తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-21

0
10

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
201.
నీరమదెక్కడ మండెడి కడుపు మంటనార్ప?
నరకమది మదిలోన పదిలమైన – కంటికి, కునుకెక్కడ?
హరియింప తరమే నెవ్వరికైన నరుడి ఈర్ష్యాద్వేషంబుల
హరి యొక్కడే గతి వారిని సరిజేయ – మంకుతిమ్మ!

202.
దశకంఠుడైన నేమి రావణుడు? శతకంఠుడు కాడె నరుడు
ఆస్య మొక్కటే గాని శతాస్యాల భావంబుల జూపించు, పం
చాస్య కాళమై బుసగొట్టు; గాండ్రించు, బెకబెకలాడు, పరువెత్తు
మసలు భూమ్యాకాశంబులకు తనకు సరిలేరని – మంకుతిమ్మ!

203.
నెలసియున్నవి పక్షులు తలలోన
కిలకిలా రావములు సేయు శుక, పిక మయూరంబులు,
పలు ఘోర కఠోర నినదంబులు సేయు కాక ఘాక గృధ్రములు
కలుషిత మయ్యె మనము నిద్ర కరువయ్యె – మంకుతిమ్మ!

204.
దైవ, పశుత్వాంశముల మిశ్రణమే మానుషత్వము
ధీ విమర్శ మొనరించి, దైవాంశముల స్వాగతించి
భావ విమర్శన గావించి, అసురగుణముల నడగించి చేయుము
జీవనము; ఇదియ జీవికి ప్రగతి మార్గము – మంకుతిమ్మ!

205.
ఒక్కచో శిలయై నిలచు, ఒకచో తీగవలె చలించు
ఒక్కచో కంటకమై నొప్పించు; వికసిత కుసుమమై వర్తిలు నొకచో
ఒక్కచో తరంగాల రీతి పైకెగసి మెఱయు; తిరము గాదు నరుని వర్తనము
లెక్కగొన రాదీ యల్పుని – మంకుతిమ్మ!

206.
చిత్తుజేసితి నా యాశల; నే జయించితి నింద్రియాల
చిత్తము నాయది తిరమై యున్నదనెడి యహంకారమేల? మోహ
విత్తనముల తెచ్చి నాటదే మనమున గాలి, మొలక
ఎత్తదే యది మరల మరల – మంకుతిమ్మ!

207.
మండుటెండకు వాటి మోడై, కనరాక యుండెడి
ఎండిన తృణమది మరల చిగురింపదే వర్షంపు జల్లుల చేత
ఎండి మోడైన వారి జీవితపు కష్టంపు దినముల్పోయి, మరి
పండవే దశ తిరిగిన వేళ – మంకుతిమ్మ!

208.
అద్దానికని, ఇద్దానికని వేరొకదానికని వెదుకులాటయే
బ్రదుకంత; క్షణక్షణము చిగురించు క్రొత్త కోర్కెలు,
కుదియుచున్నది మనసు అహరహము, సిరిసొగసు కీర్తుల
అధికార కీర్తుల మరి మరి తలచి – మంకుతిమ్మ!

209.
ఆహార, నిద్రా భయ మైథున క్రియలందు తనివి జెంది
విహరించు జల, వన, ఖగ చరకోటి; తనివి జెందడు
దాహార్తి మనుజుండు; క్రొత్త కోరికల దీర్చుకొన
సాహసించు అతృప్తుడతడు – మంకుతిమ్మ!

210.
డొక్క ఎండిన తరి చద్దియన్నమె చాలు యది మృష్టాన్నమును;
చొక్కపు చిన్నదాని నాపేక్షించు వాడు కడుపు నిండిన తరి,
చొక్కపు కనకమును, పదవి ప్రతిష్ఠల నాశించు తదుపరి,
ఎక్కువగు వాడి వాంఛలు మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here