తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-14

0
9

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
131.
సింహశార్దూల హయ మృగాదుల యూపిరి
విహగ, పన్నగ, మూషిక నిట్టూర్పు లెల్ల
అహరహము లయమై యున్నవి మన యూపిరిలో
అహహ! కలగాపులగము మన యూపిరి – మంకుతిమ్మ!

132.
రాముని యూపిరి పోవదే రావణుని వైపు
రాముని వైపు వీచదే రావణుని యూపిరి
రామ రావణుల యూపిరి లేదే మనయందు
భూమిని నూతన మదేది – మంకుతిమ్మ!

133.
బహిరంతరంగంబు లొకటె – భూత భవిష్యత్తు లొకటె
ఇహపరంబు లొకటె – చైతన్య మొక్కటె
బహు పాత్రాభినయపు వేలవేల మాయావేషాల
వహించు కర్త తా బ్రహ్మ కాడె – మంకుతిమ్మ!

134.
ఏకము నుండనేకము లయ్యేనకముల నుండేకము
ఈ క్రమానుగతమే ఈ విశ్వపు అంగాంగ బంధము
లోకమందు, జాతియందు, వ్యక్తి సంస్థల యందు
సాకల్యపు భావన నీ మది నుంచు – మంకుతిమ్మ!

135.
గోళాకారపు ఈ భూమండలపు నాభి యేదనిన, నీ వూహించినదే!
ఎల్లవేళల చలించు ఈ విరించి కందుకాన నీవును
తళుక్కుమనెడి తటిల్లతవోలె, వజ్రాయుధపు పదును
వోలె, చరింపుము – మంకుతిమ్మ!

136.
విశ్వంపు తుది యదెక్కడో, సూర్యచంద్రుల కావల, ఈ
విశ్వంపు కేంద్రము నీవకాదె, నీవను భావించి చూడ
నిశ్వాస యుచ్ఛ్వాస సంబంధ మది నీకును దిగంతమునకు,
పుష్పమై వెదజల్లు సౌరభాల – మంకుతిమ్మ!

137.
నేను, నేననువాడె ఈ విశ్వచక్రపు కేంద్ర బిందువు కాడె
కానగలడు వాడు ఈ దిగ్వలయంపు పరిధి
అనంతమీ జగచ్ఛక్రాభిక్రమము
కాననగు సత్త్వమిది యొక్కటే – మంకుతిమ్మ!

138.
ఆకాశపు టావల నుండి దిగివచ్చిన ఈ విశ్వ సత్త్వము ‘నే’ ననెడి
యాకారంబుగ చేతనత్త్వము నొందెనో, లేక ‘నే’ననెడి తత్త్వమది
ప్రాకారంబుగ విశ్వము నావరించినదో! దీని
పోకడయు, మర్మమదేమో – మంకుతిమ్మ!

139.
సత్యము కావవి సృష్టిలయములు, యయ్యవి కట్టుకథలు
సత్యములవి రెండును మాత్రమే చావుపుట్టుకలు
నిత్య పరివర్తనమే చైతన్యవర్తనము
సత్యమిదియె తెలియుము – మంకుతిమ్మ!

140.
ఋతు చక్రమది చలించు; కనుమరుగగు కాలము
మృతుని మట్టిపై జనించు నవసస్యములు
క్షితి ధరించు గర్భము, యుద్భవించు జీవి మరల
సతత కృషి ఇది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here