ఠాకరే: బయోపిక్ పేరుతో మరో అసంపూర్ణ సత్యం

0
7

[box type=’note’ fontsize=’16’] “మూల కథలో దాచిన, తెల్ల రంగులద్దిన కథనాలు కాస్సేపు పక్కన పెడితే తెరమీద కథనం అనేది చక్కగా వచ్చింది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఠాకరే‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఇ[/dropcap]ది బయోపిక్కుల కాలం. బహుశా ‘మహానటి’తో మొదలైందనుకుంటా. వెంటవెంటనే బయోపిక్కు మీద మరో బయోపిక్కు విడుదలవుతున్నది. వీటన్నిటికీ వొక సమాన లక్షణం వుంది. అది సత్యాన్ని వొక్క కోణం నుంచే చూపించడం, వొకోసారి రంగులద్ది అందంగా చూపించడం కూడా. ఈ చిత్రం దానికి అపవాదు కాదు. తెలివిగా ఠాకరే దృష్టికోణం నుంచి కథ చెప్పడం, అతను కోర్టులో తనను తాను డెఫెండ్ చేసుకోవడం ద్వారా వొక దృష్టికోణాన్ని చూపిస్తున్నామని చెప్పుకోవడానికి వుంటుంది, కాని చాలా విషయాలను దాచెయ్యడమో, అందంగా చెప్పడమో జరిగిందని వొప్పుకోక తప్పదు.

బాబ్రీ మసీదు కూలిన తర్వాత శ్రీ కృష్ణ కమిటీ ముందు హాజరవుతాడు ఠాకరే. అతని మీద అభియోగం – ప్రజలను రెచ్చకొట్టే విధంగా స్పీచులు ఇచ్చి మసీదు కూల్చివేతకు దారితీసేలా చేయడం. అలా కథ ముందుకీ వెనక్కూ కదులుతూ వుంటుంది. చివర్న కూడా అసంపూర్ణం అనే కార్డు పడుతుంది, బహుశా రెండో భాగం తీసే వుద్దేశం వుందేమో.

మొదట్లో వొక పత్రికాఫీసులో కార్టూనిస్టుగా పని చేసేవాడు ఠాకరే. అతని బొమ్మలో, వ్యాఖ్యానంలో తీక్షణత అతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది. కాని ఆ పత్రికా సంపాదకుడికి ఇబ్బందిని కూడా. అసలే పత్రిక ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, ‘కోటరీ’ కనుసన్నలలో మెలగడం ద్వారా మనుగడ సాగిస్తున్నది. ఇప్పుడిలా కార్టూన్లతో వాళ్ళకు ఇబ్బది కలిగిస్తే పత్రిక మనుగడకే ముప్పు, తద్వారా అందులోని ఉద్యోగస్తుల, తనతో సహా,ఉద్యోగాలకి కూడా. సంపాదకుడు అతన్ని పిలిచి చెప్పి చూస్తాడు. కాని యెవరి మాటా వినేరకం కాదు ఠాకరే. మాటలు వింటూనే అక్కడున్న కాగితం మీద కార్టూను గీస్తాడు, ఆ సంపాదకుని పృష్ఠం మీద కాలితో తంతున్న ఠాకరే. అదే తన రాజీనామాగా సమర్పిస్తాడు. ఈ విధంగా వీలున్న చోటల్లా కార్టూన్లను చాలా బాగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. అప్పటికి మహారాష్ట్ర ఇంకా యేర్పడలేదు. అప్పటి బొంబాయిలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి చేరిన జనం పైకి వస్తుంటే, మరాఠీలు మాత్రం వెనుక వుండిపోతారు. ముందుగా ఈ విషయాన్ని చేతిలోకి తీసుకుంటాడు. మరాఠీ మానుష్ అన్న పేరుతో మనుషుల్లో వొక భావజాలాన్ని స్థాపిస్తాడు. బొంబాయిలో ముందు ఉద్యోగావకాశాలు మరాఠీలకు, తర్వాతే ఇతరులకు అని వొక నినాదం లేవదీస్తాడు. చాలా త్వరగా ఠాకరే చేతికింద పెద్ద సైన్యమే తయారవుతుంది. శివ సేన. అవలంబించే పధ్ధతులు మోటువే, పెత్తనమే, రక్తపాతమే. క్రమంగా శివసేనకు భయపడే పరిస్థితులు నెలకొంటాయి. ఆ తర్వాత మరాఠీలో పత్రికలు నడపడం అన్నది తీసుకుంటాడు. తనే సంపాదక బాధ్యతలు కూడా తీసుకుంటాడు సామనా లాంటి వాటిలో. ఆ విధంగా కూడా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుగుణంగా తీర్చుకునే అవకాశాన్ని కల్పించుకుంటాడు. ఇక ముఖ్యమైనది హిందుత్వ రాజకీయాలకు పునాది వేయడం. ముస్లింలకు వ్యతిరేకంగా, హిందువులకు అనుకూలంగా వ్యూహాలు. బాబ్రీ మసీదు కూల్చివేత వో పెద్ద ఉదాహరణ. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం కాదనే భావిస్తాడు. అది అవసరమైన పరిణామమే అంటాడు.

ఈ పాటికి బయోపిక్కులు అంటేనే పాక్షిక సత్యావిష్కారం అని అర్థం చేసుకున్న మనకు యెక్కువ ఆశ్చర్యం కలగదు. అలవాటు పడి పోయాం. పైగా ఈ చిత్రం చివరి దాకా కూర్చుని చూసేలా తీశాడు. ముఖ్యమైన ఆకర్షణ నవాజుద్దిన్ సిద్దిఖి నటన. అతను తెర మీద కనపడని సందర్భాలలో కూడా అతను వల్లించిన సంభాషణలు వినపడుతుంటేనే రోమాలు నిక్క బొడుచుకుంటాయి. అతని కోసమైనా చూడవచ్చు ఈ చిత్రాన్ని. అరవింద్, మనోజ్ ల సంభాషణలు బాగున్నాయి. అమర్ మొహిలే నేపథ్య సంగీతం బాగుంది. సుదీప్ చటర్జీ చాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగుంది. పాత కాలం నాటి నలుపు తెలుపుల్లోని కథనం చాలా నెమ్మదిగా రంగుల్లో కి మారడం చాలా స్మూత్ గా జరిగిపోతుంది. ప్రాప్స్ కూడా బాగా సంపాదించారు, పీరియడ్ నిర్మాణానికి. అల్లర్ల సందర్భంలో రోడ్డుమీద చెల్లా చెదురుగా పడివున్న చెప్పులు ఇతర వస్తువులు, వాటిని తొక్కుకుంటూ వెళ్ళే జనం వొక దృశ్యం అయితే. మరో సారి అలాంటి అల్లర్ల తర్వాత నడుస్తూ ఠాకరే ఆ చెప్పును తీయడం, అతని అనుచరులు రోడ్డును శుభ్రపరచడం. ఇది కాస్త రాజకీయ సమర్థన కోసం తీసినా సినెమాటిక్‌గా బాగుంది. ఈ పని సగం దర్శకుడు, సగం చాయాగ్రాహకుడూ కలిసి చేసేది కాబట్టి ఇద్దరినీ అభినందించాలి. మూల కథలో దాచిన, తెల్ల రంగులద్దిన కథనాలు కాస్సేపు పక్కన పెడితే తెరమీద కథనం అనేది చక్కగా వచ్చింది. ఆ మేరకు దర్శకుడు అభిజిత్ పన్సె అభినందనీయుడు.

మనకు నిష్పక్షపాతమైన బయోపిక్కులు వస్తాయా? వస్తాయనే ఆశిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here