అణచబడ్డ వ్యక్తులందరికీ మార్గనిర్దేశం చేసే ‘ది బ్లూయెస్ట్ ఐ’

0
12

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]అం[/dropcap]దానికి మనిషి కొన్ని కొలతలు కొలమానాలు పెట్టుకున్నాడు. అసలు చిన్నతనం నుండే అందంపై కొన్ని అభిప్రాయాలను రుద్ది మనం అందాన్ని స్టాండర్డైజ్ చేసాం. ప్రపంచం అంతా తెల్లటి శరీరాన్ని అందానికి నిర్వచనంగా చెబుతారు. అలాగే నీలి కళ్ళను కొన్ని ప్రాంతాలలో చిన్ని పాదాలను కొన్ని ప్రాంతాలలో, అలా దేశ కాల మాన పరిస్థితులకు అనుకూలంగా కొన్ని కొలతలు పెట్టుకుని శరీరం ఆ కొలతల ప్రకారంగా ఉంటేనే అందమైనదని మానవ జాతి నమ్ముతుంది. ప్రపంచం అంతా తెల్లటి శరీరాల పట్లే ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడం కనిపిస్తుంది. ఎవరన్నారు తెల్లటి శరీరాలే అందమైనవని, అలా మనం నమ్ముతున్నాం. మన కళ్ళకు అలా అందాన్ని ఆరాధించమని తర్ఫీదు ఇచ్చాం. ఇది తరతరాలనుండి జరుగుతున్నదే. ఆశ్చర్యంగా మనం ఆలోచించకుండా ఈ కొలమానాల్ని స్వీకరిస్తున్నాం. అదే దృష్టితో అందాన్ని చూస్తున్నాం. దీని వెనుక ఉన్న రాజకీయాన్ని గుర్తించే నైతిక దార్శనిక శక్తిని మనం కోల్పోతున్నాం. ఎంతగా ఈ కొలతలను నమ్ముతాం అంటే వీటికి అతీతంగా ఉన్న మన శరీరాలనే మనం అసహ్యించుకుంటున్నాం. మనలను మనం గౌరవించుకోవడం మానేసి మరొకరిలా మారాలని చూస్తాం. కారణం అలాంటి రంగుని, రూపాన్ని ప్రపంచం ప్రేమిస్తుంది కాబట్టి. మనల్ని మన కళ్ళతో కాక ప్రపంచం నిర్దేశించిన కళ్ళతో చూస్తూ మన శరీరాలని అసహ్యించుకుంటూ మనకు మనం తీరని ద్రోహం చేసుకుంటున్నాం. మనలను మనం ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు అన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయేటంతగా మన మెదళ్ళు ట్యూన్ చేయబడ్డాయి.

మైఖైల్ జాక్సన్ తన రంగును మార్చుకోవడానికి పడ్డ తపన, తెల్లవారిని పాలకులుగా భయంగా చూసే ఆసియా దేశస్తులు, తెల్ల శరీరంలో ఆత్మవిశ్వాసం సాధారణమని తెల్లవారిముందు ముడుచుకుపోయే నల్లవారు ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు అసలు శరీర రంగు మనిషి ఆత్మవిశ్వాసాన్ని శాసించడం ఆ రంగు కోసం కొన్ని మిలినన్ కోట్ల విలువతో నేడు వ్యాపారాలు జరగడం గురించి విన్నప్పుడయినా మనలోని ఈ మానసిక అంగవైకల్యాన్ని మనం గుర్తించం.

అయితే ఈ భావజాలం వెనుక ఒక జాతిని మరొకరు శాసించే అధికార రాజకీయం దాగి ఉంది అన్నది చరిత్ర చెబుతుంది. లేకపోతే శారీరికంగా ఎంతో బలమైన అంగ సౌష్టవంతో, ఇమ్యూనిటితో జన్మించిన నల్లవారిపై తెల్లవారు ఒక జాతిగా ఆధిపత్యం ఎలా చెలాయించగలిగారు? ఎంతో దృఢమైన శరీర నిర్మాణం, శారీరిక బలంతో జన్మించే నల్ల జాతీయులు బానిసలుగా ఎలా మార్చబడ్డారు? దీనికి కారణం తెల్లవారి రాజకీయమే. నల్లవారిని వారు శారీరికంగా గెలవలేదు, వారి మానసిక బలాన్ని దోచుకుని వారిని నిర్వీర్యులుగా చేసి వారి పై ఆధిపత్యం సాధించింది తెల్లజాతి.

టోనీ మారిసన్ నోబెల్ ప్రైజ్ పొందిన ప్రఖ్యాత రచయిత్రి. అందం, అధికారం ఆధారంగా ప్రపంచం వేసిన ముసుగుల్ని, వాటి వెనుక తెల్లజాతి రాజకీయాన్ని తన మొదటి నవల ‘ది బ్లూఎస్ట్ ఐ’లో అద్బుతంగా అవిష్కరించారు. 1970 లలో రాసిన ఈ నవలలో పెకోలా అనే చిన్ని ఆఫ్రో అమెరికన్ అమ్మాయి ప్రధాన పాత్ర. చూట్టూ ఉన్న వారి అసహ్యానికి గురి అవుతూ బాల్యాన్ని గడిపే ఈ అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె చూస్తున్న ప్రపంచంలో తెల్ల శరీరాన్ని నీలి కళ్ళని అందరూ గౌరవించడం ఆరాధించడం చూస్తుంది. అందుకని అదే అందమని బలంగా నమ్ముతుంది. తన తోటి నల్లజాతీయులు కూడా తెల్లవారిని, నీలికళ్ళున్నవారి పట్ల అత్యంత గౌరవాన్ని చూపడం చూస్తుంది. నల్లవారిని నల్లవారే చులకన చేయడం, తక్కువగా చూడడం ఆమె రోజూ అనుభవాలు. అందుకే తనకు నీలి కళ్ళు కావాలని బలంగా కోరుకుంటుంది.

ఇంట్లో ఆమె తల్లి తండ్రుల మధ్య ఎన్నో గొడవలు. తండ్రి ఖోలి తాగుబోతు. తల్లి పౌలిన్‌కి అవిటితనం. దానితో పాటు దక్షిణ ప్రాంతపు యాసలో మాట్లాడుతుంది. ఇవన్నీ గొప్ప అందమైన విషయాలు కావు కాబట్టి తోటివారు ఈ కుటుంబాన్ని చులకనగా చూస్తారు. అంటే శారీరిక నిర్మాణం, శరీర రంగు, ప్రాంతపు భాష, యాసను బట్టి లభించే గౌరవం ఈ కుటుంబానికి దొరకదు. తమతో ప్రేమగా మాట్లాడేవరు లేక పౌలిన్ ఒంటరై కేవలం పనిలో ఆనందాన్ని వెతుక్కుంటుంది. పని అంటే గొప్ప ఉద్యోగం కాదు. ఆమె ఒక తెల్లవారింట పనిమనిషి మాత్రమే. తెల్లవారి మధ్య ఉంటూ అక్కడ సౌఖ్యాలను చూస్తూ వాటి మధ్య తన నల్లజీవితాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. భర్త ఖోలి ఆరోగ్యం బావుండదు. పైగా ముక్కోపి. అతని తల్లితండ్రులు అతన్ని చిన్నప్పుడే వదిలేస్తారు. అనాథ అయిన నల్లవాని జీవితం ఎంత హీనంగా ఉంటుందో దానికి అతని జీవితం మినహాయింపు కాదు. ప్రపంచం పై కసి కోపం, అసహనం, ఆక్రోశం ఇవ్వన్ని అతనిలో నిత్యం కనిపించే భావాలు. వీటన్నిటి మధ్య బాలెన్స్ కోల్పోయిన జీవితం గడుపుతుంటాడు అతను. వయసులో అతను ప్రేమించిన అమ్మాయితో అతను దగ్గరగా ఉన్నప్పుడు అది చూసిన తెల్లవారు కొందరు అతన్ని పబ్లిగ్గా కించపరచి అవమానిస్తారు. ఈ సంఘటన అతని మనసును చాలా గాయపరుస్తుంది. అతనిలో అన్ని రకాల సున్నిత వాంఛలు చచ్చిపోతాయి. ఏ స్త్రీ తో దగ్గరగా ఉన్నా అది ప్రేమ కోసం కాక తాను పొందిన అవమానం గుర్తుకువచ్చి స్త్రీని సున్నితంగా కాక బలవంతంగా అనుభవించే పశువుగా అతను తనకే తెలీకుండా మారిపోతాడు. తన సొంత కూతురు చిన్ని పెకోలాని బలాత్కారం చేస్తాడు ఎందుకంటే ఆమెను చూసిన ప్రతిసారి అతనికి యవ్వనంలో ఉన్నప్పటి భార్య గుర్తుకువస్తూ వుంటుంది. పెకోలా గర్భం ధరిస్తుంది. ఒక పాప పుట్టి చనిపోతుంది.

పెకోలాకు ఒక ఫాస్టర్ ఫామిలి అండగా ఉంటారు. ఆమె చిన్నప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ తనని వీధిలో వదిలేసినప్పుడు వీరు ఆమెను కొన్నాళ్ళు చేరదీస్తారు. ఆ కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెల్లు పెకోలాతో కలిసి ఆడుకుంటారు కాని విపరీతంగా భయపడుతూ ఉండే పెకోలా అంటే వారికి చులకన. పెకోలా బిడ్డ బ్రతకాలను వారు కోరుకుంటారు. కాని ఆ బిడ్డ చనిపోయి పెకోలా పిచ్చిదయినాక తమ వల్లనే పెకోలా జీవితం పాడయిందని బాధపడతారు. తాము నిత్యం ఆమెను వేధించిన విధానం, ఆమెను నిస్సహాయంగా ఉండేలా శాసించిన తమ అధికారం వారికి గుర్తుకు వచ్చి పెకోలా జీవచ్ఛవంలా అవడానికి ఆమెపై జరిగిన అత్యాచారం కాక ఆమెను తమతో కలుపుకోకుండా వంటరిని చేసిన తమ ప్రవర్తనే కారణం అని అర్థం చేసుకుంటారు. ఈ ఇద్దరు తెల్లజాతీయులైన చిన్న పిల్లలతో రచయిత్రి తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా చెబుతారు. నల్లవారి జీవితంలోని విషాదానికి కారణాలు వెతికెతే వారిని మానసికంగా నిస్సహాయులుగా మార్చిన తెల్లవారి అధికారమే కారణం అని ఆ ఇద్దరు చిన్న పిల్లల తమను తాము విశ్లేషించుకుని కనుకున్న సత్యం వారి నోటితో చెప్పించి చాలా ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేశారు.

అమెరికాలోని నల్లజాతీయుల జీవితాన్ని వారి జీవితంలోని విషాదం వెనుక ఉన్న సామాజిక కారణాలను ఈ నవల ద్వారా రచయిత్రి చర్చకు పెడతారు. తెల్లవారు నల్లవారి జీవితాలను దోచుకున్న విధానాన్ని బాహాటంగా చర్చిస్తుంది ఈ నవల. నల్లవారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని సైతం దోచుకుని వారిని పూర్తిగా తమకు బానిసలుగా మార్చుకున్న తెల్లవారి పాలనా విధానాన్ని ఈ నవల లోని పాత్రల ద్వారా రచయిత్రి చెప్పే ప్రయత్నం చేసారు. తెల్లవారు అధికారం చెలాయించే జాతిగా మారితే నల్లవారు తమను తాము తెల్లవారు దయకు పాత్రులుగా బ్రతికే అధమ స్థితిలోకి ఐచ్చికంగా దిగజార్చుకున్నారు. మానసికంగా తాము తెల్లవారి కన్నా అన్నిటిలో తక్కువని వారి రంగు, ఆర్భాటాలను గొప్పవని అంగీకరించి తమను తాము నిత్యం కించపరుచుకుంటూ, తమలోని అసహనాన్ని తమ కుటుంబాలపై వెదజల్లుతూ తమ జీవితాలను నరకప్రాయం చేసుకున్న నల్ల జాతీయుల స్థితి వెనుక ఉన్న రాజకీయాన్నివారు అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. తెల్లవారికి విధేయులుగా ఉండడమే తమ జీవితానికి అర్థం అని బలంగా నమ్మే పౌలీన్ లాంటీ వారెందరో.

నల్లవారి ఆలోచనలు, ఇష్టాలు, కోరికలు ఆఖరికి ఆకలి, మైధునం, నిద్ర, బాంధవ్యాలపై కూడా తెల్లవారి నియంత్రణ ఎలా సాగిందో ఈ కథలో పాత్రల జీవితాలను పరిశిలిస్తే తెలుస్తుంది. తెల్లవారు నల్లవారిని అణగదొక్కింది వారి ఆత్మలను సంపూర్ణంగా తమ వశం చేసుకుని. అందుకే నల్లవారు సాగించే పోరాటం కేవలం అధికారం కోసం కాదు, తమ ఉనికి కోసం, తమ సంపూర్ణమైన మానసిన స్వేచ్చ కోసం, తెల్లవారు తరతరాలుగా తమ మనసులపై, బుద్ధిపై చెలాయిస్తున్న అధికారం, నియంత్రణల నుంచి విముక్తి కోసం. నల్లవారి ఎముకలల్లోకి పాతుకుపోయిన దాస్య బావజాలాన్ని వదుల్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. ఈ నవలలో రచయిత్రి తెల్లవారు నల్లవారిని ఎలా శాసించారో చెప్పడం కన్నా తెల్లవారి అధికారం క్రింద బ్రతుకుతూ నల్లవారు తమను తాము ఎలా శిక్షించుకున్నారో, ఎలా అవమానించుకుంటున్నారో ఎలా అన్యాయం చేసుకుంటున్నారో చెప్పడానికి ప్రయత్నించారు. తెల్ల దొరలని వీరు ఎంతలా స్వీకరించారంటే అందం అన్నా, ధనం అన్నా, భోగం అన్నా, సుఖం అన్నా, తెలివి అన్నా, శ్రేయస్సు అన్నా తెల్లతనమే అని బలంగా నమ్మేటంత. ఎన్నో ఏళ్ళుగా ఆధిపత్య రాజకీయాలను అనుభవిస్తూ తెల్లవారి క్రింద బ్రతకడమే తమ కర్తవ్యమని నమ్మారు కూడా.

అణచివేతకు గురి అవుతున్న జాతి ప్రపంచంలో ఏదైనా కాని ముందు తమ స్థితికి కారణాల్ని, మూలాల్ని వెతుక్కోగలగాలి. తమ దాస్య జీవనాన్ని సహజంగా స్వీకరించడం వారి అవగాహన లేమిని చూపిస్తుంది. ఇందులోనించి బైట పడినప్పుడే వారికి తమ స్థితి అర్థం అవుతుంది. అప్పుడు వారు పోరాడవలసింది బైటి వ్యక్తులతో కాదని తమని అణిచివేతకు విరుద్ధంగా నోరెత్తనీయకుండా చేసే తమ భావజాలంతోనే అని అర్థం అవుతుంది. ముందుగా మార్పు వారిలో వచ్చినప్పుడే వారు ఎటువంటి పోరాటానికైనా, సమస్యలను ఎదుర్కోవడానికైనా, స్వాతంత్ర్యాన్ని పొందడానికైనా అర్హత సంపాదిస్తారు. ఈ అవగాహన అణిచివేతను సహిస్తున్న ప్రతి వ్యక్తికి అవసరం. నల్లజాతి తెల్లవారి అహంకారం నుంచి విముక్తి అవ్వాలంటే ముందుగా తమలోని తరతరాల దాస్య ప్రవృత్తికి తిలోదకాలివ్వాలి. ముందుగా మానసికంగా వారు మారాలి. వారి ఆలొచనలు మారాలి, వారి నిర్వచనాలు మారాలి, అప్పుడే వారి జీవితలలో మార్పుకోసం వారు సరైన రీతిలో పోరాటం చేయగలుగుతారు.

టోనీ మారిసన్ ప్రపంచం మెచ్చిన రచయిత్రి. వీరి నవలలు చదవడం అంటే ఆలోచనలను పదును పెట్టుకోవడం. ‘ది బ్లూయెస్ట్ ఐ’ నల్లజాతి సమస్యను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే గొప్ప నవల. అమెరికన్ నవల కాబట్టి నల్లవారి అణిచివేతకు సంబంధించిన కథావస్తువు కనిపిస్తుంది. కాని ప్రపంచంలో వివిధ పేర్లతో, పరిస్థితులలో అణచబడ్డ వ్యక్తులందరికీ మార్గనిర్దేశం చేసే నవలగా దీన్ని విశ్లేషించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here