తెలుగుజాతికి ‘భూషణాలు’-34

0
15

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

బహుభాషాకోవిదులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (24న వంబరు 1953):

[dropcap]కేం[/dropcap]ద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం (1992), సాహిత్య పురస్కారం ( 2009) రెండింటినీ పొందిన విశిష్ట వ్యక్తి లక్ష్మీప్రసాద్. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాములలో రైతుకుటుంబంలో పుట్టిన లక్ష్మీప్రసాద్ హిందీలో ఎం.ఎ.తో బాటు తెలుగులోను ఎం.ఎ. చేశారు. హిందీలో పిహెచ్.డి సాధించారు. నందిగామ కె. వి.ఆర్. కళాశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించి, లయోలా కళాశాలలో హిందీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ పదవి నిర్వహించారు. ఆంధ్రా యూనివర్శిటీలో హిందీ ప్రొఫెసర్‍గా చేరి 30 మంది పరిశోక్షకులకు పర్యవేక్షకులుగా వున్నారు.

1996-2002 మధ్య రాజ్యసభ సభ్యులుగా ఆరు సంవత్సరాలు క్రియాశీలకంగా అనేక విషయాలను సభలో ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు. పార్లమెంటరీ అధికార భాషా సంఘం చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ పదవులు నిర్వహించారు.

తెలుగు, హిందీ భాషలలో విశేష కృషిచేసి 35 గ్రంథాలు ప్రచురించారు. భీష్మ సహానీ హిందీ నవల ‘తమస్’ను తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. తెలుగులో ‘ద్రౌపది’ నవలకు అకాడమీ పురస్కారం వచ్చింది, విశ్వ హిందీ సదస్సు నిర్వాహకుడిగా సాహిత్యాభిమానుల ప్రశంసలందుకున్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ స్థాపించి ఏటా లక్ష రూపాయల అవార్డు అందిస్తున్నారు.

విదేశీ సాహిత్య సాంస్కతిక రాయబారిగా విదేశాలలో విస్తృతంగా పర్యటించారు. 2008లో అమెరికాలోని ‘తానా’ వారి హ్యుమన్ ఎక్స్‌లెన్స్ అవార్డు స్వీకరించారు. 2009లో జాతీయ హిందీ అకాడమీ వారి విశిష్ట హిందీ సేవా సన్మానం లభించింది. 2003లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ పురస్కారాలు అందాయి.

డా. కరణ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, హరివంశరాయ్ బచ్చన్, నరేంద్ర మోడీ, పుచ్చలపల్లి సుందరయ్యల జీవితచరిత్రలు, ‘మన గవర్నరు నారాయణ దత్ తివారీ’ వీరి రచనలు. సత్యభామ, ద్రౌపది నవలలు వీరి పురాణ పరిచయ పాండిత్యానికి నిదర్శనాలు. నాయకత్రయం, బారిస్టర్ రాఘవేంద్రరావు, దక్షిణాఫ్రికాలో మహాత్మోదయం వీరి ఇతర రచనలు. యన్.టి. రామారావు గారి అభిమానిగా రాజకీయలలో ఆరితేరిన వ్యక్తి. లక్ష్మీప్రసాద్ నిరంతర అధ్యయనశీలి.

నిర్మాణ రంగ నిపుణుడు అనుమోలు రామకృష్ణ (20 డిసెంబరు 1939-20 ఆగస్ట్ 2013):

విజయవాడ సమీపంలోని పునాదిపాడులో రామకృష్ణ జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. ప్రఖ్యాతి వహించిన లార్సన్ అండ్ టర్బో కంపెనీలో నిర్మాణ విభాగంలో ఉద్యోగ జీవితం ఆరంభించారు. 1966లో జర్మనీ నుండి ఇంజనీరింగు పరిశోధనా శిక్షణ పొందారు. 42 సంవత్సరలు L&Tలో వివిధ హోదాలలో పనిచేసి 2000లో డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ స్థాయి కెదిగారు. ఆయన పదవీ విరమణ చేసే నాటికి కంపెనీ ఆదాయం 55 బిలియన్ల డాలర్ల స్థాయికి పెరిగింది.

సిమెంటు, స్టీలు, పెట్రోకెమికల్, ఓడరేవులు, విమానాశ్రయాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నిర్మాణ సమయంలో రామకృష్ణ పర్యవేక్షణాధికారి. తాజ్ జి.వి.కె. హోటళ్లు, రామ్‌కో సిమెంట్స్, ఆంధ్ర సుగర్స్, ఆంధ్రా పెట్రో కెమికల్స్ సంస్థలకు బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా మార్గదర్శనం చేశారు.

1962లో ECC (ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్)లో చేరి అత్యున్నత పదవి కెదిగిన ధీశాలి రామకృష్ణ. ఆ కంపెనీయే తర్వాతి కాలంలో L&T గా ప్రసిద్ధి కెక్కింది. 1966లో రామకృష్ణను భారత ప్రభుత్యం స్కాలర్‌షిప్ యిచ్చి జర్మనీకి ఉన్నత చదువులకు పంపింది. నిర్మాణ రంగంలో ఆయన నూత్న ఆవిష్కరణలు చేశారు. హైదరాబాదులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) స్థాపకులు.

అవార్డులు:

  • భారత ప్రభుత్వ పద్మ విభూషణ్ – 2014 (మరణానంతరం)
  • రోటరీ ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు – 2000
  • ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ – 1997
  • జవహర్‌లాల్ టెక్నాలజీ యానివర్శిటీ గౌరవ డాక్టరేట్ – 2004

రామకృష్ణ ఆధ్యాత్మిక భావనతో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వారికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అనేక నిర్మాణ కార్యక్రమాలలో సహకరించారు. ధన్యజీవి రామకృష్ణ 73వ ఏట 2013 ఆగస్టులో నిర్యాణం చెందారు.

జీర్ణాశయ వైద్యనిపుణులు డా. డి. నాగేశ్వరరెడ్డి:

‘పుత్రాదిచ్ఛేత్ పరాజయం’ అన్నారు పెద్దలు. వైద్యవిభాగ డైరక్టరుగా పనిచేశారు డి. భాస్కరరెడ్డి. ఆ తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆయన కుమారుడు నాగేశ్వరరెడ్డి. గాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడిగా ఆయన ప్రసిద్ధులు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంట్రాలజీ సంస్థ (హైదరాబాదు)కు చైర్మన్. కర్నూలు మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్. చేశారు. అదే కాలేజీ ప్రిన్సిపాల్‌గా తండ్రి భాస్కరరెడ్డి వ్యవహారించారు. చండీగఢ్‌లో నాగశ్వరరెడ్డి డి. యం. చేశారు. కొంతకాలం హైదరాబాదు నిమ్స్‌లో పనిచేసి, తర్వాత గాంధీలో ప్రొఫసర్‌గా ఎందరికో సేవచేశారు. డాక్టరుకు మానవతా దృక్పథం ఉండాలనీ, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా సామాజిక బాధ్యతలో పనిచేయాలనీ ఆయన ప్రబోధిస్తారు.

ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ గాస్ట్రో ఎంట్రలాజికల్ అసోసియేషన్ విశిష్ట విద్యావేత్త పురస్కారం భారతీయుడైన నాగేశ్వరరెడ్డికి తొలిసారిగా లభించింది (2022). లండన్ తదితర యూనివర్శిటీ ఆఫర్లు, హార్వర్డ్ యూనివర్శిటీ వారి కోటి రూపాయల ఉద్యోగాన్ని ఆయన తిరస్కరించారు. ఎందరో విదేశీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. కళాశాల విద్యార్థిగా ఎన్నో స్వర్ణ పతకాలు అందుకున్న ఘనులు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ భూషణ్ అందుకున్నారు. గాస్ట్రో ఎంట్రాలజీ పితామహుడిగా భావించే షిండ్లర్ అవార్డు (క్లిస్టర్ అవార్డు) నాగేశ్వరరెడ్డిని వరించింది. ఆదరభావంతో రోగులకు సేవ చేసే నాగేశ్వరరెడ్డి విలక్షణ వ్యక్తి. 45 సంవత్సరాల సుదీర్ఘానుభవం గల రెడ్డి విశాల హృదయులు. ప్రామాణిక పరిశోధనా పత్రాలు విదేశీ మాగజైన్లలో వందలాది ప్రచురించారు.

పురస్కారాలు:

  1. బి.సి.రాయ్ అవార్డు – 1995
  2. పద్మ శ్రీ – 2002. పద్మ భూషణ్ – 2016
  3. ఏ.యస్. జి. ఇ. ప్రెసిడెంట్ అవార్డు – 2020
  4. ధన్వంతరి అవార్డు – 2004.
  5. విదేశ సంస్థల అవార్డులు – పది
  6. చైనా దేశ అవార్డు 2013.
  7. జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం కెప్టన్స్ చైర్ పురస్కారం – 2024

ఔషధ రంగ నిపుణులు డా. ఏ.వి. రామారావు (2 ఏప్రిల్ 1935):

హైదరాబాదులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఆర్. ఆర్. లాబ్స్) డైరక్టరుగా పనిచేసిన ఆళ్ల వెంకట రామారావు యాభై రకాల ఔషధాల పరిశోధనలు, తయారీలో ప్రధాన పాత్ర పోషించారు. 30 పేటెంట్లు సాధించిన ఘనుడు. గుంటూరులో జన్మించిన రామారావు అక్కడి ఏ.సి. కాలేజిలో కెమిస్ట్రీ బి.యస్.సి. చేసి అక్కడే డెమాన్ స్ట్రేటరుగా చేరారు. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఫార్మస్యూటికల్స్ యం.యస్.సి. పొందారు. నేషనల్ కెమికల్ లాబరేటరీ డైరక్టరయిన కృష్ణస్వామి వెంకట్రామన్ పర్యవేక్షణలో 1965లో పి.హెచ్.డి సాధించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు పరిశోకుడిగా పని చేసి 1977లో భారతదేశానికి తిరిగి వచ్చి 8 సంవత్సరాలు నేషనల్ కెమికల్ లాబరటరీస్ పరిశోధనలు కొనసాగించారు.

1985లో హైదరాబాదులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరక్టరుగా నియమితులు కావడంలో రామారావు జీవితం మలుపు తిరిగింది. 1995 వరకు పనిచేసి పదవీ విరమణానంతరం ఏ.వి. రావు లాబరేటరీ ప్రారంభించారు. దాని కార్యాలయాలు హైదరాబాదు, విశాఖపట్టణంలో పని చేస్తున్నాయి. CSIR తో బాటు అనేక విదేశీ సంస్థలు ఈ పరిశోధనా సంస్థకు సహకరిస్తున్నాయి.

రసాయన శాస్త్ర పరిశోధనలలో రామారావు ఆగ్రశ్రేణిలో నిలిచారు. ఔషధ కంపెనీ అయిన సిప్లా రామారావు పరిశోధనలకు ప్రాచుర్యం కల్పించింది. పలు ప్రభుత్వ సంస్థలతో అనుబంధంతో బాటు ప్రపంచ ఆరోగ్య సంస్థలోను రామారావు పరిశోధనలు కొనసాగించారు

పురస్కారాలు:

  • పద్మశ్రీ 1981- పద్మభూషన్ – 2016
  • సిఎస్‌ఐఆర్ టెక్నాలజీ అవార్డు
  • ఐసిటి ప్లాటినం అవార్డు
  • డా. ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డు.
  • పి.సి. రే పతకం
  • ఫిక్కి అవార్డు

2016 సంవత్సరంలో ఐదుగురు తెలుగువారు పద్మ భూషణ్ పొందడం గర్వకారణం,

సత్సంగ్ ఫౌండేషన్ డా. మీర్ ముంతాజ్ అలీ (6 నవంబరు 1948):

ఆధ్యాత్మికవేత్తగా మదనపల్లెలో నివసిస్తున్న ముంతాజ్ అలీ కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతరరంలో జన్మించారు. జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషీ వ్యాలీ స్కూల్‌తో అవినాభావ సంబంధమున్న అలీ డాక్టరు. సత్సంగ్ ఫౌండేషన్ స్థాపించి శాంతి, సౌభ్రాతృత్వాల కోసం నిరంతరం పాడుపడుతున్న మహోన్నతమూర్తి. మిస్టర్ యం. గా చిరపరిచితులు.

అంతర్జాత ప్రఖ్యాతి పొందిన జిడ్డు కృష్ణమూర్తి తాత్త్విక బావ చింతనను వొంటబట్టించుకొన్న వ్యక్తి అలీ. నిరాడంబరుడు. సేవాదృక్పథం గల వ్యక్తి. పరమత సహనం, శాంతి కోసం యావద్భారతదేశం విస్తృతంగా పర్యటించారు. శాంతి తత్వాన్ని ప్రజావళికి బోధించడానికి యాత్రా కార్యక్రములు నిర్వహించారు. మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీర్ ఏర్పరుచుకుని వైద్యరంగంలో సేవలు అందిస్తున్నారు. వీరి జీవితాన్ని దర్శకుడు రాజా చౌదరి 2011లో ‘The Modern Mystic: Sri M of Madanapalle’ పేరిత డాక్యుమెంటరీగా నిర్మించారు. హిమాలయాలకు చెందిన శ్రీ మహేశ్వరనాథ బాబాజీ వీరి గురువు. బాబాజీ ఒకనాడు వీరికి తమ యింటి పెరడులో కొద్ది నిమిషాల పాటు దర్శనమిచ్చి వీరితో మాట్లాడి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఎందరో దాక్షిణాత్య స్వామీజీల సంపర్కం లభించింది. బదరీనాథ్‌లో వ్యాస గుహలో మహేశ్వరనాథ బాబాజీ వద్ద మూడున్నర సంవత్సరాలు శిష్యరికం చేసి అనేక విషయాలు గ్రహిచారు. నాథ్ సంప్రదాయంలో వీరి కుండలినీ శక్తిని ప్రేరేపించారు. 2006లో రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం వీరు స్థాపించిన పీపుల్ గ్రోవ్ స్కూల్ ప్రారంభించారు. కన్యాకుమారిలో 2015 జనవరిలో కాలినడక ప్రారంభించి 11 రాష్ట్రాలు పర్యటించి 2016 ఏప్రిల్‍లో (5 నెలలు) 7500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆదినాథ్, శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయాన్ని జూలై 17న మదనపల్లెలో కేంద్ర రవాణాశాఖమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ముంతాజ్ అలీ మానవతామూర్తి.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here