[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
ప్రముఖ శాస్త్రవేత్త డా. పల్లె రామారావు (30 జూన్ 1937):
[dropcap]క[/dropcap]ర్నూలులో ప్రముఖ న్యాయవాది కేశవరావు కుమారుడు రామారావు. క్రమశిక్షణతో పెరిగిన వాతావరణం. కర్నూలు మునిసిపల్ హైస్కూలులో తెలుగు మీడియంలో 14 ఏళ్ళు నిండకుండానే యస్.యస్.యల్.సి. పాసయ్యారు. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదవడం ఆయన జీవితానికి దిశానిర్దేశం చేసింది. మదరాసు ప్రెసిడెన్సీ కాలేజిలో 1954లో బి.యస్.సి. ఫిజిక్సు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ తొలిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం పెట్టినపుడు 1956లో ప్రప్రథమ విద్యార్థిగా ఎం.ఎస్.సి చదివారు. అక్కడ నుండి ఆయన పయనం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైపునకు సాగింది. అక్కడ 1964లో పి.హెచ్.డి. పట్టా పొందారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుండి మెటీరియల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరల్ రిసెర్చి చేయడం విశేషం. అక్కడ ఉండగా THIN FILMS – LRSM-ప్రయోగాలు చేశారు. కాశీలో హిందూ విశ్వవిద్యాలయంలో దాతు సాధనా శాస్త్ర ఆచార్యుడు టి. ఆర్. అనంతరామన్. ఆయనతో ఏర్పడ్డ అనుబంధం రామారావు పరిశోధనకు కొత్త మలుపు తెప్పించింది.
ఉద్యోగ పర్వం:
రామారావు పట్టుదలకు, స్వయంకృషికి మారు పేరు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‍లో తొలి అడుగు వేశారు (1961-62). ఆ పిదప బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, ధాతు సాధనా విభాగ అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా 1962-82 మధ్య గణనీయుమైన పరిశోధనలు చేశారు. Physics of Metals, Dislocation Theory, Mechanical Behaviours of Metals and metal forming అనే అంశాలపై అధ్యయన అధ్యాపనలు కొనసాగించారు. అక్కడ నుండి ఆయన ఆంధ్ర ప్రదేశ్‍లో హైదరాబాదులో స్థాపించిన DMRL – డిపెన్స్ మెటలర్జికల్ రిసెర్చి లేబొరేటరీ డైరక్టరుగా (1982-91) నియమితులయ్యారు. ఆయన పరిశోధనా ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వ ఆయనను సాంకేతిక కార్యదర్శిగా (1991-95) నియమించింది. అంతే కాదు, Atomic Energy Regulatory Authority అధ్యక్షుడిగా పనిచేసే ఆవకాశం లభించింది. ప్రతష్ఠాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‍గా (1999-2002) వ్యవహరించారు.
ప్రతిభామూర్తి:
రామారావు ఇస్రో – విక్రం సారాబాయి సెంటర్ విశిష్టాచార్యులు. International Advanced Research Centre for Powder Metallurgy and New Materials (ARCI) కార్యనిర్వాహక పరిషత్ అధ్యక్షులుగా పేరు తెచ్చుకొన్నారు. 87 ఏళ్ళు నిండినా శాస్త్ర సాంకేతిక సంస్థలకు తన సేవలను, సలహాలనందిస్తూనే వున్నారు.
తనకు మార్గదర్శి అయిన అనంతరామన్ పేరిట అనంతరామన్ ఎడ్యుషనల్ అండ్ రిసెర్చి ఫౌండేషన్ సంస్థ నెలకొల్పి దాని పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. రామారావు గత ఐదు దశాబ్దులుగా ‘మిధాని’ లో చేసిన అవిరళ కృషి ఫలితంగా మిశ్రధాతు సాధనా శాస్త్రక్షేత్రాలలో భారతదేశం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.
వీరి ప్రతిభకు నిదర్శనాలుగా ఏర్పడ్డ సంస్థలు:
- హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్, తిరుచునాపల్లి (స్వదేశీ సాంకేతిక నైపుణ్యంతో ప్రారంభించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ).
- ఇంటర్నేష్నల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏ.ఆర్.సి.ఐ), హైదరాబాద్.
- నాన్-ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్.ఎఫ్.టి.డి.సి), హైదరాబాద్.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై.
- సేఫ్టీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్, కల్పక్కం.
- టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టి.డి.బి), కొత్త ఢిల్లీ.
పురస్కారాలు:
రామారావు జీవితం పురస్కారాల మయం. అనేక శాస్త్ర సాంకేతిక సంస్థలకు అధ్యక్షులు. భారత ప్రభుత్వం పద్మ శ్రీ (1989), పద్మ భూషణ్ (2001), పద్మ విభూషణ్ (2011) అందించింది.
బ్రిటన్, ఇటలీ దేశాలలో రాయల్ అకాడమీ, థర్డ్ వరల్డ్ అకాడమీ ఫెలోగా గుర్తింపు. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు (1979), టాటా బంగారు పతకం (1992), హోమీ బాబా పురస్కారం (1982), ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవార్డు (2010) విశిష్టం.
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ 2012లో ప్రదానం చేశారు. శాస్త్రసాంకేతిక రంగాలలో విశిష్ట సేవలందించిన రామారావు హైదరాబాదులో నివసిస్తున్నారు. 2011లో ప్రముఖ సినీనటులు డా. అక్కినేని నాగేశ్వరరావు పద్మ విభూషణ్ పొందడం గమనార్హం.
నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (20 సెప్టెంబర్ 1924 – 22 జనవరి 2014):
అక్కినేని అనగానే ఆయన నటించిన పాత సినిమా ‘దేవదాసు’ గుర్తుకు వస్తుంది. కృష్ణాజిల్లాలో రామాపురం అనే కుగ్రామంలో జన్మించి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నట సమ్రాట్ ఆయన. కృష్ణా జిల్లా నుండి అక్కినేని, ఎన్. టి. రామారావు – ఇద్దరు రావడం యాదృచ్ఛికం కాదు. కృష్ణా నదీతీరం నుండి ఎందరో మహనీయులు, సంగీత, సాహిత్య, కళా, రాజకీయ రంగ ప్రముఖులు ప్రభవించారు.
రైతు కుటుంబంలో పుట్టి నాటకరంగం ద్వారా వెండితెరకు పరిచయమైన నాగేశ్వరరావు 255 చిత్రాలలో నటించారు. స్త్రీ పాత్రధారణ ద్వారా తొలి అడుగు వేశారు. ఆయన సినీ జీవితానికి ‘ధర్మపత్ని’ సినిమా నాంది. ఆయన నట సమ్రాట్. ఆయన కుమారుడు నాగార్జున, మనుమలు నాగచైతన్య, సుమంత్, అఖిల్ సినీరంగ ప్రముఖులు. అక్కినేని తెలుగు, తమిళ సినీరంగంలో 75 సంవత్సరాలు వెలుగొంది తెలుగు సినీరంగ మూల స్తంభమయ్యారు. హైదరాబాదులో 1975లో అన్నపూర్ణ స్టూడియో స్థాపించడం సినీపరిశ్రమలో సాహసోపేత చర్య. అక్కినేనికి 2011లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.
భారత సినీరంగంలో ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. “అక్కినేని, యన్.టి.ఆర్. సినీరంగానికి రెండు కళ్ళు” అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పేర్కొనడం విశేషం. వ్యక్తిగా ఆయన సౌమ్యుడు, నాస్తికుడు. విజయవాడ రైల్వేస్టేషన్లో ఘంటసాల బలరామయ్య 17 ఏళ్ళ అక్కినేని ముఖ వర్చస్సును గమనించి బాలనటుడిగా పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మపత్ని’లో అవకాశం కల్పించారు. అది నాందిగా ‘సీతారామ జననం’లో కథానాయకుడిగా ఎదిగారు, ఒదిగారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘మనం’.
సాంఘిక, సౌరాణిక, జానపద సినిమాలలో ఆయన తిరుగులేని నటన అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్నన లందుకుంది. 1953లో వచ్చిన ‘దేవదాసు’ ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ‘ప్రేమాభిషేకం’ (1981) ఒక ఇతిహాసం. ఇతర ప్రసిద్ధ చిత్రాలు: మాయాబజార్, సంసారం, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజ్ బుల్లోడు. ఇవి కొన్ని ఉదాహరణలే. మరెన్నో ఘనకీర్తి బావుటాలు.
1971లో అక్కినేని స్వర్ణోత్సవ చిత్రం ‘దసరా బుల్లోడు’ విడుదలైంది. తెలుగులో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడాయన. హైదరాబాదుకు చిత్ర పరిశ్రమ తరలిరావడానికి, అది ఈనాడు విస్తృతంగా పెరిగి అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అక్కినేని దూరదృష్టి మూలకారణం.
బహుముఖ ప్రజ్ఞాశాలి:
1940లో ‘ధర్మపత్ని’ తో ప్రారంభమైన సినీ జీవితం 2014 చివరి క్షణం వరకు కొనసాగింది. అనారోగ్యాన్ని లెక్కచేయని ధీమంతుడు. ఆయన నటించిన సినిమాలు జాతీయ సమైక్యతకు నిదర్శనాలుగా నిలిచాయి. ఉజ్జయినికి చెందిన సంస్కృత పండితుడు – మహాకవి కాళిదాసు, ఒడిసాకు చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమర శిల్పి జక్కన, తమిళనాడుకు చెందిన విప్రనారాయణ, గాయక శిరోమణి భక్త తుకారాం పాత్రలకు ఆయన జీవం పోశారు. రామారావుతో కలిసి 14 సినిమాలో నటించారు.
సామాజిక సేవ:
సంఘానికి ఏదో చేయాలని సంకల్పించి గుడివాడలోని కళాశాలకు భూరి విరాళం అందించి అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపొందించారు. తాను డిగ్రీ వరకూ కూడా చదవలేదనే బాధలో – పేద విద్యార్థులలోని అభిరుచిని గుర్తించి ఉపకార వేతనాలు, విరాళాలు అందించారు. నవ సమాజ నిర్మాణానికి దోహదం చేయాలని ఆదుర్తి సుబ్బారావు – చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై రెండు సినిమాలు నిర్మించారు. ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ ఈ కోవలోనివి. ఆర్థికంగా వాటికి ఆదరణ లభించదని తెలిసీ వాటి నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
పురస్కార ప్రభ:
ఆయన అదృష్టవంతుడు. ‘అ ఆ లు’ పేర అక్కినేని ఆత్మకథ రచించారు. తెలుగు సినీ రంగంలో ఆయనకు లభించినన్ని పురస్కారాలు మరెవ్వరిని వరించలేదు. ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ ఆవార్డులు సరేసరి. కేంద్ర ప్రభుత్వం వారి పద్మ శ్రీ (1968), పద్మ భూషణ్ (1988), పద్మ విభూషణ్ (2011) లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1977) సత్కారంతో బాటు, మధ్యప్రదేశ్ వారి కాళిదాస్ సమ్మాన్ దక్కాయి. పిట్స్‌బర్గ్ లోని కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ వారు జీవన సాఫల్య పురస్కారం అందించారు. తమిళనాడు ముఖమంత్రి జయలలిత 1995లో అన్నా అవార్డు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1980లోనే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సన్మానించింది.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెలువడ్డ ‘ప్రేమాభిషేకం’ హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడింది. అందులో నాగేశ్వరరావు నటన అద్భుతం. 2023 సెప్టెంబరు 20న హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణంలో అక్కినేని విగ్రహాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. అక్కినేని ఒక చారిత్రక పురుషుడు. వార్ధక్య జీవితంలో ఆయన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సరదాగా కాలం గడిపారు. అక్కినేని తర్వాత సినిమా రంగంలో చిరంజీవికి పద్మ విభూషణ్ లభించడం సినీరంగ చరిత్రలో నూతనాధ్యాయం.
2012లో ఆంధ్రా కేడర్ పోలీస్ అధికారి టి.వి. రాజేశ్వర్‌కు పద్మ విభూషణ్ ప్రకటించారు. ఆయన నిజామాబాదులో పోలీస్ అధికారిగా ఉద్యోగం ప్రారంభించి పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా (2004-2009) పనిచేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ గౌరవ ఆచార్యునిగా పనిచేసిన శాస్త్రవేత్త రొద్దం నరసింహకు 2013లో పద్మ విభూషణ్ లభించింది.
Images source: Internet
(మళ్ళీ కలుద్దాం)