తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-16

2
10

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

151.
దైవత్వ మది నెలసియున్నదీ ప్రకృతి శక్తి యందు
జీవులవి పురాకృత వాసనా బద్ధమై చరించుచున్నయవి
ధీవర్తన, పౌరుష, పరతత్వ మనెడి
త్రివిధ రూపంబుల కాననగు దైవంపు లీల – మంకుతిమ్మ!

152.
పుణ్య పాప ఋణానుబంధ వాసనలవి
జన్మాంతర కర్మ శేష యంశంబులు
గణనకు చిక్కని యాదృచ్ఛికములవి
ఎన్న నన్నియుం దైవ నియమంబులె – మంకుతిమ్మ!

153.
ప్రారబ్ధ కర్మమది, విధి లిఖిత మవశ్య మనుభవింప,
వేరు వేరు పేర్ల విధియని యదృష్టంబని వినంబడు,
అరయ నెవ్వరు వాటి యాగమన నిర్గమనాల
పౌరుష వివేకములె వాటి నెదురింప సాధ్యము – మంకుతిమ్మ!

154.
ధర నుండి నిరతము క్రొంగొత్త రసము
వేరున కందించి క్రొంజిగురాకు తల నిడినట్లు
పరిపరి విధములు క్రొంగొత్త సృష్టి సత్త్వములవి వచ్చి
చేరి, జగమును నిత్య నూతనంబుగ జేయు – మంకుతిమ్మ!

155.
అనిలమది యాకసము నుండి యద్రి గుహాంతరాలు జొచ్చి
మన యూపిరిలో యూపిరై మసలినటుల
కానరాని యా పరతత్త్వ మదెచటి నుండియొ వచ్చి
మన యసువుల జేరియుండు – మంకుతిమ్మ!

156.
తడుపుచు, కత్తరించుచు, నుత్తరించుచు
యుడికించుచు, వ్రేల్చుచు, కాల్చుచు
పుడమి బానశాల యందు మా బ్రతుకుల
వండి నోరు చప్పరించు విధి – మంకుతిమ్మ!

157.
నేర్వవలె ఈ నరజాతి సానుభూతి యని యెంచి యా
పరబ్రహ్మ నియమించె విధిని, లేరు పరులెవ్వరు
పరమాత్మ యందరని భావించి కలిసి
తిరుగుము నీవీ భువిని – మంకుతిమ్మ!

158.
కరములు రెండవి యదృష్టమునకును, పూర్వపర సంస్కార వాసనలు
కరములు రెండు చేరిన దోసిలిలో పట్టుబడియున్నది
నరుని జీవితంపు యొత్తిడి, విడువని ఆశ యాతని
పరిధికి మీరియున్నది – మంకుతిమ్మ!

159.
తాపించుచు, తనియించుచు, లాలించుచు, ఋతువైద్యుడు
భూపటలంబుపై పుటంబువెట్టి జీవరసంబుల పక్వంబు జేసినట్టు
పాపిని ప్రోత్సహించి, పాపరహితుని పరీక్షించుచు
వేపుచున్నాడు విధి మనలను – మంకుతిమ్మ!

160.
ఏ నీట ఏ పప్పు ఉడికినదో తెలియునే భోక్త
ఆ నీ జీవనంపు పాకమేరతి పక్వమగునో
ఆ నియమము లన్నియున్ నీకు తెలుప నగునే
అన్నియున్ దైవ రహస్యములవి – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here