తెలుగుజాతికి ‘భూషణాలు’-38

0
10

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

[dropcap]గ[/dropcap]త 70 సంవత్సరాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 160 మంది ‘పద్మ శ్రీ’ బిరుదు పొందారు. వీరిలో ప్రముఖులను ఆయా కళా విభాగాల పరంగా క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

సంగీత ప్రముఖులు:

కర్ణాటక సంగీత విభాగంలో దాదాపు పది మంది ఈ పురస్కారం పొందారు. వీరందరూ ఆకాశవాణి సంగీత కచేరీలు చేసినవారే. తొట్టతొలి పురస్కారం 1957లో ద్వారం వెంకటస్వామి నాయుడుకు లభించింది.

ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 నవంబరు – 1964 నవంబరు):

వయొలిన్ విద్వాంసులుగా సుప్రతిష్ఠితులు. వారి కుటుంబంలో పలువురు సంగీత విద్వాంసులుగా లోకంలో ప్రసిద్ధి పొందారు, ఆయన (బెంగుళూరులో) దీపావళి రోజున జన్మించారు. విశాఖపట్టణంలో పెరిగారు. 26 సంవత్సరాలకే విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్ ఆచార్యులుగా చేరి 1936లో ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. 1938లో తొలి వయొలిన్ కచేరీ నెల్లూరులో చేశారు. సారంగి వాద్యంలో సున్నితత్వాన్ని ప్రచారం చేశారు. 1941లో మదరాసు మ్యూజిక్ అకాడమీ సంగీతకళానిధి అవార్డు; 1953లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించాయి. వీరి శతజయంతికి తంతి తపాలా శాఖ పోస్టల్ స్టాంపు 1983లో విడుదల చేసింది. వీరి కుమారులు భావ నారాయణ విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా చేశారు. వీరి కుమార్తె ద్వారం లక్ష్మి తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాచార్యులుగా పేరు గడించారు.

డా. ఎల్లా వెంకటేశ్వరరావు:

వీరికి 2008లో ‘పద్మ శ్రీ’ ప్రధానం చేశారు. ద్వారం తర్వాత చాలా కాలానికి గానీ తెలుగు వారికి లభించక పోవడం గమనించాలి. 1947 జూన్‍లో భీమవరానికి సమీపంలోని పాలకోడేరులో జన్మించారు. తరతరాలుగా వీరిది సంగీత కుటుంబం. 14 సంవత్సరాల వయస్సులో ఆకాశవాణి జాతీయ స్థాయి సోలో బంగారు పతకం పొంది రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ద్వారా అందుకున్నారు. హైదరాబాదులో 36 గంటల పాటు ఏకధాటిగా మృదంగం వాయించి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రపంచ దేశాలలో మృదంగ కచేరీలు చేశారు. వీరి కుమారుడు, కుమార్తెలు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. ఎల్లా ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా చాలా కాలం పని చేశారు.

శోభారాజు (1957):

అన్నమాచార్య కీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన తొలితరం గాయకురాలు. వీరికి 2010లో ‘పద్మ శ్రీ’ ప్రదానం చేశారు. పి.వి.ఆర్.కె. ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వున్న సమయంలో అన్నమాచార్య కళాపీఠం నెలకొల్పారు. ఆ సమయంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు ప్రభృతులు గాయకులుగా అందులో ప్రవేశించారు. 1983లో హైదరాబాదులో ‘అన్నమాచార్య భావవాహిని’ అనే సంస్థను స్థాపించి దాదాపు 15వేల మంది యువతీయువకులకు సంగీత శిక్షణ యిచ్చారు. హైదరాబాదులో హైటెక్ సిటీ సమీపంలో ప్రభుత్వం యిచ్చిన స్థలంలో అన్నమయ్యపురం నెలకొల్పి అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించారు. నేదునూరి కృష్ణమూర్తి వద్ద కర్ణాటక సంగీతం అభ్యసించారు. 1982లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రాచల రామదాసు ప్రాజెక్టులో కొంతకాలం పనిచేశారు. సంగీతం వినడం ద్వారా రోగనివారణ సాధ్యమని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో ప్రయోగాత్మకంగా నిరూపించారు. విదేశాలలో అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం తెచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ లభించింది. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ‘హంస’ అవార్డు దక్కింది. హైదరాబాదు ట్యాంక్‌బండ్ పై అన్నమయ్య విగ్రహ స్థాపనకు కృషి చేశారు. అన్నమయ్య కీర్తనలే ఊపిరిగా జీవనయానం చేస్తున్నారు. వీరి జ్యేష్ఠ సోదరి సుమిత్రా గుహా హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు. వీరికి కూడా 2010 సంవత్సరంలో ‘పద్మ శ్రీ’ లభించడం అరుదైన అంశం. ఆమె బెంగాలీని వివాహమాడారు. ఆ తర్వాత 10 సంవత్సరాల వరకు సంగీత విభాగంలో తెలుగువారు చోటు చేసుకోలేదు.

అన్నవరపు రామస్వామి (1926 మార్చి):

శత సంవత్సర శోభకు సిద్ధంగా ఉన్న రామస్వామి వయొలిన్ విద్వాంసులుగా సుప్రసిద్ధులు. బాలమురళీకృష్ణ, అన్నవరపు – పారుపల్లి రామకష్ణయ్య శిష్యులు. 1948లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభించినపుడు తొలి జట్టులో రామస్వామి నిలయ విద్వాంసులుగా చేరి 1986 వరకు ఉద్యోగ ప్రస్థానం చేశారు. 1988లో ఆకాశవారిలో ఏ-టాప్ గ్రేడ్ లభించింది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయకులకందరికీ ఆయన వాద్య సహకారమందించారు. 2021లో వీరికి ‘పద్మ శ్రీ’ లభించింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో సంగీత కుటుంబంలో జన్మించారు. వీరి అన్నయ్య గోపాలం ఘటం విద్వాంసులు. రామస్వామి విదేశాలలో కచేరీలు చేశారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరాలలో కనకాభిషేకం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళారత్న అవార్డు లభించింది. ఆరోగ్యంగా తిరిగే రామస్వామి అదృష్టవంతులు.

శ్రీమతి సుమతీ రామమోహనరావు (1950 అక్టోబరు):

నిడుమోలు సుమతి ఏలూరులో జన్మించారు. ఆమె తండ్రి రాఘవయ్య మృదంగ విద్వాంసులు. తండ్రి వద్ద ఆమె మృదంగం అభ్యపించి 10వ ఏటనే కచేరీలో పాల్గొన్నారు. ఆ తర్వాత దండమూడి రామమోహన రావు వద్ద సంగీత రహస్యాలు నేర్చుకొన్నారు. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మృదంగ విద్వాంసులు. వారినే సుమతి వివాహమాడారు. 2003లో ఆమెకు ఆకాశవాణిలో ఏ-టాప్ గ్రేడ్ లభించింది. ఆ గ్రేడ్ లభించిన తొలి మృదంగ విద్వాంసురాలు ఆమె.

దంపతులిద్దరూ కలిసి మృదంగ లయ విన్యాస కచేరీలు ప్రారంభించారు. సుమతికి 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారము, 2021లో పద్మ శ్రీ లభించాయి. మదరాసు మ్యూజిన్ ఆకాడమీ వారు ఉత్తమ మృదంగ విద్వాంసురాలిగా 1974, 1976లో రెండుమార్లు సన్మానించారు. 2015లో ఆమె తన భర్త కీ.శే. దండమూడి రామమోహనరావు స్మృత్యంజలిగా వందమంది మృదంగ విద్వాంసులతో ‘శతమృదంగ వాద్య నివాళి’ సమర్చించారు. దేశంలోని ప్రముఖ కర్ణాటక విద్వాంసుల కచేరీలలో ఆమె మృదంగ సహకారం అందించారు. పురుష ప్రపంచమైన మృదంగంలో ఆమె సాహసంతో ప్రవేశించిన ఘనత సాధించారు.

అహమ్మద్ వార్శి (1934-1989)

ఉస్తాద్ అజీజ్ అహ్మద్ వార్శి 1971లో ‘పద్మ శ్రీ’ అవార్డు పొందిన తొలి గజల్ కళాకారుడు. 1973లో ‘గరమ్ హవా’ అనే సినిమాలో ప్రముఖ ఖవాలీ ‘మౌలా సలీమ్ చిష్టి’ గానం చేశారు. ఖవాలీ గాయకులకు ఆ తర్వాత ‘పద్మ శ్రీ’ లభించలేదు. వార్శి కుటుంబంలో పరంపరగా ఖవాలీ గానం అబ్బింది. వార్శి సోదరులు – నజీర్ వార్శి. నజీర్ వార్శి సంప్రదాయ ఖవాలీ గానంలో పేరు గడించారు. వీరి తాత మొగల్ సామ్రాజ్య గాయకుడు. 1857లో హైదరాబాదు నిజామ్ – వార్శిని తన కొలువులో గాయకుడిగా ఎంచుకొన్నారు. అజీజ్ మురాదాబాద్ (ఉత్తర ప్రదేశ్)లో 1934 జూలై 17న జన్మించారు. సూఫీ సంప్రదాయం. చిన్నతనంలో కవితలు రచించారు. అలీగడ్ లోని జామియా ఉర్దూ పాఠశాలలో చదివారు. ఆయన తండ్రి చౌధరీ నజీర్ అహమ్మద్ ఖాన్ అటవీశాఖలో ఉద్యోగి. సూఫీ కవుల ధోరణిని అనుసరించిన అహమ్మద్ వార్శి ఖండాంతర ఖ్యాతి గడించారు.

శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి (1934 – సెప్టెంబరు 2024):

హరికథకు పెట్టని కోట వీరు. సామాజికాంశాలను, సంఘంలోని దురాచారాలను హరికథ గానం మధ్యలో జొప్పిస్తూ, ఎన్నో ఛలోక్తులతో చురకలు అంటిస్తూ జీవన గమనం కొనసాగించారు. 1934 ఆగస్టు 12 న అద్దంకిలో పండిత కుటుంబంలో జన్మించారు. ఒక బంధువుల పెళ్లిలో బలవంతంగా హరికథ చెప్పవలసి రావడంతో మొదలైన హారికథా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1960-80 మద్య కళాప్రియులను ఎంతగానో ఉత్తేజపరచారు. గుంటూరులో స్థిరపడ్డారు. సినిమాలు చూడడానికి అలవాటు పడ్డ జనాలకు హరికథల పట్ల ఆసక్తి పెంచారు. మారిషస్, ఇంగ్లండ్ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. హరికథా త్రిమూర్తుల పేరిట ఏటా వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధ కళాకారులను సత్కరించే సంప్రదాయం మొదలెట్టారు. ఆకాశవాణిలో ఏ-టాప్ గ్రేడ్ లభించింది. ‘పద్మ శ్రీ’ పొందిన తొలి హరికుథకు లాయనే. 2018లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2023లో పద్మ శ్రీ, 2014లో హంస అవార్డు లభించారు. ఆయన హరికథా గానం వినూత్న ధోరణిలో కొన సాగేది.

డి. ఉమామహేశ్వరీదేవి (1960 మే 21):

కృష్ణా జిల్లాలో కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో నాదస్వర విద్వాంసలు. ఆమె భర్త కళాకృష్ణ ప్రముఖ భరతనాట్యకారుడు. ఉమామహేశ్వరి 14వ ఏట హరికథలు చెప్పనారంభించారు. తెలుగులో 800, సంస్కృతంలో 600 కథలు చెప్పి కథకురాలిగా పేరుగాంచారు. కపిలేశ్వరపురంలోని హరికథా పాఠశాలను 1973లో యస్. బి. పి. బి. కె.  సత్యనారాయణరావు ప్రారంభించారు. ఆ పాఠశాలలో ఉమామహేశ్వరి విద్యనభ్యసించారు. తొలి హరికథకురాలు. ఆమెకు డాక్టరేట్ లభించింది. ఆటపాటల మేటి ఆమె. విజయనగరం సంస్కృత కళాశాలలో రుక్మిణీ కల్యాణం హరికథను తొలిసారిగా ప్రదర్శించారు. సంస్కృతంలో తొలి కథను ఉజ్జయిని లోని కాళిదాస అకాడమీలో కుమార సంభవం కథాగానం చేశారు. ఆదిభట్ల నారాయణ దాసు గారి మునిమనుమరాండ్రు ఈమె వద్ద హరికథలు నేర్చుకొంటున్నారు. నాలుగేళ్ల నిడివిలో శ్రీ సర్వరాయ హరికథా పాఠశాలలో శిక్షణను – ఉచితభోజన, వసతితో అందిస్తారు. శిక్షణానంతరం ‘హరికథాగాన ప్రవీణ’ బిరుదంతో సర్టిఫికేట్ లభిస్తుంది. 200 మందికిపైగా ఇక్కడ శిక్షణ పొంది పలుప్రాంతాలలో కథాగానం చేయడం విశేషం. ఆమె ఉమామహేశ్వరి కాదు ‘స్వరమహేశ్వరి’ అని హరికథకురాలు బి. నాగమణి వర్ణించారు. ‘అభినవ మాతంగి’ అని శృంగేరి పీఠాధిపతి ఆశీర్వదించారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here