తెలుగుజాతికి ‘భూషణాలు’-30

0
9

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

ఫార్మా పారిశ్రామికవేత్త డా. కె. ఐ. వరప్రసాదరెడ్డి (1948 నవంబరు 17):

[dropcap]శాం[/dropcap]తా బయోటెక్నిక్స్ వ్యవస్థాపక చైర్మన్ కోడూరు ఈశ్వర వరప్రసాదరెడ్డి నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాళెంలో జన్మించారు. మేనమామ కమ్యూనిస్టు నాయకుడు. చిన్నతనంలో ఆయన వద్ద పెరిగారు. ఆయనకు సాహిత్యమంటే ఇష్టం. అందుకే పలువురు రచయితల గ్రంథాల ప్రచురణకు లక్షలాది రూపాయలు విరాళాలుగా అందిస్తారు. అన్నమయ్య సంకీర్తనలంటే అభిమానం. మాతృ వందనం పేర ఏటా తల్లిదండ్రుల స్మారకార్థం పండిత సత్కారం ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదివారు. ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. ఎం.బి.ఏ. చేశారు.

23 ఏళ్ల వయస్సులో డి.ఆర్.డి.ఓ, హైదరాబాదులో చేరి ఏడేళ్లు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలెప్‌మెంట్ బోర్డులో ఏడేళ్లు పనిచేశారు. ఎక్కడా నచ్ఛక 1988లో ఒక మిత్రుని భాగస్వామ్యంలో ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది కుదరలేదు. అమెరికా వెళ్లినప్పుడు అక్కడ వారు హెపిటైటస్-బి వ్యాధి గురించి మాట్లాడటం ఆయనను కలచివేసింది. భారతదేశానికి రావాలని నిశ్చయించుకొన్నారు.

బయోటెక్నాలజీ రంగానికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడలేదు. నాన్న పొలాన్ని అమ్మి రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో తక్కువ ధరకు టీకా అందించాలని సంకల్పించారు. మిత్రుల సహకారంతో 15 కోట్ల రూపాయల పెట్టుబడితో 1992 నుండి ప్రారంభించి 1997 ఆగస్టు నాటికి హెపటైటిస్-బి వ్యాక్సిన్ తయారు చేశారు. సంస్థకు తల్లి పేర శాంతా బయోటెక్నిక్స్ అని నామకరణం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల పరీక్ష ఎదుర్కుని రెండేళ్లు తర్వాత యునిసెఫ్ నుండి ఆర్డర్లు రావడం విజయ పరంపరకు నాంది. ప్రపంచ వ్యాప్తంగా టీకాలు సరఫరా అయ్యాయి. భారతదేశ ఆరోగ్యశాఖ మందకొడిగా ప్రవర్తించడంతో భారతదేశంలో ఆలస్యమైంది. BOBLINGEN విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్‍లో డిప్లోమా పొందారు. భారత ప్రభుత్వం వారు 2005లో పద్మ భూషణ్ అందించారు. స్వదేశీ పరిశోధజనకు గుర్తింపుగా ఇచ్చే జాతీయ టెక్నాలజీ అవార్డును 1999లో మొదటిసారి, మళ్ళీ 2003లో రెండోసారి పొందారు. రెండు పర్యాయాలు ఆ అవార్డ్ దక్కడం అరుదైన విశేషం. 2022లో తెలంగాణ సారస్వత పరిషత్ సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం, బెజవాడ గోపాలరెడ్డి స్మారక పురస్కారం ఆయన సహృదయతకు కానుకలు. మానవసేవయే ముఖ్యమనే మతాన్ని నమ్మి ఎన్నో సంస్థలకు భూరి విరాళాలందించిన సహృదయమూర్తి వరప్రసాదరెడ్డి.

న్యాయశాస్త్ర నిపుణులు పి.పి.రావు (1 జులై 1933 – 13 సెప్టెంబరు 2017):

పవని పరమేశ్వరరావు ప్రకాశం జిల్లాలోని మొగిలిచెర్లలో జన్మించారు. రాజ్యాంగ నిపుణులుగా, సీనియర్ న్యాయవాదిగా, లోకాయుక్త ఎంపిక కమిటీ సభ్యుడిగా ఆయన కీర్తిప్రతిష్ఠలు గడించారు. నెల్లూరు వి. ఆర్. కాలేజీలో బి.ఏ. చదివి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి యల్.యల్.బి.; ఉస్మానియా నుండి యల్.యల్.యం పట్టాలు పొందారు. 1961లో ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా చేరడంతో ఢిల్లీ ప్రస్థానం మొదలై జీవితాంతం కొనసాగింది.

1967లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రారంభమైన జీవితం 1976లో సీనియర్ న్యాయవాదిగా, 1991లో సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ చైర్మన్ స్థాయికి ఎదిగింది. సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా చాలాకాలం పని చేశారు. కేశవానంద భారతి, యస్. ఆర్. బొమ్మై, పి.వి. నరసింహారావు, బాబ్రీ మసీదు కూల్చివేత, బెస్ట్ బేకరీ వంటి కేసులు వాదించారు. న్యాయరంగ నిపుణిడిగా 2006లో పద్మ భూషణ్ వరించింది. అదే సంవత్సరం సినీ నేపథ్య గాయని పి. సుశీలకు, నటులు చిరంజీవికి లభించాయి.

84వ ఏట ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. మరగించే నాటికి 50 ఏళ్ల న్యాయవాద వృత్తిని పూర్తి చేశారు. ఆయన మృతికి సంతాస సూచకంగా సుప్రీం కోర్టు విచారణలు 2017 సెప్టెంబరు 1న వాయిదా వేశారు. ఆయన మృతికి సంతాప సందేశాలందించిన ప్రముఖుల వాక్యాలివి:

“తెలుగు వారికి తీరని లోటు” – జస్టిన్ యన్. వి. రమణ; సుప్రీంకోర్టు

“న్యాయమున్న కేసులే వాదించేవారు” – కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

“ఫీజు తీసుకోకుండా వాదించారు” – కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్

“పలువురు న్యాయవాదులకు ఆదర్శంగా నిలిచారు” – జస్టిప్ యన్. వి. రమణ

పరమేశ్వరరావు కుమారుడు ప్రవీణ్, కోడలు మహాలక్ష్మి కూడా సుప్రీం కోర్టులో న్యాయవాదులు. పి.పి.రావు అన్న గారు శ్రీధరరావు, ఆయన సతీమణి పవని నిర్మల ప్రభావతి దంపతులు స్వగ్రామం మొగిలిచర్లలోనే జీవిత యాత్ర కొనసాగించిన ఆధ్యాత్మిక సంపన్నలు.

మహిళాశక్తి మోహినీ గిరి (1938  – 14 డిసెంబరు 2023):

రాష్ట్రపతి వి.వి.గిరి కోడలు మోహినీ గిరి. తండ్రి డాక్టర్ వి.యస్.రామ్ లక్నోలో గొప్ప పండితులు. ఆమె లక్నో విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి భారతచరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, జి.బి. పంత్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాధించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో పెరిగారు. సామాజిక కార్యకర్తగా 2007లో పద్మ భూషణ్ అందుకున్నారు. న్యూఢిల్లీలోని సామాజిక సేవాసంస్థ – గిల్డ్ ఆఫ్ సర్వీస్ చైర్‌పర్సన్. ఈ సంస్థను 1979లో స్థాపించారు. విద్య, ఉపాధి, ఆర్థిక భద్రత కోసం, మహిళలు, పిల్లల హక్కుల కోసం న్యాయవాదులను అందించే సంస్థ యిది. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధానంతరం 1972లో న్యూ ఢిల్లీలో వార్ విడోస్ అసోసియేషన్ స్థాపించి గణనీయమైన సేవ చేశారు. ఆ సంస్థ అధిపతి ఆమే.

1995-98 మధ్య కాలంలో జాతీయ మహిళా కమీషన్ చైర్‌పర్సన్.

ఉద్యోగ జీవితం:

విద్యావేత్తగా మోహినీగిరి జీవితం ప్రారంభించారు. లక్నో విశ్వవిద్యాలయంలో మహిళా అద్యయన విభాగం ప్రారంభించి ఎందరో యువతులకు మార్గదర్శి అయ్యారు.

2000 సంవత్సరంలో Women’s Initiator For South Asia – అనే సంస్థకు వ్యవస్థాపక ట్రస్టీ. అదే రీతిలో అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ హంగర్ ప్రాజెక్టు బోర్డ్ మెంబర్‌గా వ్యవహరించారు.

ఆమె రచనలలో ప్రధాన గ్రంథాలు:

  1. Deprived Devis: Women’s Unequal Status in Society, 2006
  2. Mantras for Positive Ageing,
  3. Reaching the Unreachable Women’s Participation in Panchayat Raj Administration: A Feministic Study on the Role Performance and Experiences of Elected Women in Sivaganga District –

మోహినీగిరి 85వ ఏట న్యూఢిల్లీలో అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె స్థాపించిన వివిధ సంస్థలు విధవా పరిరక్షణ బాధ్యతలు స్వీకరిస్తున్నాయి. గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఆ సంస్థ కార్యకలాపాలపై – “Still We Rise The Passion And Compassion of Mohini Giri” అనే డాక్యుమెంటరీని రూపొందించి ప్రదర్శించారు. మోహిని భర్త ఆమె 50వ ఏట మరణించారు.

గాన కోకిల పి. సుశీల (13 నవంబరు 1935):

విజయనగరం సంగీత సాహిత్యాల నిలయం. అక్కడ ప్రముఖ గాయని పులిపాక సుశీల సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. తండ్రి ముకుందరావు క్రిమినల్ లాయరు. 1950 నుండి నాలుగు దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీరంగంలో నేపథ్యగాయనిగా ప్రసిద్ధి కెక్కారు. దక్షిణాది భాషలే గాక హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు. స్పష్టమైన ఉచ్చారణ ఆమె ప్రత్యేకత.

ఆకాశవాణి నిర్వహించిన పోటీలో ఆమె విజేత అయ్యారు. మాతృభాష తెలుగు అయినా హిందీ, కన్నడ భాషలలో, తమిళంలో సరళ సుందరంగా మాట్లాడగలరు. వృత్తిరీత్యా వైద్యుడైన మోహన రావును వివాహమాడారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీర నృత్య కళాశాలలో డిప్లోమా ఇన్ మ్యూజిక్ పూర్తి చేశారు. అప్పుడు కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ వయోలెనిస్టు ద్వారం వెంకటస్వామి నాయుడు.

తొలి ప్రయత్నం:

1950లో సంగీత దర్శకు పెండ్యాల నాగేశ్వరరావు ఆకాశవాణిని సంప్రదించి ఉత్తమ గాయకుల లిస్టు సంపాదించారు. తమిళ సినిమాలో ఎ. ఎం. రాజాతో కలిసి 1952లో పెట్రా థాయే (తెలుగులో కన్నతల్లి) చిత్రానికి యుగళగీతం పాడారు. తెలుగులో ఘంటసాలతో కలిసి పాడారు. 1950 నుండి 1985 వరకు దాదాపు అన్ని సినిమాలలో ఆమె ఘంటసాల, పి.బి. శ్రీనివాస్‍తో కలిసి యుగళగీతాలు పాడారు. 1969లో జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ గాయని అవార్డు లభించింది. లతా మంగేష్కర్‌తో సుశీల మంచి స్నేహాన్ని పెంపొందించుకున్నారు.

అవార్డుల పరంపర ఆమెను వరించింది. 1986-2005 మధ్య భక్తి, జానపద పాటలు పాడారు. అన్ని భాషలలో ఆమె 40 వేల పాటలు రికార్డు చేసినట్లు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసింది. తెలుగులో 12 వేల పాటలు పాడారు. తమిళంలో భక్తి పాటలు 6 వేలు, కన్నడంలో 5 వేలు, మలయాళంలో 1200 పాడారు.

పురస్కారాలు:

  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు.
  • ఆసియా బూక్ ఆఫ్ రికార్డు.
  • ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలు ఐదు సార్లు
  • రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు -2001
  • పద్మ భూషణ్ – 2008
  • పైమా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు – 2022

అద్భుత కంఠ స్వరంతో ప్రేక్షక జనామోదం పొందిన యశస్వి సుశీల.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here