తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-25

0
12

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

241.
అసమత యందు సమతయు, శత్రుత్వంబున మైత్రియు
అసమంజసమున సమన్వయ సూత్రమే నయము
వెసమయ సంసారంబున వినోదంబు కన్గొను
రసికతయె యోగము – మంకుతిమ్మ!

242.
ఏకత్వమనేకత్వంబులు, నియంత్రణస్వాతంత్ర్యంబులు
తర్కవితర్కంబులు, సాధ్యాసాధ్యంబులు
యొక్కట నన్నింటగలిపి కూర్చిన
చిక్కుల బొంత యిది – మంకుతిమ్మ!

243.
నిజముగ నిద్దరే గలరీ జగాన పక్షపాత రహితులు
యా జముండొకడు, జఠరాగ్ని వర్యుడొకడు
నిజ జఠరాగ్ని నుపశమింప జేయ మనల శ్రమింప జేయునొకడు
ఇజ్జీవికి శాంతి చేకూర్చ సమయించు నొకడు – మంకుతిమ్మ!

244.
కాదను వారుందురే యహింసావ్రత మార్గంబును
యద్దాని నాచరింప యవరోధంబులు గలవు కొన్ని
ముద్దుగ హరిణంబున తిను బెబ్బులి మేయునే జీర్ణతృణంబు, కాన
రాదు దయ సృష్టి యందు – మంకుతిమ్మ!

245.
ప్రీతిన్ తన సంతానంబును పెంపొనరింపదే నరభక్షకి బెబ్బులి
ప్రీతి యనురాగంబు లడగియుండవే దాని యందును
ప్రీతి యనురాగంబుల వెదజిల్లుటే నరుని ఘనత
ప్రీతి ఆత్మ విస్తారకము – మంకుతిమ్మ!

246.
ప్రేమ బీజంబుల వోలె ద్వేష బీజంబులున్ గలవు
సౌమ్య సంక్షోభముల్గలవు రెండును ప్రకృతి యందు
భ్రమింప జేయు సృష్టి విషమ లక్షణములివి
సామరస్యము నన్వేషింపుము – మంకుతిమ్మ!

247.
గేహము నుండింకొక గేహమునకు వ్యాపించు పొగ వోలె
దేహము నుండింకొక దేహమునకు ప్రసరించు జీవన జ్వాల
అహరహమిట్లు పరస్పర గుణసమ్మిస్రణమది జగద్విలాసము
అహహ! అద్భుతమైనదీ మనసు – మంకుతిమ్మ!

248.
వేనవేలున్నవి ప్రకృతికి నీవు చెల్లించు సుంకంబులు
కనలు నామె నీవు మరచి చెల్లింపవేని; మరియు దండించు
ఎన్నగ, ప్రకృతి సదుపాయంబుల మితంబుగ నుపయోగించి
మానుగ, సక్రమముగ దీర్చవలె నామె ఋణము – మంకుతిమ్మ!

249.
పాడు రోత ఈ జీవనంబని ఈసడించుకొను వారలేగాని, ఈ
పాడు రోతల నుండి తప్పించుకొను చతురుడెవరు కానరాడు,
ఊడిగమో, జగడమో, వేడియో, పడుపాట్లు పడియో
కడదాక విడువక సాగించవలె జీవనము – మంకుతిమ్మ!

250.
పరమేష్ఠి ప్రసాద మీ జీవనము; పరమైశ్వర్యంబిది
పరగ, నూర్జిత సేవాకార్యక్రమమే మన కార్యము
అరయగ, నీయగల వాడెవడు? పడయు వాడెవడు?
దొరకునదేదో యదియ మహాప్రసాదము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here