తెలుగుజాతికి ‘భూషణాలు’-35

0
11

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

సాఫ్ట్‌వేర్ కీర్తికిరీటి సత్య నాదెళ్ళ (19 ఆగస్టు 1967):

మైక్రోసాఫ్ట్ అధినేత నాదెళ్ల సత్యనారాయణ హైదరాబాదులో బి.యన్. యుగంధర్ (ఐఎఎస్), ప్రభావతి దంపతులకు జన్మించారు. అనంతపురానికి చెందిన యుగంధర్ తర్వాతి కాలంలో గుంటూరు జిల్లా నాదెండ్లకు మకాం మార్చారు. బేగంపేట హైదరాబాదు పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన ‘సత్య’ మణిపాల్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. అమెరికాలోని విస్కాన్సిన్ – మిల్‍వాకీ విశ్వవిద్యాలయం నుండి 1990లో యం.యస్ చేయడం, 1997లో చికాగో యూనివర్శిటీ నుండి యం.బి.ఏ. చేయడం ఆయన నైపుణ్యానికి పెరుగులు పెట్టాయి.

మైక్రోసాఫ్ట్:

1992లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరడానికి ముందు ‘సత్య’ సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేశారు. 1992-2014 మధ్య మైక్రోసాఫ్ట్‌లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ‘క్లౌడ్ కంప్యూటింగ్’లో ప్రపంచంలోనే విశిష్ట స్థానం సంపాదించారు. మైక్రోసాఫ్ట్‌లో వివిధ హోదాలలో సునిశితంగా పని చేసి WINDOWS సర్వర్ రూపకర్త అయ్యారు. 2016లో ఆయన వేతనం 84.5 మిలియన్ల డాలర్లు.

2014 నుండి:

2014 ఫిబ్రవరి 4న సత్య నాదెళ్ళ – మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ.గా బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్‍ల తర్వాత మూడోవానిగా నియమితులయ్యారు. ఆయన అనేక విదేశీ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్‌లో ఒకరిగా వ్యవహారిస్తున్నారు. 2018, 2024 లలో టైమ్ 100 జాబితాలో ఒకరు. 2003లో జార్జియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 2022లో పద్మ భూషణ్ ప్రదానం చేపింది. 1992లో సత్య, అనుపమ ప్రియదర్శినిని వివాహమాడారు. ఆయనకు భారతీయ, అమెరికన్ కవిత్వాలంటే ఇష్టం. తన ఆత్మకథను ‘Hit Refresh’ అనే పేర 2017లో ప్రచురించారు. దీని ద్వారా వచ్చే రాయల్టీలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా ప్రకటించారు. ఆయన కుమారుడు 26వ ఏట దీర్ఘ అనారోగ్యంతో మరణించడం ఆయన జీవితంలో విషాదకర సంఘటన. తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి సత్య నాదెళ్ళ.

భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా – సుచిత్ర ఎల్లా:

కరోనా కష్టకాలంలో యావత్ భారతదేశం అతలాకుతలం అవుతున్న సమయంలో మొట్టమొదటి సారిగా కరోనా వాక్సిన్ -కోవాగ్జిన్ – తయారుచేసిన భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ యం. కృష్ణ ఎల్లా. ఆయన సతీమణి సుచిత్ర. ఈ దంపతులకు భారత ప్రభుత్యం 2022లో పద్మ భూషణ్ అందించింది. దంపతులుగా లోగడ కూచిపూడి నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధరెడ్డి ఈ గౌరవం పొంచారు.

కృష్ణ తిరుత్తణిలో జన్మించారు. తమిళనాడు విశ్వవిద్యాలయ్ం నుండి 1996లో, అగ్రికల్చర్ సైన్స్‌లో డిగ్రీ సాధించి విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు (1987-92). భారతదేశానికి తిరిగి వచ్చి 1999లో తన భార్యతో కలిసి హైదరాబాదులో భారత్ బయోటెక్ ఔషధ సంస్థను నెలకొల్పారు. మహమ్మారి వ్యాదులకు ఔషధాలు తయారు చేయడం, వాటిని విస్తృత ప్రాతిపదికపై ప్రజలకు అందించడం వారి లక్ష్యం. వారు టైఫాయిడ్ వ్యాధికి వాక్సిన్ కనిపెట్టారు. లక్షలాది మందికి కోవాగ్జిన్ అందించిన ఘనత వీరిది.

భారదేశానికి రాకముందు కృష్ణ ఎల్లా సౌత్ కరోలినా విశ్వవిద్యాలయంలో పరిశోధక అధ్యాపకులు. బయోటెక్ సంస్థ ద్వారా పశువ్యాధుల వాక్సిన్లు కూడా తయారు చేస్తున్నారు. మన దేశంలో సైన్సు బోధనా పద్ధతులను రూపకల్పన చేయడానికి వివిధ సంస్థలతో కృష్ణ ఎల్లా అనుబంధం కలిగివున్నారు. CSIR, CCMB, CSIR వంటి పరిశోధనా సంస్థల కమిటీ సభ్యులు. భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహా మండలి సభ్యులు. వీరికి JRD టాటా అవార్డు, ఆసియా పసిఫిక్ అవార్డు, ఫిక్కీ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు లభించాయి.

హెపిటైటిన్ బి. వాక్సిన్ అతి తక్కువ ధరకి 10 రూపాయలకే దాదాపు 400 మిలియన్ల డోసులు 65 దేశాలకు అందించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జినోమ్ వ్యాలీ పేర బయోటెక్ విజ్ఞాన పార్క్ స్థాపించమని సూచించారు. స్వైన్ ఫ్లూ వాక్సిన్ తొలుత కనిపెట్టిన ఘనత వీరిది. భారత ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో కోవాగ్జిన్ తయారీకి బయోటిక్ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని విదేశాలలో కూడా సప్లయి చేసింది. ప్రాణదాత కృష్ణా ఎల్లా.

శ్రీశ్రీ త్రిదండి నారాయణ చినజీయర్ స్వామి (3 నవంబరు 1956):

శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తూర్పు గోదావరి జిల్లాలో ఆర్తమూరులో వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో దీపావళి రోజున జన్మించారు. సమీపంలోని గౌతమీ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయంలో వేద గ్రంథాలు అధ్యయనం చేశారు. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద తర్కాదిశాస్త్రాలను, సంస్కృతాన్ని అభ్యసించారు. 23 సంవత్సరాల వయస్సులో సన్యాసదీక్ష స్వీకరించారు. గీతాజ్యోతి ఉద్యమం ద్వారా సమాజంలోని సోమరితనాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంధులకు కళ్లను ప్రసాదించడమేగాక కంప్యూటర్ నిష్ణాతులను చేశారు.

వర్ణ, వర్గ భేదం లేకుండా వేదం నేర్చుకోవచ్చునని ప్రచారం కొనసాగించారు. వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్ది అన్ని రకాల విద్యలను వాటిలో బోధించే ఏర్పాటు చేశారు. తాము స్వయంగా 12 నెలల్లో 12 భాషలను నేర్చుకొన్నారు. శంషాబాద్ సమీపంలో ముచ్చింతలలో ‘జిమ్స్’ అనే పేర ఉచిత ఆసుపత్రి స్థాపించి రోగులకు సదుపాయం కల్పించారు.

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ముచ్చింతలలో రామానుజ విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. 108 దివ్యదేశాల నమానాలను విశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి రాష్ట్రపతి శ్రీ రామనాధ్ కోవింద్‌చే ప్రారంభోత్సవం చేయించారు. 2016 అక్టోబరులో చినజీయర్ స్వామి షష్ట్యబ్ది సందర్భంగా పండిత సత్కారం పొందిన వారిలో నేనూ ఒకడిని. 2023లో వీరికి పద్మ భూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

Statue of Equality పేర రామానుజాచార్య విగ్రహం స్థాపించారు. అది 216 అడుగుల ఎత్తు విగ్రహం. 2014 మేలో ప్రారంభించి 2022లో పూర్తి చేశారు. భారతదేశంలో ఎత్తు విషయంలో మూడవ స్థానం (స్వర్ణ విగ్రహం). నైతిక ధర్మాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో చినజీయర్ స్వామి ప్రారంభించిన సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. అఖండ ప్రతిభావ్యుత్పత్తులు గల జీయర్ స్వామి ప్రవచనాలు శ్రోతలకు అమృతప్రాయం.

పద్మ పురస్కారాలలో తెలుగు వెలుగులు:

1954 నుండి 2024 వరకు 70 సంవత్సరాల వ్యవధిలో తెలుగువారు పలువురు ఈ పురస్కారాలు పొందడం గర్వకారణం. అవి మూడు స్థాయిలలో వుంటాయి. పద్మ శ్రీ డిగ్రీ స్థాయి. పద్మ భూషణ్ పి.జి. స్థాయి, పద్మ విభూషణ్ పి.హెచ్.డి. స్థాయి. అన్నటికి మించినది భారతరత్న. వివరాలలోకి వెళ్తే భారతరత్న ఐదుగురికి లభించింది.

1.సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 3. జాకీర్ హుస్సేన్. 4. వి.వి. గిరి. 5. పి. వి. నరసింహారావు. వీరిలో ముగ్గురు రాష్ట్రపతులు, ఒకరు ప్రధానిగా లబ్ధప్రతిష్ఠులు.

పద్మ విభూషణ్ 35 మందికి లభించింది. అంటే సరాసరిన రెండేళ్ళ కొకరికి ప్రాప్తించింది. పద్మశ్రీ – పద్మ భూషణ్ – పద్మ విభూషణ్- ఈ క్రమంలో మూడూ పొందిన వారున్నారు. అన్నదమ్మలు ఆర్కాట్ రామస్వామి, లక్ష్మణస్వామి మొదలియారు; దంపతులు చింతామణి దేశ్‌ముఖ్, దుర్గాబాయ్ ఈ గౌరవం పొందారు. సినీరంగానికి చెందిన అక్కినేని, యన్. పి. బాలసుబ్రమణ్యం, చిరంజీవి ప్రముఖులు. సంగీతంలో బాలమురళి, సాహిత్యంలో కాళోజీ, నృత్యకళాకారికి యామినీ కృష్ణమూర్తి గణనీయులు.

పద్మ భూషణ్ 85 మంది అందుకున్నారు. అందులో సాహితీ ప్రముఖులు – విశ్వనాథ, జాషువా, దేవులపల్లి, బోయి భీమన్న, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశిష్ట వ్యక్తులు.

సంగీతంలో శ్రీపాద పినాకసాణి, నూకల చిన సత్యనారాయణ; సినీరంగ ప్రముఖులు జగ్గయ్య, డి. రామానాయుడు, బాలు, భానుమతి, చిరంజీని, అగ్రగణ్యులు.

క్రీడారంగానికి చెంది సి. కె. నాయుడు (1955), పుల్లెల గోపీచంద్, పి. వి. సింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ప్రముఖులు.

అధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామికి 2023 లో లభించింది.

ఈ పురస్కారాలకు ఏ విధమైన పారితోషికం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పద్మ శ్రీ పురస్కారం పొందినవారికి బహుమతులు అందించడం అభినందనీయం. చివరగా పద్మ శ్రీ పురస్కారం పొందిన ప్రముఖుల వివరాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here