తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-7

0
11

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
61.
నక్షత్ర మండలము కావలి వైపు నుండి వచ్చెడు ఓ ధ్వని,
వక్షో గుహాంతరాళముల నుండి వచ్చెడు యా ధ్వని
సాక్షిద్వయమై ఈ రెండు మిళితమైయుండునెడ, ఆ విధి
సాక్షాత్కారమది యసాధ్యంబె – మంకుతిమ్మ!

62.
భౌతిక విజ్ఞానంబునకు, ధర, రవి, తారల చలన
రీతి గతుల శక్తల నెంచ సాధ్యమగునో ఏమో!
నీతి, ద్వేషా రీతిగతులు అవ్యక్త
చేతనముల నెంచగా యసాధ్యమౌ గదా – మంకుతిమ్మ!

63.
నర భాషకు సాధ్యమే పరతత్వరూపమును వర్ణింప
అరయ నేరదది హృదయ భాష
పరమానుభవముల యరుపు లోచెవికి మాత్రమే వినిపించు
ఒరటైన మాద్యమీ భాష – మంకుతిమ్మ!

64.
చిత్తానుభవ భావయోచనలన్నియున్ వరి
విత్తులు, విమర్శ వివేచనాసాధనముల చేత దంచినగాని
తత్త్వ తండుల మది దొరకునే? సారాసార వివేచనా
తత్త్వమే నిత్య భోజనము మనకు – మంకుతిమ్మ!

65.
పొత్తముల చదివి పొందిన జ్ఞానమది శిరోమణి,
చిత్తమున వికసించిన జ్ఞానమది తరువున వికసించిన పూవు
వస్తు సాక్షాత్కార మది అంతఃచక్షువు చేతనేగాని
శాస్త్ర పాండిత్యముల వలన గాదు – మంకుతిమ్మ!

66.
అర్థమే లేనిది క్రిమికీటక స్పష్టి రచనా విధానము: అది
వ్యర్థమే కదా యనియు; అనాలోచిత వర్తనమిది
కర్తది యని, అరకొర తెలివిగలవారి వర్తనమిది
వ్యర్థము కాదేదియు కర్తకార్యము – మంకుతిమ్మ!

67.
స్రష్ట సంకల్పపు రాతయది మన కగోచరము
దృష్టికి గోచరమైనది రేఖామాత్రమే
క్లిష్టమైనది, కష్టమైనదీ విశ్వసృష్టి
శ్లిష్టమైనదని నష్టమైనదని పలుక సరియే – మంకుతిమ్మ!

68.
అరకొర తెలివితేటల యవివేకములే అంతటను
పరిపూర్ణ మదియేదో నద్దాన్ని తెలియు వరకు
ఎరుక పరుచునెదెవ్వరు సృష్టి పేటిక లోని గుట్టు
పరమ గుహ్యమిది – మంకుతిమ్మ!

69.
అనామక సస్యములకు లేవే సువాసన ఫలములు
ఇన కిరణములు పక్వమొనరింపునే యవ్వాటిని?
అనిలము కొనిపోవదే సురాసనలు నన్నిదిక్కుల
మన యూపిరి యదియకాదె – మంకుతిమ్మ!

70.
భువి నిండిన రసవాసనలన్నియు
ఆవిరై, మబ్బులై, వర్షమై కురిసి
బావుల ఊటలై – నరుల యుదరంబులో చేరు
దైవ రసతంత్రమిది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here