అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల గాథల అక్షరరూపం – ‘తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య యోధులు’

0
12

[‘తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య యోధులు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె. రాకా సుధాకర్ రావు.]

[dropcap]లాం[/dropcap]బిస్ ఎంగ్లెజోస్ ఆస్ట్రేలియాలో ఒక రిటైర్డ్ హిస్టరీ టీచర్. ఆయన retire అయ్యారే తప్ప tire కాలేదు. ఆయన ఫ్రెండ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ బ్రిగేడ్ అనే సంస్థను స్థాపించి మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయి, గుర్తింపులేని ఫిఫ్టీన్త్ బ్రిగేడ్ సైనికుల సమాధులు కనుక్కునే పనికి అంకితమయ్యారు. ఫ్రాన్స్ లో వీరంతా చనిపోయారు. కొన్ని సమాధులు దొరికాయి. మరో 1335 మందివి ఏమయ్యాయో తెలియదు. ఎంగ్లోజోస్ చాలా కష్టపడి ఫ్రాన్స్ లోని ఫ్రొమెల్లెస్ అనే నగర శివార్లలో ఉన్న వందలాది మంది సమాధులను గుర్తించారు. ఇదంతా ఒంటరి ప్రయత్నమే. ప్రభుత్వాలు తరువాత రంగంలోకి దిగాయి. చివరికి వార్ కమీషన్ 2016 లో ఈ ఫ్రెంచి సైనికుల సమాధులను పునరుద్ధరించి, వారి స్మతులను సమాదరించింది.

ప్రతి అజ్ఞాత సైనికుడికీ ఒక కథ ఉంటుంది. ఆ కథలో అనంతమైన ప్రేరణ దాగుంటుంది. దాన్ని పంచివ్వడం పరమ కర్తవ్యం. కానీ ఇది కష్టమైన పని. ఆ కష్టమైన పనిని ఇష్టంగా చేశారు వై కృష్ణకుమారి గారు. ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 75 మంది స్వాతంత్ర్య సమరవీరుల గాథలను వారి కుటుంబ సభ్యులు, వారసుల చేత చెప్పించారు. ఇవన్నీ తరంగిణి పేరిట జూమ్ మాధ్యమంగా జరిగిన కార్యక్రమాలు. వీటి పుస్తకరూపమే ‘తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య యోధులు’.

నా దృష్టిలో లాంబిస్ ఎంగ్లెజోస్ చేసిన పని, కృష్ణకుమారి గారు చేసిన పనికీ తేడా లేదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పనికి నిధులు కేటాయించింది. ట్రస్టులు ఏర్పాటు చేసింది. వివిధ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి.

మన దేశంలో చరిత్ర పట్ల అవగాహన తక్కువ. అసలు చరిత్రను యూనివర్సిటీ సిలబస్ నుంచి ఎత్తివేయాలని ఒక ‘విజనరీ’ ముఖ్యమంత్రి ప్రయత్నించారు. ఆయన ఇప్పుడు తన ‘గత/ఘన చరిత్ర’ చెప్పుకుంటూ పాస్ట్ టెన్స్‌లో బతికేస్తున్నారనుకొండి. అది వేరే విషయం. చాలా మంది కుటుంబ సభ్యులు తాతల జ్ఞాపకాలను అటక మీదో, గోతాం సంచిలోనో ఉంచేశారు. అలాంటి వారిని వెతికి పట్టుకోవడం, వారిని ఒప్పించడం, వారి చేత చెప్పించడం, దానిని రికార్డు చేయడం, చేసి పుస్తకంగా తేవడం చాలా పెద్ద పని. దీని నిమిత్తం 35 మందిని వ్యక్తిగతంగా కలవాల్సి వచ్చింది. ఆ పనినంతా కృష్ణకుమారి గారు చేశారు.

విశేషం ఏమిటంటే ఈ స్వాతంత్ర్య సమరయోధుల్లో చాలా మంది అజ్ఞాతపు చెరలో ఉన్నవారే. సుప్రసిద్ధమైన ఇంటిపేరో లేక ఇంకా ప్రసిద్ధమైన కుటుంబ నేపథ్యమో వారికి లేదు. వారేమీ దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలినవారూ కాదు. అందుకే వారి జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి.

తెలంగాణలో మన చరిత్ర రచనకు మరో చెద పట్టుకుంది. అది మార్క్సిస్టు చెద. భారత ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటాన్ని తెలంగాణ విముక్తిపోరాట చరిత్రగా చూపించే ఒక ప్రయత్నం పథకం ప్రకారం జరుగుతోంది. కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆర్య సమాజ్ వంటి సంస్థలు చేసిన పోరాటాలు, వాటి కార్యకర్తల కథలను చాపకిందకి తోసేస్తున్నారు. ఈ సంకలనం ఆ కుట్రను ఛేదిస్తుంది.

పొనుగోటి మాధవరావు, మల్రెడ్డి వెంకట రంగారెడ్డి, భండారు వీరమల్లు ప్రసాద్, కారెంగుల నారాయణ రెడ్డి, మండువ మధుసూదనరావు, భండారు చంద్రమౌళేశ్వరావు, చౌడవరపు విశ్వనాథం, పెండ్యాల రాఘవరావు, సమ్మోహి సీతారామారావు, సాదుల సంబయ్య, కట్నూరి సుశీలా దేవి, మల్ దాదా వంటి వారి కథలు ఇలాంటివే. ఈ దృష్ట్యా ఈ పుస్తకానికి తనదైన విలువ ఉంది. ఆంధ్రప్రాంతంలోనూ ఇలాంటి అజ్ఞాత వీరులు కోకొల్లలు.

వీరందరి కథలను వారి కుటుంబ సభ్యుల ద్వారానే చెప్పించడంతో రచనకు ఒక first person-ness వచ్చింది. చాలా మంది కుటుంబ సభ్యులు తమ పూర్వజుల త్యాగాల పట్ల గర్వాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేయడం కూడా విశేషం. ఈ పుస్తకాన్ని జాతీయ సాహిత్య పరిషత్ ప్రచురించింది.

***

తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య యోధులు
సంపాదకత్వం: వై కృష్ణకుమారి
పేజీలు: 156
వెల: ₹ 200
ప్రతులకు
1. శ్రీ సాయి నివాస్
12-5-91/101, విజయపురి, తార్నాక
సికింద్రాబాద్ 500017
~
2. వై కృష్ణ కుమారి
19-58/101, జయరాఘవేంద్ర నగర్, విజయపురి, తార్నాకా
టీచర్స్ కాలనీ, కళ్యాణపురి, ఉప్పల్ 500039

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here