ది డెస్ట్రక్షన్ ఆఫ్ నేచర్ ఇన్ ది సోవియట్ యూనియన్ – పుస్తక పరిచయం

0
10

[dropcap]ఇ[/dropcap]ది సోవియట్ రష్యాలో పర్యావరణ విధ్వంసం గురించి బోరిస్ కొమరోవ్ (Boris Komarov) 1980లో రాసిన “The destruction of nature in the Soviet Union” అన్న పుస్తకం గురించి. ఇది కాకుండా ఈ విషయమై కొమరోవ్ మరొక పుస్తకం కూడా రాసారు “The geography of survival : ecology in the post-Soviet era (1994)” అని. ఈ పుస్తకాలు రెండూ కూడా ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో లభ్యం. అద్దెకు తీసుకొని ఆన్లైన్ లోనే చదవవచ్చు. డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం లేదు.

ఎప్పుడో దశాబ్దాల క్రితం రాసిన పుస్తకం ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కొంత ఉపోద్ఘాతం చెప్పుకోవాలి. పర్యావరణ సమతౌల్యం అన్నది ఇప్పటి కాలంలో రోజు రోజుకీ దెబ్బతింటోందన్న విషయంపై చూఛాయగా అందరికి ఒక యెఱుక ఉంది. అయితే దీనికి కారణాల గురించీ బయటపడే మార్గాల గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో పర్యావరణ సమస్యల గురించి పోరాడి ప్రాణత్యాగం చేసిన స్వామి జ్ఞాన్ స్వరూప్ సానంద్ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన పూర్వాశ్రమ నామం ప్రొఫెసర్ జీ డీ అగర్వాల్. ఆయన ఒకప్పటి రూర్కీ విశ్వవిద్యాలయంలో (ఇప్పటి ఐఐటీ రూర్కీలో) సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చదివి తర్వాత బర్కీలీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డి చేశారు. తర్వాత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో కొన్నాళ్ళు పెద్ద హోదాలో పని చేసి అటు తర్వాత ఐఐటి కాన్పూర్ లో సివిల్ ఇంజనీరింగ్ మరియు పర్యావరణ శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్ గా పని చేసారు. అటు తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి నదీజలాల కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. గంగా నది యొక్క జల ప్రవాహం నిర్మలంగా అవిరళంగా సాగాలంటూ సత్యాగ్రహం చేసి చివరికి ఆ ప్రయత్నంలో ప్రాణత్యాగం చేసారు.

అప్పట్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం స్వామి సానంద్ చేసిన అభ్యర్థనలను సరిగ్గా పట్టించుకోలేదని చాలా విమర్శలు వచ్చాయి కూడానూ. ఈ క్రమంలో నేను సామజిక మాధ్యమాలలో స్వామి సానంద్ పోరాటాన్ని సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాను. అప్పుడు కొందరు తెలిసినవారు స్వామి సానంద్ గురించి ఇలా అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇంతగా వ్యతిరేకిస్తున్నాడంటే ఈయన మార్క్సిస్టు భావజాలం కలవాడా ఏమిటి? అసలే పర్యావరణ పరిరక్షణ అంటున్నావు బహుశా మార్క్సిస్టే ఏమో అని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని గురించిన చర్చను పక్కన పెడితే మితిమీరిన పారిశ్రామీకరణను వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నిరోధకుడు మార్క్సు మతానుయాయి అన్న భావన మన సమాజంలో బలీయంగా నాటుకుపోయి ఉంది.

నిర్దిష్టమైన ప్రణాళిక మరియు దూరదృష్టి లేనటువంటి అస్తవ్యస్త భౌతిక అభివృద్ధి విధానాలను ఎవరు ప్రశ్నించినా కూడా వారిని మార్క్సిస్టు అని ముద్ర వేయటం అన్నది ఇప్పటికి జరుగుతూనే ఉంది. ఇది జరిగినప్పటి నుంచి మార్కిస్టు లేదా కమ్యూనిస్టు రాజ్యాలలో పర్యావరణ స్పృహను గురించిన రచనలను గురించి వెతుకుతూ ఉన్నాను. ఈ విషయంపై అడపా దడపా రకరకాల చోట్ల ఏవేవో చదివినా కూడానూ ఇదే ముఖ్య విషయంగా ప్రామాణికంగా రాసిన పుస్తకాలను చదవలేదు నేను.

ఈ క్రమంలో బోరిస్ కొమరోవ్ రాసిన ఈ పుస్తకాలను గురించి తెలుసుకున్నాను. సోవియట్ రష్యాలో మార్క్సిజం ఆదర్శంగా భావించే నాయకులు రాజ్యమేలిన కాలంలో కూడా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా వాదోపవాదాలు చర్చలు జరిగాయి. ఈ చర్చలను సంఘర్షణలను అర్థం చేసుకున్న వారెవరైనా కూడా మార్క్సిస్టులందరూ స్వతహాగా ప్రకృతి ప్రేమికులు అని భ్రమ పడటంలో అసలు అర్థమే లేదు అని తెలుసుకుంటారు. అప్పటి సోవియట్ రష్యాలో కూడా రాజ్యం తీసుకున్న నిర్ణయాలను పర్యావరణ సమతౌల్యత దృష్ట్యా వ్యతిరేకించిన మేధావులు చాలా మందే ఉన్నారు. అటువంటి వారి గురించీ వారి ఆలోచనల గురించిన ప్రస్తావనే బోరిస్ కొమరోవ్ రాసిన ఈ పుస్తకాలు. బోరిస్ కొమరోవ్ అసలు పేరు జీవ్ వూల్ఫ్ సన్. ఈ పుస్తకాలలో మొదటిది అయినటువంటి The destruction of nature in the Soviet Union అన్న పుస్తకం మ్యానుస్క్రిప్టును అప్పటి రష్యా రాజ్యానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ఇతర ఉద్యమకారుల సహాయంతో రహస్యంగా సోవియట్ రష్యా నుంచి పాశ్చాత్య దేశాలకు చేరవేశారట ప్రచురణ నిమిత్తమై. ఈ పుస్తకంలో అంతా కూడా పర్యావరణం మరియు పారిశ్రామీకరణ అన్న విషయంపై అప్పటి అధికార సోవియట్ రష్యా ప్రభుత్వ అధికారులతో చేసిన చర్చలు మంతనాలను వారికి వ్యతిరేకంగా వచ్చిన విమర్శలు గురించిన సమాచారం సోవియట్ రష్యా మేధోవర్గం ఈ విషయం పై చేసిన వాదోపవాదాలు వగైరాలు ఉన్నాయి.

1963లో సైబీరియా ప్రాంతంలోని బైకాల్ సరస్సు యొక్క ఉనికికి ఆ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన పరిశ్రమల వల్ల ముప్పు ఉందని చివిలిఖిన్ (V A Chivilikhin) అన్న మేధావి అప్పటి ప్రభుత్వ పనితీరుపై గొంతెత్తాడట. అయితే ఈ ఉద్యమం మెల్లగా ఊపు అందుకున్నాక ప్రజలకి తెలిసి వచ్చింది ఏమంటే ఈ విషయంపై చివిలిఖిన్ గొంతెత్తక ముందే అప్పటికి నాలుగేళ్ళ ముందు నుంచి అంటే 1958-1962 వరకు ఎందరో సైంటిస్టులు ఆ బైకాల్ సరస్సు ప్రాంతంలో ఈ కాగితం గుజ్జు పరిశ్రమ పెట్టటాన్ని వ్యతిరేకించారట.అయినప్పటికీ అప్పటి అధికార ప్లానింగ్ కమిటీ వారు మరియు ఆ కాగితపు పరిశ్రమ శాఖ వారు వీటన్నిటిని పెడచెవిన పెట్టారట. అసలు చాలా రోజుల వరకు ఆ ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు చుట్టు పక్కల పరిసరాలు పర్యావరణం పై ముఖ్యంగా బైకాల్ సరస్సుపై ఈ ప్రాజెక్టు ప్రభావం గురించి చేసిన అధ్యయనాల తాలూకా వివరాలే చెప్పలేదట ప్రజలకు అప్పటి సోవియట్ ప్రభుత్వాధికారులు. ఈ ఉద్యమ ప్రభావం పెరిగాక కొన్ని వివరాలు చెప్పారట. అవన్నీ తూ తూ మంత్రంగా చేసిన అధ్యయనాలే అని తేలాయట తర్వాత. మొదటి నుంచి కూడా ఈ బైకాల్ సరస్సు దగ్గర తలపెట్టిన కాగితం మరియు గుజ్జు పరిశ్రమ విషయంలో ఇటువంటి పర్యావరణ సమతౌల్యం గురించి వ్యాఖ్యలు చేసేవారిని అందరిని దేశ ద్రోహులుగా జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిగా చిత్రించేవారట. ఇటువంటి పరిశ్రమలు నడవాలంటే మంచినీటి సౌలభ్యం ఉన్న ప్రదేశాలే కావాలి కాబట్టి ఉన్న వాటిలో ఈ బైకాల్ సరస్సు ప్రాంతమే అనువైనది అని అదివరకే తీర్మానించేసుకొని నామ మాత్రంగా ఏదో అధ్యయనాలు చేశారట. ఆ సరస్సు చుట్టూతా ఉండే ప్రజా సమూహాలన్నీ కూడా పురోగతి సాధించాలని ఫ్యూడల్ వ్యవస్థ నుంచి సోషలిజం వైపుకు ప్రయాణం చేయాల్సిందేనని దానికోసం సరస్సు ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధికి ఇవ్వాల్సిందేనని తీర్మానించిందట అప్పటి సోవియట్ ప్రభుత్వం. పారిశ్రామిక అభివృద్ధి అన్నది అప్పటి సోవియట్ ప్రభుత్వాధికారుల ఏకైక లక్ష్యమని ఆ పారిశ్రామీకరణ కోసం వారు తతిమ్మా విషయాలన్నిటిని పక్కన పెట్టేసేవారని అంటారు కొమరోవ్. గలాజి (Galazi) అన్న సైంటిస్టు ఈ ప్రాజెక్టు పర్యావరణానికి హాని చేస్తుందని అన్నాడని అతనిని “ఎనిమి ఆఫ్ ది పీపుల్” అంటే “ప్రజా శత్రువు” అని ముద్ర వేసిందట అప్పటి సోవియట్ ప్రభుత్వం. ఈ పర్యావరణం పై ప్రభావాన్ని అధ్యయనం చేసే కమిటీ వారితో ఒకటి నచ్చలేదని మరొకటి ఇలా ఎన్నో రిపోర్టులు రాయించారట ప్రభుత్వాధినేతలు. కమిటీ వారు సరస్సు స్వచ్ఛత దృష్ట్యా ఈ ప్రాజెక్టును ఆపండని ఎన్ని సార్లు చెప్పినా కూడానూ మేము ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాక మీరిలాంటి రిపోర్టు ఎలా ఇస్తారసలు అని వారిని రిపోర్టు సరిదిద్దమని చెప్పి పంపేవారట అప్పటి ప్రభుత్వాధికారులు. ఇప్పటి మన భారత దేశంలో కూడా పశ్చిమ కనుమలలో (Western ghats) పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా పారిశ్రామిక అభివృద్ధి జరగటం ఎలా ఆన్న విషయం గురించి మొదట ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ తో ఒక అధ్యయనం చేయించారు మన ప్రభుత్వాల వారు. తర్వాత ఆయన అభివృద్ధి నిరోధకుడని ఆయన పై ముద్ర వేసి కస్తూరి రంగన్ కమిటీతో మరొక రిపోర్టు రాయించారు. కస్తూరి రంగన్ రిపోర్టు ఈ విషయంలో పరమ ప్రమాణమని గాడ్గిల్ రిపోర్టు పక్కన పెట్టారు. మొన్నామధ్య ఈ కస్తూరి రంగన్ కమిటీ రిపోర్టును కూడా అభివృద్ధి వ్యతిరేకమైన రిపోర్టని ముద్ర వేశారు. ఈ విషయంలో కేరళ కమ్యూనిస్టు పార్టీ కర్ణాటక భాజపా పార్టీ రెండు ఏకమయ్యాయి. వీటి వెనుక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బులు దండుకునే వ్యాపారుల హస్తం ఉందని విమర్శలు వచ్చాయి కూడా. కాబట్టి అప్పటి సోవియట్ రష్యాకు ఇప్పటి మన కాలానికి కూడా ఈ విషయాలలో ప్రభుత్వ దృక్పథాలలో పెద్ద మార్పులు లేవనుకోవచ్చునేమో.

ఇంకొక సోవియట్ ప్రభుత్వాధికారి ఇలా అన్నాడట.అసలేంటి మీరు ఈ సరస్సు గురించి ఇంత గోల చేస్తున్నారు. ఈ పరిశ్రమ పెట్టాలంటే సరస్సులో కాలుష్యం జరుగుతుంది. అది తప్పదు. సరే ప్రస్తుతానికి ఆ కాలుష్యమేదో చేసేద్దాం. మన దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ శక్తి తాలూకా కొత్త టెక్నాలజీ కూడా ఉంది. మీరు భయపడేటంత కాలుష్యం జరిగి సరస్సు నాశనమైపోయిందనే అనుకుందాం. అప్పుడు ఇంకొక చోట మన కొత్త టెక్నాలజీతో మరొక పెద్ద గుంత తవ్వి కృత్రిమంగా నీరు నింపి మనమే మరొక బైకాల్ సరస్సును సృష్టిద్దాం అదేం పెద్ద విషయమా అన్నాడట ఆ మేధావి. పారిశ్రామీకరణ మరియు కొత్త టెక్నాలజీ గురించిన వ్యామోహం అలా ఉండేదట అప్పట్లో. 2017లో కూడా పుతిన్ ఈ సరస్సు కాలుష్యం గురించి విషాదం వ్యక్తం చేశారట. ఐతే చుట్టుపక్కల పరిశ్రమలకు దగ్గరుండి అనుమతి ఇచ్చింది కూడా ఆయనేనట. చాలా క్లిష్టమైన విషయం ఈ బైకాల్ సరస్సు సంరక్షణ అన్నది ఇప్పటికీ రష్యాలో, మనకు గంగానది సంరక్షణకు మల్లే.

అయితే ఈ సమస్య ఈ సరస్సు ఒక్కదానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని ఎన్నో నదులు ఉపనదులు సరస్సులు వనాలు ఈ మితిమీరిన పారిశ్రామికరణకు బలైపోయేవని ఐతే రష్యా పౌరులకందే అధికారిక వార్తలలో మాత్రం పర్యావరణ సమస్య అన్నది క్యాపిటలిజం తాలూకా సమస్యని సోషలిజంలో ఆ సమస్య అసలు లేనే లేదని చెప్పేవారట కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ వారు. సోవియట్ పౌరులకు ప్రపంచమంతా అన్ని దేశాలలో పర్యావరణ సమస్యల గురించిన పోరాటాల గురించి అవగాహన ఉండచ్చును కానీ రష్యాలో ఈ విషయమై ఏమవుతుందో తెలుసుకునే అవకాశం అధికార ప్రభుత్వ ప్రాపగాండా ఇవ్వదని అంటారు కొమరోవ్. సోషలిస్టు రాజ్యంలో ప్రకృతి వనరుల మీద మరియు ఉత్పత్తి సాధనాల మీద సార్వత్రిక యాజమాన్యం ఉంటుందని ఈ దేశంలో పర్యావరణ విధ్వంసం తాలూకా సమస్యలేవీ తలెత్తవని ప్రభుత్వ ప్రాపగాండా గట్టిగా జరిగేదట. 1975 ప్రాంతంలో అసలు పారిశ్రామిక కాలుష్యం అన్న విషయంపై పౌరులకు ఏ విధమైన సమాచారం అందకుండా ఉండేలా చూడమని ప్రత్యేకమైన అధికారిక సర్క్యులర్ వేశారట ఒకటికి రెండు సార్లు అప్పటి సోవియట్ ప్రభుత్వం వారు.

ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటం అన్నది సోషలిస్టు పారిశ్రామీకరణ విధానంలో చాలా కష్టమని అంటారు కోమరొవ్. ఈ విషయంలో క్యాపిటలిస్టు సమాజానికి కూడా ఆయన అక్షింతలు వేస్తారు. అది వేరే విషయం. ప్రకృతి వనరులు అన్నవి ఖర్చు లేకుండా లభిస్తాయి ఆన్న భావనలోనే పెద్ద లోపం ఉందని అంటారు కొమరోవ్. ఫలానా ప్రాజెక్టుకు నీరు అవసరం అవుతుంది అని అంటే ఆ నీటికి ఇంత వెల అని చెబితే అప్పుడే దానిని విచక్షణతో ఎలా వాడాలో ఆలోచించటం అన్నది మొదలుపెడతారని అంటారాయన. ఉచితంగా నీరు ఇస్తూ పోతే అడ్డూ అదుపు లేకుండా వాడేస్తారని అంటారాయన. అయితే సోషలిస్టు సమాజంలో శారీరిక శ్రమకు ఇచ్చిన విలువ మరియు ప్రాధాన్యత ప్రకృతి వనరులకు ఇవ్వరని అదేదో ఉచితంగా లభించే వనరు లాగానే భావిస్తారని అంటారు కొమరోవ్. ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన నదులలో సరస్సులలో ఉండే నీరు కోసం ఎవరూ ప్రత్యేకించి శారీరికంగా శ్రమించలేదని కాబట్టి ఆ నీటికి ఇంతంటూ వెల కట్టాల్సిన అవసరం ఏమీ లేదని ఇష్టమొచ్చినట్లు దండుకోవచ్చని కమ్యునిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ వారు అన్నారట అప్పట్లో.

“మానోతో మై గంగా మా హూ, నా మానేతో బెహతా పానీ” అని లతా మంగేష్కర్ పాడిన ఒక పాత హిందీ చిత్ర గీతాన్ని ప్రస్తావించాడు నా మిత్రుడు ఒకసారి స్వామి సానంద్ గారి గురించి చెబుతూ. ఇది చదువుతుంటే అది గుర్తొచ్చింది. గంగానదిని సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావించినప్పుడు నదీ జలాలను వినియోగించే తీరుకీ గంగా నదిని కేవలం ఒక నీటి వనరులాగా భావించి పారిశ్రామిక అవసరాల కోసం ఆ నీటిని వినియోగించే తీరుకి చాలా తేడా ఉంది. “గంగానది ఫ్యాక్టరీల శౌచాలయం” అని అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవితలో.

సోవియట్ ప్రభుత్వపు భావజాలాన్ని తప్పుపడుతూ ఆ విషయమై ఏ.కే.టాల్‌స్టాయ్ రాసిన ఒక కవితను ప్రస్తావిస్తారు కొమరోవ్. ఈ కవిత పంతొమ్మిదవ శతాబ్దంలో రాసినదైనప్పటికిని ఇరవయ్యో శతాబ్దపు సోవియట్ రష్యా విధానాలకు బాగా నప్పుతుందని అంటారు కొమరోవ్. “They want to flatten the whole world. And thus introduce equality. They want to spoil everything for the common good” ఆన్న టాల్‌స్టాయ్ వాక్యాలు ప్రస్తావిస్తారు కొమరోవ్. అంటే సమానత్వం కోసం తాపత్రయ పడుతూ ప్రపంచంలోని వైవిధ్యాన్ని అంతా నిర్మూలించి ఒకటే మూసలో ఉండేలాగా తీర్చిదిద్దాలని ఉబలాటపడుతున్నారని అందరి హితాన్ని కోరుతున్నామని అంతా మనందరి మంచికే అంటూనే మొత్తం సమాజాన్ని పాడుచేస్తున్నారని అంటాడు తన కవితలో టాల్‌స్టాయ్ (లియో టాల్‌స్టాయ్ కాదు. ఇదే వంశావళికి చెందిన మరొక కవి ఈయన). సోవియట్ ప్రభుత్వ విధానాలు కూడా ఇలానే ఉంటాయని అంటారు కోమరోవ్.

ఒక కిలోమీటర్ మేర సాగునీటి కెనాల్ కట్టటానికి వందలాది ఏకరాల సాగుభూమికి నీరు లేకుండా చేసిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తారు కొమరోవ్. అస్తవ్యస్త నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల బంజరు భూములు తమ ప్రకృతి సహజ లక్షణాలు రూపురేఖలు పోల్చుకొలేనంతగా మారిపోతున్నాయని అంటారు కోమరోవ్. దూరదృష్టి సరైన ప్రణాళిక లేకుండా నిర్మించే అతిభారీ జలవిద్యుత్తు ప్రాజెక్టులు విద్యుత్ శక్తి సమస్యను తీర్చినట్టే తీర్చి మరెన్నో కొత్త సమస్యలకు నాంది పలుకుతాయని అంటారు కొమరోవ్.

ప్రకృతి నియమాలను సమతౌల్యతను పూర్తిగా పక్కన పెట్టి నిర్మించిన పరిశ్రమలు ప్రాజెక్టులు సోవియట్ రష్యాలో కోకొల్లలని అంటారు రచయిత. పారిశ్రామిక అభివృద్ధి అన్నది అధికార ప్రభుత్వ యంత్రాంగానికి రాజకీయంగా పనికొచ్చే విషయం కాబట్టి విచక్షణారహితంగా చాలా పర్యావరణ విధ్వంసం అన్నది చేశారని అంటారు కొమరోవ్. స్టాలిన్ హయాంలో ప్రతిపాదించిన ప్రణాళికలను గురించి ప్రస్తావిస్తారు కోమరోవ్ ఇక్కడ. “ప్రకృతి పరివర్తన కోసం చేసిన గొప్ప ప్రణాళిక” అంటే “The great plan for the transformation of nature” అని స్టాలిన్ హయాంలో ఒక ఆలోచన ఉండేదని ఆ ముసుగులో జరిగిన పర్యావరణ విధ్వంసం అంతా ఇంతా కాదని అంటారు కొమరోవ్. నోబుల్ పురస్కార గ్రహీత అలెక్సాండర్ సోల్జనెత్సిన్ (Aleksandar Solzhenitsyn) పుస్తకాలలో స్టాలిన్ హయాంలో సాగిన ఈ విధ్వంసం గురించిన వివరాలు ఉంటాయని అంటారు కొమరొవ్.

ప్రకృతిని అదుపులో పెట్టాలని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్న కోరిక ఆధునిక పారిశ్రామిక నాగరికతలో బాగా బలపడిందని అంటారు కోమరోవ్. సాంఘిక జీవన విధానాలను స్థితిగతులను శాసిస్తున్న రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి ఎప్పుడూ కూడా శత్రువులపై విజయం సాధించటం ఆన్న విషయం చుట్టూనే తిరుగుతుందని చివరికి వారు ప్రకృతిని నదులను వనాలను కూడా అలానే ఒక శత్రువుగా చూడటం ప్రారంభించారని అంటారు కోమరోవ్. “పర్యావరణ విపత్తుకు సంబంధించిన చారిత్రక తాత్విక మూల కారణాలు” (The Historical Roots of Our Ecologic Crisis) అని 1960లలో లిన్ వైట్ జూనియర్ (Lynn White Jr) అనే మేధావి ఒక గొప్ప రీసెర్చ్ పేపర్ రాశాడు. అందులో ఆయన కూడా ఇదే మాట అంటారు. ఆధునిక మానవుడిలో ప్రకృతి నియమాలను గౌరవిస్తూ సహజీవనం చేయాలన్న ఆలోచన పోయి ప్రకృతిని వశపరుచుకొని తనకు బానిస లాగా వాడుకోవాలనే ఆలోచన వచ్చిందని అంటారు. దీనికి మూలాలు క్రైస్తవ మత దృక్పథాలలో జరిగిన మార్పులో ఉన్నాయని అంటారు లిన్ వైట్. కోమరోవ్ ప్రస్తావించే మార్పు కూడా అదే. స్టాలిన్ కు ప్రీతి పాత్రుడైన మాక్సిం గోర్కీ వంటి రచయిత కూడా ఇటువంటి భావజాలం కలవాడేనని అంటారు కొమరొవ్. క్యాపిటలిస్టు వ్యవస్థ పై సోవియట్ రష్యా విజయం సాధించాలంటే నిరంకుశంగా నియంతలా ప్రవర్తించే ప్రకృతిని మచ్చిక చేసుకొని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనీ తమ ఇష్టానుసారం ప్రవహించే నదులని మానవ నియమితమైన దారిలోకి తేవలసిందేనని అనేవాడట గోర్కీ.

మన జీవన విధానం అన్నది పూర్తిగా భౌతికవాదం అంటే మెటీరియలిజంలో పూర్తిగా కూరుకుపోయిందని ఇటువంటి వాతావరణంలో పర్యావరణ పరిరక్షణ గురించిన మన ఆలోచనలు కూడా అపరిపక్వమైనవే అని అంటారు రచయిత. మన ముందు తరాలతో ఉండే అనుబంధాలను తెంచుకుంటూ ఉండటమే అభివృద్ధికి చిహ్నంగా భావిస్తున్నామని తర్వాతి తరాల బాగోగుల గురించిన ఆలోచన మరియు వారితో అనుబంధం అన్నది కూడా బాగా సన్నగిల్లుతోందని అంటారు కొమరోవ్.

నిజానికి గిరిజన ప్రజల సమాజాలలో కమ్యూనిటీ అంటే సమూహం పట్ల ఒక అనురాగం ఉంటుందని పునర్జన్మల గురించిన విశ్వాసం ఉంటుందనీ వీటన్నిటి మూలాన వారు తమకు ప్రకృతికి మధ్యన అనుబంధాన్ని చూసే దృష్టిలో చాలా తేడా ఉంటుందని అంటారాయన. స్లాడ్కొవ్ అన్న రచయిత తన పుస్తకాలలో భారతీయ సంస్కృతిలో జంతువులను సైతం పూజా భావంతో చూడటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడట. ఆధునిక ప్రపంచంలో భారత దేశంలోని మత ధర్మ సంస్కృతులలో ఈ విషయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్నాడట స్లాడ్కొవ్. దైవమనే భావన మరియు ఆధ్యాత్మికమైన జీవన విధానాల పై ఆధారపడిన విలువలు లేకుండా పర్యావరణ పరిరక్షణ విషయంలో పురోగతి సాధించటం కష్టం అని అంటాడు కొమరోవ్. అయితే సోవియట్ సమాజంలో మతానికి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సాహిత్యం అన్నది సామాజిక చైతన్యంలో భాగమవ్వటం అన్నది అసాధ్యమని అందరికీ తెలిసిన విషయమే కదా అని చురకంటిస్తారు కొమరోవ్.

అయితే ఈ మార్పు అన్నది కొన్ని దశాబ్దాల ముందు మొదలైంది అని అంటారు కోమరోవ్. ఈ విషయమై ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తారు ఆయన. 1898లో ఇయోకెల్సన్ (Iokhelson) ఒక పుస్తకంలో ఉత్తర సైబీరియాలో వేటగాళ్లను గురించి ఇలా రసాడట. వేటగాళ్లు మూడు రకాలట. మొదటి రకం సంప్రదాయ తెగలకు చెందిన పేగన్ (pagan) వేటగాళ్లట. వీరు తమ సంప్రదాయ పద్ధతులకు లోబడి మితంగా వేటను కొనసాగించేవారట. ఇంక రెండవ రకం వారు రష్యాకు చెందిన రైతు కుటుంబాలలో కొద్దిగా వ్యాపార దృక్పథం గల వారట. వీరు డబ్బు కోసం వేటను చేసినా కూడా ఎప్పుడూ విచక్షణారహితంగా వేట చేయరట. ఇక మూడవ రకం వేటగాడు కొత్త రకం వారట. వీరు తమకు నచ్చినప్పుడు వేటకు వచ్చి అడ్డూ అదుపు లేకుండా వేటాడటమే కాక వారు అమ్ముకోగలిగే స్థాయికి మించి వేటాడతారట. వీరికి ఈ విషయంలో ఏ విధమైన మతపరమైన నియమాలు ఉండవట. వీరిది కేవలం వినోదం కోసం పైశాచిక ఆనందం కోసం చేసే వేట అట. ఈ మూడవ రకం వేటగాళ్లు అంటే నీతి నియమం లేనటువంటి వారు ఇరవయ్యో శతాబ్దంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చారని అంటాడట ఆ రచయిత.

సోవియట్ ప్రభుత్వాధికారులు కూడా వేటను నిషేధించిన అటవీ ప్రాంతాలలో నియమాలకు తిలోదకాలు ఇచ్చి విచ్చలవిడిగా వేట పేరిట విధ్వంసం చేసేవారని అంటారు కోమోరొవ్. అక్రమ వేట తాలూకా వ్యాపారం కోట్లలో జరిగేదని ఈ డబ్బు వ్యామోహం ముందు పర్యావరణ పరిరక్షణ అక్రమ వేట నియంత్రణ అన్నది జరగటం అసాధ్యమని అంటారు కోమొరొవ్. అమెరికా నార్వే దేశం నుంచి నౌకల మీదుగా వచ్చి పోలార్ బేర్ల వేట చేసిన వారిని సోవియట్ మేధావులు తిట్టగలరేమో కానీ తమ ప్రభుత్వ కనుసన్నల్లోనే అంతకంటే ఎక్కువగా జరిగిన పోలార్ బేర్ మారణ హోమం గురించి వారు మాట్లాడలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ మేధావుల ఉనికికే ప్రమాదమని అంటారు కొమరోవ్

టెక్నాలజీ ప్రభావం గురించి మరొక అధ్యాయం ఉన్నది ఈ పుస్తకంలో. నిజానికి పర్యావరణ హితమైన టెక్నాలజీల అభివృద్ధి అన్నది ప్రతి దాన్ని కేవలం తాత్కాలిక ఆర్థిక లాభంతో బేరీజు వేసే క్యాపిటలిస్టు సమాజం కంటే కూడా సమాజ హితాన్ని కాంక్షించే సోషలిస్టు సమాజంలోనే జరిగే అవకాశం ఎక్కువని అంటాడు కొమరోవ్. అయితే ఈ విషయంలో రష్యా చేసిన ప్రయత్నం పెద్దగా ఏమీ లేదని అంటారు. పరిశ్రమలు నడిపే వారికి ప్రతీ దాన్ని ఆర్థిక దృక్కోణంలో చూడటమే తెల్సనీ పర్యావరణ పరిరక్షణ చేయటంలో ఖర్చు లాభం గురించిన లెక్కలే వారు వేస్తారని ఈ విషయం వారికి అర్థమయ్యే భాషలో చెబితేనే ఉపయోగమని అంటారు రచయిత. లేదంటే శాఖాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి పిల్లికి ఉపన్యాసం ఇచ్చి అది దోసకాయ తింటూ బతికేస్తుందని భ్రమ పడినట్టేనని అంటారు కొమరోవ్.

అమెరికాకు ఐరోపా దేశాలకు పర్యావరణ పరిరక్షణ విషయంలో భవిష్యత్తు అంతా చీకటేనని అయితే సోవియట్ రష్యాకు మాత్రం ఈ విషయంలో కొన్ని ఆశా కిరణాలు లేకపోలేదని అన్నారట ఒక మేధావి అప్పట్లో. అయితే ఈ ఆశా కిరణాలు ఏమిటి అవి రష్యాలో మాత్రమే రావటానికి అనుకూలమైన ప్రత్యేకమైన పరిస్థితులేంటి ఆన్న విషయం గురించి ఎవరూ పెద్దగా చర్చించిన దాఖలాలు లేవని అంటారు కోమరోవ్. కొందరు సోవియట్ మేధావులైతే ఇప్పటి సోషలిజంలో పర్యావరణ సమస్యలకు పరిష్కారం ఉండదని అది ఎప్పుడో భవిష్యత్తులో సిద్ధించే ఆదర్శ కమ్యునిస్టు సమాజంలోనే సాధ్యమని అంటారట. మరొక సోవియట్ మేధావి పర్యావరణ సమతౌల్యం అన్నది గత చరిత్రలో ఉందనుకోవటంలో అర్థం లేదని అది ఇప్పటి కాలం కంటే భవిష్యత్తు కాలంలోనే అభివృద్ధి చెందుతుందని తన అభిప్రాయమని అన్నాడట. ఏ ప్రాతిపదికన మీరు అలా అంటున్నారు గతంలో కంటే ఇప్పుడు పర్యావరణం పరిసరాల పరిస్థితి క్షీణించింది కదా భవిష్యత్తులో ఇంకా ఘోరంగా తయారు అవ్వదనుకోవటానికి కారణమేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదని అంటారు కొమరోవ్. గతం కంటే వర్తమానం కంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందన్న గుడ్డి నమ్మకమే దీని వెనుక ఉన్న సిద్ధాంతమని అంటారు కొమరోవ్. ఇదే సైంటిఫిక్ కమ్యునిజం యొక్క ప్రధాన సిద్ధాంతమని అంటారు రచయిత.

కేవలం సైన్సు కోణంలో ఆలోచించి పర్యావరణ సమస్యలకు సమాధానం చెప్పలేం అన్న విషయం సైంటిస్టులకు కూడా తెలుసని అయితే ప్రభుత్వాధికారులు ఎలాగూ తమ సలహాలు సూచనలు పాటించరని ఈ సైంటిస్టులకు తెలుసునని అందుకనే నిజ జీవితంలో తమ ప్రతిపాదనల అమలు గురించి ఆలోచించకుండా కేవలం వారి సైన్సు లోకానికే వారు పరిమితమై పోతారని అంటారు రచయిత.

ప్రతి సంవత్సరం సోవియట్ ప్రభుత్వ వ్యాపార అవసరాల దృష్ట్యా వందల వేల ఎకరాల వన సంపద నష్టమయ్యేదని అయితే దీనిని ప్రశ్నించే నాథుడే లేడని అంటారు కొమరోవ్. అటవీ శాఖ అధికారులని కూడా నీ హయాంలో ఎన్ని మొక్కలు నాటావు అని ఎవరూ అడగరని ఎన్ని చెట్లను నరికించావనీ ఎంత సరకు రవాణా చేశావు అనే అడుగుతారని అంటారు కొమరోవ్.

ఇప్పటి కాలపు క్యాపిటలిజంలోనూ కమ్యునిజంలోనూ పర్యావరణ సమస్యలకు సమాధానం దొరకదని అనుకున్నప్పుడు అసలు ఈ చర్చ అవసరమా అని ప్రశ్నిస్తాడు కొమరోవ్.ఫలానా పేషంట్ క్యాన్సర్ తో ఎలాగూ కచ్చితంగా చస్తాడు అన్నప్పుడు ఆ పేషెంట్ తో నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి డాక్టర్ సాధించేది ఏముంది? తన వైద్యంతో అతను బతుకుతాడు అన్నప్పుడే ఆ విషయం ఆ పేషంట్ కు చెప్పటంలో వివేకం అంటాడు కొమరోవ్.

అయితే పుస్తకం ముగింపులో చివిలిఖిన్ అనే రచయిత రాసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తారు కొమరోవ్. నా మనసులో పర్యావరణ సమస్యల గురించి ఎన్నో గంభీరమైన నిజాలు దాగున్నాయి. అయినా ఇప్పుడు ఇటువంటి విషయాలపై చర్చలు చేయనివ్వట్లేదు. ఈ చర్చలన్నీ అసలెవరికి అవసరం ఇప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. పర్యావరణం విషయంలో బ్యాడ్ న్యూస్ వినటానికి ప్రభుత్వాలు ఎలాగూ సిద్ధంగా లేవు. కానీ ప్రజలకు పర్యావరణానికి చెందిన ఈ వార్తలు తెలియాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. కనీసం మనం బతకటానికి పీల్చే గాలి విషయంలోనైనా మనకి నిజాలు తెలియాలి. మనం సుఖంగా బతకాలంటే పర్యావరణం గురించిన నిజాలు మనకు తెలియాలి. మనం ఇతరులకు చెప్పాలి అని అన్నాడట చివిలిఖిన్. నాకు బాగా నచ్చింది చివిలిఖిన్ రాసిన ఈ వ్యాఖ్యల గురించి కోమరోవ్ చేసిన ఈ ప్రస్తావన.

ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్లు ఇది కాకుండా సోవియట్ యూనియన్ అనంతరపు రష్యాలో పర్యావరణం గురించిన దృక్పథం గురించి మరొక పుస్తకం కూడా రాశారు కొమరోవ్. ఇంతేకాక ఈ విషయమై గొంతెత్తిన ఎందరో రచయితల గురించి కూడా ప్రస్తావించారు ఆయన. వారిలో వాలేంటిన్ రస్పుటిన్ ఆన్న రచయిత రచనలు నాకు నచ్చాయి. అసలిదంతా నాకు ఒక తెలియని నూతన ప్రపంచం. రస్పుటిన్ వంటి రచయితలు “విలేజ్ ప్రోజ్” (Village Prose) ఉద్యమానికి నాంది పలికారట అప్పటి రష్యాలో. అంటే సోవియట్ రష్యా పారిశ్రామీకరణ ప్రభావం వలన మెల్లగా గతించి పోతున్న గ్రామీణ విధానాల గురించి రచనలు చేశారట వీరంతా.

నాకు బాగా నచ్చింది కోమారోవ్ రాసిన ఈ పుస్తకం దీని ద్వారా నాకు పరిచయమైన కొత్త లోకం. ఈ విషయాలపై ఆసక్తి ఉన్నవారు చదవాల్సిన పుస్తకం ఇది. పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలము క్యాపిటలిజంకు చెందిన సమస్య లాగానో లేదా సోషలిజం కమ్యునిజంకు చెందిన సమస్య లాగానో చూడటంలో అర్థం లేదు. దీని మూలాలు పారిశ్రామిక అభివృద్ధి అనంతర సమాజాలలో మారిన విలువలలో ఉన్నాయి. ఈ మార్పుకు కారణమైన తాత్విక చింతనలో ఉన్నాయి. ఈ విషయాల మీద అవగాహన అందరికీ ముఖ్యం. అందుకోసం ఇటువంటి పుస్తకాలు పనికొస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here