తెలుగుజాతికి ‘భూషణాలు’-10

0
15

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

రిజర్వు బ్యాంకు గవర్నరు – శ్రీ యం. నరసింహం (3 జూన్ 1927 – 21 ఏప్రిల్ 2021):

[dropcap]నె[/dropcap]ల్లూరులో జన్మించిన మైదవోలు నరసింహం ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త. వీరి తల్లిదండ్రులు శేషాచలపతి, పద్మావతి బెంగుళూరు వాసులు. నరసింహం విద్యాభ్యాసం మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కొనసాగింది. తర్వాత కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కళాశాలలో ఉన్నత విద్య చదివారు. భారతదేశం వచ్చిన తర్వాత బొంబాయి లోని రిజర్వు బ్యాంకులో అదనపు కార్యదర్శిగా చేరారు. ఆ బ్యాంకులో పనిచేస్తూ పదోన్నతులపై గవర్నరుగా ఎంపిక కాబడిన తొలి వ్యక్తి. ఆర్థిక విభాగంలో పరిశోధనాధికారిగా ప్రగతిశీలక కార్యక్రమాలకు బాటలు వేశారు.

ఆయన పనితీరును గమనించిన ప్రభుత్వం ఆయనను ఆర్థిక వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించింది. తర్వాత రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించబడ్డారు. కేవలం ఏడు నెలల కాలం ఆ పదవిలో ఉన్నారు (1977 మే 3 నుండి 1977 నవంబరు 30 వరకు).

RBI గవర్నర్లు:

1935 ఏప్రిల్ 1న బ్రిటీషు ప్రభుత్వ హయంలో సర్ ఓస్‌బార్న్ స్మిత్ ఫెడరల్ బ్యాంకు తొలి గవర్నరుగా నియమితులయ్యారు. చింతామణీ దేశముఖ్ 1943 ఆగస్టు నుండి 1949 జూన్ వరకు గవర్నరు. ఆ తర్వాత బెనెగల్ రామారావు 1949 జులై నుండి 1957 జనవరి వరకు దాదాపు ఎనిమిదేళ్లు ఆ పదవిలో ఉన్నారు.

ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ 1982-85 మధ్య RBI గవర్నరు. ఆ తర్వాత పదేళ్లు (2004 – 2014) భారతదేశ ప్రధాని. ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన సి. రంగరాజన్ 1992-97 మధ్య; వై. వేణుగోపాలరెడ్డి 2003-2008 మధ్య; డి. సుబ్బారావు 2008-13 మధ్య రిజర్వ్ బ్యాంకు గవర్నర్లుగా ఖ్యాతి గడించారు. 24 ఏప్రిల్ 1 న రిజర్వు బ్యాంకు స్వర్ణోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు, రంగరాజన్‌కు 2002లో పద్మ విభూషణ్ ప్రధానం చేశారు.

బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు:

నరసింహం రిజర్వ్ బ్యాంక్ గవర్నరు గానే గాక ఇతర ఆర్థిక వ్యవస్థ కమిటీలలో అగ్రస్థానంలో నిలిచి బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలకు మార్గదర్శి అయ్యారు. 1991లో ఆర్థిక వ్యవస్థ కమిటీ అధ్యక్షుడిగా, 1998లో బ్యాకింగ్ రంగ సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నో సిఫారసులు చేశారు. అవి బ్యాంగింగ్ పరిశ్రమకు పునాది రాళ్లు.

ఎమర్జెన్సీ అనంతరం RBI గవర్నరు:

1977లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ రద్దు అయింది. మోరార్జీ దేశాయ్ ప్రధానిగా నూతన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆర్థిక రంగంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. దానిని సరిదిద్దడానికి ప్రభుత్వం 1977 మే 2న నరసింహాన్ని రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించింది. ఆయన ఆ పదవిలో 1977 నవంబరు నెల వరకు వున్నారు. ఆర్థిక విభాగంలో పరిశోధక అధికారిగా చేరిన నరసింహం గవర్నరు సాయికి ఎదగడానికి ఆయన సునిశిత దృష్టి కారణం. ఆయన 13వ గవర్నరు.

రిజర్వ్ బ్యాంక్ పదవి అనంతరం ఆయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టరు గాను, ఆ తర్వాత ప్రపంచ బ్యాంకులోను ఉన్నత పదవు లధిష్టించారు. బ్యాంకింగ్ రంగంలో ఆయన చేపట్టిన సంస్కరణలు అపారం. బలహీన వర్గాలున్న ప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త బ్యాంకులు ప్రారంభించడం వల్ల బ్యాంకు ఆదాయం తగ్గుతోందనే వాదన ప్రబలినపుడు ఆయన ప్రతిఘటించారు. బ్యాంకులు తమ ఖర్చులు తగ్గించుకోవాలనీ, రైతులకు ఋణాలు 10 శాతం కంటే తక్కువ వడ్డీరేటుకు అందించాలని సూచించారు. ఆయన వ్రాసిన గ్రంథం – ‘From Reserve Bank to Finance Ministry and Beyond: Some Reminiscences’ లో ఎన్నో విషయాలు ప్రస్తావించారు. నరసింహం కమిటీ చేసిన సిపారసులలో బ్యాంకులకు రావలసిన బాకీలు వసూలు చేసే విషయంలో ప్రత్యేక హక్కులు గల ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలనేది ప్రధానం. 94వ ఏట హైదరాబాదులోని తన నివాసంలో నరసింహం తుదిశ్వాస విడిచారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో నరసింహానికి పద్మ విభూషణ్ సత్కారం అందించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనకు మాతామహులు, హైదరాబాదులోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాల (ASCI) ప్రిన్సిపాల్ గాను, చైర్మన్ గాను, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షులుగాను పని చేశారు. IDBI బ్యాంక్, గ్రామీణ బ్యాంకులు ఏర్పడటం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఏషియన్ ఎకనామిక్ రివ్యూ పత్రిక సంపాదకవర్గ అధ్యక్షులుగా నరసింహం చిర్మరణీయులు.

అపార మేధావి ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి (25 సెప్టెంబరు 1924 – 25 జనవరి 2011):

తత్వశాస్త్రవేత్తగా జాతీయ ఖ్యాతిని గడించిన సచ్చిదానందమూర్తికి పద్మ విభూషణ్ సత్కారం 2001లో లభించింది. అతి చిన్న వయస్సు లోనే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పదవి నదిష్ఠించిన మేధావి. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో జన్మించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో తత్వశాస్త్ర విభాగం అధిపతిగా మూడు దశాబ్దాలు వ్యవహరించారు.

బౌద్ధమతంపైన, బుద్ధుని బోధనల తత్వం పైన మూర్తి విశేష పరిశోధనలు చేశారు. ఆచార్య నాగార్జునునిపై సాధికారిక ప్రామాణిక గ్రంథాలు రచించారు. 50కి పైగా పరిశోధనాత్మక గ్రంథాలు ప్రచురించారు. అంతర్జాతీయ పత్రికలలో పరిశోధనాత్మక వ్యాసాలు రచించారు.

వీరి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1982లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన అధిష్టించిన పదవులు:

  1. వైస్ ఛాన్స్‌లర్ – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం – 1975-78
  2. వైస్- చైర్మన్ – యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ 1986-89
  3. ఛాన్స్‌లర్ – సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్, సారనాథ్ – 1989 – 2001

వీరికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, డా. బి. సి. రాయ్ అవార్డు (1982) లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో PhD పొందారు.

పదవులు:

  • 1959లో అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‍గా చేరారు.
  • 1960లో స్వదేశానికి వచ్చి తాను చదివిన ఆంధ్రవిశ్వవిద్యాలయ ఆచార్యులయ్యారు.
  • 1963లో బీజింగ్ లోని పీపుల్స్ యానివర్శిటీ ప్రొపసర్ & JNTU హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
  • 1970లో గుంటూరు యూనివర్శిటీ పి.జి సెంటర్ ప్రత్యేకాధికారి

విదేశీ పర్యటనలు:

విశిష్ట మేధా సంపత్తి గల సచ్చిదానందమూర్తి అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ దేశాలలో తత్వశాస్త్ర ఉపన్యాసాలిస్తూ విస్తృతంగా పర్యటించారు. ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ప్రతిష్ఠాత్మక ప్రసంగాలు చేశారు.

దలైలామాతో సాన్నిహిత్యం:

సచ్చిదానందమూర్తికి టిబెట్‌తో ప్రగాడ సంబంధాలు ఉన్నాయి. 1989 లోనే టిబెటన్ స్టడీప్ సెంటరు కులపతిగా పనిచేశారు. అప్పుడు ఆ ప్రాంతీయులలో అవినాభావ సంబంధం ఏర్పడింది. పలు మార్లు దలైలామాతో కలిసి అనేక తత్వ విషయాలపై పరిశోధన పూర్వకంగా చర్చించారు. వారణాసి హిందూ విశ్వవిద్యాలయంతో అనుబంధం వుంది.

రాధాకృష్ణన్ వారసుడు:

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తత్వశాప్రవేత్త. ఆయన వారసుడిగా అదే విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర విభాగ పురోగతికి దోహదం చేశారు. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగ అధిపతిగా ఐదేళ్లు పనిచేశారు. సచ్చిదానందమూర్తి అదే శాఖలో మూడు దశాబ్దాలు పనిచేసి శాఖకు ఖ్యాతి తెచ్చారు. రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా నున్న సమయంలో సచ్చిదానందమూర్తిని ఢిల్లీ పిలిపించుకొని అనేక అంశాలపై చర్చించేవారు.

పదవులు/పురస్కారాలు:

  1. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెసు అధ్యక్షులు.
  2. రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ డాక్టరేట్ 1989
  3. బీజింగ్ లోని చైనా విశ్వవిద్యాలయు గౌరవ పట్టా 1988

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన భగవద్గీతకు విపుల పీఠిక వ్రాశారు. తెలుగులో 12, ఆంగ్లంలో 30 గ్రంథాలు వెలువరించారు. 1952లో Evolution of Philosophy in India అనే గ్రంథానికి యం. యన్. రామ్ పీఠిక వ్రాశారు.

గుంటూరు విశ్వవిద్యాలయ స్పెషల్ ఆఫీసరుగా 1971 వరకు పనిచేసిన మూర్తి అనేక జిల్లాలలో కళాశాలల అభివృద్ధికి దోహదం చేశారు. స్వగృహంలో సంగం జాగర్లమూడిలో వృద్ధాప్య సమస్యలలో 86వ ఏట కన్నుమాసిన సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రవేత్తగా అఖండ ప్రతిభామూర్తి, పాత తరానికి చెందిన విద్యావేత్త.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here