తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-19

0
7

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
181.
ఓ నిమిషంబులోన యమశూలము నిను జంప
అనుక్షణంబున జంపు నిను మోహపాశములవి
నిను తమ నురిన్ నీ మెడకు దగిలించి మెల్లమెల్లగ
యనుదినము బిగించి చంపు – మంకుతిమ్మ!

182.
ఋణపు మాయాజాలము, కర్మచక్రము లివి యనంతము
జన్మజన్మల తంతువులవి, లేదంతము
అనవరతము నూతన మనిపించెడి యా తంత్రమే
వినోద మా పరమేష్ఠికి – మంకుతిమ్మ!

183.
సుఖముల్ లభించు పుణ్యకర్మ ఫలము చేత,
సుఖములవి మద మోహములకు కారణమగు
దుఃఖ మొనగూడు పాపకర్మఫలము చేత; సుఖ
దుఃఖము లన్యోన్య జనకములవి – మంకుతిమ్మ!

184.
చూడన్ జూడ ఈ లోక సహవాసము చాలనిపించు,
వాడి పోవు పూమాల; చర్మము మీది తామరను (గజ్జిని)
కడుంగడు గోకవలదు; అంటీ అంటక తప్పించుక
నడయాడుము నేర్పు తోడ – మంకుతిమ్మ!

185.
దయామయ జీవనంబునకున్ లేదే వెలయును, ఫలంబు
దయ, ప్రేమానురాగ మధుర భావంబుల కెల్ల చోటు లేదే
హేయమని వీటిని విధియంగడిని కసవూడ్చినట్లూడ్చిన
ఏ యుపయోగమున్నదీ బదుకున – మంకుతిమ్మ!

186.
వెదుకులాటయే ఈ ఏకాకి జీవికి బ్రతుకంతమున్
వెదకి వెదకి, చేచాచి పట్టుకొన యత్నించు నితర జీవుల
వెదకు ప్రీతి మమతానురాగ ఋణంబుల కొఱకు జీవి,
హృదయ భావనల కప్పిపుచ్చనగనె – మంకుతిమ్మ!

187.
తారుమారైన యక్షరములన్ సవరించి పదములన్ కట్టు ఆటలో
మార్చి మార్చి జతచేసి పదముల కట్టురీతి; వధూ
వర జత కూర్పులున్ యవ్విధంబు గాదె
పరికించి చూడగా – మంకుతిమ్మ!

188.
షడ్రుచులన్ గలిపి పక్వమొనరించి వండి
వేడి ఘుమ ఘుమల యంతటన్ వ్యాపింప జేసి
కడు నోరూరింప జేయు నీ ప్రకృతి కె
వడు వశము కానివాడు – మంకుతిమ్మ!

189.
వివిధ రూప కాంతులతోడ కనువిందు జేయు
వివిధ మధుర ఫలముల తోడ రసనను తృప్తి పరచు
వివిధ గీతాలాపముల తోడ వీనుల విందు జేయు నీ
వైవిధ్య ప్రకృతి; దీని రసికత యదెంతయో – మంకుతిమ్మ!

190.
నరుడను మృణ్మయ ఘటంబున యమృత కణంబు భద్ర
పరచి, విచక్షణాశక్తి యనెడి యుపనేత్రము పొందు
పరచి సుభిక్షపు నడుమున దుర్భిక్షము నదేల నిరికించెనో!
యక్రమమో, క్రమమో నియ్యది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here