తెలుగుజాతికి ‘భూషణాలు’-20

0
8

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

డా. కె. యల్. రావు (1902 జూలై 15- 1986 మే 18):

[dropcap]ము[/dropcap]గ్గురు ప్రధాన మంత్రుల (నెహ్రు, లాల్ బహాదూర్ శాస్త్రి, ఇందిర) వద్ద కేంద్ర నీటి పారుదల, జల విద్యుక్తి శాఖల మంత్రిగా పనిచేసిన ఘనత కానూరు లక్ష్మణరావుది. భారీ ఆనకట్టల రూపకర్త. అపర భగీరథుడు. జలభారత భాగ్య విధాత. జల మాంత్రికుడు. అపార మేధోశక్తి సంపన్నుడు. జనహిత ఇంజనీరు. స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి కలలుగన్న దేశభక్తుడు. రాజకీయాలు తెలియని ఆయన కేంద్రమంత్రిగా నియమించబడడానికి వెనక ఇంజనీరుగా ఆయన ప్రతిభ ఉండటమే. 25 పేజీల ఉపన్యాసాన్ని ఆశువుగా పలికి నెహ్రుని అబ్బరపరచారు.

చంటి పిల్లల్ని సతీమణికి వదిలేసి ఆనకట్టల మీద నిర్మాణాల గూర్చి అధ్యయనం చేయడానికి అమెరికా వెళ్ళారాయన. ఒంటరిగా వదిలేసి వెళ్లవద్దని భార్య ప్రాధేయపడినా దేశం తర్వాతనే కుటుంబమని సముదాయించారు. విజయవాడ సమీపంలో కంకిపాడులో జన్మించిన ఆయనకు తొమ్మిదేళ్ల వయసులో పితృవియోగం కలిగింది. అన్నగారి ప్రోత్సాహంతో మదరాసు లోని గిండీ ఇంజనీరింగ్ కళాలలో చేరి మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు.

1946లో విశాఖలోని డిస్ట్రిక్ట్ బోర్డులో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరారు. బర్మింగ్‌హమ్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1950లో కేంద్ర జలవిద్యుత్ కమిషన్‌లో డైరక్టరుగా చేరి 1954లో వరదలు అరికట్టే విభాగానికి చీఫ్ ఇంజనీరు అయ్యారు. 1956లో జల విద్యుత్ కమిషన్ సభ్యులై పదవీ విరమణ తర్వాత కూడా 1962 వరకు ఆ పదవిలో కొనసాగారు.

రాజకీయ అరంగేట్రం:

నెహ్ర సూచన మేరకు 1962లో విజయవాడ లోకసభ నియోజక వర్గం నుండి గెలుపొంది జూలై 1963లో కేంద్ర మంత్రి అయ్యారు. 1967, 1971 ఎన్నికలలో గెలిచారు. అనేక భారీ ఆనకట్టల నిర్మాణ శిల్పి ఆయన. నాగార్జున సాగర్ డ్యామ్ రూపశిల్పి. 1972లో గంగా కావేరి అనుసంధానానికి గార్లండ్ కెనాల్ స్కీము ప్రతిపాదించారు.

ఆయనకు లభించిన పురస్కారాలు – 1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌తో బాటు మూడు సార్లు రాష్ట్రపతి పురస్కారాలు. 1963లో పద్మ భూషణ్ గౌరవం.

‘The Cusecs Candidate’ ఆయన ఆత్మకథ. ‘India’s Water Wealth’ అనేది ఆయన రచించిన ప్రముఖ గ్రంథం.

ఆయన కుమారుడు అశోక్ ఇంజనీరు. కుమార్తె సుజాతా రావు, ఐ.ఎ.ఎస్. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.

మీర్ అక్బర్ అలీఖాన్ (1899-1994):

హైదరాబాదు రాష్ట్రం లోని బీదరు జాగీర్దారు కుటుంబంలో వీరు జన్మించారు.

న్యాయశాస్త్రంలో బారిస్టరు పట్టా పొందడానికి ఇంగ్లండు వెళ్లారు. బారిష్టరుగా హైదరాబాదు హైకోర్టులో 1927లో ప్రాక్టీసు మొదలుపెట్టి పేరు ప్రఖ్యాతులు గడించారు. న్యాయవాదిగా ఆయన వాదనలను హైకోర్టు జడ్జీలు ఆసక్తిగా ఆలకించేవారు. మూడు దశాబ్దుల పాటు ఆ వృత్తిలో రాణించారు.

వీరి ప్రతిభకు గుర్తింపుగా 1954లో రాజ్యసభ సభ్యులుగా అవకాశం లభించింది. 1954 నుండి 1972 వరకు అవిచ్ఛిన్నంగా చురుకుగా రాజ్యసభ కార్యకలాపాలలో పాల్గొన్నారు. తర్వాత 1972లో ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా నియమితులయ్యేరు. అంతకు ముందు 1967 నుండి 1972 వరకు బెజవాడ గోపాలరెడ్డి ఆ పదవిలో ఉన్నారు. ఆక్సర్ అలీ ఖాన్ గారిని, రెండేళ్ళ తరువాత, 1974లో ఒడిషా గవర్నరుగా బదలీ చేశారు. ఆ పదవిలో 1976 వరకు కొనసాగారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించిన వీరు విశ్రాంత జీవితాన్ని హైదరాబాదులో గడిపి 95 ఏళ్ల పూర్ణాయుర్దాయంతో అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చేరినా గాంధీజీ పిలుపునందుకొని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. చదువుకు స్వస్తి చెప్పారు. తర్వాత ఉస్మానియాలోని బి.ఎ. చేశారు. లండన్ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన మిడిల్ టెంపుల్‍లో యల్.యల్.బి. ఆనర్స్ చదివి స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాదులో ప్రాక్టీసు మొదలు పెట్టారు.

యునైటెడ్ ప్రోగ్రెసివ్ కమిటీ అధిపతిగా 17 సంవత్సరాల పాటు 1939 చివరి వరకు కొనసాగారు. హిందూ-ముస్లింల మధ్య అభిప్రాయ భేదాలను అధ్యయనం చేసి ఉభయ వర్గాల నాయకుల ముందు వుంచారు. మహమ్మదాలీ జిన్నా ప్రతిపాదించిన మజ్లిస్ పార్టీలో చేరడానికి తిరస్కరించారు. హైదరాబాదు రాష్ట్ర ప్రధాన మంత్రి పదవిని కూడా వద్దన్నారు.

హైదరాబాదులో 15 ఎకరాల స్వంత భూమిని దానం చేసి 1957లో పాలిటెక్నిక్ ప్రారంభించారు. హైదరాబాదు పారిశ్రామిక ఎగ్జిబిషన్ స్థాపక సభ్యులలో ఆయన ముఖ్యులు. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. 1965లో పద్మ భూషణ్ పురస్కారం లభించింది. మత సామరస్యానికి పాడుపడిన నాయకుడాయన.

సంగీత విదుషీమణి యం. యల్. వసంతకుమారి (3 జులై 1928 – 31 అక్టోబరు 1990):

1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతాలో పద్మ భూషణ్ పురస్కారం పొందిన యం. యల్. వసంతకుమారి సంగీత సంప్రదాయ కుటుంబంలో మదరాసులో జన్మించారు. అనేక భారతీయ భాషలలో ఆమె నేపథ్య గాయనిగా పేరు గడించారు. యం.యస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, యం.యల్.వి – ముగ్గురినీ మహిళా సంగీత త్రయంగా పేర్కొంటారు. జి.యన్. బాలసుబ్రముఖ్యం వద్ద యం.యల్.వి. సంగీత విద్య నభ్యసించారు. ఆ తరానికి చెందిన గాయనీమణులలో ఆమె వయసులో అతి చిన్నవారు. సంగీత కళానిధి బిరుదు పొందిన వారిలో కూడా చిన్నవారు. ఆమె కుమార్తె శ్రీవిద్య తమిళ, మలయాళ భాషలలో సినీనటి.

మదరాసు లలితాంగి వసంతకుమారి – యం.యల్.వి. గా కర్ణాటక సంగీత లోకానికి సపరిచితురాలు, హెచ్.యం.వి. ఏవియం, వాణి, అమృతం, సంస్థలకు రికార్డింగులు చేశారు. ఆమె రూపొందించిన రాగం-తానం-పల్లవి బాగా ప్రసిద్ధి పొందాయి. హరిదాసు కీర్తనలకు స్వరకల్పన చేశారు. ఆమ శిష్యురాండ్రలో ప్రసిద్ధులు – కుమార్తె శ్రీవిద్య, సుధారఘునాధన్, చారుమతి రామచంద్రన్, ఏ. కన్యాకుమారి.

12 ఏళ్ల వయసులోనే ఆమె జి.యన్. బి. శైలిని పట్టుకున్నారు. స్వంత మనోధర్మంతో ఆమె కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. షణ్ముఖప్రియ – శంకరాభరణం, భైరవి- కామాస్; ఆభోగి – వాలాజీ రాగ సమ్మేళనంలో ఆమె ప్రతిభ అమోఘం. ఆమె తల్లి లలితాంగి పురందరదాసు కీర్తనలకు ప్రాచుర్యం కల్పించారు. ఆ సంప్రదాయాన్ని కుమార్తె కొనసాగించారు. సింధుభైరవి రాగంలో నారాయణ తీర్థుల ‘కళ్యాణ గోపాల’ తరంగాన్ని, పురందర దాసు ‘వెంకటాచల నిలయం’ కీర్తనను ఆమె స్వరపరచారు.

సినీరంగం:

1946 లోనే 18వ ఏట సినీ నేపథ్య గాయనిగా ప్రవేశించారు. తమిళ, మలయాళ సినిమాలలో విస్తృతంగా పాడారు. తెలుగులో బీదల పాట్లు, నవ్వితే నవరత్నాలు, పెళ్ళికూతురు, సౌదామిని, తిలోత్తమ, ముగ్గురు కొడుకులు, ఇన్‍స్పెక్టర్, కోడరికం, నా ఇల్లు, ప్రపంచం, మేనరికం, ఆదర్శ సతి, విజయగౌరి, నాగులచవితి, భలే అమ్మాయిలు, మాయాబజారు తదితర సినిమాలకు పాడారు.

1970లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, 1976లో మైసూరు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, 1977లో మదరాసు మ్యూజిక్ అకాడమీ వారి సంగీత కళానిధి, తమళ ఇసై సంఘం పురస్కారం (1977), ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి సంగీత కళాశిఖామణి (1987) లభించాయి, మదనపల్లిలోని ఋషీ వ్యాలీ స్కూల్లో ఆమె 1980 దశకంలో పని చేస్తుండగా కడప ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీలు చేశారు.

పత్రికా సంపాదకులు – యం. చలపతిరావు (1908–1983):

ప్రముఖ పత్రికా సంపాదకలు మానికొండ చలపతి రావు 1938 నుండి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదక వర్గంలో వుండి 1946 నుండి 1978 వరకు సంపాదకులుగా అర్ధ శతాబ్ది పాటు కొనసాగారు. ఆ ఆంగ్ల దినపత్రికను లక్నో నుండి పండిత్ జవహర్‌లాల్ నెహ్రు నెలకొల్పారు.

విశాఖపట్టణంలో జన్మించిన చలపతి రావు మదరాసు నుండి ఎం.ఏ., బి.యల్ పట్టాలు సాధించారు. కొంత కాలం లాయర్‌గా అక్కడే పనిచేశారు. అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిధ్యాలయం వైస్- ఛాన్సలర్. ఆయన సాహిత్యాభిలాషి. వారి ఆద్వర్యంలో ‘ఎథేనియం’ అనే సాహిత్య సాంస్కృతిక సంస్థను ప్రారంభించి, చలపతిరావు కార్యదర్శిగా వ్యవహరించారు.

నెహ్రు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని జాతీయ భావాలు గల చలపతి రావు లక్నో వెళ్లి నేషనల్ హెరాల్డ్‌లో సబ్ ఎడిటర్‌గా చేరి క్రమక్రమంగా సంపాదక స్థాయి కెదిగారు. పిఠాపురం రాజా వారి ‘పీపుల్స్ వాయిస్’, ‘వీకెండ్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రికలలో వేర్వేరు కాలాలలో సహాయ సంపాదకత్వం వహించారు. నెహ్రూకి సన్నిహిత మిత్రులు. భారతదేశంలోని ప్రముఖ పత్రికా సంపాదకులలో ఒకరుగా ప్రఖ్యాతి.

ట్రేడ్ యూనియన్ తరహాలో Indian Federation of Working Journalists సంస్థను పత్రికా రచయితల హక్కులు కాపాడటానికి స్థాపించారు. దాని అధిపతిగా 1950-55 మధ్య వ్యవహారించారు. ప్రెస్ కమిషన్ ఏర్పాటుకు ముఖ్యకారకులు. యునెస్కో సంస్థకు భారతదేశ ప్రతినిధిగా వెళ్లివచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ, గోవింద వల్లభ్ పంత్ జీవితచరిత్రలు వ్రాశారు. వీరి గ్రంథాలలో ‘The Press in India’ అతి ప్రసిద్ధం. వీరికి 1968లో పద్మ భూషణ్ ప్రకటించారు. కానీ ఆయన తిరస్కరించారు.

‘The Press, Journalism and Politics’ మరో గ్రంథం.

స్వాతంత్రోద్యమ సమయంలో రహస్యంగా పత్రికను నడిపిన వారిలో చలపతి రావు అగ్రగణ్యులు. ‘Magnus’ అనే కలం పేరుతో హిందూస్థాన్ టైమ్స్‌లో వారం వారం వ్యాసాలు ప్రచురించారు. దేవదాస్ గాంధీ నడిపే హిందూస్థాన్ టైమ్స్‌లో పనిచేస్తుండగా వీరి జీతం పెంచే ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. నెహ్రుకి సన్నిహితుడైనా ఆయన రాజకీయ విధానాలను గట్టిగా విమర్శిస్తూ వ్రాసేవారు. నెహ్ర మెమోరియల్ మ్యూజియం స్థాపనకు కృషిచేశారు. ఆయన బ్రహ్మచారిగా జీవనయానం కొనసాగించారు. ధన్యజీవి.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here