తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-20

0
11

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~
191.
తన కుక్షిం నింప, ఖగ మృగ కీటకాదుల వెదుకులాట యందే
తన జీవవంబును గడుపుచుండె నరుడు; దేహపు చింతయే
గాని, యాత్మ నన్మరచి చరించుచుండు గాని
దాని కుయ్యి వినడాయె – మంకుతిమ్మ!

192.
దేవదానవ రణరంగ మీ మానవ హృదయంబు
భావ, రాగద్వేషంబులే వారి సేనా సమూహంబు
భువిన్ భూరి విజయంబులే నిజమని భ్రమించి
జీవామృతంబును మరతురు – మంకుతిమ్మ!

193.
తన చాతుర్యమున్ దెలియజేయ నిర్మించే పరమేష్ఠి
తాను జంతువుల రెండింటిని; మరి యూరకుండక
తానా రెండింటిని యొకటి జేసి, వెఱగొందె, మానవునందు
వానర వృకంబుల గుణంబుల గని – మంకుతిమ్మ!

194.
అంతరంగంబులు విప్పి చూపగల వారెవ్వరు?
అంతరంగ గాంభీర్యముల తా గాంచిన వాడెవ్వడు?
గ్రంథుల బంధనాల చిక్కుబడి పోయినవన్నియు
స్వంతంబుగ పరికింప నసాధ్యము – మంకుతిమ్మ!

195.
మొగంబులు నాల్గు; స్త్రీపురుష భేదంబులు లేక ఇర్వురకున్
జగమునకు కన్పించునదొక్కటి, స్వజనంబుల కింకొక్కటి
సొగసైన కోరికల కొక్కటి, తనయాత్మకే వేరొకటి
తగ వ్యామోహంబు లెన్నో మొగంబులన్ని – మంకుతిమ్మ!

196.
మానవ మనోవికారముల సరిజేయ నీదు కోర్కె యేని, తొల్త
మనసుల వీక్షించు దర్పణంబుల సేయుము నిర్మాణంబు; నందు
కాననగు వారి వారి యంతరంగంబుల వికారంబుల
అనుపమ నసహ్యంబుల – మంకుతిమ్మ!

197.
క్రోధము తోడ నిండిన సింహశార్దూల
ఏదుబంది, కపి, వేటకుక్కలాది మృగముల
వదనంబుల ఘోర చేష్టలెల్ల; వెలసియున్నవి
పదిలంబుగ నరుడి మనంబులోన – మంకుతిమ్మ!

198.
అత్యాశ దిరిగే దివిటీ చేతబట్టి వీధుల పట్టపగలు
సత్యవంతుని కనుగొన; నిరాశచెంది నిందించె జగమును
తాత్త్వికుడు డయోజనీస్; వసించె నీటి తొట్టియందె
సత్యవంతుల కిది కాలంబు కాదయా – మంకుతిమ్మ!

199.
ఎడదలోన, బుద్ధిని, వాక్చర్యలలోన
ఎడతెగని విడదీయగరాని తెరలు తెరలుగ
కడు ముడులున్నవి; ఇదమిత్థమను నదేది, మానవ స్వభావంబు నందున
‘వాడి’ హస్త లాఘవ మిది – మంకుతిమ్మ!

200.
ఆకలి మంటలు చాలవన్నట్లు లదెందులకో విధి
సంకల్పించె నరునకు కడుపు మంటయు
ఆకలి తీరినంత తోడేలది విశ్రమించు
ఆకలి తీరియు శమింపదు నరుని కడుపు మంట – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here