తెర తీయగ రాదా

0
6

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]ఈ [/dropcap]లోకంలో ఎవరి ఆనందం వారిది. ఎవరి ఆనంద బాష్పాలు వారివి. ఎవరి బాధ వారిది. ఎవరి కన్నీళ్ళు వారివి. పాపపుణ్యాలను బట్టి దేవుడు రాసిన రాత, గీతను బట్టి వాటంతట అవి జరిగిపోతూనే వుంటాయి. దాని నేపథ్యం లోనే…

ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్।
జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్॥

మంత్రాలతో రాగయుక్తంగా గణపతిని ప్రార్థించి కార్యక్రమం మొదలుపెట్టారు యాజ్ఞీకస్వామి. వైఖానసులతో వైఖానస ఆగమ ప్రకారం చేసే ఏ కార్యక్రమాలైనా మిగతా వాటికన్నా కాస్త భిన్నంగా వుంటాయి. ఆ క్రమంలోనే యాజ్ఞీకస్వామి రామానుజాచార్యుల వారు కార్యక్రమం మొదలు పెట్టారు.

యాజ్ఞీకస్వామి చెప్పే క్రియను తుచ తప్పకుండా ఆచరిస్తున్నారు బలరాం, కృష్ణమోహన్. తండ్రి రఘవంశి కాలం చేసి ఏడాది అయినా జ్ఞాపకాల నుండి ఎవరూ తేరుకోలేకపోతున్నారు. అలల్లాంటి జ్ఞాపకాలు ఆ కుటుంబీకులను గతంలోకి లాగుతూ భవిష్యత్తు అనే ఒడ్డుకు నెడుతూ ఊగిసలాటలో ముంచి తేలుస్తున్నాయి. నిలువెత్తు వున్న భర్త రఘవంశి ఫోటో ఎదురుగా కుర్చీ వేసుకుని జరుగుతున్న కార్యక్రమాన్ని, భర్త ఫోటోని మార్చి మార్చి చూస్తూ మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటూ సర్వం కోల్పోయిన దానిలా కూర్చుని వుంది రాధమ్మగారు. అందులో ఈ రోజు ధనత్రయోదశి. ఆయన ఉన్నప్పుడు ఈ రోజుని ఎంతో పవిత్రంగాను, ఒక పండుగలా చేసేవాడు. లక్ష్మీహోమాలు, పూజలు, దానధర్మాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు. ఈ ధనత్రయోదశి ఎంతో కళావిహీనంగాను, ఆయన లేకపోవడం ఎంతో వెలితిగాను ఉందని బాధపడుతూ పదే పదే కళ్ళు తుడుచుకుంటున్నది రాధమ్మగారు.

ధనలక్ష్మీ పూజ సందర్భంగా ఆ విధిలో ఉన్న శాస్త్రిగారింట్లో నాదస్వర కచేరీ పెట్టించినట్లున్నారు. ఆందులో నుంచి వచ్చే ‘తెర తీయగ రాదా’ అన్న త్యాగరాజకీర్తన వాయిదేవునికి కూడా ఇష్టంలా వుంది దాన్ని మాధుర్యాన్ని మోసుకువెళ్ళి నాలుగు వీధులకి పంచుతున్నాడు. ఆ పాటలో అంతర్లీనమైన భావంలోని మాధుర్యాం రాధ కర్ణద్వయానికి సోకగానే ఆమె మనసు గత జ్ఞాపకాలలోకి జారిపోయింది. అక్కడున్న వాతావరణమంతా మారిపోయింది.

***

అత్తలూరు పైస్కూలులో హెడ్‌మాష్టారుగా పని చేస్తున్న ఆనందరావుగారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి మంచి సంబంధమే తెచ్చి వివాహం చేసారు ఆనందరావుగారు. అల్లుడు ఇంజనీరు. ఉద్యోగరీత్యా బెంగుళూరులో వుంటారు వాళ్ళు. చిన్న కూతురైన రాధ అంటే ఇంట్లో అందరికీ ఎంతో గారాబం. పెద్ద అమ్మాయి బాధ్యత తీరింది కాబట్టి చిన్న కూతురికి ఎంతో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు ఆనందరావుగారు. అందుకే దూరపు బంధువు లాయరు రఘువంశితో సంబంధం కుదుర్చుకున్నారు.

పెళ్ళి పనులు చురుగ్గా సాగుతున్నాయి. తమ పిల్లల చదువు విషయంలో మాష్టారు ఎంతో శ్రద్ద తీసుకున్నారనే గౌరవంతో పిల్లల తల్లిదండ్రులు తమకు తోచిన సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంటి ముందు వున్న ఖాళీ స్థలంలో పచ్చిని పూల కల్యాణ మండపం కడతామని బంతి… చేమంతి… సంపెంగ… గులాబి మొదలగు పూల బస్తాలతో వచ్చారు కొంత మంది. ఉదయం పది గంటలకి వివాహం కావడాన ఎనిమిది గంటలకే మండపం తయారు చేసి ఇచ్చారు. అలాగే విద్యుద్దీపాలంకరణ, మేళతాళాలు అన్నీ సిద్ధం చేసి పెట్టారు.

పది గంటలకి బంధువుల సమక్షంలో వివాహం తంతు మొదలయింది. వివాహ వ్యవస్థలో జరిగే ఆచార సంప్రదాయాలు – వరుని రాక, వరపూజ, మహాసంకల్పం, కన్యాదానం, మధువర్కం, మంగళసూత్రం, తలంబ్రాలు, కంకణాలు, బ్రహ్మముడి, ప్రధానహోమం, పాణిగ్రహణం, సప్తపది, అరుంధతీ దర్శనం, ఆశీర్వచనం, ఇలాంటి హిందూ సంప్రదాయాలన్నీ వైఖానస ఆగమ ప్రకారం రఘవంశీ, రాధల వివాహంలో ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయాయి.

సాయంత్రం ఆయిదు గంటలకి వధూవరుల పరిచయ కార్యక్రమం మొదలైంది. బంధువులంతా బహు సందడిగా వున్నారు. పెళ్లికి వచ్చిన పెళ్ళి కాని యువతీ యువకులు ఒకరిపై ఒకరు చూపుల బాణాలు సంధించుకుంటున్నారు. తమకు నచ్చిన వారితో మాటలు కలపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.

పెద్దవాళ్ళు చూస్తారేమోనన్న భయంతో… చూపులు మరల్చుకుంటున్నారు. చిన్న పిల్లలు కొతం మంది హుషారుగా పరుగులు పెడుతూ ఆడుతున్నారు. మరీ చిన్న పిల్లలు అది కావాలి, ఇది కావాలి అని పేచీ పెడుతూ రాగయుక్తంగా ఏడుపు మొదలు పెడుతున్నారు. వధూవరుల పరిచయ వేదికకి అరుదెంచిన పెద్దలందరూ సుఖాసీనులై వధూవరుల జంట గురించి గొప్పగా చెప్పకుంటున్నారు. ఎంతైనా ఆనందరావుగారు అదృష్టవంతులు, గుణవంతుడు, అందగాడు, ఉద్యోగస్తుడు, ఆస్థిపరుడు అయన అబ్బాయిని అల్లునిగా తెచ్చుకున్నారు. ఆనందరావుగారే కాదు రాధమ్మ కూడా అదృష్టవంతురాలే. అదృష్టాన్ని గురించి ఆనందంగా చెప్పకుంటూ ఆ జంటని అపురూపంగా చూస్తున్నారు.

వధూవరుల చుట్టూ చేరిన ఆడవాళ్ళు వధూవరుల చేత ఒకరి పై ఒకరికి పన్నీరు చల్లించడం. గంధాలు పూయించడం, ఒకే కొబ్బరిబోండాం ఇద్దరి చేతా త్రాగించడం లాంటి సరదా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆలోచిస్తే పెళ్ళి సందడిలో పాల్గొంటే మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుందోననిపిస్తుంది. ఇది ఇలా ఉండగా…

అక్కడ ఆనందరావుగారి దగ్గర కూర్చున మగవాళ్ళు “ఆనందరావుగారూ… మీ అమ్మాయిని మాత్రం మంచి పద్దతిలో పెంచారండి. ఇప్పటి రోజుల్లో అలాకుదురుగా తల వంచుకుని ఒక ఆడపిల్లలా కూర్చునే అమ్మాయిలు ఎవరున్నారండీ? పెళ్లి జరుగుతున్నప్పడే పంతులుగారి మంత్రాలు పంతులుగారివే… అబ్బాయి, అమ్మాయి వారి జోకులు, నవ్వులు వారివే” అని ఒకరంటే…, “నిజమేనండీ పూర్వపు రోజుల్లో పెళ్ళి అయినా భర్తతో మాట్లాడాలంటే సిగ్గుతో ముడుచుకుపోయోవారు” అని మరి ఒకరు…,  “అలాంటి దాంపత్యాలే నూరేళ్ళ పంటగా నిలిచిపోతాయి”… ఇలా ఎవరికి తోచిన ఆలోచనలు వారు మాటల రూపంలో పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు.

ఇంతలో మధురంగా… అతిమధురంగా… వాతాపిగణపతిం అనే త్యాగరాజ కీర్తన నాదస్వరంలో వినిపించింది. అంతే అక్కడి వాతావరణ మంతా నిశ్శబ్దమైపోయింది. సూది పడితే వినపడేంత అతి నిశబ్దమైపోయింది. ఆ నిశ్శబ్దంలో నాదస్వర గళానికి రఘవంశి, రాధల హృదయాల్లో వసంతం వెల్లివిరిసింది. శరీరాలు గగుర్పొడిచాయి. మనసులు పరవశం చెందిగాలిలో తేలిపోతున్నాయి.

అందుకే అన్నారు పెద్దలు

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః… అని…

శిశువులు, పశువులేగాక, చెట్లూ చేమలు, రాయి రప్పలు, పూలు, పండ్లు, అంత ఎందుకు పాట వింటే చేతనాచేతన ప్రపంచంమంతా పరవశించిపోతుంది. అది మనిషి గళం నుండి వచ్చినా… లేక ఒక వాయిద్యం గళం నుండి వచ్చినా, పరవశించిపోవడం మాత్రం సత్యం. పాట విన్న అందరూ పరవశించడం నిజమైనా… గాయనీ, గాయకులు, సంగీత ప్రియులు మాత్రం ఆ పాటతో మమేకమై మాధుర్యంలో లీనమై పోతారు. ఇప్పుడు రఘుంశి రాధల విషయంలో అదే జరిగింది. ఈలోగా గణపతి ప్రార్థన పూర్తి అయి ‘తెర తీయగ రాదా’ అన్నత్యాగరాజ కీర్తన మొదలైంది.

ఇక పరవశం ఆపుకోలేని రఘవంశి “నాకు ఈ కీర్తిన అంటే చాలా ఇష్టం” అన్నాడు రాధ వంక చూస్తూ… కానీ ఆమె వైపు నుండి ఏ సమాధానం లేదు. సమాధానం చెప్పలేదన్నరోషంతో మెల్లగా రాధాదేవి చేతి పై గిల్లి ఆమె వైపు చూసాడు రఘవంశి. పాటకి పరవశించి కళ్ళు మూసుకున్న రాధ పులికిపాటుతో రఘువంశిని చూసింది. వెంటనే రఘవంశి “సారీ రాధ… నువ్వింత తన్మయంలో వున్నావని తెలియదు” అన్నాడు.

తన భర్త తను ఏ స్థితిలో ఉన్నదో పరిశీలించి గ్రహించినందుకు మురిసిపోతూ సిగ్గుతో తలవంచి పయట చెంగును ముడులు వేస్తున్నది రాధ.

“రాధా అంత సిగ్గు ఎందుకు సమాధానం చెప్పవా?” ఎవరూ తనని గమనించకుండాలనే ఉద్దేశంతో తన మెడలో ఉన్న దండను చేత్తో పట్టుకుని తల వంచి దాని వంక చూస్తూ అన్నాడు రఘువంశి. దానికి కూడా సిగ్గు పడటమే సమాధానమైంది.

“సరే రాధా, సమాధానం చెప్పొద్దులే కానీ… నే చెప్పే ఒక ముక్యమైన విషయం శ్రద్ధగా విను. అదేంటంటే నాదస్వరం అంటే నాకెంతో ఇష్టం. నాద స్వరం పలికించే ‘తెర తీయగ రాదా’ అనే కీర్తన ఎంతో… ఎంతో ఇష్టం ఎందుకంటే రాధా ఆ కీర్తన వినగానే వివాహ సమయంలో వధూవరుల మధ్య అడ్డుగా పెట్టే తెరసల్లా గుర్తుకు వస్తుంది. ఉదయం మన వివాహ సమయంలో కూడా మన మధ్యన పెట్టిన ఆ తెర ఎప్పుడు తొలుగుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. ఆ తెర తొలగి నువ్వు కనపడగానే నా హృదయమంతా ఆనందంతో నిండిపోయింది. రాధా ఇక జీవితంలో అలాంటి అడ్డు తెర మన కెప్పుడూ రాదు కదా” ఆర్ద్రత నిండిన గొంతుతో ప్రేమగా రాధని చూస్తూ అన్నాడు రఘుంశి.

దీనికి మాత్రం వెంటనే సమాధానం వచ్చింది. “మీకే కాదు నాకు కూడా నాదస్వరం అంటే చాలా ఇష్టం. ఎందుకిష్టమే నాకే తెలియదు. బహుశ కలిసి జీవించబోయే ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలిస్తే ఆ జంట మధ్య ప్రేమాభిమానాలు అధికమై నూరేళ్ళు కలిసి జీవిస్తారని ఆ దేవుని సంకల్పమేమో” సిగ్గు పడుతూ అయినా స్పష్టంగా చెప్పింది రాధ.

“అమ్మయ్యా నీ నోటి నుండి ముత్యాల్లా చిలుక పలుకులు నాలుగు రాలి పడ్డాయి. అవి ఏరుకుని పదిల పరచుకుంటాను. అవి చాలు జీవితాంతం తీపి గుర్తుగా మిగిలి పోవడానికి” హాయిగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు రఘువంశి…

“ఆ కీర్తన నేర్చుకుందామని ఎన్నో సార్లు ప్రయత్నించాను కానీ….. కుదరలేదు….”

“ఏం ఫరవాలేదు రాధా. రేపు నువ్వు మనింటికి వచ్చిన తరువాత ఒక సంగీతం టీచర్ని పెట్టి నీకు సంగీతం నేర్పుస్తాను. నాకు మాత్రం రోజుకు ఒకసారైనా నా కిష్టమైన ‘తెర తీయగ రాదా’ అనే కీర్తనని పాడి వినిపించాలి. ఏమంటావు” అన్నాడు రఘువంశి.

“ఏమంటాను, సరేనంటాను” సిగ్గుపడుతూ అన్నది రాధ.

***

“నాన్నగారికి నమస్కారం చేసుకోండి” అన్న యాజ్ఞీకస్వామి మాటలతో వర్తమానంలోకి వచ్చింది రాధమ్మగారు. కానీ అక్కడి వాతావరణం అంతా మారిపోయింది. ఎదురుగా చిరునవ్వుతో రఘవంశి ఫోటో కనిపించింది. రాధమ్మకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. రఘువంశి ఫోటోని పట్టుకుని గట్టిగా పడ్చేస్తూ “ఏమండీ మీరు నేర్పించిన ‘తెర తీయగ రాదా’ కీర్తన నా నోటి వెంట ఇంకా పలుకుతూనే వుంది. కానీ ఆ భగవంతుడు మరణమనే తెరను మీకు అడ్డగా పెట్టాడు. అది నేను తొలగించినా తొలగిపోదు, మీరు కనపడరు” అంటూ భర్త మాటలను గుర్తుకు తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. కుటుంబ సంభ్యులందరూ చుట్టు చేరి ఓదార్చసాగారు. పది నిముషాలకి రాధమ్మ కాస్త తేరుకున్నారు. భర్త ఫోటో ఎదుగురుగా కూర్చుని ‘తెర తీయగ రాదా’ అనే త్యాగరాజ కీర్తనను అందుకున్నారు.

అక్కడ ఉన్న వాళ్ళ అందరి కళ్ళు బాధతో చెమర్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here