తెలుగు పెద్ద కథలు – పుస్తకావిష్కరణ సభ – నివేదిక

0
8

[dropcap]13 [/dropcap]నవంబరు 2022, ఆదివారం, హైదరాబాదు సోమాజిగూడా ప్రెస్ క్లబ్‌లో సాయంత్రం ఆరు గంటలకు – మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పెద్ద కథలు’ సంకలనం ఆవిష్కరణ జరిగింది. సభకు ప్రయోక్తగా శ్రీ  ఖదీర్ బాబు  వ్యవహరించారు. సభాధ్యక్షులు అంటూ ఎవరూ లేరు. శ్రీ ఖాజా మొహియుద్దీన్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రసంగంలో కథానికకు, పెద్ద కథకు, నవలకు ఉన్న భేదాలను వివరించారు. ప్రక్రియ విస్తృతి క్రమంలో, రచయితలు సెక్యులర్ స్ఫూర్తి వైపు మళ్ళారన్నారు.

ఈ పుస్తకంలో పెద్ద కథలు 16 ఉన్నాయి, 130 ఎంట్రీల నుండి, ఒక యువ రచయితల టీమ్ వీటిని కాచి వడబోసి తేల్చారు. మొత్తం నలుగురు సమీక్షకులు ప్రసంగించారు. వారు కథలను ఎక్కువగా ప్రస్తావించకుండా, పెద్ద కథ అనే కాన్సెప్ట్‌ను గురించి చెప్పుకొచ్చారు. పెద్ద కథ రాయడానికి అవకాశం వచ్చిందని రాశారే తప్ప, రచయితలు మరింత కృష్టి చేసి ఉంటే బాగుండేదని ఒక సమీక్షకుడు అభిప్రాయపడ్డారు. కథల్లో సింహభాగం గ్రామీణ జీవన చిత్రణమే ఉంది, పట్టణీకరణపై ఫోకస్ తక్కువగా ఉందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ఆంగ్లంలో వచ్చిన అనువాద పెద్ద కథల సంకలనంతో పోలుస్తూ, దాన్ని ప్రశంసించారు మరో యువ సమీక్షకుడు. మొత్తం మీద కథలన్నీ బాగున్నాయని అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక సమీక్షకుడు ఎక్కువ కథలు రాయలసీమ నేపథ్యంలో ఉన్నాయని, రాయలసీమ మాండలికం క్లిష్టమైనదని, దాన్ని అర్థం చేసుకోవటం సమయాన్ని తీసుకుంటుందని ఉటంకించారు.

16 మంది రచయితలకు, 16 లబ్ధప్రతిష్ఠులైన సాహితీవేత్తలు వ్యాఖ్యలు వ్రాశారు. అవి కూడా ప్రతి కథ తర్వాత పొందుపరచడం విశేషం. కొంతమంది   రచయితలు సభకు  హాజరు కాలేదు. వచ్చిన రచయితలందరికీ, సంకలనం ప్రతిని బహుకరించారు. ఆ క్రమంలో ఖదీర్ బాబు ఆయా కథలను గురించి అతి క్లుప్తంగా ప్రస్తావించి, వాటి విశిష్టతను సభికుల దృష్టికి తెచ్చారు.

సంచిక రచయితలలో డా. చిత్తర్వు మధు గారి ‘పద్మగంధిని’, పాణ్యం దత్తశర్మ గారి ‘కర్మయోగ కమనీయం’ కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. దత్తశర్మకు ప్రముఖ రచయిత శ్రీ వి. రాజారామ్మోహనరావు గారు; చిత్తర్వు మధు గారికి శ్రీ గణేశ్వరరావు గారు పుస్తకాలను బహుకరించారు.

ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనం, శాలువాలు, వందన సమర్పణ లాంటి అంశాలు ఏమీ లేకుండా, విభిన్నంగా సభ సాగింది. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్ది నవీన్ లాంటి ప్రముఖులు సభకు హాజరైనారు.

కథల నిడివికి పరిమితి అనేది లేకుండా, రచయితలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పెద్ద కథలు వ్రాయించడం ఆహ్వానించదగ్గ పరిమాణం. సంచిక ఎప్పటి నుంచో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తూ ఉంది.

సంచిక రచయితలు శ్రీ చిత్తర్వు మధు, శ్రీ పాణ్యం దత్తశర్మ గార్లకు సంచిక టీమ్ అభినందనలు తెలియచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here