తెలుగు కవుల కుకవినిందలు

3
12

[box type=’note’ fontsize=’16’] “కుకవులు తమంతట తాము ఏవిషయమూ తెలుసుకోలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా సహృదయతతో గ్రహింపలేరు” అంటూ “స్థాలీపులాక న్యాయంగా మహాకవుల కుకవినిందా నిర్వహణ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం” అని తెలుగు కవుల కుకవినిందల గురించి వివరిస్తున్నారు దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. [/box]

[dropcap]తె[/dropcap]లుగు కవులు కావ్యరచనా సందర్భాల్లో పూర్వరంగ ప్రాయాలైన అవతారికలకు ఎంతో ప్రాధాన్యాన్నిచ్చి ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించారు. ఆ అవతారికలు ఆయా కావ్యాల స్వరూప స్వభావాల్ని సూత్రప్రాయంగా నిరూపిస్తాయి. అవి తత్కావ్యరచనా కాల నిర్ణయానికి ఆధారభూతాలవుతాయి. అటువంటి అవతారికల్లో ఉండే విభిన్న విషయాల్లో కుకవి నిందలు విశిష్ట స్థానాన్ని అలంకరిస్తాయి. సంస్కృత అలంకారికులు కావ్యాదిని దేవత నమస్కృత గాని వస్తునిర్దేశం గాని ఉండాలనీ ఖలాదికనింద సత్పురుష వర్ణనము కూడా రచింపబడాలని ఇలా వివరించారు.

“అదౌనమస్క్రియా…శీర్వా వస్తునిర్దేశ ఏవవాక్వచిన్నిందా ఖలాదీనాం సతాం చ గుణవర్ణనమ్ “

ఈ లక్షణంలోని ఖలాదిక నిందని కావ్యారంభంలో చాలా తక్కువమంది సంస్కృత కవులు నిర్వహించారు. మాళవికాగ్నిమిత్ర నాటక ప్రస్తావనలో కవి కులతిలకుడైన కాళిదాసు రచించిన  –

“పురాణమిత్యేవ న సాధు సర్వం న చాపి కావ్యం నవమిత్య వద్యమ్

సంతః పరీక్ష్యాన్యతరద్భ జంతే మూఢః పర ప్రత్యయ నేయ బుద్ధిః “

అనే శ్లోకంలో పై లక్షణం కొంతవరకూ ప్రవర్తించిందని చెప్పవచ్చు. బుద్ధిమంతులు స్వయంగా పరీక్షించి గుణదోషాలను బట్టి మంచి కావ్యాన్ని సమాదరిస్తారు. ముఢులు కేవలం ఇతరులు చెప్పుమాటల్ని బట్టి ప్రవర్తిస్తారని కాళిదాసుని అభిప్రాయం. భట్టబాణుడు కాదంబరీ పూర్వార్ధంలో ఖలునివాక్కు సర్పవిష సదృశ్యమై ముఖంలో ఎప్పుడూ సుదుస్సహంగా ఉంటుందనీ ఆకారణంగా వైరాన్నిపొందే ఖలుని వలన అందరికీ భయం కలుగుతుందనీ ఇలా పేర్కొన్నాడు.

“అకారుణావిష్కృత వైరదారుణా దసజ్జనా త్కస్య  భయం న జాయతే

విషం మహాహేరివ  యస్య దుర్వచః సుదుస్సహం  సంనిహితం సదాముఖే “

ఖలస్వభావాన్నీభ దానితోపాటు సజ్జన ప్రశంసనీ మరి రెండు శ్లోకాల్లో కూడా దృష్టాంత పూర్వకంగా బాణుడు రచించాడు. కానీ ఈ ఖలనిందకీ సాహిత్యానికి ఎటువంటి సంబంధమూ కనబడడం లేదు. కావ్యవ్యాఖ్యాతలలో ధనపతి సూరి శంకర విజయ వ్యాఖ్యా రచనారంభంలో తన వ్యాఖ్యానం నిర్విఘ్నంగా నెరవేరడం కోసం గణేశాదులతో  పాటు విమత్సరులైన పండితుల్ని కూడా నమస్కరించినట్లు

“ నుమశ్రీ బాలగోపాల తీర్థన్ వ్యాసముఖాన్మునీన్

విఘ్నహర్తౄన్గణేశాదీన్ పండితాంశ్చ విమత్సరాన్ “

అని రచింపబడింది. ఇందులోని మత్సర గ్రస్తులైన పండితుల్ని ప్రార్థించడం ఖలాదిక నింద గావించాలన్న ఆలంకారిక లక్షణానుగుణంగా ఉందని సమన్వయింపవచ్చు.వట్టిఖలనింద కంటే ఇటువంటి దుష్పండిత నిరసనంగుణోత్కర్షకంగా వుంటుంది. కాళిదాస మహాకావ్య వ్యాఖ్యాత అయినా మల్లినాథసూరి తద్వ్యాఖ్యాన రచనాదిని కాళిదాస భారతి కువ్యాఖ్య అనే విషంచేత మూర్చిల్లిందని “ భారతీ కాళిదాసస్య కువ్యాఖ్యా విషమూర్చితా “ అని చెప్పడంలో కూడా ఖలనింద నిర్వహింపబడిందనవచ్చు.

ఈ ఖలనిందని కుకవినింద గా మార్చి ఆంధ్రకవి శేఖరులు చక్కని సాహిత్య సంబంధాన్ని కల్పించారు. తన్నిర్వహణ సందర్భంలో అపూర్వ రమణీయమైన బావ సంపత్తిని ప్రదర్శించారు. వాళ్ళ కుకవినిందా వైశిష్ట్యాన్ని నిరూపించేటప్పుడు కుకవి అనే పదాన్ని వాళ్లు ఏయర్థంలో ప్రయోగించారో ముందుగా పరిశీలించడం అత్యంతావశ్యకం. కుకవి అంటే కుత్సితుడైన కవి అని అర్థం. కవి అనే పదం కేవలం కవిత్వం చెప్పేవాడని మాత్రమే కాకుండా పాండిత్యం కలవాడు అనే అర్థాన్ని కూడా బోధిస్తుంది. విద్వాంసుడు, పండితుడు కవి అనే పదాలు సమానార్థకాలుగా లింగాబట్టీయంలో పేర్కొనబడ్డాయి. ఆంధ్ర సాహిత్యంలో అర్థాల్లో ప్రయోగాలు కూడా ఉన్నాయి. నన్నయభట్టారకులు “ సారమతింగవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో నారసి….” అనీ నన్నేచోడ మహాకవి దుష్కవిహృత్సరోజవమున్ భంజింపుచున్…”అనీ కవి అనే పదాన్ని పండితుడు అనే అర్థంలో ప్రయోగించారు. కవిపండిత విభాగం కేవలం ఆధునికం. పూర్వం కవులందరూ పండితులే పండితులందరూ కవులుగా పరిగణింపతగ్గవాళ్ళే. ఆంధ్ర సాహిత్యంలోని కుకవినిందల్ని నిశితంగాపరిశీలిస్తే మహాకవులు కవి అనే పదాన్నిమహాకావ్య గతమైన గుణగణాన్ని అసమర్ధతచేతవో మాత్సర్యంచేతనో గ్రహింపకజాలక గోరంతదోషాల్ని కొండంతలుగా గుణించి విమర్శించే దుష్పండితుడు అనే అర్థంలోనూ, ప్రతిభాహీనుడై “గురువు లఘువు చేయ గుదియించి కుదియించి లఘువు గురువు చేయ లాగి లాగి “ కవిత్వం చెప్తూ పూర్వకవుల పదార్ధాలనే తమవిగా చాటుకుంటూ తమ కవిత్వమే మహా కవిత్వంగా స్వయం ప్రశంస చేసుకునే దుష్కవి అనే అర్థంలోనూ ప్రయోగించారని నిర్ణయింపవచ్చు. ఇక స్థాలీపులాక న్యాయంగా మహాకవుల కుకవినిందా నిర్వహణ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.

కవిరాజశిఖామణి బిరుదాంకితుడైన నన్నెచోడుడు కువిమర్శచేసే దుష్పండితుడు అనే అర్థంలో కుకవినిందని నిర్వహించిన విధం అత్యంత సహజంగా ఉంది. కుకవి మహాకవుల కావ్యాలలోని గుణాన్ని దోషంగా పరిగణిస్తాడనీ దోషాన్ని గుణంగా సమర్ధించడానికి ఆశక్తుడనీ ఆ రాజకవి వివరించి దృష్టాంతంగా కుక్క దొంతుల్ని త్రోసి వేస్తుందే గాని పూర్వపు రీతిని పేర్చలేదని ఇలారచించాడు.

“ చెనసి గుణమైన దోషంబు సేయనేర్చు గుకవి కృతులందు దోషంబు గుణము సేయ

నేరడది యట్ల దొంతులు సేరి నాయి దోర్పగా నేర్చు గాకది యేమి సేర్ప నేర్చు “

ఈ శునకౌపమ్యం కొ‌‌రవిగోపరాజు కృతమైన సింహాసనద్వాత్రింశిక లో కూడా కనబడుతుంది. కుకవులు మృదు మధురములైన కావ్యాల మర్మాన్ని గుర్తింపజాలరనీ గుణ నిరాకరణోద్ఘాటనానికే సమర్ధులని గోపరాజు ఇలా అభిప్రాయపడ్డాడు.

“ బావరసానుకూల మృదుపాక పదార్ధ సమృద్ధి లోక సం

భావన నొప్పు కావ్యముల మర్మము గానగ లేక దుర్మతుల్

కావన గాని యేట్టి కడగట్టిడి జెప్పగా నేర రెల్లెడం

ద్రోవనగాక కుక్కలకు దొంతులు వేర్వగ నేర్పు గల్గునే.”

కుకవులు ఏ కావ్యాన్ని ప్రశంసించినా ఆ కావ్యానికి ఖ్యాతి కలగదని వారు మెచ్చుకోకపోయినా ఆ కావ్యానికి తక్కువ తనం రాదని వారు ఉపేక్షామాత్రదండ్యులనీ పింగళిసూరన కళాపూర్ణోదయం లో పేర్కొన్నారు. హాస్యానికైనా కుకవుల్ని అజాగళస్తనసగోత్రులని ఇలా చమత్కారించాడు.

“మెచ్చియొక్కింత గౌరవము మెచ్చక యుండి మెచ్చకయుండి లఘుత్వలేశమున్

దెచ్చుటకున్ సమర్థులె? కృతిక్రియకుం గుకవిత్వ గర్వితుల్

తచ్చరితం బుపేక్ష కుచితం బగుగాక నగంగనైనా వా

క్రుచ్చి యజాగళస్తన సగోత్రుల వారల నెన్న నేటికిన్.’’

కావ్య ప్రాశస్త్యం విద్వత్ప్ర శంసల్ని ఆశ్రయించి ఉంటుంది “ ఆపరితోషాద్విదుషాం నసాధుమన్యే ప్రయోగ విజ్ఞానం ‘’ అని కదా కాళిదాసోక్తి. ఆపండితులెందర కావ్యాన్ని శ్లాఘించినా కావ్యానికి వైశిష్ట్యం కలగదు. అలాగే వాళ్లు నిందించిన కావ్యోత్కర్ష తగ్గిపోదు. ఈ అనుభవసిద్ధమైన పరమసత్యాన్ని పింగళి సూరన్న చమత్కరించినవిధం మనోహరంగా ఉంది. అజాగళస్తనసగోత్రు లనడంలో కుకవుల్లో పాండిత్యమూ సరసత్వమూ లేశ మాత్రంగా అయినా ఉండవనే విషయం వెల్లడవుతోంది. పింగళి సూరన్న రాఘవపాండవీయం లో కుకవులు తమకు తోచిన విధంగా తప్పొప్పులు నిర్ణయించి మహాకవుల పాఠాల్ని దిద్దేస్తారని ఇలా సూచించాడు.

“ఈవిధి నభీష్ట సిద్దికి దైవత కవి నుతి యొనర్చి తప్పొప్పు మదిన్

భావించి దిద్దకుండను దేవానాం ప్రియుల మొక్కి తెలతుగుకవులన్ ‘’

ఇందులోని చమత్కృతి అంతా దేవానాం ప్రియులు అనే చోటా ఇమిడివుంది. కుకవుల మౌర్ఖ్యం బాగా వ్యక్తం చేయబడింది.

కుకవుల సమగ్ర స్వభావాన్ని సంగ్రహంగా తెలిపిన ఘనత కంకంటి పాపరాజు కి చెందుతుంది. ఉత్తర రామాయణంలో ఆకవిచంద్రుడు కుకవుల్ని ఇలా నిందించాడు.

“సరసత దామునుం దెలియజాలరు చెప్పిన నీసులేక యా

దరణహించి యూకొనరు తప్పులే వట్టుదు రొప్పుగన్న మె

చ్చరు వెడయుక్తులెన్నుదురు శక్తులు గారొకడైన నింపు చే

కుర రచియింప నెట్టి చెడుగుల్ విననోర్తురె సత్ప్రబంధముల్ ‘’

కుకవులు తమంతట తాము ఏవిషయమూ తెలుసుకోలేరు.  ఒకవేళ ఎవరైనాచెప్పినా సహృదయతతో గ్రహింపలేరు. ఇతరుల దోషాల్ని ఎన్నడంలో్ సిద్ధహస్తులు. మనోజ్ఞంగా ఒక కావ్యం నైనా రచింపలేరు. అట్టి నీచులు సత్పబంధాల్ని వినగలుగుతారా అని పాపరాజు తీవ్రంగా కుకవుల్ని అదిక్షేపించాడు. కావ్య పరిశీలకులకు ముఖ్యంగా ఉండవలసిన గుణం సహృదయత. అది లేనివాడు ఆ వ్యక్తికి కావ్య గుణ గ్రహణ యోగ్యత లేనట్లే అది ఉన్నవాడు కావ్యాన్ని సమగ్రంగా సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఒకవేళ తమ శక్తి సామర్థ్యాలు చాలకపోతే ఇతరుల సహాయాన్ని ఆపేక్షించి అయినా కావ్యాన్ని అర్థంచేసుకోవాలన్న సంకల్పం కలుగుతుంది. కు కవుల్లో ఇలాంటివేవీ ఉండవని పాపరాజు ప్రవచించినవిధం సహజ సుందరంగా ఉంది.

ఇలా ఎందరో కవులు ఎన్నెన్నో భావాలతో కుకవుల్ని దుష్పపండితులైన కువిమర్శకులు అనే అర్థంలో సుదీర్ఘంగా నిందించారు. ఇంకా మహాకవులు కుకవుల్ని అసమర్థులైన కవులుగా నిందించిన రీతిని పరామర్శిద్దాం.

కుకవులు కావ్యాన్ని రచించడంలో ఎంతటి శక్తిహీనులో నిర్వచనోత్తర రామాయణంలో తిక్కనసోమయాజి వివరించిన పద్ధతి గణనీయంగా ఉంది. కుకవులు సందర్భ సముచితంగా పదాలు ప్రయోగింపలేరనీ రసభంగం చేస్తూ వ్యవహార విదురాలయి పాతబడిన మాటలనే నేర్పుగా చెప్పబోయి లోకుల పరిహాసానికి గురవుతారనీ చెప్తూ దుర్విటులతో పోలుస్తూ కవిబ్రహ్మ ఇలా అధిక్షేపించాడు.

“ పలుకుల పొందు లేక రసభంగము సేయొచు బ్రాతవడ్డమా

టల దమనేర్పు చూపి యొకటన్ హృదయం భలరింప లేకయే

పొలమును గాని యట్టి క్రమముం  దమ మెచ్చుగ లోకమెల్ల న

వ్వుల బొరయం జరించు కుకవుల్ ధర దుర్విటులట్లు చూడగన్ ‘’

కుకవులకి ప్రయోగించిన విశేషాలణాన్నీ దుర్విటులకి కూడా సమానంగా వర్తిస్తాయి. అసంబద్ధంగా మాట్లాడుతూ రసభంగం చేస్తూ ఎప్పటివో అయిన మాటల్ని నేర్పుగా ప్రయోగించడానికి తాపత్రయ పడుతూ నాయికాహృదయాన్ని రంజింపచేయలేకపోవడం అపహాస్య భాజనాలవడం వంటివి దుర్విటుల లక్షణం. ఔపమ్యం అనుపంగా ఉంది. ఇందులో తిక్కయ్యజ్వ కావ్యం లేక కవిత్వం ఎలా ఉండాలో వ్యంగ్యంగా సూచించాడు కావ్యంలో పలుకుల పొందు ఉండాలి. అలాగే రసం పుష్టిగా పోషింపబడాలి. ఎంతసేపు పూర్వకవుల పదప్రయోగ చమత్కారాలనే మాటమాటకీ ప్రదర్శించకూడదు. సహృదయ పాఠకలోకం మెచ్చుకొనేటట్లు రచించాలి. తిక్కనార్యుడు భంగ్యంతరంగా ప్రతిపాదించిన ఈ కవితా సిద్ధాంతాలు పరమసత్యాలు.

కుకవుల గ్రంథచౌర్యాన్ని శేషం వెంకటపతి శశాంక విజయంలో పట్టుగా పేర్కొన్నాడు. ఎట్టి పనికైనా కుకవులు సిద్ధపడి కొందరి కవిత్వంలోని పాకాన్నీ కొందరి వృత్తుల్నీ గ్రహించి రచిస్తూ ఆ రచన ఏకక్రమంగా ఉండక విరసంగా ఉండడంచేత వివర్ణులై దైన్యాన్ని పొందుతారనీ అట్టి కుకవుల్ని చూసి విద్వాంసులు రసోక్తులు పల్కరనీ వేంకటకవి ఇలా చెప్పాడు.

“ పరపాకంబులగోరి యెందు కయినం బ్రాల్మాలి వృత్త్యర్థమై

యొరుపాదంబుల వంటి యర్థ కలనా యోగంబు లేమి న్నిరం

తర చింతన్ దగురీతి దోపక వివర్ణత్వంబునన్ దీనులౌ

నరులంజూచి సుదృగ్జనంబు రసవన్నర్మోక్తులం బల్కునే.’’

లలిత సంపదుడైన శేషం వేంకటపతిపై పద్యంలో మనోహరమైన మరో అర్థాన్ని కూడా నిక్షేపించాడు. దుర్విటులు స్త్రీ వాంఛా వృత్త్యర్థమై పడరాని పాట్లు పడుతూ ధనరాహిత్యంలో దీనులై ఉండగా వేశ్యలు వాళ్ళని రసోక్తులతో పలకరిస్తారా? అని ఇందులో కుకవుల్ని నిర్ధనులైన విటులతో పోలుస్తూ వేంకటపతి చమత్కరించిన విధం హృదయంగమంగా ఉంది. ఒక మహాకవి రచనా విశేషాలు అనంతరం కవుల రచనల్లో అంతో ఇంతో గోచరించడం ఏ సాహిత్యంలో అయినా సంభవిస్తుంది. కాళిదాసుని కావ్యాల్లో ఆర్షకవి వాల్మీకి ప్రయాగ విశేషాలు చాలా ఉన్నాయన్నా విషయం పెద్దలు గుర్తించారు కదా అలంకారికులు అన్యకవితా సామ్యాన్ని సంవాదం అంటారు. అది విడువరానిదని ఆలంకారిక శిరోమణి అయిన ఆనందవర్ధనాచార్యుల వారు “ నాన్య సామ్యం త్యజేత్కవిః ‘’ అని ధ్వన్యాలోకంలో ప్రవంచించారు ఒక కవిమీద గఢ ప్రత్యయం గలకవి అతని కావ్య మాధుర్యాన్ని కాకృష్ణుడై బహువారాలాతని కావ్యాన్ని పఠించిన ఫలంగా ఆ రచన విశేషాలని స్వియాలుగా చేసుకుని తన రచనల్లో గుప్పిస్తాడు. అది అతను కవిత్వానికి గుణోత్కర్షకంగానే ఉంటుంది కానీ గ్రంథచౌర్య దోషాన్ని కలిగించదు. విదగ్దుడైన ఆ మహాకవి కవిత్వంతో అది అంగత్వాన్ని పొంది ఇమిడి ఉండడమే దానికి కారణం అవుతుంది. వివిధ కవుల రసవత్పద్యాలనో పాదాలనో సన్నివేశాలనో గ్రహించి తన పేరుమీద ఒక కావ్యంగా కూర్చడానికి ఏ కవైనా సిద్ధపడితే అది గ్రంథచౌర్యం అనబడుతుంది. హూ కవులు అట్టి ఘనకార్యానికి తలపడి పండితుల విమర్శలకి గురౌవుతారని తిక్కకవీంద్రుడూ వేంకటకవి తల్లజుడు హెచ్చరించారు.

మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రలో కుకవులు నిగూఢమైన అర్థాన్ని ప్రతిపాదించే నైపుణ్యం లేనివారై కంచుఢక్కా మ్రోగే ఆర్భాటంతో తమకు తామే తమ రచనా సౌందర్యాన్ని శ్లాఘించు కొంటూ ప్రాజ్నుల్ని  పరిహసిస్తూ ఉండే మహాగర్వితులైన మూఢత్ములని ఇలా నిందించాడు.

“ గాఢార్ధ ప్రతిపాదన క్రమ కళా కౌసల్య ముల్ లేక వా

చాఢక్కార్భటితోడ దామ తము మజ్ఝాయంచు గైవారముల్

ప్రౌఢిం జేయుచు బ్రాజ్నుల న్నగుచు గర్వగ్రంథులై యుండు నా

మ్మూఢ స్వాంతుల  మెచ్చ కుండు టయు సమ్మోదంబు మాబోంట్లకున్ “.

మల్లన్న మహాశయుడు ఈ కుకవినిందలో రెండు విషయాలు ప్రతిపాదించాడు. గాఢమైన అర్ధాన్ని ప్రదర్శించే శక్తి సామర్థ్యమూ కుకవులకి వుండదనడం మొదటిది. రెండవది వాళ్ల కావ్యాన్ని వాళ్లే ఘనంగా పొగుడుకుంటూ పండితుల్ని పరిహరిస్తూ ఉంటారనడం. రెండు సార్వకాలిక సత్యాలే. కుకవుల  స్వరూప స్వభావాల్ని బాగా వ్యక్తం చేస్తాయి.

అజ్ఞాతతో కూడిన కుకవిహృదయం ఎలా ఉంటుందో అతి సహజంగా ఉండేటట్లు చిత్రించిన ఘనత కవిరాజు రాజకవి అయినా రఘునాధ రాయల కే దక్కుతుంది ఆ మహాకవి వాల్మీకి చరిత్రలో ఇలా అన్నాడు.

“ తెనుగు తెరంగు సంస్కృతము తీరును గాని యప ప్రయోగముల్

పెనచిన కబ్బముల్ సభల పెద్ద రికంబుగ దెచ్చి పెద్దలన్

వినుడన వారు నేరుపున వింతలు వింటిమి నేడటంచు న

వ్విన నుతియంచునెంచు కుకవి ప్రకరంబుల మెచ్చ నర్హమే ‘’.

సంస్కృతాంధ్ర భాషా స్వరూపం తెలియక యథేచ్ఛగా కూడని ప్రయోగాలతో కుకవులు ఏవో వ్రాస్తూ గొప్పగా సభల్లో పండితులకి వినిపిస్తూవుంటే వాళ్లు వ్యంగ్యంగా వింతలు విన్నామని అంటే దాన్ని ప్రశంసగా స్వీకరిస్తారని విద్వత్ర్పభువైన రఘునాథుని అభిభాషణం. ఆ మహాకవి వాగ్వైదగ్ధ్యం అంతా విద్వాంసులు వింతలు విన్నామని నవ్వినట్లు రచించడంలో ఇమిడి ఉంది.

సరసములైన ఉపమానాలతో సార్థకములైన పద ప్రయోగాలతో కుకవుల సమగ్ర స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు నిరూపించిన మహనీయుడు దామెరల వేంగళ భూపాలుడు.  బహుళాశ్వ చరిత్రలో కుకవులలో ఉండే లోపాలన్నిటినీ ఇలా వరుసగా ఏకరవు పెట్టాడు.

“ శబ్ద దరిద్రుడై శారదాభ్రము  బోలు బ్రాసంబు  విడిచి సంత్రాసు బోలు

నవహృతాన్యలం క్రియత దస్కరుని బోలు బృదులార్థదురుడై పేద బోలు

వగళితౌజస్కుడై పగలింటి నెల బోలు నవదిత ధ్వనికుడై చెవిటి బోలు

బద్యాన భిజ్ఞతా భంగి బంధువు బంగువు బోలు భిన్న మాధుర్యడై పిప్పి బోలు

ముక్త సూక్త ప్రసాదుడై మూర్ఖు బోలు జీర్ణ పాదత నదియా జెట్టు బోలు

లుప్త సముదాయ భావుడై లోభి బోలు సుకవి వాసరధవ దివాంధ కవి కుకవి.’’

ఈ పద్యంలో కుకవి ఉద్దేశించి చెప్పబడిన విశేషాలు శ్లేషమూలకంగా ఉపమానాలకు కూడా చక్కగా నప్పుతాయి. కుకవి సమగ్ర స్వరూపాన్ని గ్రహించడానికి ఈ ఒక్క పద్యం ఇంచుమించు సరిపోతుందని చెప్పవచ్చు.

ఈ విధంగా కుకవులపై దాడిచేసి పెక్కు కవులు వాళ్లని రచ్చకీడ్చారేగాని వాళ్ల వల్ల పండితులకి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో చెప్పడానికి ఏ మహాకవి సిద్ధపడలేదు. భట్టుమూర్తి మాత్రం సాహసించాడు. నరసభూపాలీయంలోఆ మహాకవి వ్యాజస్తుతి పూర్వకంగా గావించిన కుకవినింద అనిదం పూర్వరమణీయంగా ఉంది. ఆ పద్యంలోని  ప్రతి పాదమూ వక్రోక్తి వైభవంతో విరాజిల్లుతుంది.

“ ఏ మహాత్ములు గల్గ భూమీశ సభలలో గవులకు నధిక విఖ్యాతి గల్గె

నేకృతార్థులు గల్గ నెల్ల పామరులకు గణన మీరు ప్రబంధకములు గల్గె

నేవాజ్నిధులుగల్గ నిరవొందు రసికుల కమితలీలా వినోదములు గల్గె

నేప్రవీణులు గల్గ నిలనలంకృతికృతో ద్యములకు దోష లక్ష్యములు గల్గె

నేదయాళులు బుధవ చోహేతి చకిత విసర దపశబ్ద భరణలాలసముఖాబ్జు

లట్టి నిఖిలోపకారధీరాత్ములైన సకల కవి ధూర్వ హకులకు నంజలి ఘటింతు.”

కుకవులు ఉండడంవల్ల రాజ్యసభల్లో సత్కవులకు ఎక్కువ పేరూ ప్రతిష్టా కలుగుతాయి. పామరజనానికి ప్రబంధాలు లభిస్తాయి. వాళ్లు వాజ్నిధిత్వం రసికులకి ఎన్నో లేలా వినోదాలు కలిగిస్తుంది. అలంకారశాస్త్రంలోని దోష ప్రకరణానికి కుకవుల దయవల్ల లక్ష్యాలు లభిస్తాయి. పండితుల వాక్కారవాలానికి జడిసి వాళ్లు దయాస్వభావంతో అపశబ్దాల్ని ముఖారవిందంలో భరిస్తూ ఉంటారు.

ఈ విధంగా ఆంధ్ర సాహిత్యంలో అవతరించిన మహాకవుల కుకవుల్ని సమీక్షిస్తే అనేక విషయాలు గోచరిస్తాయి. అందులో ప్రధానంగా ఆనాటి రాజాస్థానాలలో ప్రభువుల మెప్పుకోసం విపరీత భాష్యాలు చెప్పే పండితుల కుత్సిత స్వభావం ఎలా ఉండేదో సరసమూ లక్షణముబద్దమూ అయినా కవిత్వం చెప్పలేక తాము చెప్పిందే మహాకవిత్వంగా భేషజంతో ఆ మహానుభావులు ఎలా ప్రవర్తించేవారో తెలుసుకోవడానికి ఈ కుకవి నిందలు బాగా ఉపకరిస్తాయి. సాహిత్యతత్త్వ నిర్ణయంలో మహాకవుల దృక్పథంలోని వైవిద్యాన్ని కూడా కుకవినిందలు నిరూపిస్తాయి. అలాగే ఆ కవి పుంగవుల అపూర్వ కల్పనా ప్రాగల్భ్యాన్ని పరిగణించడానికి కూడా ఈ కుకవి నింద లు సూత్రప్రాయంగా నిలుస్తాయి.

కవిలోక చూడమణులు తమ కావ్య అవతారికలలో రచించిన కుకవినిందలు ఆంధ్రసాహిత్యంలో అతి విశిష్ట స్థానాన్ని అలంకరిస్తాయి. ఏదో లక్షణ పాలన కోసం కాకుండా సహృదయహృదయ సమాకర్షకంగా వారు కుకవినిందల్ని నిర్వహించిన విధం అత్యంత ముదావహంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here