తెలుగులో ఆధునిక మహాకావ్యాలు

0
5

[box type=’note’ fontsize=’16’] 31-10-2019 నాడు తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ కోవెల సుప్రసన్నాచార్యగారికి వానమామలై వరదాచార్యుల స్మారక పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగాన్ని ‘ఆధునిక మహాకావ్యాలు’ పేరిట వ్యాసంగా అందిస్తున్నాము. [/box]

[dropcap]సం[/dropcap]స్కృతంలో కావ్యమనే మాటకు కవిత్వమని, అనేక శ్లోకాల సమిష్టి అయిన గ్రంథమని రెండు వ్యవహారాలు ఉన్నాయి. అందుచేతనే కాళిదాసాదుల రచనలను కూడా కావ్యములని వ్యవహరిస్తారు. రామాయణాన్ని కూడా ఆదికావ్యమని, వాల్మీకి పేర్కొన్నారు. ఈ కావ్యములు వ్యవహార దశలో మహాకావ్యములని పిలువబడటం ఉన్నది. సర్గబంధో మహాకావ్యం అన్నచోట అనేక కావ్య ఖండికల సమిష్టిగా.. సర్గల సమాహారంగా మహాకావ్యం పేర్కొనబడింది. మహాకావ్యాన్ని నిర్వచించే సందర్భంలో ఉదాత్త నాయకుడు, నాయిక, వర్ణనలు మొదలైన అనేక అంశాలు ఉండవలసిన అవసరాన్ని లాక్షణికులు పేర్కొన్నారు. అష్టాదశ వర్ణనలు అంటే మనచుట్టూ ఉన్న ప్రకృతి, ఋతువులు, సూర్యోదయాస్తమయాలు, సముద్ర మధ్య అద్భుత అంశాలు, మనం చూచే వ్యక్తుల వేషభాషలు, ఉత్సవాలు, పండుగలు ఇవన్నీ కలిసే ఉంటాయి. ఒక విధంగా ఇది మన జీవన బాహ్యాభ్యంతర రీతికి సమగ్ర చిత్రణగా తోడ్పడుతుంది. అందువల్ల కావ్యంలో ఇతివృత్తం మాత్రమే కావ్యమనుకోవడం, ఇతివృత్తేతరమైన ఆలంబన, ఉద్దీపన భావాలు.. సంచారి సాత్త్విక భావాలు.. వాటి పుష్టికి తోడ్పడే వర్ణనాదికాలను కావ్యేతరంగా భావించడం లాక్షణికుల హృదయానికి వ్యతిరేకమైన అంశం. కాకపోతే కావ్యానికి, మహాకావ్యానికి అంతతోగత్వ భేదం లేకపోయినా.. స్థూల సూక్ష్మ భేదాల వల్ల లోకంలో వాటి గురించిన అవగాహన ఏర్పడి ఉండవచ్చు. పంచకావ్యాలు అన్న వ్యవహారం కావ్య శబ్దము యొక్క విస్తృతిని తెలియపరుస్తుంది.

రూపాన్ని బట్టి కావ్యాలను గద్య, పద్య చంపూకావ్యాలుగా దృశ్య, శ్రవ్య కావ్యాలుగా నిర్వచించడం జరిగింది. కావ్యము యొక్క రామణీయకతకు, రసప్లావితకు కావ్యభేదంతో నిమిత్తంలేదు. ఏ కావ్యమైనా సహృదయుని మనస్సును కరిగించగలిగితేనే దానికి కావ్యస్థితి కలుగుతుంది. సా వాక్‌ యా రసవృత్తి: అని చింతామణి సూత్రకారుడు చెప్పిన విషయం గ్రహిస్తే ఏ కావ్యంలో.. ఏ శబ్దం ద్వారా రసము ప్రవర్తిస్తుందో దానిని విశ్వశ్రేయ: ప్రతిపాదకమైన కావ్యంగా ప్రతిపాదించవలసి వస్తుంది. ఈ రసం కావ్యములో శబ్దముల నుండి శబ్దములలో చేర్చబడిన అక్షరముల నుండి.. వాక్య విన్యాసమునుండి.. దానిలోని కాకువు నుండి.. అలంకారము నుండి.. ఇతివృత్త నిర్వహణము నుండి.. రసోల్బణ శీలమైన మహాకావ్య నిర్మాణముదాకా ఆవరించి ఉంటుంది. దీన్నే.. ఆధునిక విమర్శకులు శిల్పమన్నారు. తిక్కన సోమయాజి ఇంతకుముందే ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్‌ పారగుడన్‌ అని తన్నుగూర్చి పేర్కొన్నారు. ఈ శిల్పము సంవిధానము అని కొందరు.. టెక్నిక్‌ అని మరి కొందరు వ్యవహరించినా ఈ లక్షణము కావ్యము నిండా వ్యాపించి ఉంటుంది.

మన తెలుగు పంచకావ్యాలను పరికించితే.. వాటి ఇతివృత్త నిర్వహణ దేనికదిగా సర్వ స్వతంత్రంగా సాగినట్లు మనకు అర్థమవుతుంది. ఒక శతాబ్దంపైగా తెలుగు సాహిత్యంలో మనుచరిత్ర నుండి.. విజయవిలాసము దాకా సాగిన కావ్య పరంపర దేనికదే కవి ప్రతిభకు విజయస్తంభంలాంటి రచనలు. వాటి ప్రత్యేకతలను గూర్చి ఇక్కడ చర్చించే అవకాశం లేదు. సాహిత్య పరిణామంలో ఇటీవలికాలం ఎంతో మార్పును తీసుకొచ్చింది. 19వ శతాబ్దపు చివరి అంచునుండి 30 సంవత్సరాలపాటు నూతన కవిత్వ అన్వేషణ.. రాయప్రోలు సుబ్బారావు వంటి గొప్ప కవులు చేశారు. కవిత్వంలోని ప్రయోగాలు కూడా అంతులేనివే. పద్యంలో ప్రయోగాలు.. గేయకావ్యాలు.. దేశి ఛందస్సులోని రచనలు.. ఇలా అద్భుతమైన సృజన కొనసాగింది. దీన్ని స్థూలంగా భావకవిత్వమని, కాల్పనిక కవిత్వమని వ్యవహరించినా.. ఇక్కడ ప్రధాన ప్రక్రియ ఖండకావ్యం. ఈ ఖండకావ్యం పరిమితమైన శరీరం కలది. పరిమితమైన అనుభవాన్ని వ్యక్తీకరించే మహాకావ్యాదులలో ఉండే.. ఆలంబన.. విభావానికి ప్రాధాన్యం లేదు. కవి స్వ అనుభవంగా చెప్పుకొనిపోయే అంశమే దీన్లో ముఖ్యమైనది. వెంకట పార్వతీశ్వర కవుల ఏకాంతసేవ.. మధురభక్తి ప్రధానమే అయినా దాన్లో ప్రధానమైంది దైవానికి గానీ, భక్తునికి గానీ స్పష్టమైన రూపముద్రలేదు. అంతా నీరూప చిత్రణమే. కృష్ణశాస్త్రి ఖండకావ్యాలు, నాయని, నండూరి, అడవిబాపిరాజు, విశ్వనాథ మొదలైన వారి రచనలు ప్రణయాన్ని, విరహాన్ని, దేశభక్తిని ఆధారంగా, ఆత్మానుభవంగా తమ స్పందనను తెలియజేసే ప్రయత్నం జరిగింది. కృష్ణపక్షంలోని అన్వేషణ.. గోపికలు, శ్రీకృష్ణుని కథను సూచించినా విభావాలకు.. తగినంత పరిపుష్టి కలుగలేదు. కృష్ణపక్షంలోని చివరిగీతం శివుడి తాండవాన్ని గురించి చెప్పిన సందర్భంలో ఆ అనుభవాన్ని తలలైన ఊపలేని నిర్భరానందాన్ని తెలియజేసినా.. ఆ శివతాండవ చిత్రణ అతి స్వల్ప పరిధిలోనే సాగింది. తర్వాతి కాలంలో పుట్టపర్తినారాయణాచార్యులు శివతాండవంలో అందుకున్న అంతస్తును ఇది చేరుకోలేదు. విశ్వనాథ ఆంధ్రప్రశస్తిలోని ఖండికలు అన్నీ చరిత్రలోని ఘట్టాలకు సంబంధించినవే కానీ, వాటిలోనూ ఖండకావ్యత్వ పరిధి దాటినా.. కావ్యత్వము సమగ్రంగా అందుకోవడం జరుగలేదు.

ఆ కాలంలో వచ్చిన అద్భుతమైన కావ్యం ఎంకిపాటలు. ఏకకథా సూత్రం ఉన్నట్టు కానరాకపోయినా.. తల తడుముకొని తానె తబ్బిబ్బులైనాడు అన్న రసానుభవ వైశిష్ట్యం.. ఇతర ఖండకావ్య కర్తల్లో మృగ్యంగానే ఉండిపోయింది. అన్నమాచార్యులవారి కీర్తనల్లో పద్మావతీ వెంకటేశ్వర్లు.. అన్న నాయికా నాయకుల పరిమితిలోనే ఒక్కొక్క కీర్తనే ఒక గొప్ప కావ్యంగా అన్నమయ్య రచించి ఆ సంకీర్తనలను రస గుళికలుగా తీర్చిదిద్దాడు. ఆ పోలిక బెత్తెడు తక్కువగా ఎంకిపాటలకు వర్తిస్తుంది. ఈ కాలంలో వచ్చిన అద్భుతమైన మరొక కావ్యం కిన్నెరసాని పాటలు. కిన్నెరసాని పాటల్లో ఒక నది కథయే అయినా.. ఆరంభం నుండి చివరి వరకు అనేక రసభావముల గాఢ చిత్రణము కనిపిస్తుంది. నాయికా నాయకుల మధ్య నెలకొని ఉన్న గాఢమైన ప్రేమ.. కిన్నెర వియోగబాధ.. ఒంటరిగా ఉన్న కిన్నెరను ఆక్రమించవలెనని ఉద్దేశించిన కడలిరాజు ధూర్తత.. చివరికి తల్లి గోదావరిదేవి ఆమెను రక్షించడం.. బ్రతుకు చివర ఆమె తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య దర్శనం చేసుకొనే భక్తులకు దాహం తగ్గిస్తూ అలసటను పోగొడ్తూ సామాజిక సేవలో నిలిచి ఉన్నదనే అంశం సూచించింది. కావ్యారంభంలో తెలుగు కుటుంబాలలోని అల్లకల్లోలంతో మొదలైన ఒక స్త్రీ జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి తన్నుతాను నిలువరించుకొని దైవసేవలో, సామాజిక సేవలో జన్మను సార్థకంచేసుకొన్న ధీర వనిత కిన్నెరసాని కావ్యనాయికగా తన సమగ్ర వ్యక్తిత్వంతో వర్ణన ప్రధాన కావ్యమైనా, గేయమే అయినా, ప్రకృతి తాదాత్మ్యం తోడనే మహాకావ్యంగా రూపుకట్టింది. 20వ శతాబ్దపు మూడవ దశాబ్దంలో తన్నుతాను వెతుక్కుంటున్న ఖండకావ్య కవిత.. ఆధునిక కాలపు సంవేదనలతో.. అద్భుతమైన వర్ణనలకు, భారతీయ స్త్రీ యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వంతో గొప్ప కావ్యంగా రూపుకట్టింది. ఒక విధంగా ఇది ఆధునిక మహాకావ్య ఆరంభమే.

1930 తర్వాత తెలుగు సాహిత్యంలో ప్రగతివాద.. ప్రయోగవాదాలు, నవ్య సంప్రదాయము.. సమకాలంలోనే కొనసాగాయి. 1932లో పింగళికాటూరులు గాంధీ తత్త్వాన్ని.. బౌద్ధ మత పరివేషంలో సౌందరనందము కావ్యరూపంలో ప్రదర్శించారు. కాల్పనిక కవితాయుగంలో కవులు ఆత్మాశ్రయ ధోరణిలో వెదికిన వెదుకులాటకు ఫలితంగా నవ్య సంప్రదాయ కావ్యానికి తగిన రూపురేఖలమర్చి మరొక ఆధునిక కావ్యం వెలువడింది. దేశి ఛందస్సు ఒక కొత్తదనాన్ని కావ్యరూపంలో అతిశయింపజేయగా సౌందరనందం సంప్రదాయ ఛందస్సునందునే కాల్పనిక కాలపు కావ్యభాషను ప్రవేశపెట్టి.. నూతన కావ్య నిర్మాణానికి దారిచూపింది. ఇక్కడ ఇతివృత్తంలోనూ.. కావ్యభాషలోనూ మార్పు వచ్చింది. ఛందోమార్గం పాతదే అయినా.. కిన్నెరసాని పాటల్లో ఛందస్సు దేశి కావ్యాల నుండి జానపద గీతాల నుండి.. ఇతివృత్తం రాయప్రోలువారి తృణకంకణం వంటి కావ్యాలలోనిదై అభినవ రూపాన్ని సంతరించుకొన్నది. తర్వాత ఒకటి రెండేండ్లలోనే రామాయణ కల్పవృక్షం ప్రారంభమైంది. సంప్రదాయ ఛందోరూపమే అయినా.. దీనిలో వెలువడిన సంవేదనలన్నీ.. ఆధునిక మార్గానికి చెందినవే. దేవాసుర సంగ్రామం అనే ఇతిహాసాలకు మూలమైన ఇతివృత్తాన్ని కేంద్ర బిందువుగా స్వీకరించి ఇది ఆధునిక ఇతిహాసమైంది. గుడిపాటి వెంకటచలం వంటివారి వల్ల వివాహ వ్యవస్థ మానవ శ్రేయస్సుకి నిరోధకంగా భావింపబడుతున్న సందర్భంలో ఆ దాంపత్య వ్యవస్థ యొక్క బలాన్ని సార్వకాలీనతను కేంద్రబిందువుగా పెట్టుకొని కల్పవృక్షం నిర్వహింపబడ్డది. చేతోమోహ కుర్యానదీ మర్యాదాకృతి ఇస్తు యోగమిది అని దాంపత్య వ్యవస్థను కల్పవృక్షం నిర్వచించింది. చలం నవలలో నాయికలు వ్యవస్థ నుండి బయటపడ్డా.. పరిష్కారాలు దొరక్క అనేక సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకొన్నారు. కల్పవృక్షం కానీ, కిన్నెరసాని గానీ ఈ పరిణామాన్ని త్రోసివేసింది. కల్పవృక్షంలో ఒక స్తరంలో బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని దోచుకున్న విధం వ్యక్తమైతే అత్యంత గాఢంగా సార్వకాలీనంగా ఇతిహాసాలకు మూల బిందువులైన దైవాసుర సంఘర్షణ కేంద్రస్థానంగా నిలిచింది. ఈ కాలంలోనే నిర్మింపబడిన వేయిపడగలు ఆధునిక భారతదేశంలో అతివేగంగా వస్తూ ఉన్న వికృత పరిణామాలకు పట్టణీకరణను భారతీయ సభ్యతావిలువల పతనాన్ని చిత్రించి అత్యంత తీవ్రమైన పరివర్తనను ఆవేశంతో చిత్రించింది. ఇది ఒక విధంగా ఆధునిక ఇతిహాసం. ఈయన తర్వాతి కాలంలో కుమారాభ్యుదయమనే కావ్యంలో పురాణ గాథలను ఆధునికీకరించి ఈనాటి దేశంలోని పరిణామాన్ని.. పునర్నిర్మాణ వైభవాన్ని వ్యక్తీకరించారు. రురు చరిత్రంలో మృత్యు తత్త్వాన్ని.. శరీరం యొక్క అస్థిరత్వాన్ని నిరూపించి దివ్యజీవన మార్గం ఎంత అపరిహార్యమో నిరూపించారు. మహా యోధుడైనా.. మహా పురుషుడైనా శివాజీ జీవితాన్ని ఒక అంతర్ముఖ ఉపాసనగా దేశమాతకు రక్షణగా రక్షాదేవతల మేలుకొలుపుగా నిరూపించారు. ఇలా విశ్వనాథ కృషి ఎంతో విస్తృతమైనది. ఆయన సహచర కవి యైన నాయని సుబ్బారావు 1970లలో విషాదమోహనమనే స్మృతి కావ్యాన్ని, జన్మభూమి అనే మహాకావ్యాన్ని నిర్మించి నవ్య సంప్రదాయ కావ్యాలకు ఆభూషణంగా జన్మభూమిని నిలబెట్టారు.

అప్పుడు గాంధీ నేతృత్వంలో జాతీయోద్యమం ఇతివృత్తంగా భారత చరిత్రలోని రెండు ఉజ్జ్వల ఘట్టాలను ప్రతీకలుగా భావిస్తూ శివభారతంను గడియారం వెంకటశేషశాస్త్రి, రాణాప్రతాపసింహ చరిత్రను దుర్భాక రాజశేఖర శతావధాని.. రెండు కావ్యాలను వెలువరించారు. వర్తమాన ఉద్యమాన్ని ప్రాణధాతువుగా నిక్షేపించి ఈ మహాకావ్యాలు రెండూ ఆవిర్భవించాయి. కొద్దికాలం తర్వాత తుమ్మల సీతారామమూర్తి వారి ఆత్మకథ, మహాత్మ కథ వెలువడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్త రోజుల్లో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రేరణగా ఆంధ్ర పురాణం రచించారు. తెలంగాణ నుండి పోతనమహాకవి చరిత్ర ఆధారంగా వానమామలై వరదాచార్యులు పోతన చరిత్రమనే మహాకావ్యం నిర్మించారు. ఇది పూర్తయిన కొత్త రోజుల్లో (1967) వరంగల్లులో కవికి సన్మానం జరుగగా ఆ గ్రంథాన్ని గురించి నేను ప్రసంగం చేశాను. ఆయన ఆ ప్రసంగం విని తన గ్రంథాన్ని సంతకం చేసి నాకు బహుమానంగా ఇచ్చారు. ఆ సమావేశానికి పీవీ నరసింహరావు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొన్నారు. వరదాచార్యులు ఎంత ఉదారులంటే.. పోతన చరిత్రలో కవిస్తుతి సందర్భంలో తెలంగాణ కవిపండిత స్తుతి అనే భాగం ఏర్పరిచి దానిలో చివరి పద్యంలో కవిగా నన్ను కూడా ప్రశంసించారు. ఈ యుగంలోనే కాల్పనికవాద భూమికతో రచనలు కొనసాగించిన విశిష్ట కవులలో జాషువా ఒకరు. జాషువా తన కాలపు కవులలోని ప్రేమను, విరహాన్ని పట్టించుకోలేదు. జాతీయోద్యమంలోని దేశభక్తిని స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రధానంగా స్వీకరించాడు. కానీ, అతని వ్యక్తిత్వంలో ఒక తీవ్రమైన విషాద స్వరం వర్ణాశ్రమ ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని.. ఈ రెంటివల్ల దేశంలోని ఒక వర్గం పొందిన బాధాతీవ్రతను వ్యక్తంచేస్తుంది. ఆ వ్యథలోనుంచే పుట్టిన కావ్యం గబ్బిలం. గబ్బిలంలో రూప పద్ధతిలో దూత కావ్యమే అయినా.. ప్రేమ, విరహములను పక్కనపెట్టి అణగదొక్కబడ్డ ఒక వర్గం యొక్క వేదన ప్రధాన వస్తువుగా స్వీకరించింది. కావ్య పద్ధతిలో భౌగోళిక వర్ణన ఉన్నా.. అది జాతి చరిత్రలోని ఉజ్జ్వల ఘట్టాలను, వీరులను, మహాపురుషులను సంకీర్తనచేసింది. ఆ విధంగా గబ్బిలం దూతకావ్య పరిధులను అతిక్రమించి గొప్పకావ్యంగా రూపొందింది. అయితే జాషువా రచించిన ఫిరదౌసి ఇంకొక విశిష్టమైన కావ్యం. ఇది రాజులకు, కవికి మధ్య సంబంధాన్ని.. రాజుల నిరంకుశత్వాన్ని అధికార తత్పరతను వెల్లడించింది. తనమీద కావ్యం రాయమని బంగారు నాణాలు ఇస్తానన్న రాజు.. చివరకు వెండి నాణాలను పంపించడం, కవియైన ఫిరదౌసికి తీవ్రమైన దు:ఖాన్ని కలిగించింది. ‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు’ అని రాజనిందచేసిన ధూర్జటి ఈ మార్గంలోకే వస్తాడు. ధూర్జటిలోని తాత్త్విక చింతన కాళహస్తి శతకమైతే, ఫిరదౌసి తాత్త్విక చింతన కావ్యంలోని రెండవభాగం. అయితే బమ్మెరపోతన పొందిన పరిపాకం.. ఇంతకంటే గొప్పది. ఆయన రాజతిరస్కారంలో ధనలోభం లేదు. సమాజ సమష్టిరూపమైన దైవానికి కావ్యాన్ని అంకితంచేసి ఇమ్మనుజేశ్వరాధములు అన్న స్థితికి చేరి దుష్టులైన రాజులను తిరస్కరించాడు.

ఇదేకాలంలో పాశ్చాత్యదేశాల ప్రయోగవాదాలు, డాడాయిజం, సర్రియలిజం, ఇంప్రెషనిజం మొదలైనవాటి ప్రేరణలతో ఒక అల్పకాలం వరకు ప్రయోగవాద రచనలు వచ్చాయి. కాల్పనిక కవిత్వపు ప్రేరణతో కవిత్వ రచన ప్రారంభించి శ్రీశ్రీ ప్రభవ అనే ఖండకావ్య సంపుటిని వెలువరించాడు. దీన్లో షుప్తాస్థికలు అనే ఖండకావ్యం ‘అవి ధరాగర్భమున మానవాస్థికాపరంపరలు షుప్త నిశ్శబ్ద సంపుటములు’ అన్న రచన ద్వారా భగత్‌సింగ్‌ మొదలైన వారు నిర్వహిస్తున్న అతివాద ఉద్యమాల మార్గాన్ని ప్రతీకాత్మకంగా ప్రశంసిస్తూ కావ్యరచనచేశారు. శ్రీశ్రీ ఎక్కువకాలం ప్రయోగవాద భూమికలో నిలువలేదు. ఆయన మార్క్స్‌ వాదం పునాదిగా మహాప్రస్థానం అనే రచన చేశారు. ఈ రచనలో ఏక సూత్రత కంటే వైవిధ్యం, వైరుధ్యం ఎక్కువ. భిక్షు వర్షీయసి అన్న దీనిలోని ఖండకావ్యం వాస్తవిక దేశీయ పరిస్థితులను వెల్లడించే కరుణరసాత్మకమైనది. ఆనందం అర్ణవమైతే.. ఏ దేశ చరిత్ర చూసినా.. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా.. మొదలైన రచనలు ఒక సూత్రానికి ఒదిగిరావు. అందువల్ల మహాప్రస్థానం మహాకావ్య స్థాయిని పొందక ఖండకావ్యత్వాన్నే పొందింది. శ్రీశ్రీ కాల్పనిక వాదానికి స్వస్తిచెప్పి 30 సంవత్సరాపాటు తెలుగుసాహిత్యాన్ని పరిపాలించాడు. ఇదే సమయంలో కాల్పనిక వాదాన్ని చుట్టగా చుట్టి మహాకవిత్వ సముద్రంలో విసరివేసిన విశ్వనాథ నవ్యసంప్రదాయ ఉద్యమానికి కారకుడైనాడు. ఖండకావ్యాలకు పరిమితమైన తెలుగు కవిత్వం మహాకావ్య ఆవిర్భావంతో తన రూపాన్ని మార్చుకున్నది. సౌందరనందము మొదలైన కావ్యాలు తమ నూతన భాషతో, భావనలతో సమకాలీన చైతన్యంతో పూర్వ కవిత్వంతోని అనుబంధాన్ని తెంచుకోకుండా ఆధునికులకు, తమ చిత్త సంస్కారాన్ని స్ఫురింపజేసేలా కావ్య ప్రవాహం కొనసాగింది.

1955-56 దాకా కొనసాగిన నవ్య సంప్రదాయం బలం పెంచుకొని ఛందోరూపాన్ని మార్చుకొని ప్రగతివాదంలోని తిరుగుబాటు మొదలైన అంశాలను చేర్చుకొని పునరావిర్భావం చెందింది. ఈ సందర్భంలో తెలుగు కవిత్వ రంగంలో దాశరథి, నారాయణరెడ్డి, తిలక్‌, ఆరుద్ర, విద్వాన్‌ విశ్వం, పుట్టపర్తి నారాయణాచార్యులు, శేషేంద్రశర్మ, కుందుర్తి.. మొదలైన కవుల పరంపర వివిధ భాషావేషాలతో కొత్తపాతల మేలు కలయికలతో ముందుకు వచ్చింది. వీళ్లలో చాలామంది ప్రాచీనమైన పద్య ఛందస్సును.. జానపదాల్లోంచి కదలివచ్చిన గేయమును, ప్రయోగవాదులు అందించిన వచన పద్యాన్ని.. ఏ ఒక్కటినో కాక.. అన్నింటినో.. కొన్నింటినో సాధనచేసినవాళ్లే. ఏ పరిమితులూ లేనివాళ్లే. ఈ యుగ కవులలో శిరస్థానం అందగలిగిన దాశరథి ప్రగతివాదాన్ని జాతీయోద్యమ భావాల్ని, నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని తనలో గర్భీకరించుకొని ఒక అద్భుతమైన సమన్వయాన్ని తెలుగు సాహిత్యానికి అందించారు. ఆయన పద్యం శ్రీనాథుడికి, విశ్వనాథకు, కృష్ణశాస్త్రికి దగ్గరగా సాగుతూనే తన వ్యక్తిత్వ ముద్రణను ప్రకాశింపజేసింది. దాశరథి కొన్ని జాతక కథలకు కావ్యరూపమిచ్చి మహాబోధి రాశాడు. ముసునూరి కాపయ.. నాయకుడుగా ఒక మహాకావ్యం నిర్మించబూనినా.. అది ఆయన కొనసాగించలేదు. ఈ తరంలో ఆరుద్ర ప్రగతివాదిగానే ప్రారంభమైనా.. దాని మూలాల నుంచి ఒదుగుతూ.. కదలుతూ నిత్య ప్రయోగశీలియై రచనలు కొనసాగించాడు. ప్రయోగాల గాలిదుమారంలో ఆయన తనకున్న ప్రతిభను సినీవాలి వంటి రచనల్లో మాత్రం కావ్యరూపాన్ని అందించాడు. నగరంలోని సామాన్య ఉద్యోగి మధ్య తరగతి జీవితం ఇక్కడ కావ్యమైంది. ఇంతకుముందే కుందుర్తి ఆంజనేయులు 1946-48 ప్రాంతాల్లో తెలంగాణ విముక్తి ఉద్యమాన్ని వస్తువుగా ఒక మహాకావ్య నిర్మాణం చేశాడు. పద్యం రాయగలిగి కూడా.. దాన్ని ప్రక్కకు పెట్టి, వచన పద్యాన్ని కవిత్వానికి ప్రధాన వాహికగా నిర్ణయించి ఒక ఉద్యమమే నడిపాడు. వందలాది వచనకవులు ఈ సందర్భంలో ఆవిర్భవించారు. ఆయన ఎన్నో వచన కవితా సంపుటాలు ప్రకటించినా తెలంగాణ అన్న కావ్యం ఎన్నో పర్వాలుగా సమకూర్చి ఆ వచన పద్య రూపానికి కావ్యత్వ సిద్ధికి హేతువైన బలం ఉన్నదని నిరూపించారు. ఈ కావ్యం మొత్తం రూపకాలంకార బాహుళ్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. 1946 ప్రాంతంలో కమ్యూనిస్టులు సాగించిన ఉద్యమం లక్ష్యం ఏదైనా ఆయన పోలీసు చర్యతో ఆ ఉద్యమానికి భరతవాక్యం చెప్పి జాతీయ వాదానికి బలం చేకూర్చాడు. అప్పుడే సి నారాయణరెడ్డి జలపాతం వంటి రచనల్లో గొప్ప పద్యం రాసినా.. తరువాత గేయమే ప్రధాన వాహికగా కొంతకాలం.. వచన పద్యమే ప్రధాన వాహికగా మరికొంతకాలం కవితా సృజన సాగించాడు. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు వంటి గేయ రచనలు ఇంతకుముందు పేర్కొన్న నవ్య సంప్రదాయ మార్గంలోనివే. ఛందస్సు మాత్రం గేయరూపమైంది. ఇవి ఒక విధమైన మహాకావ్యాలే.  ప్రణయము, దేశభక్తి, బౌద్ధ ధర్మ భావనలు, చారిత్రక వీరుల మరణం.. మొదలైనవి ఈ కావ్యాలలోని అంశాలు. తర్వాత భావాత్మకమైన కావ్యాల రచన.. ప్రాచీనులు చెప్పిన విభావాదులను పక్కనపెట్టి ప్రతీకలనే విభావాదులుగా మలచి ఒక నూతన కావ్య సృష్టి ప్రారంభమైంది. ఈ నూతన సృష్టిలో సినారె, శేషేంద్ర, విద్వాన్‌ విశ్వం మొదలైనవారు ప్రముఖస్థానాన్ని ఆక్రమించారు. ఆరుద్ర సినీవాలి కూడా చాలావరకు ఈ మార్గానికి చెందినదే. శేషేంద్ర నా దేశం నా ప్రజలు గొరిల్లా వంటి కావ్యాలు ఈ ప్రతీకాత్మక నూతన సృష్టికి నూతన సంకేతాలైనవి. ఈ కాలంలోనే సినారె భూమిక, విశ్వంభర, మట్టి మనిషి ఆకాశం వంటి భావాత్మక కావ్యాలను నిర్మాణం చేశారు. వీటన్నిటి అనుభవంలో పూర్వ రసరీతి కనిపించదు. కానీ, విశ్వచైతన్యంలోని అద్యతన పరిణామాలు ఒక కమ్రంలో చలనచిత్రాలుగా పాఠకుని మనః పరిధిలో స్ఫురిస్తూ పోతాయి. టీఎస్‌ ఇలియట్‌ ది వేస్ట్‌ల్యాండ్‌ అన్న కావ్యం ఈ రచనలన్నింటికీ మూలభూతమైన రచనగా చెప్పుకోవచ్చు. మహాకావ్యాలలోని ప్రక్రియా స్వరూపభేదం వల్ల కావ్యభాష మరింత తీవ్రంగా వేగంగా పరివర్తన చెందింది. కొత్త ప్రతీకలు, కొత్త భావ చిత్రాలు, శబ్ద సంకేతాలు తెలుగు కావ్య భాషలోకి ప్రవేశించి దీని స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశాయి. నవ్య సంప్రదాయము ఒక జ్ఞానపీఠ పురస్కారానికి కారణమైతే.. ఈ కావ్య ధోరణి మరొక జ్ఞానపీఠ పురస్కారానికి కారణమైంది. సామాన్యంగా ఈ కావ్యాలు మానవుని దేశకాల పరిమితులకు అతీతంగా భావించి అతనిలోని గాఢంగా దాగి ఉన్న అనంతమైన దుఃఖాన్ని వైఫల్యాన్ని సూచిస్తాయి. ఆ విధంగా శేషేంద్ర, సినారె మొదలైనవారు ఈ యుగంలో ప్రముఖ కవులైనారు.

పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండ లక్ష్మి, మేఘదూతము, శివతాండవము ఈ కాలంలోనే చెప్పుకోదగిన కావ్యాలు. విద్వాన్‌ విశ్వం రాయలసీమలోని కరవు పరిస్థితులను వస్తువుగా చేసుకొని పెన్నేటిపాట అనే ఒక మహాకావ్యాన్ని నిర్మించాడు. దీన్లో పద్యము గద్యంలాగానే నడుస్తుంది. ఆధునిక జీవితం ప్రత్యక్షంగా ప్రతిఫలించింది. కరుణము ప్రధాన రసమైంది. ఇదేకాలంలో బాలగంగాధర్‌ తిలక్‌ కవితామయములైన అనేక ఖండకావ్యాలను రచించాడు. ఈ రచనలలో ప్రగతివాద ధోరణి ఎంత ఉన్నదో.. కాల్పనిక వాద ధోరణీ అంతే ఉన్నది. ఈయన భాషాపరివేషం వల్ల ఈయనను నవ్యకాల్పనిక వాది అనవచ్చు. అమృతం కురిసిన రాత్రి అన్నది కవిత్వాన్ని అందించిన కొబ్బరిపాల వంటి రచన. నన్నయ కావ్యభాషకు, రాయప్రోలు సుబ్బారావు రూపు మారిస్తే ఆ మార్పును మరికొంతవరకు పరిణమింపజేసి నూతన కవిత్వ ద్వారాలు తెరచిన కవి శేషేంద్రశర్మ. హృద్యమైన ఋతుఘోష లాంటి కావ్యం రచించి వర్ణనలను ఆధునికీకరించిన శేషేంద్ర.. శేష జ్యోత్స్నలో ఒక గొప్ప విరహ కావ్యాన్ని నిర్మించాడు. నాదేశం నా ప్రజలు, గొరిల్లా వంటి కావ్యాలు ఆయన సృష్టికి నిదర్శనాలు. నాదేశం నా ప్రజలలో ఆయన దేశభక్తికి నూతన జన సముదాయాన్ని, రైతులను, వృత్తులవారిని లక్ష్యాలుగా చేసుకొన్నాడు. గొరిల్లా గొప్ప కావ్యమే. ఒక విధంగా గొరిల్లాకు ప్రాగ్రూపం రామాయణ సుందరకాండలోని అశోకవనంలో ఆంజనేయుడు చేసిన సమరక్రీడ. ఉత్పల సత్యనారాయణ కరుణశ్రీ తరువాత అంతటి సరళమైన పద్యాన్ని చెప్పగలవారు. హైదరాబాద్‌లోని సాహిత్య సభాంశాలను ఒక వీధికావ్యంగా ఈ జంట నగరాలు హేమంత శిఖరాలు అనే గేయంతో రచించారు. ఆ తర్వాత కృష్ణభక్తి మార్గంలో పడిపోయి భాగవతసారాన్ని భక్తి కాంతిని శ్రీకృష్ణ చంద్రోదయం అన్న కావ్యంతో వెలికి తెచ్చారు. వరంగల్‌ నగరంలో గార్లపాటి రాఘవరెడ్డి, ఉదయరాజు శేషగిరిరావు అనే ఇద్దరు ప్రౌఢ కవులు ఉండేవారు. రాఘవరెడ్డిగారిని పీవీ నరసింహరావు ప్రభృతులు తమ గురువుగా భావించేవారు. ఆయన పద్యం సరళంగా గర్వంగా ఉండేది. ఆ కాలంలోనే చిలుకమర్రి రామానుజాచార్యులు అనే యువకవి అధ్యాపక వృత్తిలో ఉండేవారు. ఆయన కవిత్వం భావకవుల కవిత్వంవలె మృదువుగా సుప్రసన్నంగా ఆకట్టుకునే విధంగా ఉండేది. వానమామలైవారి కవిత్వంలో అక్కడక్కడ సులభమైన శ్లేషలు తొంగిచూసేవి. కానీ చిలుకమర్రివారి కవిత్వంలో మాధుర్యం పొంగిపోయేది. ఆయన కల్యాణ రాఘవం అనే కావ్యాన్ని విని విశ్వనాథ సత్యనారాయణ ఎంతో మెచ్చుకొని తమ కల్పవృక్షంలోని సీతాకల్యాణ ఘట్టాన్ని చదివి వినిపించారు. అట్లాగే కాటూరి వెంకటేశ్వరరావు ఆయన పై కావ్యాన్ని (కల్యాణ రాఘవం) విని మెచ్చుకొని తామై దానిని బందరులోని త్రివేణి పబ్లిషర్స్‌తో అచ్చువేయింపజేశారు. ఆయన ఖండకావ్య సంపుటి మధురవేదన సాహితీ బంధుబృందం అచ్చువేసింది. ఆయన రచించిన గీతాంజలి అనువాదం మిత్రుల ప్రోత్సాహంతో వెలికివచ్చింది. ఆయన అద్భుతంగా అష్టావధానం చేసేవారు. చిన్నవయస్సులోనే వ్యాధిగ్రస్థులై పరమపదించారు. ఇదే కాలంలో సీవీ సుబ్బన్న.. కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లై, కోడూరి ప్రభాకర రెడ్డి, గొట్టిముక్కుల సుబ్రహ్మణ్య శర్మ మొదలైనవారు తెలుగు పద్యాన్ని బలహీనపడకుండా కాపాడుతూ కావ్యరచనలు కొనసాగించారు. ఆధునిక మహాకావ్య శ్రేణిని గూర్చి చేసిన ఈ వివేచనలో ఇటీవలి ఇరవై ముప్ఫై సంవత్సరాలలో వచ్చిన రచనలు పరిశీలించడం జరుగలేదు. నాకనిపిస్తుంది.. మహాకావ్యానుభవం రెండు ముఖాలుగా ఉంటుందని. ఒకటి.. మానుషానుభవం. భరతాదులు చెప్పిన రసమార్గంలోనిది. రెండవది.. ఆధునిక కావ్య శాస్త్రజ్ఞులు వివేచించే భావాత్మక కావ్య పరంపర ఇచ్చే ప్రతీకానుభవం. ఈ రెండూ ఒకదానికొకటి అనుబంధాలుగానే భావించాల్సి ఉంటుంది. రెండూ లోకగతమైనవే. ఒక చోట వ్యక్తి ప్రత్యక్షంగా.. మరొకచోట సంకేతంగా దర్శనమిస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here