తెరవని కిటికీ తలుపు

0
9

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘తెరవని కిటికీ తలుపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]తూ[/dropcap]ర్పు గట్టు నుంచి నడిచొస్తూ
దారి తప్పిన ఓ పిడికెడు కిరణాలు
పొద్దు పొద్దున్నే పలుకరించి పోతుంటాయి
ఆప్యాయంగా ఆ కిటికీని

రాగం తీస్తూ ఒంటరి కోయిల
పగలంతా పాట కచేరీ చేస్తూంటే
ఆగకుండా కీచురాళ్ళు
రాత్రంతా పారా హుషార్ కేకలేస్తుంటాయి
ఆ కిటికీ పక్కనే

వడివడిగా పరుగులు తీసే గాలి
ఓ దోసెడు పూవులను
ఓ బుడ్డీడు గాఢమైన పరిమళాన్ని
దొంగిలించి తెచ్చి పడేస్తుంటుంది
ఆ కిటికీ ఎదురుగానే

పడమటి గుట్టనుంచి
పనిగట్టుకుని వచ్చిన నీడలన్నీ
నల్లని చీకటి గుడారాలను
చల్లగా ఆ పక్కనే వేసేసుకుంటాయి
ఆ కిటికీ ముందుగానే

పండిన ఎండిన నేలరాలిన ఆకులన్నీ
గుంపుకట్టి కలిసి ఎగిరొచ్చోసి
కథలు కబుర్లు చెప్పుకుంటూ
పక్కలేసుకుని పడుకుంటుంటాయి
అక్కడే, ఆ కిటికీ కిందుగానే

ఎందుకో
ఆ కిటికీ తలుపులెవరూ తెరవరు
ఓ రోజు మెల్లగా గడుస్తుంది,
ఓ రాత్రి చల్లగా కరిగిపోతుంటుంది
అయినా
ఆ కిటికీ తలుపులెవరూ తెరవనే తెరవరు

కానీ ఆశ చావదు
పై క్రమం మాత్రం తప్పదు
మళ్ళీ మళ్ళీ
అలా పునరావృతం అవుతూనే ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here