తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు – పుస్తక పరిచయం

0
8

[dropcap]మ[/dropcap]హాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శాలను సిద్ధాంతాలను ప్రతిబింబించే తెలుగు కథల సంకలనం “తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు”. ఇందులో ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘స్వదేశీ’, ‘అస్పృశ్యత నివారణ’, ‘వ్యక్తిత్వం’, ‘దేశవిభజన’ అనే విభాగాలలో మొత్తం 30 కథలు ఉన్నాయి.

***

“సత్యాహింసలు ప్రధాన సాధనాలుగా మహోద్యమం నడపటమే కాక సాంఘిక రాజకీయ జీవనాల్లో వాటి ప్రాముఖ్యాన్నీ, ప్రాశస్త్యాన్నీ అచరణ ద్వారా ప్రకటించి చూపిన మహాత్ముడు భారతీయ సాహిత్య సర్వస్వాన్ని ప్రభావితం చేసిన యుగపురుషుడు. అటువంటి గాంధీజీ ప్రభావం పడిన కథాసాహిత్యాన్ని కొంతవరకైనా ఆధునిక పాఠకలోకానికి అందించాలనే ఆకాంక్షతో, గాంధీ జన్మించి 150 ఏళ్ళ సందర్భంగా గాంధీజీ కేంద్రంగా వచ్చిన కథలు, సమాజంపై గాంధీజీ ప్రభావాన్ని ప్రతిబింబించే కథలు, ఆధునిక సమాజం ఏ రకంగా గాంధీజీ ప్రభావానికి దూరమవుతూ తత్ఫలితంగా నష్టానికి గురవుతూ గాంధీజీని ఎలా గుర్తుచేసుకుంటుందో చూపించే కథలు ఒక సంకలనంగా తీసుకొస్తే బాగుంటుందనిపించింది. శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గార్లు నా అభ్యర్థన నంగీకరించి గాంధీజీ భావాల ప్రభావంతో సమాజానికి సందేశ రూపంలో, తెలుగు కథకులు రచించిన కథలను సంకలనంచేసి అందించారు. ఇందుకు ‘గాంధేయ సమాజ సేవా సంస్థ’ తరఫున ధన్యవాదాలు” అన్నారు మండలి బుద్ధప్రసాద్ తమ ‘నివేదన’లో.

***

“కథలను స్వీకరించటం ఆరంభించిన తరువాత, ఒక్కో కథ చూస్తూంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ‘కథ సమకాలీన సమాజానికి దర్పణం పడుతుంది’ అనటానికి ఈ సంకలనంలోని కథలు నిదర్శనం. 1921లోని కథ నుంచి 2018వరకూ వచ్చిన కథలలో మా దృష్టికి వచ్చిన కథలను సేకరించి, ఆ కథలలో మహాత్ముడిని దర్శించాలని మేము చేసిన ప్రయత్న ఫలితం ఈ సంకలనం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంకలనం తయారు చేయటం మరోసారి మేము మహాత్మాగాంధీని గురించి తెలుసుకోవటం కూడా.

మహాత్ముడి సమకాలీకులుగా తెలుగు కథకులు అత్యద్భుతమైన రీతిలో స్పందించారు. ఆనాటి సమాజంలో మహాత్ముడి ద్వారా కలిగిన చైతన్యాన్ని, ప్రజల మనస్తత్వాలను అతి చక్కగా పరిశీలించారు. గాంధీజీ అనంతరం కూడా ఈనాటికీ గాంధీజీ ప్రభావం భారతీయ సమాజంపైన ఉంది అని నిరూపిస్తూ ఈనాటికీ ఆయన ఆదర్శాలను ప్రతిబింబిస్తూ, ఉత్తమత్వానికి గాంధీజీని గీటురాయిగా చూపిస్తూ కథకులు కథలని సృజిస్తున్నారు.

ఈ సంకలనంలోని 30 కథలను రెండు భాగాలుగా వర్గీకరించాము. మొదటి విభాగంలోని కథలు స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. రెండవ విభాగంలోని కథలు గాంధీజీ అనంతర భారతంలోని పరిస్థితిని ప్రదర్శిస్తాయి.

ఈ సంకలనంలోని కథలు మహాత్మాగాంధీ గురించి ఈనాటి సమాజానికి అవగాహనను కలిగించి, అపోహలు తొలగించి, చేరువకు చేరిస్తే అంతకన్న కావలసింది మరొకటి లేదు” అన్నారు సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ గారు తమ ‘మనవి’లో.

***

తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు (కథా సంకలనం)

సాహితి ప్రచురణలు
పేజీలు: 280
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here