తెంచుకున్న బంధం

5
15

[dropcap]“మీ[/dropcap] నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు, వున్న భూమి అమ్ముకుని దేశాలు పోతానంటే ఎలాగరా నాయనా. మనకు ఆధారం ఉండొద్దు.”

“అది కాదమ్మా, అమెరికా చదువంటే మాటలా బోలెడు డబ్బు ఖర్చవుతుంది.”

“మనకెందుకొచ్చిన అమెరికా చదువులు రా, వున్నచోటే హాయిగా వుండక, ఎలాగు మీ నాన్న సంపాదించిన మూడెకరాలు, మా పుట్టింటి వాళ్లిచ్చిన రెండెకరాలు ఉండనే వుంది. అది చాలదూ మనం బ్రతకడానికి. ఇక్కడే వుండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా.”

“అమెరికా వెళితే ఇక్కడి కన్నా మంచి ఉద్యోగం, బాగా డబ్బులు సంపాదించొచ్చమ్మా. ఆ తరువాత మనం దర్జాగా బతకొచ్చు.”

“చూడయ్యా.. వున్నది ఒక్కగానొక్క కొడుకువి, అదీ లేక లేక పుట్టిన బిడ్డవి, నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలు అంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. మాట్లాడవేం అన్నయ్యా..”

“నువ్వలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయ్, చూడు అల్లుడూ, మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు, వున్నది ఒక్కడివి, నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ, మీ నాన్నెమో అర్ధాంతరంగా పాయె, నువ్విప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు.”

“నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకువెళతాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. కాని నేను మాత్రం అమెరికా వెళ్లాలనే నిశ్చయించుకున్నాను మావయ్య.”

“నువ్వేమంటావు శాంతమ్మా..”

“అనడానికింకేముందన్నయ్య.. వాడు అంతగా మొండి పట్టుబడితే అలాగే కాని, వాడి ఎదుగుదలే కదా నాక్కావలసింది.”

“ఇంకేం అమ్మ ఒప్పుకుంది, వెంటనే ఐదెకరాలు అమ్మకానికి చెప్పు మావయ్య, నాకు డబ్బు చాలా అవసరం, వెంటనే కావాలి.”

“మూడెకరాలకైతే మంచి  ధర రావొచ్చు, మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం, ఏరోజు ఎలాంటిదో తెలీదు కదా..”

“ఎందుకన్నయ్యా, అది కూడా అమ్మకానికి పెట్టు, రేపైనా ఆ భూమి వాడిక్కాకపోతే ఎవరికి చెప్పు..”

“అది కాదమ్మా, నా మాట మీద ఆ భూమి అలాగుండని, ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు.”

“నువ్వెమంటావురా నాయనా..”

“సరే అమ్మా.. ఆ మూడెకరాలు తీసేద్దాం., డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్యా..”

***

“అమెరికా వెళ్లిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు. అప్పుడు వెళ్లావంటే నీ భార్య కూతురు కొడుకునైనా తీసుకురాకుండా మళ్లీ ఇప్పుడొచ్చావు. నా మనవరాలిని మనవడిని చూడాలనుందిరా నాయనా. ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివితీరుతుందా చెప్పు. అదే నువ్విక్కడుంటే నా మనవరాలికి మనవడికి అన్ని దగ్గరుండి చూసుకునేదాన్ని.”

“అది కాదమ్మా, వాళ్లకి ఇక్కడి వాతావరణం అది పడదు, రావడానికి వాళ్ళకు ఇష్టం లేదు, అయినా వాళ్లు ఇక్కడ వుండలేరమ్మ, అందుకే తీసుకురాలేదు.”

“ఏం అల్లూడూ, అంతా కులాసాయేనా, ఈ రోజే వచ్చావని తెలిసింది.”

“అవును మావయ్యా..”

“మరి ఈ సారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా, ఒంటరిగా ఉండలేకపోతోంది రా, నీ మీద ఒకటే బెంగ.”

“ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకువెళ్లడం కష్టం మావయ్యా, పైగా అక్కడ చలి ఎక్కువ, అమ్మ అక్కడ వుండలేదు.”

“సంపాదించుకున్నది చాలురా నాయనా, నువ్వే ఇక్కడికి వచ్చేయరాదు, అందరం కలిసి ఉండొచ్చు.”

“అదెలా కుదురుతుందమ్మా, అక్కడ ఉద్యోగం ఇల్లు అన్ని ఏర్పాటు చేసుకున్నాను. పిల్లలు కూడా అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడ్డారు. ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, అందుకే ఇంక అక్కడే నేను ఉండబోయేది.”

“అదేంట్రా అల్లుడు, మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతోంది. ఇన్నాళ్లు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేనూ ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను. మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు, తీసుకుపోవడమా-నువ్వే ఇక్కడికి రావడమా అనేది.”

“అక్కడి బిజీ లైఫ్‌లో అమ్మ మాతో వుంటే మాకు చాలా కష్టం మావయ్యా, అమ్మను మేం దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. అదే ఆలోచిస్తున్నాను, ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండటం మంచిదికాదు, అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు. అందుకే వృద్ధాశ్రమంలో వేద్దామనుకుంటున్నాను. మనకు డబ్బుకు ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఏ లోటు ఉండదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్లు బాగా చూసుకుంటారు. అంతా అమ్మ వయసు వాళ్లే ఉంటారు. సమయానికి భోజనం మందులు ఇస్తారు. ఏమంటావమ్మా..”

“అనడానికేముంటుంది నాయనా, రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది. నా చుట్టూ ఇంతమంది వుండి, కన్న కొడుకువి నువ్వు వుండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు.”

“ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా”

“ఏమైనా సరే.. నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్లేది లేదు నాయనా.”

“సరే అమ్మా నీ ఇష్టం..”

***

ఆనంద నిలయం వృధ్ధాశ్రమం.

“లోపల పెద్ద గుడి వుందమ్మా. నువ్వెళ్లి గుళ్లో పూజ చేసుకో.”

“నువ్వు రాగూడదు నాయనా, నీ పేర పిల్లల పేర పూజ చేయిస్తాను”

“నువ్వెళ్లమ్మా, నాకు వీళ్లతో కొంచెం పనుంది మాట్లాడి వస్తాను”

“అలాగే నాయనా, త్వరగా రా.”

***

“చెప్పండి సార్.”

“అటువైవు వెళుతుందే ఆవిడ మా అమ్మగారు, ఇక్కడ వుంచడానికి తీసుకొచ్చాను. నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను. ఆవిడ ఇక్కడ వుండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. జాగ్రత్తగా చూసుకొండి. నా గురించి అడిగితే పనుండి బయటికి వెళ్లానని మళ్ళీ వస్తానని చెప్పండి. ఇదిగోండి ఆవిడ పెట్టె, ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే వుండేట్టు చూడండి.”

“అలాగే సార్.”

***

“చూడమ్మాయ్, ఇందాక మా అబ్బాయ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలాగే లోపలికొచ్చాడు. ఏడి ఎక్కడ వాడు?”

“ఆయన, పనిమీద బయటికెళ్లారు మామ్మగారు, మీమ్మల్ని ఇక్కడే వుండమన్నారు.”

“అలాగా, ఇది నా పెట్టెలా వుందే, ఇక్కడుందేమిటి?”

“మీ అబ్బాయే ఇచ్చి వెళ్లారు.”

“సరే అమ్మాయ్, మా అబ్బాయ్ వస్తాడు, నేను ఆ గేటు దగ్గర కూర్చూంటాను. నేను కనపడకపోతే వాడు కంగారు పడతాడు.”

***

సంవత్సరం తరువాత –

“మామ్మగారు.. ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు. రాత్రయింది, రండి భోజనం చేసి పడుకుందురు గాని.”

“అయ్యో.. ఈ రోజు కూడా రాలేదు వాడు.. సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కూచుంటున్నాను. వాడు మాత్రం రావడం లేదు. ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు. చూడమ్మాయ్,  నేను ఇక్కడ వుండలేకపోతున్నానని , చాల ఇబ్బందిగా వుందని, వచ్చి నన్ను తీసుకెళ్లమని ఒకసారి ఫోన్ లోనైనా మాట్లాడి చెప్పగూడదు మావాడితో..”

***

“సార్.. మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడ ఉండలేక పోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడను ఇక్కడ దింపేసాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు. రోజూ మీకోసం గేటు దగ్గర పెట్టె పట్టుకొని పొద్దున సాయంత్రం ఎదురుచూస్తున్నారు మీరు వస్తారని, మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో”

“చూడండి, మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను, కావాలంటే ఇంకా పంపిస్తాను. నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు. ఆవిడను అక్కడే ఉండనివ్వండి.”

“అది కాదు సార్, ఆవిడ చాలా చిక్కిపోయారు, మానసికంగా బాగా కృంగిపోయారు. ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నారు. కనీసం ఒకసారి ఫోన్ లోనైనా మాట్లాడండి.”

“అవసరం లేదు, ఈసారి నేను ఇండియా వచ్చినపుడు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తాను. నాకు చాల బిజీగా ఉంది, నేను తరువాత మాట్లాడతాను.”

“మామ్మగారు, మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా వున్నారట. ఈసారి ఇండియాకు వచ్చినపుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు. మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు.”

“అంతా నా కర్మ, ఇప్పుడు నేనేం చేసేది..”

“అలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడకండి మామ్మగారు.”

“అమ్మాయ్, నాకో సహాయం చేసి పెడతావా, ఇదిగో ఈ నెంబరుకు ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న ఫళంగా రమ్మన్నాని చెప్పు.”

“ఎవరు మామ్మా ఈయన?”

“మా అన్నయ్య..”

***

పదిహేను సంవత్సరాల తరువాత –

“ఇదిగో బాబూ…  చీటిలో వున్న ఈ ఊరికి ఎలా వెళ్లాలి?”

“ఏదండి.. ఇదాండి, ఇది మా ఊరేనండి, నన్ను మీతో పాటు రమ్మంటారా?”

“వచ్చి కారెక్కు”

“అలాగే.. ఇంక పదండి..”

“అవును నీ పేరేంటి?”

“గట్టయ్య అంటారండి.”

“నీకు ఆ ఊర్లో శాంతమ్మ గారు తెలుసా?”

“ఆరు తెలియకపోవటమేంటండి, ఆరు దేవతండి, మా ఊరందరికి పెద్ద దిక్కండి బాబు. నాకు మాత్రం తల్లిలాంటోరండి, మా ఊరి నుండి పొట్ట చేతబట్టుకొని ఈ ఊరొచ్చానండి. ఆరే నాకన్నవెట్టి నన్ను సేరదీసి పన్లో ఎట్టి నాకో దారి సూపించారండి ఆ మహాతల్లి.”

“ఆవిడ ఈ ఊరికెలావచ్చారో తెలుసా?”

“పెద్దగా తెల్దండి, నాకు తెల్సిన ఇసయమైతే ఆరికో పెద్ద ఇల్లు రెండెకరాల భూమి ఉండేదటండి, ఆ భూమి పక్కనుండి గవర్నమెంటోళ్లు రోడ్డు ఏత్తే దాని ధర అమాంతం పెరిగిందంటండి. అయన్ని అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో ఐదెకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారంటండి.”

“ఇదేనా ఊరు?”

“అవునండి.”

“డ్రైవర్ ఒక్క నిమిషం కారాపు, ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మగారు అని రాసుకున్నారు?”

“మరదేనండి మా ఊరు గమ్మత్తు, శాంతమ్మగారు ఈ ఊరికే తల్లండి, అందరు ఆరి మాటమీదే నడుత్తారండి, ఊళ్లో ఎవరికే కట్టమొచ్చిన ఆరే తీరుత్తారండి, పిల్లకాయలకి బడి పెట్టిచ్చి సదివిత్తున్నారండి, అంతా ఆరి డబ్బేనండి, ఇక మా ఊరి పిల్లకాయలకైతే ఆరు దేవతలాంటి లాంటి అమ్మండి. ఒక్క షణం కూడా ఆరినొదిలి పిల్లకాయలు ఉండలేరండి.”

“డ్రైవర్ పోనియ్.”

“బాబుగారు సూటు బూటు ఏస్కున్నారు ఎక్కడి నుండండి రాక?”

“అమెరికా నుండి.”

“అయ్య బాబోయ్, మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి ఒత్తున్నారా?”

“అదేం లేదు.. ఆవిడ మా అమ్మగారు.”

“అయ్య బాబోయ్.. మా అమ్మగారు మీ అమ్మగారాండి..”

***

“ఎలా ఉన్నావమ్మా..?”

“తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు, అలాగే ఉన్నాను.”

“ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా”

“ఎలా చేసినా, నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు?”

“అందుకే.. నిన్ను అమెరికా తీసుకెళ్దామనే వచ్చానమ్మా?”

“ఎందుకు నాయనా, నీ ఇంట్లో వెట్టి చాకిరి చేయడానికా, అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు. నన్ను గాలికొదిలేసి వెళ్లిపోయావు. నా బతుకును నేను దిద్దుకున్నాను ఇక్కడ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను.” “నాకెందుకు నాయనా ఆ అమెరికాలు?

“అమ్మా అమ్మా.. ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా.”

“అయ్యో నా తండ్రి కొంచెం ఓపిక పట్టు నాయనా, ఈ చెత్తంతా బయటికి వెళ్లాకా నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా… ఇలా ఒళ్లో కూచ్చో.”

“నా పిల్లల మొఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా..”

“నన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది పిల్లున్నారు, నా వయసు వారున్నారు. ఇప్పుడు వారందరికి నేనే తల్లిని. కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు.”

“నన్ను క్షమించలేవా అమ్మా?”

“ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది, కాని అంతరాత్మ అనేది ఒకటుంటుంది. అది నిన్ను క్షమిస్తుందా బాబు.. ఇక చాలు”

“గట్టయ్యా..”

“అమ్మగారు”

“కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చి రా, మనకు కాని వారు ఎవరు మన ఊరిలో ఉండడానికి వీళ్లేదు.”

“అలాగే అమ్మగారు.. పదండి బాబు.”

“గట్టయ్యా..”

“అమ్మా”

“గేటు వేసి వెళ్లు, ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడటానికి ప్రయత్నిస్తున్నాయి.”

తలుపులు ధడేలుమని మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here