచి పన్జేశిందే, వాళ్ళ సోపతిగాళ్ళు అచ్చిల్లు గదా గాళ్ళు ఇక్కడి పండ్గనంత ఇడియోలు, ఫోటోలు, దీసిల్లుగదా వాట్ని ఇదేశాల్లో వార్తలకేశిల్లంట. మన గొప్పదనం అందర్కి దెల్సిందే. ఇన్నేండ్లు మనవూరి పేరు ఎవలకు తెల్వకపాయే గిపుడు సూడే జిందగంతా మన పాలంపేట వైపే జూత్తాంది! గద్జూశి అందరచ్చిన్లే! మీ కోడలు బంగారం. మన కండ్లలో కనిపించే ఆనందం నింపిందే ఈ యేడు అని జానవి కోసం ఇంట్ల కుర్కింది. ఎక్కడో ఉన్నోళ్ళు మన భాషా, సంస్కృతి కోసం పరితపిస్తుంటే, మనోళ్ళు అన్నిడ్సిపెట్టి ఇదేశాలు పోవట్టే ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం వంటిదని యెన్నడు దెల్సుకుంటరో అని బాధతో ఆలోచిస్తూ ఇంట్లోకెళ్ళాడు రాజయ్య. రాజయ్య, ఎంకటవ్వ, విష్ణు అతని పిల్లలు అందరాకం జానవి పడుకున్న మంచం పక్కకు గూసున్నరు. గప్పుడే కన్లు దెర్శిన జానవి వార్ని చూసి చిరునవ్వు నవ్వింది.

గా వీడియోలు, యూటూబ్, టిటర్, ఫేస్ బుక్, గీట్ల యెల్ల జూశినా! యాడ జూసినా గామే పేరే. యువత మొత్తం పరేశానయ్యిండ్రు. మన కెర్కలేనియన్ని గామెకెట్ల దెల్సినయని. గిదంత ఎర్కైన మనోళ్ళంతా యీదేశం నుంచచ్చిన గీ జానవే మన భాషకోసం గిదంత జేత్తాంటే ఈన్నే పట్టీనోళ్ళం ఇక్కన్నే సచ్చటోళ్ళం ఇంక మనమెంత జెయ్యారే అని భాష పరిరక్షణకై పట్టం గట్టిన్లు.

గీ ముచ్చటంత యెర్కైన తెలంగాణ ప్రభుత్వం మాతృభాషా పరిరక్షణకు పట్టం గట్టింది. ఎన్నో గ్రంథాలయాలను, స్థాపించింది. కనుమరుగవుతున్న ప్రజా కవులను వెలికిదీసింది. భాషా సంఘాలని, కవుల సమ్మేళనలని ఎన్నో ఆవిష్కరించింది. గట్లనే న్యాయస్థానం తీర్పులన్నీ తెలుగులోనే యివ్వాలని హుకుం జారీచేసింది. భాషా ప్రేమికుల కోసం అంతర్జాలం సుత తెలుగును పొందుపర్చిన్రు. యువత ఎక్వున్న గీ దేశంలో శానా మంది సీన్మాలకు అల్వాటైన్లు, గా సీన్మలు సుత మన యాసల్నే అత్తున్నయి. కొన్నైతే మన సంస్కృతి కట్టు, బొట్టు సాంప్రదాయాల్ని దెల్పుతున్నయ్. గిట్లా మన ప్రభుత్వం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ భాషా పరిరక్షణకు ఎనెన్నో జేసింది. జానవి జేసిన కృషికి మన తెలంగాణ ప్రభుత్వం ఆమెను రవీంద్ర భారతిలో జరిగే తెలుగు మహా సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన్రు. ఇంకా ఎన్నో జేయాలని నిర్ణయించింది. గదో మహోన్నత సంగ్రామమై తెలుగు భాషా ప్రపంచ భాషల్లో కెళ్ళా తరగని కీర్తిగా నిల్చింది.

జానవిలా మనం సుత సోచాయించుతే మనం మన భాషను ఒక ఉన్నత స్థానంలో ఉంచవచ్చు. జానవిని ఊరోళ్ళేగాదు. అందరు మెచ్చుకున్రు. కన్నతల్లి కున్న మాతృభాషా మీద మక్కువ తరుణ్, లోకేశ్‍లను సుత అదే తోవలో నడుపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here