తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-24

2
12

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

231.
నేడు పొంగిన యల యది నాడు రేపు క్రుంగు; మరి యదియె
నాడు క్రుంగినది మరల పొంగు వేరు రూపంబున
నేడు, నిన్నటి యలల నన్నిట కూర్చి చూచిన
కడు వెరగనిపించు కడలి – మంకుతిమ్మ!

232.
అతి సులువుగా మార్చవీలగు విరిగిన పాలను తక్రంబుగ,
పతనమగు దాని నిల్వరించుటయు, పతనమైనదాని నుద్ధరించుటయు
శిథిలంబులు కన్మరగు కాకుండునట్లు, పురాతనాల నూతనంబు జేయు
యతనమే శాశ్వత ధర్మము – మంకుతిమ్మ!

233.
నూరారు వక్రంబు లున్నవి సృష్టి విధానంబున, దీని
సరిజేయ వలెననెడి వారిది మూర్ఖత్వమే యగు, యొకరికి
సరికాని దింకొకరికి సరియగు గాదె; సృష్టి తత్త్వ
మరయ నరుడేపాటి – మంకుతిమ్మ!

234.
ఒక ప్రక్క నొకటి, ముందు భాగమందునే కన్ను లెందుకో రెండు; వీపున
నొకటి ఎదన మరి యొకటి యుండిన సుకరంబు గాదె
వికటంబు లవెన్నొ సృష్టి క్రమంబున యని యాడెడి జన
వాక్యంబులకు మాన్యత ఎక్కడిది – మంకుతిమ్మ!

235.
తన సంతానంబును వృద్ధి జేయ సస్య, ఫలంబుల నిచ్చు భూమాత, మరల
తాను పడయు యందలి యర్ధ భాగంబును,
మన దేహంబునో వంటపాత్రగ వాడు
కొను యుక్తి ఆ పరమేష్ఠిది – మంకుతిమ్మ!

236.
తరు ఖగ మృగ జాతులు వేనవేలు,
నరజాతి భిన్నము తక్కిన వాటి కంటె
నరుడొక్కొక్క డొక్కొక్క తీరు, వాని జగమె వేరు
చేరియున్నవి సామ్యాసామ్యములు వానియందు – మంకుతిమ్మ!

237.
నేల యొకటె; ఇది మాగాణి, యది తోట, ఇది బీడది బంజరని వేరు
జలమొక్కటె, యైన, ఇది యుప్పు, యది మంచినీరు, యూటనీరని వేరు
కులమొక్కటే మైన యన్నదమ్ముల గుణంబులె వేరు
ఇల వేయారు రీతులు – మంకుతిమ్మ!

238.
మనుజ కుల మొక్కటే, యైన తీరులు వేరు రీతులు వేరు
తను ముఖంబు లొకటైనను రూప గుణంబులు వేరు
మనంబుల వారి యాలోచనలే వేరు
భిన్నత్వంబున ఏకత్వము – మంకుతిమ్మ!

239.
సమత లేదు ప్రకృతి యందు; లేదు సమత నరుల యందు
క్షమయు లేదామె యందు; కర్మానుసారమే ఫలము, ‘నేను నా
క్రమమున నడచుకొనెద’ నంటివా, ‘సరిచూచెదగాక’ యని;
యామె, యా ప్రకృతి మనకు ప్రతిస్పర్ధి – మంకుతిమ్మ!

240.
పరస్పర భిన్నములై యున్నవీ వ్రేళ్లని చూడ
కర ధర్మమున కుచిత రీతి నున్నవి వాటి హెచ్చుతగ్గులు
కరమున వ్రేళ్లవి సమముగనున్న పట్టువడునే వస్తువులవి
పరస్పర భిన్న రీతులె సరియగు కార్యమొనరింప – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here