తెలుగుజాతికి ‘భూషణాలు’-11

0
12

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

గణితశాస్త్ర మేధావి సి. ఆర్. రావు (10 సెప్టెంబరు 1520 – 22 ఆగస్టు 2023):

మదరాసు ప్రెసిడెన్సీలోని బళ్లారిలో తెలుగు కుటుంబంలో పదిమంది పిల్లలలో ఎనిమిదవ సంతానంగా కల్యంపూడి రాధాకృష్ణారావు 1924లో జన్మించారు. 102 సంవత్సరాల పూర్ణ జీవితాన్ని ఆనందమయంగా గడిపిన యశస్వి. పాఠశాల విద్య ఆంధ్ర ప్రదేశ్‍లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్టణంలో పూర్తి అయింది. గణితశాస్త్రంలో M.Sc. డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి స్టాటిస్టిక్స్‌లో ఎం.ఎ. పట్టా సంపాదించారు. కేంబ్రిడ్జిలోని కింగ్స్ కాలేజిలో ఆర్.ఎ. ఫిషర్ పర్యవేక్షణలో 1948లో Ph.D. అందుకొన్నారు. 1965లో అదే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారి డి.యస్.సి డిగ్రీ వరించింది.

గణాంక శాస్త్రవేత్త:

సి. ఆర్. రావుగా ఖ్యాతి గడించిన వీరు కేంబ్రిడ్జ్ లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగంలో ప్రవేశించారు. ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో పనిచేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో 40 సంవత్సరాలకు పైగా పనిచేసి డైరక్టర్‍గా పదవీ విరమణ చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రొఫెసర్, నేషనల్ ప్రొఫెసర్‍గా వ్యవహరించారు. ఫిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా, ఇతర ప్రముఖ సంస్థలలో – పెన్సిల్వేనియా లోనూ తన విజ్ఞానాన్ని పంచుకొన్నారు.

పరిశోధన, శిక్షణా కార్యక్రమాల పితామహుడిగా, Indian Statistical Institute Research & Training సంస్థ అధిపతిగా గణిత రంగంలో ఎందరో పరిపాలకులను తీర్చిదిద్దారు. వీరి సిఫారను మీద టోక్యోలో Asian Statistical Institute శిక్షణా సంస్థను స్థాపించారు.

ప్రసిద్ధ ఆవిష్కరణలు:

సి.ఆర్. రావుకు ప్రపంచంలోని 19 దేశాలలోని విశ్వవిద్యాలయాల వారు 38 గౌరవ డిగ్రీలు ప్రధానం చేశారు. ఆయన ఆవిష్కరణలలో CRAMER – RAO BOUND మరియు RAO – BLACKWELL థీరమ్ ఎస్టిమేటర్స్ సిద్ధాంతాలలో ప్రసిద్ధం.

MULTI VARIATE ANALYSIS, ESTIMATION THEORY, DIFFERENTIAL GEOMETRY – అంశాలపై ఆయన పరిశోధన కొనసాగించారు. 14 ప్రామాణిక గ్రంథాలు, 400 పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు.

గౌరవ పురస్కారాలు:

సి. ఆర్. రావు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గంణాంక శాస్త్రవేత్త. భారతదేశంలోను, బ్రిటన్, అమెరికా, ఇటలీ దేశాలలో 8 ప్రసిద్ధ జాతీయ ఆకాడమీలలో సభ్యులు. 2002 జూన్‌లో శాస్త్రపరిశోధనలో అత్యత్తమ పరిశోధనకు గాను అమెరికా దేశం వారి NATIONAL MEDAL OF SCIENCE అవార్డును జీవన సాపల్య పురస్కారంగా అందించారు. భారత ప్రభుత్వంవారు శాస్త్ర పరిశోధనకుగా అందించే INDIAN SCIENCE AWARD 2010లో ప్రకటించారు. 2013లో వీరి పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. అంతర్జాతీయ ఎన్‍సైక్లోపీడియా (గణాంకశాస్త్రం) రూపొందించినందుకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

2014లో 38వ గౌరవ డాక్టరేట్‍ను ఖరగ్‍పూర్ లోని IIT సంస్థ వీరికి ప్రదానం చేసింది. ఆయన అధిష్ఠించిన గౌరవ పదవులలో International Statistical Institute అధ్యక్ష పదవి, అమెరికాలోని Institute of Mathematical Statistics అధ్యక్షత, అంతర్జాతీయ బయోమెట్రిక్ సొసైటీ అధ్యక్షత ప్రధానాలు. 1991లో రావు గౌరవార్థం The Journal of Quantitative Economics పత్రిక ఒక ప్రత్యేక సంచినను ప్రచురించింది.

ఇతర పురస్కారాలు:

  1. Guy Medal in Gold – 2011 రాయల్ ఏసియాటిక్ సొసైటీ
  2. International Mahalanobis prize –
  3. శ్రీనివాస రామానుజం మెడల్ 2003.
  4. సర్దార్ రత్న అవార్డు 2014
  5. భారత ప్రభుత్వ పద్మ విభూషణ్ 2001

భారత ప్రభుత్వ గణాంక విభాగ మంత్రిత్వశాఖవారు ప్రతి ఏటా వీరి స్మారకార్థం National Award in Statistics ప్రదానం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా వెళ్ళే రోడ్డును సి.ఆర్. రావు వీధిగా నామకరణం చేశారు. 102 ఏళ్ల పూర్ణ జీవితం గడిపిన రావు న్యూయార్క్‌లోని బఫెలోలో 2023 ఆగస్టు 22న కన్నుమూశారు.

రావు సాహెబ్ సి. ఆర్. కృష్ణస్వామి రావు (2 ఫిబ్రవరి 1927- 12 ఫిబ్రవరి 2013):

ప్రముఖ సివిల్ సర్వెంట్ కృష్ణస్వామి రావు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‍కు చెందిన ఐ.ఎ.ఎస్. ఆఫీసరు. పద్మ విభూషణ్ అవార్డు 2006లో ప్రదానం చేశారు. భారత ప్రధాని చరణ్ సింగ్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా వున్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానిగా వున్నపుడు 1981-85 మధ్య అత్యున్నత పదవి అయిన క్యాబినెట్ సెక్రటరీగా పరిపాలన చేశారు. ఆయన 15వ క్యాబినెట్ సెక్రటరీ. ఆ తర్వాత చాలా కాలానికి తెలుగువారైన టి. ఆర్. ప్రసాద్ (2000-2002), కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కాగలిగారు.

బిజాపూరు సుల్తాన్ – వీరి పూర్వీకులైన వేద్‍జీ భాస్కరరావు పంత్‍కు ‘రావు సాహెబ్’ బిరుదు నిచ్చారు. ఆ వంశంలో కొలత్తూరు రామకృష్ణ స్వామి మదరాసులో దేశముఖ్ కుటుంబంలో జన్మించారు. రావుసాహెబ్ బిరుదు వారసత్వంగా వచ్చింది. ఆయన మాతామహులు ఆర్. రామచంద్రరావు నెల్లూరు జిల్లా కలెక్టరు. శ్రీనివాస రామానుజన్ ప్రారంభ దినాలలో రామచంద్రరావు తోడ్పడ్డారు. చెన్నైలోని సి.యన్. హయ్యర్ సెకండరీ స్కూల్‍లో విద్యాభ్యాసం చేసిన కృష్ణస్వామి అక్కడే ప్రెసిడెన్సీ కళాలలో బి.యస్.సి. చేశారు.

ఫిబ్రవరి 1948లో IAS అధికారిగా చేరారు. వివిధ హోదాలలో భిన్న ప్రాంతాలలో పనిచేశారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం కృష్ణస్వామి భవిష్యత్ దర్శనాన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారు “1980 దశకంలో భారత రక్షణ దళాల వ్యవస్థపై ఒక విమర్శ నుండేది. యుద్ధరంగానికి ఒక ఉపయోగపడే ఒక్క క్షిపణిని కూడా తయారు చేయలేదని విమర్శ. ఆ సమయంలో రక్షణశాఖ సమావేశంలో కృష్ణస్వామిరావు చేసిన సూచన నా చెవులలో మారుమ్రోగుతోంది. ‘ఇప్పుడు భారతదేశ శాస్త్రవేత్తలు క్షిపణుల తయారీకి సిద్ధంగా వున్నారు’ అన్నారు. వెంటనే 93 లక్షల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. అది కృష్ణస్వామిరావు దార్శనికత.”

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా వుండగా 2006 మార్చి 20న కృష్ణస్వామి రావుకు పద్మ విభూషణ్ ప్రధానం చేయడం విశేషం. పృథ్వి, అగ్ని, బ్రహ్మోస్ వంటి ఆయుధాలు వీరిద్దరి ముందుచూపు వల్ల సాధ్యమయ్యాయి. – 1983లో భారత ప్రభుత్వం ఆర్థిక సలహా సంఘం ఏర్పరిచినపుడు కృష్ణస్వామి రావు ప్రధానపాత్ర వహించారు. ప్రణాళిక సంఘానికి తోడ్పడుతూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ సంఘం సలహాలు అందించింది.

వివిధ హోదాలు:

ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన కృష్ణస్వామి రావు పరిపాలనా దక్షులు. రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. 1949 నుండి 1985 వరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలోను, డెప్యూటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం లోను వివిధ శాఖల అధిపతి. ఈయనకు 2009లో ప్రతిష్ఠాత్మకమైన GREAT MARATHA AWARD లభించింది.

రాష్ట్రంలో ఇతర పదవులు:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అధిపతిగా, జలగం వెంగళరావుకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా వ్యవహరించారు. అలానే లెదర్ డెవెలప్‍మెంట్ కార్పొరేషన్ అధిపతి.

కేంద్రంలో ప్రభుత్వోద్యోగులు, శిక్షణా మంత్రిత్వశాఖ (DoPT) అత్యంత కీలకమైంది. ఆ శాఖ కార్యదర్శిగా కృష్ణస్వామి రావు 1977 మే నుండి 1978 జాన్ వరకు సంవత్సర కాలం పనిచేశారు. ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన మరొక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IAS అధికారి ఏ.యన్. తివారి. ఈయన కడప కలెక్టర్‍గా పనిచేశారు. 2004 జూలై నుండి 2005 డిసెంబరు వరకు DoPT కార్యదర్శి. వీరు కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా ఉండగా కార్యదర్శి.

1984 అక్టోబరులో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత సమయంలో కేంద్ర ప్రభుత్య వ్యవస్థలో ప్రధాన పురుషులు ముగ్గురు. ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, హోంశాఖ మంత్రి పి.వి. నరసింహారావు – క్యాబినెట్ కార్యదర్శి సి.ఆర్. కృష్ణస్వామి రావు. దీనిపై 1984లో జస్టిస్ రంగనాథ మిశ్రా అధ్యక్షతన ఒక విచారణా సంఘం ఏర్పరచారు.

కేంద్రంలోను, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కృష్ణస్వామి రావు నిర్వహించిన పదవులు:

  1. రెవెన్యూశాఖ ఉప కార్యదర్శి, సహాయ కార్యదర్శి.
  2. ల్యాండ్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి
  3. జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఇంపోర్ట్స్ & ఎక్స్‌పోర్ట్స్, మదరాసు (డెప్యుటేషన్)
  4. కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక సమితి జాయింట్ డైరక్టర్, ఢిల్లీ
  5. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి, ఢిల్లీ
  6. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, హైదరాబాదు
  7. ముఖ్యమంత్రి కార్యదర్శి (జలగం వెంగళరావు)
  8. కేంద్ర హోంశాఖ కార్యదర్శి,
  9. క్యాబినెట్ సెక్రటరీ, ఢిల్లీ 1981-85

పరిపాలనాదక్షుడు, నీతి, నిజాయితీలకు మారుపేరు కృష్ణస్వామి రావు.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here