తెలుగుజాతికి ‘భూషణాలు’-28

0
12

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

శాస్త్రనిధి డా. రాజ్ రెడ్డి (13 జూన్ 1937):

2001 సంవత్సరంలో ఏడుగురు తెలుగు వారికి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడం విశేషం. బోయి భీమన్న, రాజ్ రెడ్డి, భానుమతి, యామినీ కృష్ణమూర్తి, శివ్. కె. కుమార్, బి.వి. రాజు, పల్లె రామారావులు. వీరిలో యామినీ కృష్ణమూర్తికి, పల్లె రామారావులకు పద్మ విభూషణ్ కూడా లభించింది. రాజ్ రెడ్డిగా విదేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ఖ్యాతి గడించిన దబ్బాల రాజ గోపాలరెడ్డి స్వస్థలం చిత్తూరు. అపోలో ప్రతాప రెడ్డి కూడా అక్కడి వారే. కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు రంగాలలో ఆయన విశేష కృషి చేశారు. ఆమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో నాలుగు దశాబ్దులుగా ఆచార్య పదవి ఆయన పరిశోధనా పటిమకు నిదర్శనం.

తాను జన్మించిన దేశానికి ఏదో చేయాలని తపనతో, రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్‌, టెక్నాలజీ స్థాపనకు దోహదం చేశారు. హైదరాబాదులో IIIT చైర్మన్. 1994 లోనే ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందారు. కృత్రిమ మేధస్సు రంగంలో చేసిన పరిశోధన కది లభించింది. 1958 లో చెన్నైలోని గిండీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగు చదివారు. వెంటనే మదరాసు పోర్టు ట్రస్టులో ఉద్యోగం. 1960లో ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1966లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాదించారు. అదే విశ్వవిద్యాలయంలో అదే సంవత్సరం అధ్యాపకులయ్యారు. ఆ తర్వాత పిట్స్‌బర్గ్ లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయ అధ్యాపకత్వం. 1984లో యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి హయాంలో ఆయన అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ఐ.ఐ.టీ.ల ఏర్పాటుకు పాలక మండలి అధ్యక్షులయ్యారు. 1999-2001 మధ్య ప్రెసిడెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహా సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. అమెరికాలో బిల్ క్లింటన్ అధ్యక్షులుగా ఉండగా ఈయన ఐటీ సలహా సంఘానికి కో-చైర్మన్.

సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడేలా చూడాలని ఆయన దీక్ష. వైద్యరంగంలోను, రోడ్డు ప్రమాదాలలోను ఉపయోగపడేలా రోబోలు తయారుచేసి 1980 దశకంలో ఆఫ్రికా దేశాలలోని పాఠశాలలకు అందజేశారు. అనేక విదేశీ అవార్డు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సహాకరించి అనేక ప్రాచీన ఆధునిక గ్రంథాల డిజిటిలైజేషనకు దోహదం చేశారు. జాతి గర్వించదగిన వ్యక్తి రాజ్ రెడ్డి.

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ (7 సెప్టెంబరు 1925 – 24 డిసెంబరు 2005):

దక్షిణ భారతదేశంలో సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు – అన్ని రకాల ప్రజ్ఞాపాటవాలు గల వ్యక్తి బానుమతి. ప్రకాశం జిల్లా ఒంగోలులో శాస్త్రీయ సంగీత ప్రియుడైన బొమ్మరాజు వెంకట సుబ్బయ్య ఇంట జన్మించారు. సంప్రదాయ కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1939లో 13వ ఏట ‘వరవిక్రయం’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సినిమా నిర్మాణ సమయంలో ఆమె తండ్రి విధించిన షరతు విచిత్రం! “చిత్రనిర్మాణ సన్నివేశాలతో ఏ కథానాయకుడు ఆమె శరీరంపై చేయి వేయకూడదు”. అలానే ఆమె నటించారు. చిత్రనిర్మాత, దర్శకుడు అయిన రామకృష్ణారావులో 1943లో 17వ ఏట వివాహమైంది. వీరి ఏకైక కుమారుడు భరణి పేర భరణీ స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలు తీశారు.

భానుమతి సుమారు వంద సినిమాలలో నటించారు. వైవిధ్యభరితమైన పాత్రలలో విలక్షణమైన నటనను ప్రదర్శించారు. మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు చిత్రాలలో ఆమె అద్భుత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె స్వయంగా చిత్రాలలో పాటలు పాడారు. సినిమా పాటలేగాక రేడియోలోను, గ్రామఫోను రికార్డులకు ఆమె పాటలు పాడారు. వీరిని నేను విజయవాడ కేంద్రంలో 1996లో ఇంటర్వ్యూ చేశాను.

“మీకు అహంకారం అంటారు?” అని అడిగిన ప్రశ్నకు – “కళాకారులకు, ప్రతిభావంతులకు అది అవసరం” అని సమాధానమిచ్చారు భానుమతి.

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రారంభ సమయంలో భానుమతి, బాలాంత్రపు రజనీ కాంతారావు పాడిన యుగళ గీతం – ‘పసిడి మెరుంగుల తళతళలు’ చిరస్మరణీయం. 1939 నుండి 1998 వరకు తమిళ, తెలుగు సినిమాలలో అద్భుత నటనా వైదుష్యం ప్రదర్శించారు. మాలతీ మాధవం (1948), ధర్మపత్ని (1941), కృష్ణప్రేమ (1943) తాసిల్దారు (1944), స్వర్గసీమ (1945), రత్నమాల (1946), లైలామజ్నూ (1949), అపూర్వ సహోదరులు (1950), మల్లీశ్వరి (1951), చండీరాణి (1953) చక్రపాణి (1954), విప్రనారాయణ (1954), తెనాలి రామకృష్ణ (1956) సారంగధర (1957), బాటసారి (1961), బొబ్బిలి యుద్ధం (1964), పల్నాటియుద్ధం (1966), తాతమ్మ కల (1974), మంగమ్మగారి మనవడు (1984), బామ్మ మాట బంగారు బాట (1990), పెళ్లికానుక (1998)- ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆమె ‘అత్తగారి కథలు’ రసవత్తరం,

పురస్కారాలు:

  • జాతీయ చలనచిత్ర అవార్డులు మూడు సార్లు.
  • నటనకు వ్యాకరణం – నడిప్పుకు ఇళక్కనం – అన్నాదురై యిచ్చిన బిరుదు.
  • పద్మశ్రీ పురస్కారం 1966
  • పద్మ భూషణ్ 2001
  • శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ 1984
  • ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ 1975
  • ఆం.ప్ర. రఘుపతి వెంకయ్య అవార్డు 1986

అట్టి విదుషీమణి భానుమతి.

ఆంగ్ల కవి శివ్. కె. కుమార్ (16 ఆగస్టు 1921 – 1 మార్చి 2017):

ఆంగ్లభాషాకవి, నాటక రచయిత, నవలా రచయిత, కథానికా రచయిత అయిన శివ్. కె. కుమార్‌కు 2001లో పద్మ భూషణ్ లభించింది. శివ కృష్ణకుమార్ తాత తులసీదాసు కుమార్ పాఠశాల ఉపాధ్యాయుడు. తండ్రి బిషన్ కుమార్ దాస్ ప్రధానోపాధ్యాయుడు. అధ్యాపక కుటుంబంలో జన్మించిన శివకుమార్ బ్రిటీష్ ఇండియాలో లాహోర్‌లో జన్మించారు. అక్కడే 1953లో ఎం. ఏ. చేశారు. లాహోర్ డి.ఏ.వి. కళాశాలలో అదే సంవత్సరం లెక్చరర్‌గా చేరారు. దేశ విభజన తర్వాత ఢిల్లీకి మకాం మార్చారు. కొంతకాలం ఆకాశవాణి, ఢిల్లీ కేంద్రంలో ప్రోగ్రామ్ ఆఫీసరుగా పనిచేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పి.హెచ్.డి. సంపాదించారు.

అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్లోపన్యాసకులుగా చాలాకాలం పని చేశారు. పదవీ విరమణానంతరం 1972-74 మద్య హైదరాబాదులో నూతనంగా ఏర్పడిన సెంట్రల్ యూనివర్శిటీలో ఆంగ్ల శాఖ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1980లో కొంతకాలం యూనివర్సిటీ తాత్కలిక ఉపాధ్యక్షులుగా నియమింపబడ్డారు. వివిధ విదేశీ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫసర్‌గా పనిచేశారు. ఆయన కవితలు, కథానికలు బి.బి.సి. రేడియో ద్వారా ప్రసారమయ్యాయి.

బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలనుండి వెలువడే ప్రతిష్ఠాత్మక మాగజైన్లలో ఆయన రచనలు ప్రచురించబడ్డాయి. ఆ రచనలు వివిధ భారతీయ భాషలు, విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి. లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెలోగా 1978లో ఎంపికయ్యారు. 1987లో ఆయన రచించిన ‘Trapfalls in the Sky’ అన్న గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఆ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ద్వారా వారి ఇంటర్వ్యూ ప్రసారం చేశాము.

వీరు అవార్డు పొందిన గ్రంథం హిందీ, ఉర్చూ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోకి అనువదింపబడింది. కవి 14 కవితాసంపుటులు ప్రచురించారు. The Last Wedding Anniversary (1973) అన్న నాటకాన్ని ఇండియన్ నేషనల్ థియేటర్ వారు ప్రదర్శించారు. విశ్రాంత జీవితాన్ని హైదరాబాదులో గడుపుతూ 2017లో కీర్తిశేషులయ్యారు.

పారిశ్రామికవేత్త బి.వి. రాజు (15 అక్టోబరు 1920 – 8 జూన్ 2002):

భూపతిరాజు విస్సంరాజు కుముదవల్లి గ్రామంలో జన్మించారు. రాశి సిమెంట్స్ అధినేతగా ప్రముఖులు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. సిమెంటు పరిశ్రమ రంగంలో ఆద్యులు. సిరామిక్స్, రిఫ్రాక్టరీ పరిశ్రమలలో అనుభవముంది. 1997లో ఇంజనీరింగ్ కళాశాలలు, దంతవైద్య కళాశాల, ఒక ఆసుపత్రి, ఫార్మసీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, పాఠశాలలు – ఇలా ఎన్నో విద్యాసంస్థల వ్యవస్థాపకులు. వీరి పేర హైదరాబాదులో పద్మశ్రీ బి.వి. రాజు ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నడుస్తోంది. 1977లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ లభించాయి.

భీమవరంలో విష్ణుపూర్ వద్ద విష్ణు యూనివర్సల్ లెర్నింగ్, విష్ణు కాలేజీ ఆఫ్ ఫార్మసీ బాగా ప్రసిద్ధి పొందాయి. వీరు ఒక కమ్యూనిటీ రేడియో నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‍లో పలు ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమలు ప్రారంభించడానికి తాను సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా దూరదృష్టితో వ్యవహరించారు. ఆంధ్రలో కడప దగ్గర యర్రగుంట్ల, తాండూరు, అదిలాబాదు, హిమాచల ప్రదేశ్‌లో రాజ్ బన్, కర్ణాటకలో కూరుకుంట, అస్సాంలో బొకజన్, మధ్యప్రదేశ్‍లో నీముఖ్, అఖిల్తాన్, మందర్‌లో సిమెంటు ఫ్యాక్టరీలు వెలసి వృద్ధి పొందాయి. ఎందరికో ఉపాధి అవకాశాలు లభించాయి. రాజు దూరదృష్టికి అది నిదర్శనం,

తమిళనాడు, కేరళ, ఒడిసా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు రాజును సలహాదారుగా నియమంచాయి. వీరి ఆధ్యరంలో నడపబడిన సంస్థలు:

  • రాశి సిమెంట్స్, తెలంగాణ పేపర్ మిల్స్
  • విష్ణు సిమెంట్స్, రాశి సాఫ్ట్‌వేర్
  • రాశి రిప్రాక్టరీస్, రాశి ఫైనాన్స్
  • రాశి సిరామిక్స్

సేవాకార్యక్రమాలలో భాగంగా బి.వి.రాజు ఫౌండేషన్ స్థామించి గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. తన స్వగ్రామం కుముదవల్లిలో వీరేశలింగ గ్రంథాలయానికి భూరి విరాళం అందించారు. బి.వి.రాజు దార్శనికుడు.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here