తెలుగునాట గాంధీజీ

0
7

[dropcap]ప్ర[/dropcap]పంచానికి సత్యాహింసలను ప్రబోధించిన తత్త్వవేత్త… జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవ సంవత్సరంలో మనం భాగస్వాములం కావటం అదృష్టమే. ఒక్క బొట్టు నెత్తురు కూడా చిందకుండా పోరాడి పరాయి పాలనను అంతమొందించిన వీరుడు. విశ్వమంతటా మానవ సంబంధాలను, అంతరాజతీయ సహకారాన్ని వ్యాపింపచేసేందుకు సార్వకాలీనమైన సూత్రాలను ప్రవచించిన యోధుడు. దూరంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ.. సత్యపథమే చివరి గమ్యానికి అతి దగ్గర దారి అన్న సూత్రాన్ని గాఢంగా నమ్మినాడు కాబట్టే గాంధీజీ విశ్వమానవాళికి ఆరాధ్యుడైనాడు. తెలుగువారితో మహాత్మాగాంధీకి ఉన్న అనుబంధం అనిర్వచనీయమైంది. స్వజాతిని, స్వదేశాన్ని సత్యాగ్రహ విధానం ద్వారా ప్రభావితం చేసిన మహితాత్ముడు మహాత్ముడు. భారత దేశోన్నతితో పాటు సమస్త మానవ కళ్యాణం కోసం కృషి చేసిన మహాత్ముని అడుగు జాడల్లో తెలుగుజాతి నడిచింది. మహాత్ముని ప్రభావంతో ఎందరో తెలుగు ప్రముఖులు సర్వస్వం అర్పించి స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. నిర్మాణ కార్యక్రమానికి తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ సేవాపరాయణులెందరో ఉన్నారు. 1910-1980 మధ్య కాలంలో గాంధీజీ తెలుగు రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు. నిజాం రాజరికం కొనసాగుతున్న సమయంలో కూడా గాంధీజీ హైదరాబాద్‌కు వచ్చి హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న వివక్షపై జరుగుతున్న పోరాటానికి బాసటగా నిలిచేందుకు 1927 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు మహాత్మాగాంధీ వచ్చారు. నగరం నడిబొడ్డున గల వివేకవర్ధిని హైస్కూల్లో జరిగిన సభకు హాజరయ్యారు గాంధీజీ. గాంధీజీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిన్న వేదికపై కూర్చొని ఆయన సందేశం ఇచ్చారు. ఆ వేదిక ఇప్పటికీ వివేకవర్ధిని హైస్కూల్లో భద్రంగా ఉన్నది. మహాత్మాగాంధీ.. ఆరోజు హరిజనోద్ధరణ గురించి చేసిన ప్రసంగం ప్రజల్లో ఎంతగానో చైతన్యాన్ని తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ వివేక వర్ధిని విద్యాసంస్థకు వచ్చిన నాటి జ్ఞాపకాలను యాజమాన్యం ఇప్పటికీ భద్రపరిచింది. విద్యాలయానికి వచ్చినపుడు సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. గాంధీజీ. హిందీలో రాసిన ఆ సందేశాన్ని పెద్దగా ఫోటో ప్రేమ్ చేయించి గ్యాలరీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. సభలో గాంధీ మాట్లాడిన ఫొటోలతోపాటు సభకు వచ్చిన ప్రముఖులు, ఇతర ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ఉంచారు. జాతిపిత మహాత్మాగాంధీ వేదికపై కూర్చుని మాట్లాడుతున్న ఫొటో అద్భుతంగా ఉంటుంది. గాంధీజీకి ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వ కార్య నిర్వాహక శాఖాధ్యక్షుడు సర్ అక్బర్ హైదరీతో సన్నిహిత అనుబంధం ఉండేది. తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి హైదరీ మరణానంతరం గాంధీజీ తన ‘హరిజన్’ పత్రికలో.. ఇలా అన్నారు. “సర్ అక్బర్ హైదరీలో చాలా సుగుణాలున్నాయి. అట్లా ఉండటం చాలా దుర్లభం. ఆయన గొప్ప పండితుడు, తత్వశాస్త్రవేత్త, సంస్కరణవాది, భక్తిపరుడయిన మహనీయుడు. రెండో రౌండ్ టేబుల్ మహాసభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకే నౌకలో ప్రయాణం చేశాం. నేను రోజూచేసే ప్రార్థనకు ఆయన హాజరవుతుండేవారు. గీతాశ్లోకాలలోను, మేముచేసే భజన కీర్తనల్లోను ఆయనకు ఆసక్తి కలిగింది.

వాటినన్నిటినీ మహాదేవ్ దేశాయి చేత ఆయన అనువాదం చేయించుకున్నాడు. భారతదేశంలో మతసామరస్యం కోసం మేమిద్దరం కలసి విస్తృతంగా పర్యటన చేయాలనుకున్నాం. ఆయన నా చేత ఆ మేరకు వాగ్దానం చేయించుకున్నారు కూడా. కానీ దేవుడు అన్యథా తలచాడు’ అని గాంధీజీ రాశారు. హైదరాబాద్‌కు మహాత్మాగాంధీ వచ్చినప్పుడు ఆయనకు కులీనుడైన ధన్‌రాజ్‌గిరీ రోల్స్ రాయిస్ కారును ఏర్పాటుచేశారట. ఈ ధన్‌రాజ్‌గిరీ ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్రశర్మ సతీమణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిరీ తండ్రిగారు. ఆ రోజుల్లోనే హైదరాబాద్ వీధుల్లో రోల్స్ రాయిస్ కారు తిరిగింది.

1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సందర్భంగా గాంధీజీ విజయవాడకు వచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 1921లో బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరిగాయి. ఆ సభల్లో మహాత్మాగాంధీ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను కాషాయం, ఆకుపచ్చ రంగులు, రాట్నంతో కూడిన పతాకాన్ని తయారుచేసి తీసుకురమ్మని చెప్పారట. ఆయన కేవలం మూడు గంటల్లో పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందించారట. దీనికి సంబంధించి 1921 ఏప్రిల్ 13న యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పింగళి వెంకయ్యను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. “మచిలీ పట్టణంలోని ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళి వెంకయ్య ఇతర దేశాల పతాకాలను గురించి వివరాలతోపాటు భారత జాతీయ పతాకానికి కొన్ని నమూనాలను సూచిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి ఏండ్ల తరబడి ప్రచారం సాగించారు. గడచిన నాలుగేండ్ల నుంచి ప్రతి కాంగ్రెస్ మహాసభలోనూ పట్టుదలగా జాతీయజెండాను గురించి ఆయన చేసిన కృషిని నేను శ్లాఘించక తప్పదు. బెజవాడలో ఎరుపు (హిందూ రంగు), ఆకుపచ్చ (ముస్లిం రంగు) రంగులు గల పటం పైన రాట్నాన్ని చిత్రించి తీసుకుని రమ్మని నేను వెంకయ్యను అడిగాను. ఆయన అత్యుత్సాహంతో మూడు గంటలలో నాకా జెండాను అందించాడు” అని గాంధీజీ రాశారు. 1929లో ఆంధ్రదేశ పర్యటన చేసినప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య అంతా తానే అయి నిలిచారట. పట్టాభి వ్యాపార సరళి అద్భుతమైనదని.. తన ఆంధ్రదేశ యాత్రను బాగా తగ్గించగలిగారని గాంధీజీ ప్రశంసించారు. ఆ తర్వాత ఉప్పుసత్యాగ్రహంలో భాగంగా గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి 178 మంది అనుచరులతో వచ్చిన గాంధీజీ 1980 ఏప్రిల్ 15న మచిలీపట్నం కోనేరు సెంటర్లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో చిన్నచిన్న ఉప్పు పొట్లాలు అమ్మగా, జనం ఎగబడి కొనుగోలుచేశారు. దీంతో బందరులో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితరులు సముద్రపు ఒడ్డు నుంచి ఉప్పు తెచ్చి కోనేరు సెంటర్లో ప్రదర్శించారు. అనంతరం ఇక్కడ ఉప్పు సత్యాగ్రహ శిబిరాన్ని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభించారు. గాంధీజీ స్ఫూర్తితోనే బందరులో ఖద్దరు ఉద్యమానికి గొట్టిపాటి బ్రహ్మయ్య, దుగ్గిరాల రాఘవచంద్రయ్య వంటి మహానుభావులు ఎంతగానో కృషిచేశారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంకోసం గాంధీజీ దేశవ్యాప్తంగా అన్ని సంస్థానాల్లో.. అన్ని ప్రావిన్సులలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా మహాత్ముడు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఆగారు. రైల్వే స్టేషన్లోనే కొద్దిసేపు ఆగి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. కొన్ని నగరాల్లో రైలు దిగి వీధిలోకి వచ్చి మాట్లాడేవారు.

ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరిమివేయడానికి యావత్ భారతీయ సమాజంలో చైతన్యం రగిలించారు. ఇందులో భాగంగా కాజీపేట, వరంగల్ స్టేషన్లలో కాసేపు ఆగినప్పుడు వేలమంది ఆ మహాత్ముడిని చూసేందుకు గంటలకొద్దీ వేచిచూశారంటే ఆయన ప్రభావం ఆనాటి నిజాం రాజ్యంలో కూడా ఎంత మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రజాకవి కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు, భూపతి కృష్ణమూర్తి, ఎంఎస్ రాజలింగం, హయగ్రీవాచారి, ఎంఎస్ ఆచార్య.. ఇలా ఎందరో జాతీయోద్యమ నాయకులు గాంధీ బాటలో నడిచారు. ఆరోజు వరంగల్ వీధుల్లో గాంధీజీ తిరిగినప్పుడు ఆయన వెంట వాహనంలో కాళోజీ ప్రభృతులు ఉన్న చిత్రం ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ రైలు ప్రయాణంలో భాగంగానే మహాత్ముడు ఆముదాలవలస దగ్గరలోని దూసి రైల్వేస్టేషన్లో ఆగారు. అక్కడ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి సుమారు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో ఒక మర్రి మొక్కను నాటారు. ఆనాటి మొక్క ఇప్పుడు వట వృక్షమైంది. ఇప్పుడు దాని వయస్సు దాదాపు 80 సంవత్సరాలు ఉండవచ్చు. గాంధీజీ ఆనాడు వచ్చిన గుర్తులు ఇప్పటికీ ఆ స్టేషన్లో మనకు కనిపిస్తాయి. దూసి రైల్వే స్టేషన్‌కు గాంధీజీ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉన్నది.

1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్‌లో నిర్వహించిన దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి తిరిగి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ శాఖ కోరిక మేరకు మార్గమధ్యంలో ఫిబ్రవరి 5 వ తేదీన రైలు ఆగినప్పుడు అక్కడ రైలు దిగి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడు ఖమ్మం టౌన్ కాంగ్రెస్‌కు అప్పుడు గెల్లా కేశవరావు ప్రెసిడెంట్‌గా వున్నారు. అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో చెక్క బల్లలతో వేదిక ఏర్పాటుచేశారు. గాంధీజీ ఆ వేదికపై కూర్చొని జాతీయోద్యమ కార్యకర్తలైన ప్రజావాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు పదిహేను నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగాన్ని మోటూరు సత్యనారాయణ అనువాదం చేశారు. ఖమ్మం పట్టణానికి గాంధీజీ వచ్చినప్పుడు ఆయన వెంట కార్యదర్శులు ప్యారేలాల్ గాంధీ, మహదేవదేశాయ్‌తో పాటు కమలాదేవి బజాజ్ కూడా ఉన్నారు.

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుపై మహాత్ముడికి ఉన్న మమకారం అనన్య సామాన్యమైంది. 1933 డిసెంబరు 22న మద్రాసు ఆంధ్ర మహాసభలో దేశోద్ధారకుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంలో గాంధీజీ చేసిన ప్రసంగం అద్భుతమైంది. నాగేశ్వరరావు పంతులు గురించి ఆయన ఎంతో అద్భుతంగా తెలిపారు. “నేను నాగేశ్వరరావు పంతులుగారిని ఎరిగి ఉన్నప్పటి నుంచి ఆయనలో ఒక ప్రత్యేక లక్షణం గమనిస్తున్నాను. అవసరమైనప్పుడు సహాయం ఆపేక్షించే వారికి ఆత్మ సమర్పణ చేయడమే ఆయన ఆదర్శం. అదే ఆయన ప్రత్యేకత. నేనొకసారి వారితో ఛలోక్తిగా అమృతాంజనం పేరుతో ప్రజలను మీరు వంచిస్తున్నారు గదా?” అన్నాను. “నిజమే, నేను మీ మాట కాదనను, అది వంచన అయినా ఎలాంటి ఉపద్రవం తీసుకురాలేని వంచన. అది ఎవరికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయదు. అమృతాంజనం వాడేవారు దాని నివారణ శక్తిలో విశ్వాసముండే కొంటున్నారు. ఆ నమ్మకం వల్లనే వారికి గుణం ఇస్తున్నది. ఆ నమ్మకమే నా వ్యాపారానికి ఆధారం. కానీ నేనొక మాట మాత్రం నిశ్చయంగా చెప్పగలను. అమృతాంజనం వల్ల వచ్చే లాభంలో ఎక్కువ భాగం ఆర్తుల కష్ట నివారణకు వినియోగిస్తున్నాను. ఈ వ్యాపారానికిదే పరమ ప్రయోజనం” అన్నారు నాగేశ్వరరావుగారు. ఈ సమాధానం విన్నంతనే ఇతడే నాకు నచ్చిన మనిషి అని అనిపించింది. ఆయన ప్రత్యుత్తరంలో త్రికరణ శుద్ధి, వినమ్రత, సత్యసంధత ప్రతిబింబించాయి.

యాచకులెవరైనా కన్నీరుపెట్టి దేహీ’ అంటే నాస్తి’ అనే మాట ఆయన నాలుకకు రాదు. నా వంటి వారు కూడా వారిని ఆశ్రయించి రిక్తహస్తాలతో తిరిగి రాలేదు” అని గాంధీజీ అన్నారు. ‘సద్గుణాలను, ఉదారాశయాలను మీ జీవితాలలో మీరు ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఈ చిత్రపటావిష్కరణలోని సంపూర్ణ ఫలితం మీరు పొందగలరు’ అని మహాత్ముడు తమ ప్రసంగంలో కాశీనాథుని వారిపై తనకున్న ప్రేమాభిమానాలు వ్యక్తపరిచారు. గాంధీజీ ఒక్క మాటతో యావత్ తెలుగుజాతి ఆయన మాటలో నడిచింది. జాతీయోద్యమంలో సంపూర్ణంగా భాగస్వామి అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here