[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘తెల్లారింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ప్పటికింకా
కిటికీ తలుపులు తెరవలేదు
గది దర్వాజా మూసేవుంది
వెంటిలేటర్ లోంచి తొంగిచూసి
లోపలికి దూసుకొచ్చిన ఉదయపు కిరణాలు
అందమయిన పక్షుల్లా
నా రాత బల్లపై వాలాయి
బల్లమీదున్న
జయంత్ మహాపాత్ర, గుల్జార్
జావేద్ అక్తర్, సచ్చిదానందన్, రూపికౌర్
వీవీ సార్, అట్లా అందరి ముఖాలూ
అందంగా ఆప్యాయంగా వెలిగిపోయాయి
నేను కళ్ళు నులుపుకుంటూ లేచి
చేతికందిన ఒకర్ని దగ్గరకు తీసుకుని
ఒక్కో పేజీలోకి చూపునీ
ఆ కవిత్వంలోకి మనసునీ వొంపుకుంటున్నాను
అప్పుడే మేల్కొన్న నా సహచరి ఇందిర
నిద్రమబ్బుతో..
“ఏం.. అప్పుడే తెల్లారిందా?” అంది
తెల్లారింది
కాలానికో, నాకో, కవిత్వానికో
అర్థం కాలేదు
అవుననీ కాదనీ చెప్పలేక
తల అడ్డదిడ్డంగా వూపాను
*