తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-11

0
12

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
101.
క్షీరంబున నవనీతము, సాగరంబున హిమరాశి
తిరముగ తేలియాడినట్టు తెలియనేరని
పరమమేయ శక్తి, గాలి యూపిరుల వలె యొకటై
బరగు చున్నదమేయమై – మంకుతిమ్మ!

102.
నిర్దిష్టమీ పాంచ భౌతికకాయము – కాదది మనంబు
నిర్దిష్టమీ స్నాయువుల సంఖ్య – కావవి జీవకణంబులు
నిర్దిష్టానిర్దిష్ట మిశ్రణమీ నరజన్మ
నిర్ధారమిది నియ్యలకును – మంకుతిమ్మ!

103.
తెలసిన భూరాశికి కట్టడిగ నున్నదీ తెలియని జలరాశి
వలసిన కార్యమాచరింప కట్టడి చేయు మనోభ్రపటలము
తెలియని వన్ని చుట్టియుండ తెలిసిన వాటి లెక్కగొన నేల
తెలిసియు తెలియని మిశ్రణమే ఇమ్మాయ – మంకుతిమ్మ!

104.
ఆరని నందా దీపమీ కాలము; అపారము దాని పాత్ర
చిరుదివ్వె ఈ బ్రతుకు; ఈ మిణుకు దీపమును గాలి
ఆర్పివేయ, ఇంకొక దీపమును వెలిగించు ఆ నందాదీపము
నిరతము ప్రవహించునది తైలమే – మంకుతిమ్మ!

105.
కుడ్యమది లేక చిత్రరచన యదెట్లు వీలగు?
కుడ్యమదెట్లు భాసించు చిత్రరచన లేక?
కుడ్యమిది శాశ్వతము, క్షణభంగురము చిత్రము
కుడ్య – చిత్రాల సంబంధమే తత్త్వము – మంకుతిమ్మ!

106.
సురక్షితమీ జీవనము ఇయ్యనంత జగచ్చట్రమునందు
నిరాకార నభంబున సాకార ఘనతతి వోలె
నిర్లౌకిక తత్త్వమడగి యుండవలె లౌకిక వ్యవహారంబున
సరైన లెక్కయిది – మంకుతిమ్మ!

107.
తెలియనిది – లేదని భావించు నాస్తికుండు
తెలియని దానికి నమస్కరించు ఆస్తికుడు
తెలియని దానిని శోధించి తెలియు విజ్ఞాని
తెలిసికొనిన దానిని శోధించు వాడు మౌని – మంకుతిమ్మ!

108.
జడమేది? జీవమేది? చైతన్యమది నిదురించ
జవసత్వములు లేక నిదురించు ఎండుగడ్డిలో యడగియున్న
జీవ చైతన్యము మేల్కొనగ చలించు జీవజగము
జీవమునకు నెలవు జడమే – మంకుతిమ్మ!

109.
శిలయై, జడమై నిదురించున్న పడతి
అల రామపాదము సోకినంత మేల్కాంచిన రీతి
చలనము శూన్యమైన జడంబునకు దైవకృప సోకిన
చాలు, చలించి జీవించు – మంకుతిమ్మ!

110.
హిమగిరిని కనినంత, యతిహీనమై కన్పించు క్రిమి
క్రిమికి లేవే ఆకలిదప్పులు; శ్రమించదేయది యుదర పోషణార్థమై
అమిత సంతానంబు లేదే దానికి? హిమగిరి సమకాలీనము కాదె
క్రిమి? మరి దాని హీనంబున చూడనేల – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here