హిందీ సినెమా పాటలలో స్త్రీ పురుష సంబంధాలు

0
6

[box type=’note’ fontsize=’16’] పరేశ్ దోషి రచించిన తేరే బినా జిందగీ పుస్తకానికి రచయిత వ్రాసిన ముందుమాట ఇది. [/box]

నా మాట

[dropcap]నా[/dropcap]కు సాహిత్యంలో ఆసక్తి. అయితే నాకు సాహిత్యం పరిచయమైనది సినెమా పాటలతోనే అంటే ఆశ్చర్యంగా వుండొచ్చు. చాలా మందికి పాట వింటే ముందు ఆ సంగీతం ఆకట్టుకుంటుంది. నాకైతే అందులోని పదాలు. నాలో భావావేశం ముఖ్యంగా ఆ పదాలే కలిగిస్తాయి, తర్వాతే సంగీతం. సినెమా సాహిత్యాన్ని సాహిత్యం అని గుర్తించని లోకంలో నేనిలా అనడం కూడా సాహసమేనేమో! ఇప్పుడు అలా లేదుగాని, ఆ రోజుల్లో సినీ పాటలకు సాహిత్య గౌరవం ఇవ్వలేదు. తక్కువగా చూసేవారు. ఇప్పుడు వ్రాస్తున్నదంతా అప్పట్లో వ్యక్తపరచడానికి ధైర్యం వుండేది కాదేమో.

నేను నా మానాన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ గడిపేవాడిని. పరీక్షలకి చదువుకుంటున్నప్పుడు కూడా రేడియో మోగాల్సిందే, ఆ పాటలకి నేను చదువు మీద మరింత శ్రధ్ధ పెట్ట గలిగే వాడిని. ఇది ఎలానో నాకూ అంతు చిక్కని విషయం. నా మిత్రుడు పులివర్తి పూర్ణచంద్రరావు అని వొకడు అనేవాడు : నువ్వు నాకంటే అదృష్టవంతుడివి, నేను లత గాత్రాన్ని మాత్రం ఆస్వాదించగలిగితే నీకు హిందీ వచ్చు కాబట్టి నువ్వు నా కంటే యెక్కువ ఆస్వాదించగలవు. (ఇతను కూడా కథలు వ్రాశాడు, అనువదించాడు.) నిజమే కదా అనిపించింది. ఇప్పుడు కొందరు మిత్రులు ఇళయరాజా తమిళ పాటలు ఎంజాయ్ చేస్తుంటే నేను నా మిత్రుడిలా ఆలోచిస్తాను, నాకు తమిళం రాదు కాబట్టి.

వయసులో వ్రాయడం అలవాటుండేది. కథలు, కవితలు, అనువాదాలు, నవలలు. తర్వాత చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. జీవితంలో యెన్నో మార్పులు, యెగుడుదిగుడులూ. వ్రాయడం పూర్తిగా మరచిపోయాను. అలాంటి పరిస్థితుల్లో వొకరోజు యాకూబ్ ఫోన్ చేసి కవిసంగమం కోసం యేదన్నా వ్రాయకూడదూ అన్నాడు. యెలాగూ నేను మళ్ళీ వ్రాయడం అలవాటు చేసుకుని జన జీవన స్రవంతిలోకి వద్దామనుకున్నా. అప్పటికప్పుడు “స్వరాలు తొడిగిన కవిత” అన్న శీర్షిక తడితే ఆ శీర్షికతో హిందీ పాటల పరిచయం చేస్తాను అన్నా. అలాగే కానిమ్మన్నాడు. వొక వంద వారాలు పాటూ చేశా. చాలా మిత్రులకు ఆ శీర్షిక అమితంగా నచ్చింది. యెలాగైనా పుస్తక రూపంలో తేవాలి అని వత్తిడి. నా పని వల్ల ఇంత మందిని సంతోషపెట్టగలిగానని ఆనందించాను. అయితే మొదటగా నేను ఇందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది యాకూబ్ కి, కవి సంగమానికి, నా పాఠకులకి.

కవులుగా లబ్ధప్రతిష్టులైనవారు తెలుగు,హిందీ సినిమా పాటలు కూడా వ్రాశారు. పాటకు దిశానిర్దేశం ఆ చిత్రంలోని సన్నివేశమే కావచ్చు, కాని ఆ పాటలో కవితాత్మ వుండేది. అంతేనా! ఆ కావ్యాత్మకు సంగీతం సమకూర్చినవారు, పాడినవారు, తెర మీద నటించిన వారు, దర్శకత్వం వహించినవారు, వాళ్ళందరూ కలిసి దానికి మరిన్ని మెరుగులు దిద్దారు.

“పాకీజా”లో చల్తే చల్తే పాట కు కట్టిన బాణీ ఆ భావాన్ని వొక లెవెల్ కు తీసుకువెళ్తుంది.
“గైడ్”లో దిన్ ఢల్ జాయె హాయె రాత్ న జాయె పాటలో రఫీ “హాయె” అన్నప్పుడు గుండెలను పిండేసినట్లుంటుంది. అదే పాటలో :
“తూ ముఝసే, మైన్ దిల్ సే పరేషాన్, దోనో హై మజబూర్
ఐసె మై కిస్కో కౌన్ మనాయె” వచ్చినప్పుడు ఐసె మై కిస్కో కౌన్ మనాయె అని రఫీ పాడటం, ఆ తీరు వేదనాభరిత నిస్సహాయత్వాన్ని బలంగా వ్యక్త పరుస్తుంది.
అలాగే “గైడ్” లోనే “కాంటోఁ సే ఖీంచ్ కె యె ఆంచల్” పాటలో వహీదా రహ్మాన్ స్వేచ్చగా, లేడిలా గంతులేస్తూ నటించిన తీరు ఆ పాటలోని భావాన్ని భాష అర్థం కానివారికైనా పట్టి ఇస్తుంది.
ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే “ప్యాసా” లో “యె మెహలొం యె తఖ్తోం యె తాజోం కి దునియా” పాటలో గురు దత్త్ నటన.
“కాగజ్ కె ఫూల్” లో “వక్త్ నె కియ క్యా హసీన్ సితం” పాట చిత్రీకరించిన తీరు కు దర్శకుడి గురు దత్త్ ని మెచ్చుకోవాలి; అలానే వీ కె మూర్తిని కూడా అంతే అద్భుతమైన చాయాచిత్రగ్రహణం ఇచ్చినందుకు.
“శ్రీ 420” లో “ప్యార్ హువా ఇకరార్ హువా హై” పాటలో “తుం న రహోగే, మై న రహూంగి, ఫిర్ భి రహేంగి నిషానియాఁ ” అన్నప్పుడు వర్షంలో రైన్ కోట్లు వేసుకుని వెళ్తున్న ముగ్గురు పిల్లలను చూపించడం…
ఇన్ని విధాలుగా వొక పాట అలా మలచబడి , మన జ్ఞాపకాలలో చోటు సంపాదించుకుంటుంది.

పాటల గురించి వ్రాస్తాను సరే. యెలా వ్రాయాలి? అనువాదం అన్నప్పుడు మూలం లో వున్న షేడ్స్ అన్నీ మరో భాషలోకి వెళ్ళవు. కొంత అదనపు సమాచారమూ, వ్యాఖ్యలూ అవసరమవుతాయి. ఉన్నదున్నట్టుగా అనువదిస్తే వొక సమస్య, స్వేచ్చ తీసుకుని సొంత కవిత్వం వ్రాద్దామంటే మనసొప్పదు. చివరికి నేను నిర్ణయించుకున్నది యేమిటంటే : ప్రతి పాటనూ వొక స్వతంత్ర తెలుగు కవితలా అనువదించాలని. ఆ పనే చేశా. మరొకటి, ఇందులో యే ఒక్క పాటా అంత తేలికగా అవలేదు. చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఆ కవి గురించి, సంగీత దర్శకుని గురించి కొంత సమాచారం ఇవ్వడం సబబనిపించి అది కూడా చేర్చా. ఇక “అజీబ్ దాస్తాఁ హై యే” పాటకి సంగీతం వెనుక నేపథ్యం; “ఐ దిలే నాదాఁ” పాటకు ఆయా ప్రాంతాల సంగీతాలు వగైరా యెరుక పరిచే చిన్న ప్రయత్నం చేశా. ఇక హిందీ, ఉర్దూ, పంజాబీ లలో వున్న ప్రత్యేక పలుకుబడులు యథాతథంగా అనువదించాల్సి వచ్చిన సందర్భంలో వాటి వివరణ ఇస్తూ పోయాను.

స్త్రీ పురుషులు పరస్పర ప్రేమలో వున్నా ఆ సంబంధం సమానత్వంతో కూడుకుని వుంటుంది. సామాజిక పధ్ధతులకు ఆమె లొంగదు. పాట ఇందులో లేదు కానీ స్త్రీ పురుష సంబంధంలో మరో కోణం మీ ముందుకు తేవాలని చిన్న వివరణ. “దో రాస్తే” చిత్రం లోని “బిందియా చమకేగీ చూడీ ఖనకేగీ” పాట. అతను చదువులో మునిగి వున్నాడు. ప్రియురాలికేమో అతనితో ప్రేమసల్లాపాలు జరపాలని వుంది. ప్రేమలో ఆటపట్టించడం, గడుసుగా శృంగారభావనలను ప్రకటించడం వో భాగం. అలాగే ఆమె అతని దృష్టి చదువు మీంచి తనమీదకు మరల్చడానికి ఆడుతుందీ, పాడుతుందీ, బెట్టు చేస్తుందీ, గేలి చేస్తుందీ. అన్నీ ఏకకాలంలో. చివరికి అతని చిరాకు పోయి పెదాల మీద నవ్వు వెలసి, కళ్ళతో దగ్గరికి రమ్మంటాడు. ఆమె వెళ్ళి అతన్ని అల్లుకుంటుంది. అప్పుడు వచ్చే వాక్యాలు మాత్రం ఇవి : నేను ప్రేమించాను, ఒకరికి బానిసత్వం చెయ్యలేదు/ ఎవరి హృదయమన్నా పగులనీగాక, ఎవరన్నా అలగనీగాక/ నేనైతే ఆడుతాను, పాడుతాను, అల్లరీ చేస్తాను/ స్నేహం విడిపోతే విడిపోనీగాక. అంటే సమాన స్థాయిలో ఇద్దరి మధ్య ప్రేమ వున్నప్పుడు ఆమెకు తన మీద ప్రేమా, అతని మీద ప్రేమా సమాన స్థాయిలో వుంటాయి. ఇలాంటి ప్రకటన కూడా సాంప్రదాయికంగా వున్న సమయాల్లో, సమాజాల్లో పాటలో అరుదుగానైనా గానీ విన్నాము.

పాటల యెంపికలో నేను ముఖ్యంగా చూసింది ఆ మాటల్లో సాహిత్యపు విలువలు వున్నాయా లేవా అన్నది. చాలా పాటలు వినసొంపుగా వున్నా ఆ సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా వుండదు. ఇక పాత పాటలతో పాటుగా ఇప్పుడొస్తున్న పాటలను కూడా తీసుకున్నా. కొంత మంది కవులవి యెక్కువ పాటలు వుండి, ఇంకొందరివి అసలు లేకపోవడం లాంటివి ఇందులో కనబడితే, దానికి వొక్కటే కారణం. నేను వంద వారాలే శీర్షిక నడిపా. ఇక వాటిలోంచి కొన్నే యెంపిక చేసి ఇందులో కూర్చాను. యెలాగూ అందరికీ న్యాయం చెయ్యాలన్నా వొక్క పుస్తకంతో అయ్యే పని కాదు. అది మీరూ అంగీకరిస్తారు.

ఈ పుస్తకానికి వొక రూపం తీసుకురావడానికి చాలా కాలమే పట్టింది, దీని వెనకాల చాలా ఆలోచనలే, చర్చలే జరిగాయి. చివరికి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే వొక theme based compilation గా వస్తే బాగుంటుంది అని, హిందీ సినెమా పాటలలో స్త్రీ పురుష సంబంధాలు అన్న శీర్షిక కింద తెస్తే బాగుంటుందని. ఇప్పుడు ఇది మీ చేతుల్లో వుంది. చదివి మీ స్పందన తెలియ జేయండి.

అన్నీ మంచి పాటలే. వొకటి ఎక్కువా కాదు, మరొకటి తక్కువా కాదు. అందుకే పాటలను అక్షర క్రమంలో (alphabetical order) పెట్టడం జరిగింది.

మనసులో నేను పెట్టుకున్న అంతిమ ఉద్దేశ్యం, ఇవి చదివిన తర్వాత చదువరి కూడా పాటను భాష వచ్చిన వాళ్ళు అర్థం చేసుకున్నంతా చేసుకోవాలని. మరి నేను ఆ ప్రయత్నంలో సఫలీక్రుతుడయ్యానా లేదా మీరే చెప్పాలి. మీ నుంచి తగిన ప్రోత్సాహం వస్తే దీని రెండో భాగం లో మరిన్ని పాటలతో మీ ముందు వుంటాను.

ఇందులో వొప్పులన్నీ మూలంలో వ్రాసిన కవులవి. తప్పులన్నీ మాత్రం నావే.

***

తేరే బినా జిందగీ,
రచన: పరేష్. ఎన్. దోషి
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్,
పుటలు: 111+32 పేజీల బుక్‌లెట్,
వెల: ₹ 150.00
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here