తెలుగులో వ్రాసిన అసలుసిసలైన తొలి యుద్ధ నవల ‘విరామం’

0
9

[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘తెలుగులో వ్రాసిన అసలుసిసలైన తొలి యుద్ధ నవల ‘విరామం’’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

అంగర వెంకట కృష్ణారావు కలకత్తా వెళ్లి సైన్యంలో చేరారు. బహుశా 1940 దశకం పూర్వార్థంలో. రెండో ప్రపంచయుద్ధం చెలరేగుతోందపుడు. ఈశాన్య భారతం రణక్షేత్రం. 1939లో ఆరంభమయిన రణం 1945 ఆగస్టు దాకా కొనసాగి అణుమారణ యాగంతో ముగిసింది. సైనికులు వాళ్ళ ఇళ్లు చేరేసరికి మరో రెండేళ్లు పట్టింది. 1945 వరకూ మూడేళ్లపాటు యుద్ధభూమిలో గడిపారు. ఒక హృదయం, భావుకత కల సాక్షిగా అక్కడున్న అంగర, 1966-67లో తాను తన కంటితో చూసిన దానికి అక్షరరూపం ఇచ్చారు. ఆంద్రజ్యోతి ఆ సమయంలోనే ఆరంభమయింది వార పత్రికగా. దానికి పేరుకు నార్ల వెంకటేశ్వర రావు సంపాదకుడైనా, పురాణం సుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో నడిచేది. ‘విరామం’ ఆ పత్రికకు పరిశీలనార్థం చేరింది. దాని పట్ల ఎందుకో శర్మ శ్రద్ధ చూపక తిప్పిపంపాలన్న ఆలోచనలో ఉన్నారు. దాన్ని నార్ల చూసి తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన చదివారో ఆయన కళత్రం చదివారో తెలియదు గాని ఆమె ఒక చీటీ మీద తిరిగిపంపెయ్యండి అని వ్రాసి, సంతకం పెట్టి ఆ వ్రాతప్రతికి దాన్ని గుచ్చి శర్మ గారి బల్ల మీదికి పంపారు. శర్మకి సహాయకుడిగా వున్న భమిడిపాటి రామగోపాలం అది చూసి అవాక్కయ్యారు. దాన్ని తిప్పి పంపే పని చేయకుండా, మరోసారి ఆ నవలను చదవమని శర్మను బ్రతిమాలుకున్నారు. శర్మ ముందు కసురుకున్నారు. తరువాత శర్మ ఆ నవలను చదివి, వెంటనే దాన్ని ప్రచురించడానికి పూనుకున్నారు. అది 1967-68 మధ్య ధారావాహికగా వెలువడింది. 1968లో విశాలాంధ్ర ప్రచురణాలయం దానికి పుస్తక రూపం ఇచ్చింది. 2008వ సంవత్సరం వచ్చేసరికి ఒక పాత ప్రతిని సంపాదించడమే గగనమైంది. కార్యసూర్యుడు, కార్యశూరుడు భరాగో ఒక ప్రతి సంపాదించి జ్యేష్ఠ లిటరరీ సంస్థ తరఫున ద్వితీయముద్రణ కావించారు. పేరు తప్ప, ఆ నవలకు ఏ పురస్కారం రాకపోవడం తెలుగు సాహిత్య లోకపు దివాళాకోరుతనాన్ని సూచిస్తుంది. ముళ్ళపూడి వెంకటరమణ ఏకైక సభ్యుడిగా ఉన్న అక్కినేని నాగేశ్వర రావు లిటరరీ అవార్డ్స్ సంస్థ, 1970 సంవత్సరానికి గాను ఈ నవలకు స్వర్ణ పతకాన్ని ప్రకటించి శాశ్వత మౌనాన్ని పాటించారు దాన్ని ఇవ్వకుండా; ఒక పతకానికి టన్ను బంగారం అవసరమవుతుందనేమో.

రేఖామాత్రంగా నవల కథనం ఇదీ:

కథకుడు రావు, కలకత్తాలో వాకైగా పని చేస్తున్న పద్మ, బ్రిగేడు కార్యాలయం ఇంటి యజమాని కమల్ లాంచీలో ప్రయాణం చేస్తున్నారు. ఆ కలకత్తా నుంచీ తూర్ప బెంగాలులోకి చేస్తున్న ప్రయాణంతో నవల ఆరంభమవుతుంది. లాంచీ నది పద్మపై పున్నమి రాత్రి ప్రయాణం చేస్తోంది. ఆ యువతీ యువకులకు ఒకరంటే మరొకరికి ప్రేమ ఉంది. పద్మ మీది కుటుంబ బాధ్యత పెళ్ళికి అడ్డొస్తోంది. ఆరుగురు తోబుట్టువులు, తండ్రి ఆమె మీద ఆర్థికంగా ఆధారపడున్నారు. కొమిల్లాలో ఉంటున్నారు. ఆమె ఆ ఊరు వెళుతోంది. కమల్ కొంత దూరం వెళ్లి ఆమెను ఆమె సొంత ఊరు రైలు ఎక్కించి కలకత్తాకు వెనుదిరుగుతాడు. రావు అగర్తలా లోని తన సైనిక పటాలానికి వెళ్ళాలి. ఆమె, అతను చాంద్‌పూర్ పొద్దునకు చేరి అక్కడ రైలెక్కాలి. ఆమె లక్షం కూడలి వద్ద దిగి వేరే రైలు ఎక్కి కొమిల్లా వెళ్ళాలి. రావు అక్కడ దిగకుండా వెళ్లి Akhaura వద్ద దిగి బస్సులో అగర్తలా వెళ్ళాలి. కమల్ లక్షం దాకా వచ్చి ఆమెను కొమిల్లా రైలు ఎక్కించి వెనక్కు వెళతాడు. కొమిల్లా వెళ్లడం సంభవిస్తే తన ఇంటికి రమ్మని రావును ఆహ్వానించి చిరునామా ఇస్తుంది. ఆ యుద్ధ సమయంలో ప్రయాణాలు చెయ్యడం కష్టం. బండ్లన్నీ జనసమ్మర్ధంగా ఉంటాయి. చాంద్‌పూర్ లో దిగి ముగ్గురు కష్టపడి రైలు ఎక్కుతారు. లక్షం దగ్గిర కమల్, పద్మ దిగి రావుకు వీడ్కోలు పలుకుతారు.

సాయంత్రం ఐదుకు Akhaura చేరతాడు రావు, జోరు వాన. స్టేషను నిర్మానుష్యం. స్టేషన్ మాస్టారు ఒక్కడే తన గదిలో మిగిలాడు. ఆ రాత్రి రైళ్ళేమీ రావు. మాస్టారుతో దెబ్బలాడి బలవంతాన అతని గదిలోనే ఆ రాత్రంతా గడుపుతాడు రావు. తిండి, కనీసం టీ సదుపాయం లేకపోవడం వలన సిగరెట్లతో సరిపుచ్చుకుంటాడు. పదిహేను రోజులనుంచీ ఆ చుట్టుపక్కల కుండపోత వానలు, ఎడతెరిపి లేకుండా. కమ్యూనికేషన్ వ్యవస్థ కూలిపోయింది. బండ్లూ ఆ ఊరినుంచీ ఎక్కడికీ వెళ్లడం లేదు. స్టేషనులోకి పిక్కల దాకా నీరొచ్చింది. దీపాలు వెలగడం లేదు. రాత్రి గడిచింది. ఏమి చేయాలో పాలుపోక ఒక సిమెంటు బల్ల మీద కూర్చుని సిగరెట్టు తాగుతుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతనితో సంభాషిస్తాడు. అతను వివిధ వ్యాపారాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరి. తెలుగు కూడా వచ్చిన బెంగాలీ. అక్కడి నుంచీ అగర్తలాకు ఇరవై అయిదు నిమిషాల ప్రయాణం. కానీ సైనిక శకటాలు తిరగడం లేదు. టీ దొరుకుతుందా అని రావు అడుగుతాడు. దొరకదు; నాతో వస్తే ఇప్పిస్తా అంటాడు ఆ ఆగంతకుడు. అతనితో బయలుదేరుతాడు. బురదలోనుంచీ నడవగా నడవగా ఒక మట్టి కొంప వస్తుంది. దాంట్లోకి దాసుతో సహా రావు దూరతాడు. దాంట్లో గొంతి అనే పేరుగల ఇరవయ్యేళ్ళ నల్లటి స్త్రీ, నెత్తిమీద కొప్పుతో వుంది. రొట్టె పెట్టి, టీ ఇస్తుంది. బలవంతాన తినగానే రావుకు కడుపులో తిప్పుతుంది. ఆకలి తీరటం ముఖ్యం కదా. ఇక్కడ కూర్చుంటారా అని ఆమె అంటుంది తన భాషలో. దాసు తర్జుమా చేస్తాడు. కూర్చునే ఉన్నా కదా అని రావు అమాయకంగా అంటాడు. దాసు అర్థాన్ని వివరిస్తాడు. కూర్చోడం అంటే లైంగికంగా కలవడం. రావు ఐదు రూపాయలిచ్చి వెలుపలికొచ్చి నడవడం మొదలిడతాడు. భోంచెయ్యకుండా, విశ్రమించకుండా డబ్బు ఎందుకిచ్చాడు అని గొంతి అంటుంది. స్టేషనుకు వచ్చేశాడు. మధ్యాహ్నం మూడు గంటలకు వాన వెలిసింది. సాయంత్రమవుతున్నా ఏ ట్రక్కూ, రైలూ రాలేదు. రావును ఒదిలించుకోడానికి స్టేషన్ మాస్టర్ ఒక ఇంజిన్ ఎక్కించి, సింగర్ బిల్లు అనే చోటికి వెళితే ఏదో ఒక రవాణా సౌకర్యం దొరుకుతుందంటాడు. వెళ్లి అక్కడ దిగి, నిర్మానుష్యంగా ఉన్న ఆ చోట ఒంటరిగా మిగిలిపోయాడు రావు. వర్షం కురుస్తూనే ఉంది. ఒక బక్కచిక్కిన మనిషి కనిపించాడు. మూడు రూపాయల ఆశ చూపిస్తే ముందు రానన్నావచ్చాడు సామాను మొయ్యడానికి. అతని నెత్తికి తన సామాన్లు ఎక్కించి గంటపాటు వాడు మొరాయించినపుడల్లా తంతానని బెదిరిస్తూ – బురదలో, వానలో నడిచారు. సైనిక గుడారాలు చేరారు. సుబేదార్ మేజరు కథంతా విన్నాడు. పొడి దుస్తులు, సరైన ఆహారం, నిద్రా సౌకర్యాలూ ఏర్పరిచాడు. ఒక ట్రక్కు ఇచ్చి రావు వెళ్ళవలిసిన చోటును వెదుక్కోమన్నాడు. కష్టపడి గమ్యం చేరాడు. రావు యూనిట్ ఇంకా జన్మ ఎత్తలేదు. ఉండటానికి బాషా అని పిలువబడే వెదురు బొంగుల గది దొరికింది. పది రోజుల తరువాత ఆఫీసర్ కంమాండింగ్ విన్‌స్టన్ వచ్చాడు. తుపాకులను, సైనిక బండ్లనూ మరమ్మత్తు చేసి సంసిద్ధం చేయడం ఆ రెజిమెంటు పని. వాళ్ళున్న ప్రాంతంలో వెదురు చెట్ల అడవిలో పులులూ ఎలుగుబంట్లూ ఉంటాయి.

“ఓ బిదేశీ బంథోరే అమీ తోరే నచాయనా.. జోకొన్ తోరే మోనేపాడీ తొఖోన్ తోరే పాయినా..” దానర్థం ఓ దూరదేశంలోని ప్రియుడా నీవు నాకు అక్కరలేదు; కారణం నీవు నాకు కావాలన్నపుడు లభ్యం కావు. ఆ పాట పాడుతూ పదకొండేళ్ల కుర్రాడు రావు యోనిట్ సైనికుల కంటపడ్డాడు. వాడికి సిగరెట్ లంచంగా ఇచ్చి పాడమంటుంటారు. ఒక రోజు రావు ఇతరులూ సాయంవేళ వాహ్యాళికి దూరంగా వెళతారు. ఆ కుర్రాడు వీళ్ళను చూసి కాస్తున్న గొడ్ల మందను ఒదిలి వస్తాడు. ఎప్పట్లాగే మూరెడు చింకిగుడ్డ మొలకు చుట్టి, ఒక చేత్తో పొడుగు కర్రను పట్టుకుని. లంచంగా రావు ఒక సిగరెట్టు ఇచ్చి వాడిని పాడమన్నాడు. గొంతు సవరించుకుని ఆ నిశ్శబ్ద సంధ్యలో అతి సున్నితమైన విప్రలంభ శృంగార గీతం ప్రతిధ్వనించేలా పాడాడు. ఆకాశాన్ని దూసుకు పోయింది ఆ స్వరం. వాడు పాట ముగించి, తన పశువులను తోలుకుంటూ, సిగరెట్టున్న చేతినీ ఊపుతూ, వంద గజాలైనా వెళ్ళుండడు. భయంకరమైన అరుపు అరిచాడు. సైనికులు వాళ్ళ నవ్వులను ఇంకా ఆపకముందే. ఓక తీవ్రమైన సంఘటన జరిగింది. ఒక క్రూర జంతువు వాడిని పట్టుకుని పక్కనున్న పొదల్లోకి లాక్కుపోవడం వాళ్ళు చూసారు. చిరుతపులి అయి ఉండొచ్చు. ఆ రాత్రి తల్లి పిల్లాడి గురించీ ఎదురుచూసి ఎంత బెంగటిల్లిపోతుందో అని రావు విచారిస్తాడు. సిగరెట్ ఆశ చూపి వాడి చేత బలవంతాన పాడించగా అది విని చిరుతగొడ్డు వచ్చి వాడిని బలి తీసుకుందా అన్న అపరాధ భావం రావును వేధిస్తుంది.

ఆ యూనిట్ చుట్టుపక్కల చాలా గ్రామాలున్నాయి. తెల్ల సైనికులు వాటిల్లోకి జొరబడి స్త్రీ సంబంధమైన గొడవలు పడేవాళ్ళు. అగర్తలాలో రావుకు దాసు కనబడ్డాడు. యూనిట్లో కాంటీను పెట్టుకోడానికి సాయం చెయ్యమన్నాడు. రావు చేశాడు. దాసు వైవిధ్య వ్యాపారాలలో వ్యభిచారపు తార్పుడు కూడా ఒకటి. అక్కడి పేద స్త్రీలు వచ్చిన డబ్బుతో ఆకళ్లను తీర్చుకుని ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు. సమీపపు షివాజిపూరులో, అక్కడి ఇతర ఊళ్లలో లాగే ముస్లిములు ఎక్కువగా నివసిస్తుంటారు. ఊరిపెద్ద అబ్దుల్. నలుగురు భార్యలున్నారు. రావుతో అతను చనువుగా ఉండేవాడు. అవన్నీ పేద కుటుంబాలు. పటాలం వైపు తొక్కితే వెళ్లొచ్చే తిండి సౌకర్యం ఉంది. అతని నాలుగో భార్య పందొమ్మిదేళ్ళ సల్మా అందంగా ఉంటుంది. దాసు సల్మాను మాటలతో మోసగించి బ్రహ్మంబెరీయా అనే దగ్గిరనే ఉన్న పట్నం తీసుకెళ్లి వ్యభిచారంలోకి దించాడు. అబ్దుల్లా తన భార్యను జంతువు తినేసింది అనుకున్నాడు. నిజమే, ఆమెను ‘ఆకలి’ అన్న పేరున్న జంతువు తినేసింది. ఆ ఊళ్ళో తొంబై శాతం స్త్రీలు ఆకలికి తట్టుకోలేక వ్యభిచారాన్ని వృత్తిగా తీసుకున్నారు. విశాలమైన సహజ ప్రకృతి నేపథ్యంలో మెరుపులా బతుకుతూ వచ్చిన సల్మా ఆ పట్నంలో ఇరుకు సందులోని మురికి కూపంలో బతుకుతోంది. గొర్రెల కాపరిని ఆకలిగొన్న పులి మింగింది; ఆమెను ఆకలి పులి మింగింది.

యూనిట్లో ఉన్న మదరాసీ సిపాయిలూ కందిపప్పు సరఫరా కొంత కాలంగా జరగడం లేదని గొడవకు దిగారు. పై అధికారి ఇక్కడికి మనం పప్పు తినడానికి కాదు వచ్చింది; యుద్ధం చెయ్యడానికి అని మందలించినా – వాళ్లు వినలేదు. కందిపప్పును రేషన్ స్టెండు నుంచీ తెచ్చే బాధ్యత రావుకు అప్పగించారు. అక్కడ సరఫరా చేస్తున్న వ్యక్తి మారువేషంలోని కమల్. అతని పేరు ఇప్పుడు రాయ్. ష్టాండు బైట ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. వాళ్ళు లాంచ్, రైలు ప్రయాణం చేసి విడిపోయిన తరువాత ఏమి జరిగిందీ, అతను ఎందుకు వేషం మార్చుకోవలసొచ్చిందీ చెబుతాడు. కలకత్తాలోని కమల్ మేడ క్రింది భాగంలో ఆర్టిలరీ బ్రిగేడ్ కార్యాలయం ఉంది. ఫిష్ ఫూల్ అనే ఆంగ్లేయుడు సూపర్నెంటుగా పనిచేస్తున్నాడు. అతను షక్స్పీయర్ నవల ఒథెల్లో లోని ‘ఇయాగో’ పాత్రలా ఉంటాడు – సన్నగా, పొడుగ్గా, తోడేలులా. అతనికి గులాబీ పువ్వుకూ, ఉమ్మెత్తపూవుకూ తేడా తెలియదు. అతను, మరో ఇద్దరు వాకాయిలూ ఒక రోజు పద్మ రానంటున్నా బలవంతం మీద ఊళ్లోని ఒక హోటల్లోకి గొనిపొయ్యారు. ముగ్గురూ ఆమె మానాన్ని భగ్నంచేశారు. ఆ విషయం పదిరోజుల తరువాత కమల్‌కి తెలిసింది. పద్మ ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఊరు కొమిల్లా వెళ్ళిపోయింది. అప్పుడు కమల్ ఊళ్ళో లేడు. అతనికివ్వమని ఒక ఉత్తరం వ్రాసి అతని తల్లికిచ్చింది ఊరు వెళ్ళిపోతూ. ఆ ఆంగ్లేయుడిని భారతదేశం మట్టిదాటి పోనీయ కూడదనుకున్నాడు కమల్. ఒక హోటలుకు తీసుకెళ్లి మస్తుగా తాగించాడు ఆ ఆంగ్లేయుడిని. తూలిపోతున్న వాడి గొంతుముడి విరిచాడు. బూటు కాలితో వాడి మొహం మీద తన్నాడు. బైటికొచ్చి కమల్ తిన్నగా ఢాకా వెళ్లి సైన్యంలో చేరాడు, పేరు మార్చుకుని. అప్పటికి పద్మ సంగతి ఏమీ తెలియలేదు కమల్‌కు కూడా.

షిరాజ్పూర్ ఒకరోజు కాలిపోయింది. అక్కడ మూడు శవాలు పిస్తోలు గుండ్లతో పడున్నాయి. వెస్ట్ ఆఫ్రికన్ రెజిమెంటుకు చెందిన గన్నర్ ఆ ఊరు వెళ్లి అబ్దుల్లా ఇంట్లో జొరబడ్డాడు తాగి. అతని కూతురు రజియా మీద ఆమె స్పృహ తప్పినా అత్యాచారం చేసాడు. ఎదిరించిన అబ్దుల్లాను, అతని కొడుకును, ఆరేళ్ళ అబ్దుల్లా కూతురును కాల్చి చంపాడు. జనం బెదిరి కకావికలయ్యారు. దర్యాప్తు చేశారు. నేరాన్ని నల్ల ఆఫ్రికన్ల మీదికి తోసే ప్రయత్నం జరిగింది. రజియాను పిలిపించి ఆ పని చేసింది ఎవరో చెప్పమన్నారు. భయపడుతూ, తాత్సారం చేస్తూ ఆ డ్రైవర్ను చూపించింది. వాడికి ఏ శిక్షపడిందీ ఎవరికీ తెలియదు.

రావు ఆఫీసర్ కమాండింగ్‌తో కలిసి కొమిల్ల వెళ్ళాడు బదిలీ మీద. అక్కడ సరైన సదుపాయాలూ లేవు. రెజిమెంట్ headquarters కు ఎదురుగ ఒక టిన్ రేకు ఇల్లుండేది. నజీబుల్లా అనే వ్యక్తి స్వగ్రామం నుంచీ వచ్చి ఒక కాంటీను నడుపుకుంటున్నాడు. మొదట ఒక్కడూ వచ్చి తరువాత తల్లి లేని తన ఇద్దరు కూతుళ్లనూ తెచ్చేసుకున్నాడు. పెద్దమ్మాయి నగ్మా, చిన్నమ్మాయి మెహర్ కాంటీన్ వెనుక గదిలో ఉండేవాళ్ళు. కాంటీనుకు వెళ్లే వాళ్లలో మూడొంతుల మంది సిపాయిలు. వాళ్ళు అల్లరి పెట్టినపుడల్లా సుబేదారుకు నజీబుల్లా ఫిర్యాదు చేసేవాడు. ఒకసారి అలా జరిగినపుడు తండ్రి అడ్డు వెళ్లి తన్నులు తిన్నాడు. దర్యాప్తుకు వచ్చిన సుబేదార్ ఆ ఇద్దరు ఆడపిల్లలనూ తాను అనుభవించడానికి తండ్రిని అప్పగించమన్నాడు. తండ్రి ఒప్పుకోకపోగా పటాలం ఆ కాంటీనుకు వెళ్లకూడదని నిషేధించాడు. తండ్రి కష్టం చూడలేక, ఆర్ధిక ఇబ్బందిని అధిగమించలేక కూతుళ్లే లొంగిపోయారు సుబేదారుకు. ఎక్కడపెట్టినా ఆకలి, దారిద్ర్యం విలయ తాండవం చేస్తుండగా, నజీబుల్లా మడికట్టుకుని జీవించడానికి వీలులేకపోయింది.

కొమిల్ల లాల్మొయి [ఎర్రమట్టి] గుట్టలదగ్గిర సంవత్సరం గడిచింది రావుకు. చిట్టగాంగ్‌కు బదిలీ అయింది. అది వంగదేశపు ఆరామం [తోట]. బర్మాకు తీసుకెళ్లే ఆరకాన్ రోడ్డు అక్కడనుంచే ఆరంభమవుతుంది. అక్కడున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైనికుల విడుదులుగా మారాయి.

చిట్టగాంగ్‌లో రంగూన్ ట్రేడింగ్ కంపెనీ అనే పేరుతో ఒక వ్యాపార సంస్థను నలుగురు అన్నదమ్ములు నడుపుతున్నారు. ఆ సంస్థకూ సైనికాధికారులు అక్రమ సంబంధాలున్నాయి. అదొక రాకెట్టు. ఆఖరి తమ్ముడు సన్నీ గోపాల్ సేన్‌తో రావుకు పరిచయమయింది. వాళ్ళ నాన్నకు పద్మ తండ్రి దాయాది అవుతాడన్న విషయం క్రమేపీ రావుకు తెలుస్తుంది. ఆ కంపెనీ ఎదురు పేవుమెంటు మీద ఆకలితో చచ్చిన జనాల శవాలుండేవి; బతికున్నవాళ్ళు పట్టించుకోకుండా వాటిని దాటుకుని పోయేవాళ్లు.

రావు యూనిట్ ఎదురుగా ఒక కాంటీన్ ఉండేది; దాన్ని ఒక బెంగాలీ నడిపేవాడు. సిపాయిలు అక్కడ ఖాతాలు తెరిచారు. దాన్ని వేరు చేస్తూ ఒక కంచె ఉండేది. దాని సమీపంలో తెల్ల సైనికుల స్టోర్ గది ఉండేది. ఆ స్టోర్ నుంచీ ఎవరో రెండు బస్తాలు పడెయ్యడం సార్జెంట్ మేజర్ చూశాడు. కాంటీను సోదా చెయ్యగా నాలుగు బస్తాల బియ్యం, రెండు బస్తాల పంచదారా, వంద పాలడబ్బాలు బయటపడ్డాయి. కాంటీన్ యజమానిని పట్టుకుని అడిగితే సార్జంట్ల మెస్ వెయిటర్ ఇచ్చాడు, వాటిని నేను కొనుక్కున్నా అన్నాడు. వెయిటర్ మనిరుజ్జిమాన్ నేరం ఒప్పుకున్నాడు. అతన్ని గార్డ్ రూములో బంధించారు. రావు ఎవరూ లేకుండా చూసి అతన్ని ప్రశ్నించాడు. తన ముగ్గురు పిల్లలూ సంతానానికి అపకారం చేస్తారేమోనని అసలు విషయం చెప్పడానికి భయపడుతున్నా అన్నాడు. మూర్ అనే తెల్లవాడు ఆ పని చేసాడని చివరకు చెప్పాడు. తాను కేవలం ఆ బస్తాలు మోశా అన్నాడు. తెల్లవాడైన ఆఫీసర్ కమాండింగ్‌కు రావు చెప్పాడు. మూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనిరుజ్జుమన్ విడుదలయ్యాడు.

అగర్తలాలో లహరి అనే అతను ఇనుస్ట్రుమెంట్ మెకానిక్కు. అతనికి పని మార్పిడిలో రావు సాయం చేసాడు. హోదా కూడా పెరిగింది రావు వల్ల. ఇప్పుడు అతనూ రావుతో పాటు చిట్టగాంగ్‌లో ఉన్నాడు. ఒకరోజు అతను అషూ అనే తొమ్మిదేళ్ల కుర్రాడిని పని గురించీ తెచ్చాడు. వాడు పద్మ ఆఖరి తమ్ముడు. వాడి తండ్రి అంటే పద్మ తండ్రి చనిపోయాడు. లహరి పద్మ పెద్ద చెల్లెలుతో ప్రేమలో పడ్డాడు. పెళ్లాడతాడు.

రావుకు అపెండిసైటిస్ వచ్చింది. శస్త్రచికిత్స అవసరమైంది. చిట్టగాంగ్ హాస్పిటల్లో అక్కడ సైనిక క్షతగాత్రులకు చికిత్స చేయాలి కనుక మామూలు రోగులను చేర్చుకోరు. డాకా బేస్ ఆసుపత్రికి రావును పంపారు. అక్కడ సకల సౌకర్యాలూ ఉంటాయి. ఆపరేషను చేశారు. హెలెన్, షీలా అనే ఆంగ్లో ఇండియన్ నర్సులు ఉండేవారు. వాళ్లు రావును ప్రత్యేక అభిమానంతో చూసేవాళ్ళు. షీలాతో రెండర్థాల సంభాషణలు జరిగేవి. ఆమె రావును ముద్దుపెట్టుకుంది. వేరే ఊళ్ళో ఆమె తల్లిదండ్రులున్నారు. తల్లికి పక్షవాతం. ఆమె అక్క పిచ్చిది. తమ్ముడు ఉద్యోగం చేస్తున్నా షీలా మూడొందల రూపాయలు పంపాలి. ఆ కారణంగా ఆమె ఉద్యోగ సంపాదన సరిపోవడం లేదు. ఖర్చుకు చాలామందిని స్నేహితులనే వాళ్ళను ఆకట్టుకుంది. ఆ విషయం రావుకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నేను పూర్తిగా చెడిపోయాను అనింది. ఆ ఆసుపత్రిలో మారువేషంలో కమల్ కలిసాడు. ఇప్పుడు రహీం అతని పేరు. ఆస్పత్రిలో రావుకు వింతవింత వ్యక్తులు, రోగులూ తారసపడతారు. వాళ్లలో కొందరు సాంవరియా, టాండన్, సూర్జు, మూర్తి, యాదవ్. వాళ్ళ చిరు కథలు రావు తెలుసుకుంటాడు. రాయ్ పేరుతో కమల్‌ను రావు అగర్తలా రేషన్ డిపోలో కలిసి పద్మపై జరిగిన అత్యాచారం గురించీ తెలుసుకున్నాడు రావు. ఇప్పుడు ఆస్పత్రిలో అతను రహీంగా ప్రత్యక్షమయ్యాడు. అతను, రావు ఆస్పత్రి వెలుపలికి వెళ్లి మాట్లాడుకుంటారు. ఇలాంటి సాహసాలెందుకు చేస్తావు అని రావు మందలిస్తాడు. రేషన్ డిపోలో ఉన్నపుడు కమల్ అహుజా అన్న వ్యక్తితో ఒక ఒప్పందానికి వచ్చాడు. దాని ప్రకారం రేషన్లు అతని లారీకి ఎక్కిస్తుంటాడు దొంగతనంగా. వాటిలో సగం అహుజా సొమ్ము చేసుకుని మిగతాది పేదలకు పంచిపెట్టాలి. మిలటరీ పోలీసులు అహుజాను పట్టుకోబోతే వాళ్ళను అతను పిస్తోలు పేల్చి చంపి పారిపోతాడు. తననూ పోలీసులు వెంటాడతారని తెలిసి కమల్ మీసం గడ్డం పెంచి రహీం అన్న పేరుతో తిరుగుతున్నాడు. ఇపుడు ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పద్మ కొమిల్లాలో లేదు, ఇల్లు అద్దెకిచ్చి ఎక్కడికో వెళ్లిపోయిందని కమల్ రావుకు చెబుతాడు. పద్మ చనిపోయిందేమో అనుకున్న రావు ఆమె ప్రాణాలతో ఉన్నందుకు సంతోషిస్తాడు.

తిరిగి యూనిట్ చేరాడు రావు. అల్లైడ్ సేనలు జపాన్ సేనలను తిప్పి కొట్టాయి. రావు యూనిట్ రాంరీ ద్వీపానికి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ ఘోరమైన యుద్ధం జరుగుతోంది. పెరేడ్ గ్రౌండులో వాళ్ళ సామానంతా తగలబెట్టి కొత్తచోటుకు వెళ్ళాలి. లేకపోతే ఒకవేళ ఆ సామాను శత్రు సైన్యానికి దొరిగితే వాళ్ళు వాడుకుంటారు.

ఆ బదిలీ రద్దయింది. ఇక్కడ దహనకాండ జరుగుతుంటే, ఆ వేళ 1945 ఆగస్టు 6న హిరోషిమా మీద అమెరికా బాంబు పడింది. తొమ్మిదిన మరో బాంబు పడగానే జపాను లొంగిపోయి కొద్దీ రోజులకే యుద్ధం ముగిసింది. ఆ రోజు రావు యూనిట్‌లో విందూ, విలాసం జరిగాయి. అసంఖ్యాకమైన కోళ్ల పీకలు తెగాయి. యుద్ధం ముగిసినా యుద్ధ వాతావరణం ముగియలేదు. సైన్యాల విడుదల కార్యక్రమం మొదలయింది. రావుకు ఏరియా ఆఫీసుకు బదిలీ అయింది, పదోన్నదీ కలిగింది. అక్కడ పద్మ చెల్లెలు ఉమ పనిచేస్తున్నది. లాహిరిని, ఉమను కలిపాడు రావు. ఆమె తన అక్క పరిస్థితిని వివరించింది, వైద్యుడికి చూపిస్తే ఆమె గర్భిణి అని తేలింది. తండ్రికి రక్తపోటొచ్చింది. అది పక్షవాతానికి దారి తీసింది. రంగూన్ కంపెనీ దాయాదులు పద్మను ఆస్పత్రిలో చేర్పించి సాయం చేశారు. పద్మకు గర్భస్రావం అవడానికి చేసిన ప్రయత్నం వృథా అయింది. ఆమె ఏడో నెలకు చేరినపుడు తండ్రి చనిపోయాడు. మతిసరిగా లేని పద్మకు ఆమె ప్రాణాన్ని రక్షించడానికి శస్త్రచికిత్స చేసారు. బిడ్డ బతకలేదు. పద్మ ప్రస్తుతం సీతాకుండీలోనే ఉంది. ఎలాగైనా కమల్, పద్మ ఒకటయ్యేలా చూడమని రంగూన్ కంపెనీ దాయాదులకు చెప్పాడు రావు. అది మా బాధ్యత కూడా కదా అన్నారు వాళ్ళు. రావుకు కలకత్తా బదిలీ అయింది. లహిరి, ఉమ వీడ్కోలు చెప్పారు.

విరామం తెలుగులో వ్రాసిన అసలుసిసలైన తొలి యుద్ధ నవలఅని పెద్దలు అంగీకరించారు. ఈ నవల ప్రత్యేకతలు మరికొన్ని ఉన్నాయి.

ప్రథమ పురుషలో చెప్పిన మెచ్చుకోదగిన, అరుదైన తెలుగు నవల. ప్రథమ పురుషలో చెప్పడం వలన, ఈ నవలలో చిత్రించిన యుద్ధ జీవితం, సంఘటనలు, పాత్రలు, వర్ణనలతో రచయితా మమేకం అవడానికి వీలయింది. ఇది కాల్పనిక గ్రంథంలా కాక అంగర వారి ఆటోబయోగ్రఫికల్ కథలా అనిపించడం ఒక ప్రత్యేకత. ఆత్మ కథలోని ఒక దీర్ఘ అధ్యాయంగా ఈ నవల తోస్తుంది – కేవలం రెండు మూడేళ్ళ జీవితానికే పరిమితమై. హోమర్ ‘ఒడిసి’ [Odyssey] లా సంఘటనల కూర్పు, ఒక దారంలాంటి ప్రేమ కథ.

ఏ తెలుగు నవలైనా తెలుగువాళ్ళ జీవితానికి మాత్రమే ఇంతవరకూ పరిమితమయింది. విరామం ఒక తెలుగువాడు వ్రాసిన బెంగాలీయుల ప్రాంతాన్నీ, జీవితాన్నీ చిత్రించింది. అది ఒక మంచి నవలా లక్షణంగా భావించవచ్చు. మరే ఇతర భాషలోనూ, మరే ఇతర రచయిత తన నేటివ్ జీవితాన్ని కాకుండా వేరే ప్రాంత, వేరే భాషను మాట్లాడేవాళ్ల జీవితాన్ని ఈ విధంగా చిత్రించలేదని అనిపిస్తోంది. మరోసారి చెప్పాలంటే, తెలుగు నేల మీద జరిగిన వృత్తాంతాలకు సంబంధించినవి చదివాము. ఇది ఈశాన్యప్రాంతపు నవల.

ముఖ్య కథ దాని ప్రధాన పాత్ర ఏ నవలలోనైనా విస్తృతంగానో, నవల ఆసాంతమూ ఉంటుంది. ఈ నవలలో పద్మ కథానాయిక అనుకుంటే, ఆరంభంలో కనిపించి, వినిపించే ఆఖరున కూడా దర్శనం ఇవ్వదు ప్రత్యక్షంగా; కానీ నీడలా వెన్నంటుతుంటుంది. కథ నిరంతరాయంగా సాగదు.

పద్మ పై అత్యాచారం ముగ్గురు చేస్తారు. ఫిష్పూల్ అన్నవాడిని కమల్ చంపినట్టుంది గానీ; మిగతా వాళ్ళ సంగతి నవలలో చెప్పలేదు.

తన ముందుమాటలో ఇలా అంటారు రచయిత: “అడుగడుగునా ‘నేను’ ఉన్నా, ఇది కేవలం నా ఊహ కాదు. ఈ ప్రదేశాలు నా కళ్ళతో చూసినవి. అయితే రచనకు కల్పన అవసరం. ఇందులో కల్పన అంతమాత్రమే ఉంది”. కల్పన ఎంతమాత్రం ఉందో మనకు తెలియకుండా ఆ స్వల్ప మాత్రపు కాల్పనికత, వాస్తవికత – పాలు, కొంచం నీళ్లుగా కలిసిపోయి అంతా చిక్కటి పాలే అన్నట్టుగా మలచారు రచయిత.

అంగర వారు గంభీర రచయితే కాదు. చమత్కార ప్రియులు, చిన్నపిల్లాడంత చిలిపివారు. అలాంటి సంఘటనలను యుద్ధ వాతావరణంలో అతికించడంలో ప్రతిభ చూపారు.

ఆరేళ్ళ పాటు సాగిన మానవుడి మనుగడలో మరో కాళరాత్రి లాంటి కాలం [1939-45] లో తొలి ఏళ్ళ నుంచీ రచయిత యుద్ధక్షేత్రంలో లేరు. సంపూర్ణంగా ఉండుంటే మనకు ఘనమైన నవల అంటే మూడు లేక నాలుగు వందల పుటలది దక్కుండేదేమో. ఈ నవల అక్షరాలనూ, పంక్తులనూ విడివిడిగా అచ్చొత్తించినా కేవలం వంద పుటలకు పరిమితమయింది. సాహిత్యప్రియులకు తెలుగు యుద్ధనవలకై కలిగే ఆకలి కొంత మేరకు మాత్రమే ఈ నవల వలన తీరుతుంది. ‘యుద్ధము-శాంతి’ [War and Peace], ‘అల్ ఇస్ క్వయేట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ [All is Quiet on the Western Front] లాంటి నవలలతో, ఇతర భాషలలోని దీనికంటే పెద్ద యుద్ధ నవలలతో పోల్చే సాహసం చేయకూడదు. “కంపారిసన్స్ ఆర్ ఆడియస్” [comparisons are odious] అని ఆంగ్లంలో నానుడి ఉంది. నాకన్నా పెద్దలు కాబట్టి పురాణం సుబ్రమణ్య శర్మ – విరామం నవలను – బబని భట్టాచార్య వ్రాసిన ‘సో మెనీ హంగర్స్’ [So Many Hungers] తో పోల్చవచ్చుగాని, నాలాంటి అల్పుడు పోలిక తేవడమనే పనికి ఒడిగట్ట కూడదు.

రెండు మూడు చోట్ల రావు యుద్ధాన్ని ఒక చెంప నిరసిస్తూనే, తాను యుద్ధంలో చేరటానికి గల కారణం – పలు ప్రదేశాలు చూడటానికి, డబ్బు సంపాదించడానికి – అని అంటాడు. ఒక చోట కమల్ ఆ పరస్పర విరుద్ధ వైఖరిని గేలిచేస్తాడు కూడా. అలాంటి వైఖరి మోటుగా చెప్పాలంటే చితి దగ్గిర చలి కాచుకోవడమే కదా! అయితే నవలలో యుద్ధాన్ని యుద్ధంచేసే వాళ్లు కూడా కోరుకోరు కదా. యుద్ధం అంతమవడం లేదేంటి అని దిగాలు పడతారు కూడా. మానవ అశక్తత ఉంది ఆ పరస్పర విరుద్ధ వైఖరిలో.

మానవ మనుగడలో యుద్దాలు నిరంతరం జరుగుతున్నాయి. శాంతి అన్నది విరామం లాంటిది. నాటకంలో రంగానికి, రంగానికి మధ్య కిందికి జారే తెరలాంటిది. అదీ ఈ నవల తాత్పర్యం. దానివలన మనం విరామం అనుకునేదే తాత్కాలిక విరామం అన్నమాట. ఏదైతే నిజం కాదో లేక వాస్తవం కాదో దాని పేరు కన్నా వాస్తవమైనది, శాశ్వతమైనది అయినా యుద్ధం పేరే ఈ నవలకు ఎక్కువగా నప్పుతుందేమో. అవధారణం యుద్ధం మీదుండాలి, విరామం మీద కాదు అనిపిస్తోంది. యుద్ధము-విరామం అంటే ఇంకా బాగుండేదా – టాల్ స్టాయ్ యుద్ధము-శాంతి లా?

హవల్దార్ అంగర భావుకతకు ఒక మచ్చుతునక కొమిల్లా లోని వెన్నెల రాత్రుల, ఎర్రమట్టి గుట్టల వర్ణన. సైనికుడి యూనిఫామ్ కాఠిన్యం వెనుక హృదయం ఎందుకుండదూ?

యుద్ధాల మధ్య ఉండే విరామం సంగతి పక్కనుంచితే అంగర ‘విరామం’ మాత్రం చిరకాలం జ్ఞప్తికి ఉండాలని కోరుకుందాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here