తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-26

0
17

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

251.
‘ఊర్థ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్!’ ఈ
యశ్వత్థ జగము మొదలు తుది యనక వేర్లూని యున్నది
అశ్వత్థ వృక్షము వోలె వృద్ధి నొందుచు నున్నదీ నరకోటి
శాశ్వతుడా బ్రహ్మ నెలసియున్నాడందు – మంకుతిమ్మ!

252.
కొమ్మ యొకటి వాడిన మరి యొకటి చిగురించు
ఎమ్మెయినైన వసివాడక పచ్చదనంబున నుండు నీ యశ్వత్థపు
కొమ్మరెమ్మలు, ఈ విశ్వవృక్షమును నీవొక
కొమ్మవై మసలుము – మంకుతిమ్మ!

253.
తరియించుము నియ్యశ్వత్థపు సేవలో నిరతము నీవును;
విరిదోటలో కలుపు దీసి, పాదుజేసి నీరము నిడు తోటమాలి వోలె
ధర్మము నీయది విస్మరింపకుము, యది నీ కర్తవ్యము
నిర్వహించుము కార్యము – మంకుతిమ్మ!

254.
తిలకించు మోయి, నాటకంబుల నీ బ్రహ్మండ రంగస్థలంబున,
వేలవేల పాత్రధారు లెందరో, విచిత్ర వేషధారులెందరో!
తెలియదు కథ ఎయ్యదియో, మొదలేదో తుది ఏదో
తెలియరారు ప్రేక్షకు లెవ్వరో – మంకుతిమ్మ!

255.
ఇన్నాటకంబున మనము గలసి పోయి, నటించి పొందవలె మెప్పు
ఇన్నాటకంబును తిలకించి, పులకించి, నర్తించి
ఎన్నెన్ని పాఠంబులు నేర్చినవాడె జీవసత్త్వ మెఱింగిన యోగి
ఇన్నాటకపు నయము దెలియవలె – మంకుతిమ్మ!

256.
ఇహమును విస్మరించి, పరంబుపై దృష్టి సారించి, ఇద్ధర
సహ్యంబు కాదని యెంచి, దీని తృజించనుంకించి, కర్తవ్యంబులన్ మరచు
సాహసమది, నాకమునకు నిచ్చెన వేయుపగిది గాదె; నీ పెరడున
మోహమున పూచిన పూవు మేల్గాదె – మంకుతిమ్మ!

257.
పరంబు జేర సోపాన మొకటున్నదని ఎంచినన్; ఇహము
పరము కంటె యంత తుచ్ఛమైనదా! మోయ తీరవలసిన
భారంబుల నెల్ల మోయలేక, ఇహమును నిందించ దగునే!
పరంబు జేర ఇహమే సోపానము – మంకుతిమ్మ!

258.
వలదు వలదీ జీవనమని యనబోకు సాగించు
ముల్లాసంబుగ జీవనంబును కడవరకును, పోరాడుము
నిలిచి ఎదురొడ్డి వెనుకడుగు వేయక
నెల్ల వేళల సిద్ధముగ నుండుము – మంకుతిమ్మ!

259.
కడలిని చిలికిరి సురాసురులు తమ భుజ బలంబులొడ్డి;
పుడిసిలి బట్టి త్రావె కడలినిన్ కుంభజుడు తపోబలంబు చేత;
కడవారు, భుజబల, తపోబలంబులు లేక సాధించగలరే!
పుడమి నియ్యవి వలయు సాధింప – మంకుతిమ్మ!

260.
ద్రాక్షాపాక రసానుభవము గాదు జీవనానుభవము,
ఇక్షు రసానుభవమది కష్ట భోజనానుభవము
దక్షత చేత నింపుగ గ్రోల వలె నిక్షురసము
మక్షికమునకే మిగిలిన దెల్ల – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here