తెలుగు కథ – ఏరిన ముత్యాలు 4

5
13

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

సమాజ గమనంలో వంకరదారులకి ఒక సాక్ష్యం “‘ఎర’ చందనం” కథ:

[dropcap]స్మ[/dropcap]గ్లింగ్, గేంబ్లింగ్, డెన్, డాన్, సుప్రీం, మాస్, బాస్, మాఫియా ఈ పేర్లన్నీ వెండితెరపై సాధారణ సినీ ప్రేక్షకులకు బాగా పరిచితమైనవే. కానీ, నిజజీవితంలో, క్షేత్ర స్థాయిలో స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో, దాని పథక రచన ఏమిటో తెలీదు. దాని వెనుక ఎలాంటి మూలశక్తులూ, పెద్దసారులూ, మధ్యవర్తులూ, దళారులూ ఉంటారో, ఆ చదరంగపు ఆటలో పావులయ్యే బలహీనుల ఛిద్ర జీవనవిషాదం ఎంత దారుణంగా వుంటుందో – చాలామందికి తెలీదు. తెలుగు కథల్లో కూడా ఇలాంటి దృశ్యీకరణ వివరంగా జరగలేదు.

ఆ వివరాల్ని విశదంగా చెబుతూ, వాస్తవ జీవనచిత్రణ చేసిన కథ ఈసారి ‘సంచిక’ పాఠకులకి పరిచయం చేస్తున్నాను. కథ పేరు- “‘ఎర’ చందనం”. శేషాచలం అడవులనుంచీ ఎర్రచందనం దుంగలు ఎలా స్మగ్లింగ్ అవుతాయో, ఆ దుష్టక్రీడలో అన్యాయంగా బలి అయ్యే జీవుల విషాదం ఎలా ఉంటుందో చూపింది ఈ అపూర్వకథ. రచయిత అమర్. తెలుగు పాఠకులకు అంతగా పరిచయంకాని వాసిగల కథకుడు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి అపూర్వ కథల్నే రాశారు. ఈ “‘ఎర’ చందనం” కథ-విశాలాక్షి సాహిత్య మాసపత్రిక-సెప్టెంబరు 2017 సంచికలో వచ్చింది.

‘రేపటివారం నరకాల్సిన చెట్లకు వేసిన టాకా గుర్తుల్ని గమనిస్తూ వాటినుంచి కారుతున్న ఎర్రటి జిగటను చేతితో తాకి దుంగల నాణ్యతను పరిశీలిస్తున్నాడు ముత్తు స్వామి’ అంటూ మొదలౌతుంది కథ. మేస్త్రీ ప్రభాకరం మాట కలుపుతాడు. ఇద్దరూ-దుంగల రవాణాలో సాదకబాధకాల్నీ, పెద్దసారు వారు కోపగించుకోవటం గురించీ, రవాణాకి తెలివిగల డ్రైవర్లు దొరక్కపోవటం గురించీ మాట్లాడుకుంటున్నారు.

అసలీ వ్యవహారం విధానం ఎలా ఉంటుంది?

ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చెయ్యడానికి చాలా పకడ్బందీ పథకాలను స్మగ్లర్లు అమలుపరుస్తారు. అన్ని శాఖల అధికారులకు పర్సంటేజ్‌లను స్మగ్లర్లు అందిస్తారు.

కానీ అధికారుల నిజాయితీకి కొలమానం లెక్కలు. అంటే వారు పట్టుకున్న దుంగలు, లేక కేసులు, తమ విధి నిర్వహణా నివేదికలను ప్రతీ వాటా ప్రభుత్వానికి అందజేయాలి. అందుకే స్మగ్లర్లపై నామమాత్రపు దాడులను నిర్వహిస్తూ, కేసులను నమోదు చేస్తుంటారు. ఇలాంటి దాడులతో స్మగ్లర్లకు పెద్దఎత్తున ఆస్తినష్టం, కీలకమైన అనుచరుల అరెస్టులు జరగకుండా అవినీతి అధికారులు అండగా నిలుస్తారు. ఆ పథకంలో భాగంగా స్మగ్లర్లకే ఆ బాధ్యతలను అప్పగించి అరెస్టుల కోసం అధికారులు ఎదురుచూస్తుంటారు. తేలిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆకాంక్ష ఉన్న యువకులను, కుటుంబబంధాలు లేనివారై, వీరికి ఏమైనా పట్టించుకునే వారే లేనటువంటి వ్యక్తులను స్మగ్లర్స్ టార్గెట్ చేసుకుని తమ బృందంలో చేర్చుకున్నట్లు నటిస్తారు. సుమారు వంద స్మగ్లింగ్ వాహనాలను సరిహద్దు దాటించినందుకు ఒకటి లేదా రెండు వాహనాలను అధికారుల లెక్కలకోసం కావాలని అప్పజెపుతారు. అంటే అధికారులకు లంచంతో పాటు కేసులను కూడా స్మగ్లర్లే అందిస్తారన్నమాట. ఆ కేసులపాలయ్యే డ్రైవర్లను ఏ స్మగ్లరూ, దళారీ, మేస్త్రీ పట్టించుకోరు. అలా ఎందరో అమాయకులు అత్యాశ, అమాయకత్వాలతో ఖైదీలుగా మారి జీవితాలను జైలు నాలుగుగోడల మధ్య కరిగించేసుకుంటూ, కుమిలిపోతూ జీవచ్ఛవాల్లా మిగులుతారు.

ఇదిగో-అలాంటి ఒక ‘ఎర’- సలీం కథే ఇది.

బెట్టింగులో పైసలు సంపాదించుకుంటూ, అల్లరిచిల్లరగా తిరుగుతున్న సలీమ్‌ని నెల్లూర్లో మదీనా కేఫ్ దగ్గర గమనించారు, సిరాజ్, రాజన్ అనే దళారులు. సులభంగా డబ్బు సంపాదించే మార్గం చూపుతామని పెద్దసారు దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేస్తారు. ఆ అక్రమరవాణా సాలెగూడులో చిక్కుకున్నాడు సలీమ్.

సలీమ్‌కి పిన్నీ, ఇద్దరు చెల్లెళ్లూ వున్నారు. రంజాన్ పండుగ రాబోతోంది. చెల్లెళ్లు కొత్త దుస్తుల కోసం అన్నని పోరుతున్నారు. తన జల్సాలకీ కావాలి. అందుకు మార్గం కనిపించింది. అలా ఆ రొంపిలో దిగబడ్డాడు సలీమ్.

డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్ వచ్చు. అది చాలు అన్నారు. నీకేమైనా అయితే మేం చూసుకుంటాం అని నమ్మబలికారు. మొదటి ట్రిప్పులో వాళ్లు దగ్గరుండి ‘ఆపరేషన్’ని విజయవంతంగా పూర్తి చేయించారు. ఐదువేలు చేతిలో పడినై. సలీమ్ ఖుషీ, ఖుషీ! చెల్లెళ్లకు పైసలిచ్చాడు. వాళ్లూ ఖుషీ!

రెండవ ట్రిప్పులో చాలా వాహనాలు చెక్ పోస్ట్ దాటి వెళ్లిపోయాయి. సలీమ్ వాహనాన్ని పట్టుకున్నారు. అతనితో వచ్చిన వారంతా చూస్తూ ఊరుకున్నారు. ఫర్వాలేదు మేం విడిపిస్తాం లెమ్మని బోలు మాటలు పలికారు. వాహనాన్నీ, అతన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కేసు తతంగం! ఐదేళ్ల జైలు శిక్ష పడింది సలీమ్‌కి. ఏ నాథుడూ వచ్చి ఏవిధంగానూ ఆదుకోలేదు.

శిక్ష ననుభవించాడు సలీమ్. కథ ముగింపులో ‘తప్పు చేశాను, నన్ను విడిపించండి సార్. ఖైదీ నెం 114. బ్యారెక్ నెంబరు 3. షేక్ సలీమ్ బాషా’ అనే అర్థం అయ్యీకాని అక్షరాలున్న కాగితాన్ని ఎస్‍.ఐ. కిచ్చి చేతులు కట్టుకు నిలబడ్డాడు. ‘ఆ కాగితాన్ని మడిచి దూరంగా విసిరికొట్టాడు ఎస్.ఐ. జీపు బయల్దేరి అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. సమాధానం కోసం అరుస్తూ జీపు వెంటపడ్డాడు ఆ పిచ్చివాడు!’

స్వతంత్ర భారతంలో అభివృద్ధి తీరూ, దానికి సమాంతరంగా అవినీతి పెచ్చుపెరిగిన తీరూ, వాటి పర్యవసానాలూ-వీటిని విశ్లేషించుకుంటే, ‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడిన దుస్థితే’! అమాయకుల మీద ‘ఈజీ మనీ’ అనే రంగుల వలలు విసరుతున్న పెద్దల గాలాలకి ఈ సలీమ్ లాంటివారు ఎప్పుడూ ‘ఎర’లే అవుతున్నారు. “‘ఎర’ చందనం” కథలో ‘రియలిజం’ సాహిత్య ధోరణి ప్రతిఫలనం ఉంది. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మనుషుల బలహీనతలు, వాటిని తమ స్వప్రయోజనానికి తెలివిగా వాడుకొనే పెద్దసారుల బలవత్తర ‘డబ్బు’ చేసే విన్యాసం – వీటి వాస్తవ చిత్రణ ఉన్నది. మనం రోజూ లేక వారం వారం చదివే సాధారణ కథలకు భిన్నమైన ‘జీవితం’ గల పాత్రల పరిచయం వుంది. ఆ పాత్రల కార్యకలాపాల సంకీర్ణమైన ప్రక్రియ వివరణ కూడా ఉన్నది. కథానిక ఏం చెప్పాలో, పాఠకుల్లో దేని గురించి తార్కిక ఆలోచనా వేదనని రగిలించాలో దాన్ని చెప్పిన రచయిత చిత్తశుద్ధి ఉన్నది. అతని చైతన్యం ఉన్నది. ఇతివృత్తంలోనూ, దాన్ని అందించిన వివరణలోనూ స్పష్టత, కథాత్మక వాస్తవికతా ఉన్నాయి. అందుకూ ఈ కథ మన అపూర్వ కథగా, ఏరిన ముత్యంగా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here