అద్భుతమైన ప్రేమ కథను పరిచయం చేసే క్రైం థ్రిల్లర్… The Devotion of Suspect X

1
12

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

క్రైం థ్రిల్లర్స్ పట్ల కొంత మంది తేలిక భావం చూపుతారు. పాఠకులే కాదు రచయితలు కూడా క్రైమ్ ధ్రిల్లర్స్‌ని సాహిత్యపరంగా తక్కువగా చూడడం తెలుసు. కాని ఒక పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఉత్కంటతతో చదివింపజేయడానికి ఒక రచయితలో చాలా ప్రతిభ ఉండలి. అతని రచనా శైలిలో ఒక పదును ఉండాలి. పాఠకులను పుస్తకం చివరిదాకా ఒకే రకమైన కుతూహలం, ఆసక్తితో కట్టిపడేయగలగడం అంత సులువైన పని కాదు. అందుకే అన్ని రకాల పుస్తకాల మధ్య క్రైం ఫిక్షన్‌ను అంతే ఆసక్తితో చదవడం నాకు ఇష్టం. కొన్ని క్రైం నవలలు చాలా గొప్పగా రాసినవి ఉన్నాయి. రచయిత గొప్పతనం ప్రతి పేజీలో కనిపిస్తూ ఉంటుంది. కథను అల్లిన విధానం, కథనం నడిపించిన తీరు, ముగింపులో రచయిత ఇచ్చే షాకు ఆ పుస్తకాన్ని మర్చిపోనీయకుండా చేస్తుంది. అలాంటి గొప్ప నవల THE DEVOTION OF SUSPECT X. ఇది జపనీస్ భాషలో 2005లో వచ్చిన నవల. రచయిత కెయిగో హిగాషినో… దీన్ని జపనీస్ ఫిక్షన్‌లో ఒక కల్ట్ క్లాసిక్‌గా పరిగణించారంటే ఈ పుస్తకం ఎంత ప్రాచుర్యం పొందిందో ఊహించవచ్చు. ఎన్నో భాషల్లో అనువదించబడి అన్ని దేశాలలో అత్యధిక కాపీలు అమ్ముడు పోయిన నవల ఇది. దీన్ని ఎన్నో భాషలలో సినిమాగా కూడా తీసారు. జపాన్, కొరియా, చైనీస్ భాషల్లో ఇది సినిమాగా వచ్చి ఎన్నో ప్రశంసలు పొందింది. కొన్ని మార్పులతో మళయాళం, తెలుగు, హిందీ భాషలలో ఈ కథనానికి దేశీ రంగు పులిమి కుటుంబ కథను జోడించి మరో భారతీయ కథను తయారు చేసుకుని ‘దృశ్యం’ అనే సినిమా తీసారు. దృశ్యం కథ ఈ నవల కథకు భిన్నంగా ఉన్నా హత్య చేసి తప్పించుకోవడానికి హీరో వాడిన ఐడియా, ఆ సస్పెన్స్ ఎలిమింట్ ఈ నవల స్పూర్తితోనే తీసుకున్నారు అని అర్థం అవుతుంది. అలా ఈ నవల ఎన్నో కొత్త కథలకు కూడా ప్రాణం పోసింది. ఒక కథ, ఒక పుస్తకం ఇంత మందిని ప్రపంచ వ్యాప్తంగా అలరించించినప్పుడు అంత కన్నా విజయం ఏం ఉంటుంది? అందుకే ఈ నవల నేను చదివిన గొప్ప నవలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

క్రైం నవలలో పాత్రలను మలిచేటప్పుడు వాటి ద్వారా మానవ స్వభావాన్ని చాలా చక్కగా చర్చించే అవకాశం రచయితకు ఉంటుంది. ఒక మనిషి ఒక తప్పు చేసేటప్పుడు అతన్ని ఆ పనికి ఉసిగొల్పిన కారణాలు, ఒకరు క్రిమినల్‌గా మారితే అతని ఆ మానసిక స్థితికి కారణభూతమైన కారణాలు చాలా వరకు సమాజానికి, కుటుంబానికి, అతని జీవన విధానానికి సంబంధించి ఉంటాయి. వాటిని క్రైం నవలల్లో ప్రతిభ గల రచయితకు చాలా విపులంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. అందుకే ఒక మంచి క్రైం నవల మానవ స్వభావాన్ని, మనుష్యులలో భిన్న కోణాలను మనకు పరిచయం చేస్తుంది.

ఈ నవలలో ముఖ్య పాత్ర ఒక లెక్కల ప్రొఫెసర్. జీవితంలో మాథ్స్ తప్ప మరేం తెలీని ఒంటరి జీవి. అతన్ని ఎవ్వరూ ఒక మనిషిగా కూడా గుర్తుంచరు. విద్యార్ధి దశలో నుంచే అతనో గొప్ప మేధావి కాని సాధారణ సమాజానికి అర్థం కాక అనామకుడిగా మిగిలిపోతాడు. అతని పక్క ఇంట్లో ఒక వివాహిత తన కూతురితో ఉంటూ ఉంటుంది. వారిని పరిశీలించడం ఒక్కటే ప్రపంచంతో అతనికున్న ఏకైక సంబంధం. అలా వారిని రోజూ పరిశిలిస్తూ ఆ వివాహితతో ప్రేమలో పడతాడు అతను. తమను ఒక వ్యక్తి పక్క గదిలో నుండి నిత్యం కనిపెట్టుకుని చూస్తున్నాడని ఆ తల్లి కూతుళ్ళకు తెలీదు. అతని ఉనికి ఎవ్వరూ గుర్తించరు.

ఆ వివాహిత భర్త తాగుబోతు, దుర్మార్గుడు. అతని నుండి తప్పించుకుని వీరు జీవిస్తుంటారు. కాని వారి ఈ కొత్త ఇల్లు కనిపెట్టి అతను అక్కడికి చేరతాడు. వారిపై తన జులుం ప్రదర్శించి భయపెడుతున్నప్పుడు ఆ తల్లి కూతుళ్ళూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అతనిపై తిరగబడతారు. కూతురు చేతిలో అతను హత్యకు గురి అవుతాడు. తల్లి ఆ తప్పు తన మీద వేసుకుంటుంది. శవాన్ని ఏం చేయాలని వారిద్దరూ ఆలోచిస్తున్న సమయంలో ఇదంతా గమనిస్తున్న ఆ ప్రొఫెసర్ వారి ఇంటి తలుపు తట్టి ఆ బాధ్యత తన చేతుల్లోకి తీసుకుంటాడు. శవాన్ని మరో చోటకు తరలిస్తాడు.

శవం దొరికిన తరువాత ఆ కేస్‌ను డీల్ చేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఈ తల్లి కూతుళ్ళను ప్రశ్నించడానికి వచ్చినప్పుడు పక్కన ఉన్న ఈ లెక్కల ఫ్రొఫెసర్‌ను చూస్తాడు. అతను తన కాలేజీ రోజుల్లో తనతో పాటు చదివిన మిత్రుడు అని గుర్తిస్తాడు. పరిచయం పెంచుకుంటాడు. ఆ కేస్‌లో వచ్చే ట్విస్ట్‌లు గమనించి అతనికి ఈ హత్య వెనుక ఒక మేధావి ఉన్నాడని అర్థం అవుతుంది. కాని ఎటువంటి సాక్షం దొరకదు. హత్య జరిగిన రోజు సినిమాకు వెళ్ళాం అని తల్లి కూతుళ్ళు చూపే టికెట్టు వారిని కాపాడుతుంది. కాని ఈ హత్య వెనుక రహస్యం మాత్రం అర్థం కాదు. కాని తన మిత్రుని హస్తం ఈ హత్యలో లేదా సాక్షాలను తారుమారు చేయడంలో ఉందని అతని మనసు చెబుతూ ఉంటుంది.

చివరకు ఆ లెక్కల ప్రొఫెసర్ చేసింది అర్థం అయినప్పుడు పాఠకులు పొందే షాక్ నుండి వారు అంత త్వరగా కోలుకోలేరు. కొన్ని కారణాల వల్ల తనకు తానుగా లొంగిపోయి జైలుకి వెళ్ళిన ఆ ఫొఫెసర్ త్యాగం వెనుక కారణాన్ని, అతని నిష్కళంకమైన మనసును అతని స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్నాక ఆ పాత్రను హంతకుడైనా కాని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఇంతగా తనను తాను సమర్పించుకోవడం చూసిన తరువాత ఇది ఒక గొప్ప ప్రేమ కథ అనిపిస్తుంది. క్రైం థ్రిల్లర్‌గా మొదలయిన ఈ నవల గొప్ప ప్రేమ కథగా ముగుస్తుంది. ఇందులో పాత్రలు చేసే ప్రతి పని వెనుక ఒక మానవీయ కోణం కనిపిస్తుంది. అద్భుతమైన శైలితో సాగే ఈ కథను సృష్టించడానికి ఒక రచయిత నిజంగా మేధావి అయితే తప్ప సాధ్యం కాదు. మానవ సంబంధాలపై గొప్ప నమ్మకం కలిగించే ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. ఈ కథ ముగింపు చెప్పి పాఠకులు స్వయంగా అనుభవించగలిగే ఆ ఆనందాన్ని, తృప్తిని, థ్రిల్‌ని మిస్ చేయించడం ఇష్టం లేక కేవలం ఈ పుస్తకం మిగిల్చిన అనుభూతిని పంచుకుంటున్నాను. కథలు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపరిచే అద్భుతమైన రచన ఇది. పుస్తకాలు ఇలాంటి ధ్రిల్ ఇవ్వగలవా అని ఆశ్చర్యపడి మళ్ళీ మళ్ళీ ఆ అనందం కోసం పుస్తకాల్ని వెతికి చదివే పుస్తక ప్రియులను తయారు చేయగలిగే సత్తా ఉన్న పుస్తకం ఇది. THE DEVOTION OF SUSPECT X చదివి ఆ అనుభవాన్ని ఆస్వాదించండి మరి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here