తెలుగుజాతికి ‘భూషణాలు’-39

0
9

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

నృత్యాది కళా విభాగాలు:

[dropcap]‘ప[/dropcap]ద్మ శ్రీ’ అవార్డు గ్రహీతలైన నృత్యాది కళా విభాగాలకు చెందిన ప్రములు గత 70 సంవత్సరాలలో (1954 -2024) తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 26 మంది. వారిలో రంగస్థల నటుల వివరాలు ముందుగా ప్రస్తావిస్తాను. స్థానం నరసింహరావుకు 1957లో ‘పద్మ శ్రీ’ లభించింది.

స్థానం నరసింహారావు (1902 సెప్టంబరు – 1971 ఫిబ్రవరి):

సత్యభామ నటనతో ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మహా నటుడు. దాదాపు 40 సంవత్సరాలకు పైగా వివిధ స్త్రీ పాత్రలు ధరించిన ఘనుడు. సినిమాలలో కూడా నటించారు. స్వస్థలం బాపట్ల. 1920లో బాపట్లలో హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించడానికి చంద్రమతి పాత్రధారి రాలేదు. నరసింహారావుకు ఆ రోజు అలా లభించింది అవకాశం. దాదాపు మూడు వేల పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో వివిధ స్త్రీ పాత్రలు ధరించారు. శృంగార రస పోషణలో దిట్ట. సత్యబామ, చిత్రాంగి, రోషనార, చింతామణి, దేవదేవి, మధురవాణి పాత్రలకు జీవం పోశారు. రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) సినిమాలలో నటించారు. రంగస్థల నటుడిగా ‘పద్మ శ్రీ’ పొందిన తొలి నటులు. 1938లో రంగూన్ ప్రజలు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు. ఆకాశవాణి హైదరాచాదులో పని చేశారు.

ఆర్. నాగేశ్వరరావు (బాబ్జీ) (1949 జూన్- 2022 జూన్):

సురభి నాగేశ్వరరావుగా ప్రసిద్ధులు. శ్రీకాకుళం జిల్లా గిమిడిపేట స్వస్థలం. 2013లో ‘పద్మ శ్రీ’ గ్రహీత, నాలుగు తరాలుగా ఆ కుటుంబం రంగస్థల ప్రదర్శనలకు పేరు గాంచింది. 1973 నుండి ప్రసిద్ధ సురభి శ్రీవేంకటేశ్వర నాట్యమండలి బాధ్యతలు స్వీకరించి దేశవిదేశాలలో ప్రదర్శన లిచ్చారు. వారు ప్రదర్శంచిన ప్రముఖ నాటకాలు: లవకుశ, మాయాబజార్, అనసూయ, శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్ర, హరిశ్చంద్ర, బొబ్బిలి యుద్ధం, బాలనాగమ్మ, చింతామణి, రంగూన్ రౌడీ. కుటుంబమంతా నటులుగా వేషాలు ధరిచేవారు. బి.వి. కారంత్ దర్శకత్వంలో వెలువడ్డ ‘చండీప్రియ’ చిత్రనిర్మాణంలో తోడ్పడ్డారు. సురభి వారి రంగస్థల ప్రదర్శనలో టిక్కులు అమోఘం. బాబ్జీకి 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. సురభి కంపెనీకి డా. కె. వి. రమణాచారి ఎంతో ప్రోత్సాహం కలిపించి విదేశాలలో ప్రదర్శనలకు తోడ్పడ్డారు.

ఎడ్ల గోపాలరావు (1950):

శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గొప్ప నటుడు. సాంఘిక నాటకాలలో 6 వేలకు పైగా నటించారు. 2020లో ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు.

నృత్య సంప్రదాయం:

వేదాంతం సత్యనారాయణశర్మ (1935–2012):

కూచిపూడి నృత్య సంప్రదాయానికి చెందిన వేదాంతం సత్యనారాయణశర్మకు 1970లో ‘పద్మ శ్రీ’ లభించింది. స్త్రీ పాత్రధారణలో ఖ్యాతి గడించారు. ఉషాపరిణయంలో ఉష, భామాకలాపంలో సత్యభామ, విప్రనారాయణలో దేవసేన, మోహినీ రుక్మాంగదలో మోహిని, శశిరేఖా పరిణయంలో శశిరేఖ, గొల్లకలాపంలో గొల్లభామ పాత్రులకు జీవం పోశారు. కూచిపూడిలో జన్మించిన శర్మ దాదాపు పదివేల ప్రదర్శనలిచ్చారు. వెంకట రామా నాట్య మండలిని కూచిపూడిలో స్థాపించి ఎందరికో శిక్షణనిచ్చారు.

డా. నటరాజ రామకృష్ణ (1923-2011):

పేరిణి శివతాండవం నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన యశస్వి. ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో జన్మించారు. నృత్య గురువుగా ప్రసిద్ధులు. ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఆంధ్ర నాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్య రీతులను వెలుగులోకి తెచ్చారు. రామకృష్ణ తల్లిదండ్రులు బాలి ద్వీపానికి వలస వెళ్లారు. రామకృష్ణ హైదరాబాదులో స్థిరపడి అనేకమంది దేవదాసీ నృత్యకళాకారిణులను సంఘటితపరిచారు. 1992లో ‘పద్మ శ్రీ’ వరించింది.

కుమారి శోభానాయుడు (1956 – 2020):

వీరికి 2001లో ‘పద్మ శ్రీ’ దక్కింది. వెంపటి చిన సత్యం శిష్యురాలు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‍గా ఎందరినో తీర్చిదిద్దారు. అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు హైదరాబాదులో స్థిరపడ్డ నృత్య చూడామణి బిరుదాంకితురాలు. దేశవిదేశాలలో ప్రదర్శనలిచ్చారు. సత్యభామగా, పద్మావతిగా, చండాలికగా ఆమె నృత్యప్రదర్శన అమోఘం. దాదాపు 1500 మంది శిష్యులను తయారుచేశారు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ‘హంస’ అవార్డు గ్రహీత.

శ్రీమతి ఆనందాశంకర్ జయంత్ (1961):

వీరికి 2007లో ‘పద్మ శ్రీ’ వచ్చింది. ఇండియన్ రైల్వే సర్వీసుకు చెందిన ఈమె తిరునల్వేలికి చెందినా, హైదరాబాదులో విద్యాభ్యాసం చేశారు. 11వ ఏట చెన్నైలో కళాక్షేత్రంలో చేరి నృత్యం అభ్యసించారు. 17వ ఏట హైదరాబాదులో శంకరానంద కళాక్షేత్రం స్థాపించి పలువురికి మార్గదర్శనం చేశారు. దేశ విదేశాలలో ప్రదర్శన లిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదప్రధానం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డు 2009లో లభించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ ప్రకటించింది (2008).

2021లో గుస్సాడీ నృత్యకారుడు కనకరాజుకు ‘పద్మ శ్రీ’ లభించింది. ఆయిన 2024 అక్టోబర్ 25న మరణించారు.

గడ్డం పద్మజారెడ్డి (1967) కి 2022 లో నృత్యరంగంలో ‘పద్మ శ్రీ’ లభించింది కూచిపూడి నృత్య సంప్రదాయంలో మిన్న. ‘కాకతీయం’ నృత్య సంప్రదాయాన్ని ప్రచారం చేశారు.

చిత్రకళాతపస్యులు:

డా. యస్. వి. రామారావు (1936):

గుడివాడలో జన్మించిన రామారావు క్యూబిస్ట్ పెయింటింగ్ కళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. చికాగోలో స్థిరపడ్డ వీరికి 2001లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1955లో డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అడ్వాన్స్ ట్రైనింగు పొందారు. కామన్ వెల్త్‌ ఫెలోషిప్‍తో 1962లో లండన్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలలో బోధన చేశారు. పికాసో, జాక్సన్, తదితర అద్భుత కళాకారులతో కలిసి చిత్రకళా ప్రదర్శనలిచ్చారు. ప్రముఖ మ్యూజియంలలో వీరి చిత్రకళ ప్రదర్శితమవుతోంది. రామారావు రచయిత కూడా. కామన్వెల్త్ అత్యత్తమ అవార్డు 1965 లో అందుకున్న ఘనులు.

అదే రీతిలో తిరుపతిలో జన్మించిన పన్నూరు శ్రీపతికి (1943) 2007లో చిత్రకళలో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. దాదాపు వెయ్యిమంది యువతీయువకులకు తర్పీదు యిచ్చారు. 2008లో శిల్పగురు అవార్డు లభించింది.

కలాల లక్ష్మాగౌడ్ (1940) గ్రామీణ వాతావరణాన్ని ప్రతిభచించే గ్లాస్ పెయింటింగ్‍లో ప్రసిద్ధులు. మెదక్ జిల్లా లక్ష్మాపూర్‌లో జన్మించారు. 2016లో వీరి ప్రతిభకు ‘పద్మ శ్రీ’ పట్టం గట్టింది. బరోడా లోని మహారాజా శాయజీరావు విశ్వవిద్యాలయంలో మురల్ పెయింటింగ్స్ అద్యయనం చేసి (1963-65) Fine Art PRINT లో పట్టా సాధించారు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతిగా వ్యవహరించారు.

ఎక్కాల యాదగిరి రావు హైదరాబాదు పాతబస్తీలో జన్మించారు. శిల్పకళను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో అభ్యసించారు. వీరి లోహ మిథున శిల్పం ఢిల్లీలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వారు కొనుగోలు చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం రూప శిల్పి. ఆయన గాంధీ, నెహ్రు, దుర్గాబాయ్ దేశముఖ్ విగ్రహ శిల్పి. 2017లో ‘పద్మ శ్రీ’ వరించింది.

దళవాయి చలపతిరావు (1936) సంప్రదాయ తోలుగొమ్మలాట కళాకారుడు, అనంతపురం జిల్లా నిమ్మలకుంట వాసి. 2020లో ‘పద్మ శ్రీ’ లభించింది. 40 ఏళ్లుగా తోలుబొమ్మల ప్రదర్శన లిస్తున్నారు. 1988లో జాతీయ అవార్డు, 2016 లో కళారత్న లభించాయి.

తాడేపల్లి వెంకన్నకు 1992లో ‘పద్మ శ్రీ’ లభించంది.

వృత్తి కళాకారులు:

గజం గోవర్దన (1949):

ఇక్కత్ అద్దకంతో చేనేత పరిశ్రమలో ఖ్యాతి గడించి 2011లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. నల్గొండ జిల్లా పుట్టపాకలో జన్మించారు. ‘తేలియా రుమాల్’ సంప్రదాయ పోషకులైన వీరు ఆంధ్రదేశంలో 500 మంది చేనేతకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. యునెస్కో ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. వీరి ‘మురళి శారీ ఎంపోరియం’లో సోనియాగాంధీ, షీలా దీక్షిత్, షబనా అజ్మీ వంటి ప్రముఖులు షాపింగ్ చేశారు.

గజం అంజయ్య (1955) చేనేత డిజైన్‍ల రూపశిల్పి. వీరిది కూడా పుట్టపాక గ్రామం. 1970 నుండి టెక్స్‌టైల్ డిజైనర్‌గా ప్రావీణ్యం సంపాదించారు. శైవ వాఙ్మయంలోని 16 పవిత్ర చిహ్నలతో నేత చీరలు రూపొందించారు. ఎందరో నేతపనివారికి శిక్షణ నిచ్చారు.

చింతలపాటి వెంకటపతి రాజు (1963) విజయనగరం జిల్లా జొన్నవలస వాసి. ఏటికొప్పాక ఆటబొమ్మలకు ప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతులతో బాటు 2023లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు.

2024లో ఐదుగురు తెలంగాణీయులకు ‘పద్మ శ్రీ’ లభించింది.

ఏ. వేలు ఆనందాచారి (1952):

సాంప్రదాయక దేవాలయ శిల్పకళాకోవిదులు. చిత్తూరు జిల్లాకు చెందిన వీరు తిరుపతి దేవస్థానం వారి శిల్పకళాశాలలో చదివారు. రాష్ట్ర ప్రభుత్వ స్థపతిగా 2009లో నియమితులయ్యారు.

దాసరి కొండప్ప (1958):

బుర్రవీణ సంప్రదాయాన్ని నిలబెట్టిన చివరి వ్యక్తి, నారాయణపేటకు చెందిన వ్యక్తి. 50 ఏళ్లుగా తత్వాలు గానం చేస్తున్నారు.

గడ్డం సమ్మయ్య (1957) జనగాంకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు. చిందు యక్షగాన కళాకారుల సంఘం స్థాపించారు.

సకిని రామచంద్రయ్య (1963-2024) తెలంగాణాకు చెందిన జానపద కళాకారుడు. కోయజాతికి చెందిన చరిత్రను మౌఖిక సంప్రదాయంలో ప్రచారం చేసినందుకు 2022లో ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు. కంచుమేళం – కంచు తాళం అనే గిరిజన సంప్రదాయానికి ఆద్యులు.

2022లో నాగర్ కర్నూలుకు చెందిన కిన్నెర వాద్యకారుడు, దర్శనం మొగిలయ్య (1951)కు ‘పద్మ శ్రీ’ లభించింది. ఎక్కడో మారుమూల గ్రామాలలోని కళాకారులను ప్రభుత్వం గుర్తించింది.

గోసవీడు హసన్ (1928 – 2021) భద్రాచల ఆలయ నాదద్వర విద్వాంసుడు, ‘పద్మ శ్రీ’ అందుకున్నారు.

జొన్నలగడ్డ గురప్ప శెట్టి (1937) శ్రీకాళహస్తికి చెందినవారు. కలంకారీ వృత్తి నిపుణులు. భారత రత్నమాల, భాగవత మణిమాల, వ్రాతపని (కలంకారీ) గ్రంథాలు రచించారు. వీరికి 2008లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here