‘ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై’ – పుస్తక సమీక్ష

0
7

ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై – జీన్ డామ్నిక్ బౌబీ

[dropcap]జీ[/dropcap]వితంలో సమస్యలకు కృంగిపోయి, పోరాడటం అనవసరమని, తామున్న స్థితిలో అన్నీ కోల్పోయామని మరి తిరిగి తమ స్థితిని మెరుగుపరుచుకోలేమని చాలామంది ఏదో ఒక సమయంలో తమ జీవితంలో చతికలబడిపోతూ ఉంటారు. అసలు జీవితంలో మనిషి ఆఖరి నిముషం దాకా బ్రతకడానికి తన స్థితిని మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన జీవన విధానమని చాలా మందికి అర్థం కాదు. చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడడం, జీవితంలో ఎదురయ్యే ఒటమికి లోంగిపోవడం, ముఖ్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడాలనే కోరిక, ఎరుక లేకపోవడం వల్ల జీవితాలెన్నో నిస్సారంగా నిరుపయోగంగా ముగిసిపోతుంటాయి. అలాంటివాటి గురించి విన్నప్పుడు, చూసినప్పుడు ఈ పుస్తకం నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

‘ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై’ ప్రెంచ్ భాషలో రాసిన పుస్తకం. రచయిత జీన్ డామ్నిక్ బౌబి. ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి పుస్తకం మరొకటి లేదు. ఈ పుస్తకాన్ని కూర్చిన బౌబీ ‘ఎల్లీ’ అనే ప్రెంచ్ ఫాషన్ మాగజిన్‌కి సంపాదకుడిగా పని చేసేవారు. డిసెంబర్ 8, 1995 న 43 ఏళ్ళ బౌబీ ప్రాణాంతక స్ట్రోక్‌తో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇరవై రోజుల తరువాత శరీరం పూర్తిగా పక్షపాతంతో పని చేయని స్థితిలో, చురుగ్గా పని చేసే మెదడుతో హాస్పిటల్‌లో కళ్ళు తెరుస్తాడు బౌబీ. దీన్ని మెడికల్ భాషలో లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అంటారు. అతను తన కళ్ళను మాత్రమే కదల్చగలడు. కాని అలాంటి స్థితిలో కూడా కుడి కన్నుకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా డాక్టర్లు దాన్ని కుట్టివేసి శాశ్వతంగా మూసేస్తారు. ఆ కన్ను అలాగే వదిలివేస్తే కనుగుడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకటే కన్నుతో బౌబీ డైవింగ్ బెల్‌లో బంధించబడ్డ ప్రాణిలా కొట్టుకుంటాడు.

డైవింగ్ బెల్ అన్నది అడుగుభాగం లేని ఒక జాడి. దాన్ని ఆక్సిజన్ అందించడానికి సముద్రంలో దిగిన డైవర్స్ కోసం ఉపయోగిస్తారు. డైవర్లు ప్రాణాలు నిలుపుకోవడానికి ఈ డైవింగ్ బెల్‌లో దూరి అలా ఇరుక్కుని ఆక్సిజన్ పీల్చుకుంటారు. బౌబీ తన శారీరక స్థితిని ఆ డైవింగ్ బెల్‌లో బంధింపబడ్డ డైవర్లతో పోల్చుకుని సీతాకోకచిలుకలా విహరించే తన మనస్సును దానికి సమానంగా స్పందించలేని తన అసహాయ శరీరాన్ని కలిపి తన లాక్డ్ ఇన్ సిండ్రోమ్‌లో తన మానసిక స్థితిని చెప్పుకునే ప్రయత్నం చేసాడు. అలా వచ్చిందే ఈ ‘ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై’ అన్న శీర్షిక.

ఈ స్థితిలో ఇతరులతో సంభాషించడానికి “పార్ట్‌నర్ అసిస్టెడ్ స్కానింగ్” అనే పద్దతి ద్వారా అతనికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక అసిస్టెంట్ సహకారంతో ప్రెంచ్ భాషలోని అక్షరాలను కనురెప్పలు మూసి తెరవడం ద్వారా చెబుతూ, పదాలను అతను కూర్చడం నేర్చుకుంటాడు. అతని కనురెప్పల కదలికతో కూడిన ఆ పదాలను గుర్తించి అతనికి సహకరించే ట్రాన్స్‌లేటర్, అతని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక చిన్న పదాన్ని కూర్చడానికి ఈ పద్దతిలో 2 నిముషాల సమయం పడుతుంది. అలా బౌబి ఈ పుస్తకం లోని వాక్యాలనీ కూర్చి తన మనసును, ఆ అసహాయ స్థితిలో తన మానసిక స్థితిని, హాస్పిటల్‌లో తన అనుభవాలను, ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసారు. అతనికి ఇందులో సహకరించిన అసిస్టెంట్ క్లాడ్ మెమ్డిబిల్. ఈ పుస్తకం ప్రచురించడిన రెండు రోజుల తరువాత న్యుమోనియాతో మార్చ్ 9, 1997 న బౌబీ మరణించాడు.

ఈ పుస్తకాన్ని గొప్ప సాహిత్య కృతిలా విశ్లేషించకూడదు. ఈ పుస్తకంలో అన్ని కష్టాలను అధిగమింఛి ధైర్యంగా ఎవరూ చేయలేని పెద్ద సాహసం చేస్తూ, ఘోరమైన స్థితిలో కూడా ప్రపచంతో సంభాషించి తన భావాలను ప్రపంచంతో పంచుకోవాలనే ఒక వ్యక్తి దృఢ నిశ్చయం వుంది. దాన్ని అర్థం చేసుకుని ఈ వాక్యాలను చదవాలి, ప్రతి వాక్యం వెనుక ఒక మహత్తర లక్ష్యం కనిపిస్తుంది. ఆ స్థితిలో కూడా రచయిత నిలుపుకున్న సమయస్పూర్తి హాస్యం మనల్ని అబ్బురపరుస్తాయి.

మొదటి అధ్యయంలో బౌబీ శరీరాన్ని నిర్వీర్యం చేసిన స్ట్రోక్ గురించి సమాచారం ఉంటుంది. దాన్ని తన శైలిలో వర్ణిస్తూ “పూర్వం దాన్ని మాసివ్ స్ట్రోక్ అని అనేవారు. మనిషి అప్పుడే చనిపోయేవాడు. కాని ఆధునిక వైద్య విధానంలోని గొప్పతనం మనిషిని ఆ స్థితిలో కూడా బ్రతికించగలుగుతుంది. అతని బాధను పెంచేందుకు సహకరిస్తుంది” అంటాడు. “ఇప్పుడు ఆ స్ట్రోక్ తరువాత కూడా మనిషి బ్రతుకుతాడు, అందమైన బాధతో. దాన్ని లాక్ట్ ఇన్ సిండ్రోమ్ అనే అద్భుతమైన పేరుతో పిలవచ్చు. తల నుండి కాలి వేళ్ళ దాకా పనిచేయవు కాని ఆ మనిషి మేధస్సు పరుగుతీస్తూనే ఉంటుంది. ఆ శరీరంలో ఖైదీలా మిగిలిపోయి కదలలేక కొట్టుకుంటూ ఉంటుంది. నా విషయంలో నా ఎడమ కనురెప్పను తెరవడం మూయడం మాత్రమే నేను చేయగలిగిన సంభాషణ. అప్పుడు కూడా సీతాకోకచిలుకలా నా ఆలోచనలు దిగంతాల వైపుకు పరుగెడుతూ ఉండడం అపలేకపోయారెవ్వరూ… అలా నేను చాలా పరుగెత్తాను. ఎన్నో అద్భుతమైన చోట్లకు ప్రయాణం చేయగలిగాను అద్బుతమైన వ్యక్తుల మధ్య గడిపాను.. నా ఆలోచనలలో” అని తన స్థితిని గురించి చెప్పుకోగలిగిన బౌబీ నిజమైన హీరో.

ఈ అసహాయ స్థితిలో కూడా మనసును చురుగ్గా ఉంచుకుని ఆఖరి నిముషం వరకు తన ప్రయత్నం చేస్తూనే ఉన్న బౌబీ దీక్ష ఎందరికో స్పూర్తిదాయకం. అతి విషాదమైన స్థితిలో కూడా అతని చతురత బైటపడుతూ ఉంటుంది. అతన్ని మంచంపై పడుకోబెడుతున్న నర్సులను చూస్తూ తాను చూసిన గాంగ్‌స్టర్ సినిమాలలో మనిషిని చంపి ఆ శరీరాన్ని కారు డిక్కిలో పట్టించడానికి శ్రమపడే కిరాయి గూండాలు అతనికి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడట. తానీ స్థితి నుండి ఎప్పటికీ బైటికి రాలేనని అతనికి తెలుసు. కేవలం కాలి వేలు కదల్చడానికి సంవత్సరాలు పడతాయి అన్న స్పృహ అతనికి ఉంది. ఈ స్థితిని అతను సానుకూల దృక్పథంతో స్వీకరించడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని ప్రస్తుతం తన ఉమ్మి తాను మింగగలిగినా తన మూతి తాను శుభ్రపరుచుకునే అవకాశం కలిగినా దాన్ని ఎంజాయ్ చేస్తాను అని రాసుకుంటాడు. తన గతాన్ని అందులోని ఆనందాన్ని గుర్తు తెచ్చుకుని ఆనందిస్తాడు. ఆ ఆనందాల మధ్య విషాదానికి చోటు లేదంటాడు.

ఈ స్థితిలో కూడా హాస్పిటల్ వారిచ్చే జాగింగ్ సూట్ ధరించడానికి అతను ఇష్టపడడు. తాను ధరించే బట్టలను అతనే ఎన్నుకుంటాడు. తాను ధరించే దుస్తులలో జీవితంలోని కొనసాగింపుని అనుభవిస్తానని. ఎట్టి పరిస్థితులలో కూడా తనకు నచ్చని దుస్తులను ధరించనని చెప్పుకుంటాడు. కాశ్మీరి శాలువల మధ్య దోగాడుతాను కాని ఇష్టపడని దుస్తులను ధరించలేను అని చెప్పుకున్న అతని ధైర్యం మనలను కదిలిస్తుంది. తనతో తాను నేర్చుకున్న భాష ద్వారా సంభాషించాలని ప్రయత్నించి సఫలం కాలేని వ్యక్తులపై ఎన్నోసెటైర్లు అతను వేయడం ఈ పుస్తకంలో మనం చూస్తాం. తన కళ్ళద్దాల గురించి చెప్పాలని ప్రయత్నించి అక్షరాలు, స్పెల్లింగ్ తప్పుల కారణంగా చంద్రుని గురించి చెప్పే వారి చేతకానితనంపై అతను ఆ స్థితిలో కూడా జాలిపడతాడు. అన్ని అవయవాలు పని చేసే వారి కన్నా ఆ భాషపై మంచి పట్టు తాను సంపాదించగలిగానని గర్వపడతాడు.

హాస్పిటల్ సిబ్బందందరికి తనకు నచ్చిన పేర్లు పెట్టుకుని వారిని మనసులో ఆ పేర్లతో పిలుచుకుంటూ వారిపై జోకులు వేసుకుంటూ తన శరీరాన్ని వారికి అప్పగించి ఉండగలగడం అతనికే చెల్లింది. అంతటి అసహాయ స్థితిలో కూడా హాస్యాన్ని తన రొటీన్‌లో భాగం చేసుకోగలగడం అద్భుతం అనిపిస్తుంది.

ప్రతి క్షణం నోటి నుండి కారే లాలాజలంతో చూసే వారికి తానెంత భయంకరంగా, జుగుప్సాకరంగా కనిపిస్తాడో అతనికి తెలుసు. కాని అది అతని ధైర్యాన్ని సడలించనివ్వదు. తనని చూసి భయం, దిగ్బ్రాంతి, దడుపు తమ కళ్ళలో, మొహాల్లో చూపే వ్యక్తుల హావభావాలను చూసి నవ్వుకోవడం అతను నేర్చుకున్నాడు. తనను చూసి నోరెల్లబెట్టే వారందరిని చూసి మనసులో బిగ్గరగా నవ్వుకుంటూ ఆనందించడానికి ఎంత మనోధైర్యం కావాలి? ఆ నవ్వుతో విధిని ఎదిరించడాన్ని ఎంజాయ్ చేసానని పుస్తకం ద్వారా చెప్పుకుంటాడు. తనకిష్టమైన సినిమాలలో దృశ్యాలను ఊహించుకుంటూ బెడ్ మీద గంటలు గడిపేవాడట. హాస్పిటల్ నుండి బైటపడి నయమయ్యి తమ ఇళ్ళకు వెళ్ళిపోయే పేషంట్లను టూరిస్టులని సంభోధించేవాడు. తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బందిపడే వారిని చూసి వినోదాన్ని పోందేవాడట. త్వరగా నయమవ్వాలని కోరుకోలేరు, మంచిగా తినమని అనలేరు, హాయిగా నిద్రపొమ్మని, ఏం ఆలోచించవద్దని అంతా మన మంచికే లాంటి స్టేట్మెంట్లివ్వలేక ఏం తోచక అయోమయంగా నిలబడే వారిని చూసి వారి అవస్థను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నడు ఆ స్థితిలో కూడా.

హాస్పిటల్‌లో ఉన్న కొన్ని నెలలు కేవలం కొన్ని చుక్కల నిమ్మరసం, సగం టీ స్పూన్ పెరుగు అతని ఆహారం. అది కూడా అతని శ్వాస పైపుకి నొప్పి కలిగించేది. కేవలం జ్ఞాపకాల తోడుతో బ్రతుకుతూ “ఒకప్పుడు నేనో రీసైక్లింగ్ ఎక్స్‌పర్ట్‌ని. ఇప్పుడు నా జ్ఞాపకాల రీసైక్లింగ్‌లో ఆ నైపుణ్యం నాకు ఉపయోగపడింది” అని రాసుకున్నాడు. తన స్పీచ్ థెరపిస్ట్ సాండరిన్‌ని అతను దేవదూతలా చూసేవాడు. ఆమె సహాయంతోనే ఆలోచనలను పంచుకునే విధానాన్ని, ఆ స్థితిలో కూడా సంభాషించడం నేర్చుకోగలిగాడు. కనురెప్పల కదలికలకు అక్షరాలను జోడించగలిగాడు. ఆదిమానవుడు భాషను కనుగొన్నట్లుగా తానా కనుబొమ్మల భాషను నేర్చుకున్నానని అతను అంటాడు. తన తండ్రి ముసలితనంతో నాలుగవ అంతస్తులోని తన అపార్ట్మెంట్లో బందీగా జీవిస్తూ ఎలాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడో ఇప్పుడు తనకు పూర్తిగా అర్థం అయ్యింది అని అంటాడు. తండ్రిని అర్థం చేసుకోవడానికి తన స్థితి తనకు సహకరించించని అది తనకు జరిగిన ఒక మేలు అని మరో చోట అంటాడు. అలెగ్జాండర్ డ్యూమస్ రాసిన “ద కౌంట్ ఆఫ్ మోంటో క్రిస్టో” లోని నొఇర్టియర్ డె విల్లిఫొర్త్ అనే పాత్రతో తనను పోల్చుకుంటూ సాహిత్యంలో మొట్టమొదటి లాక్డ్ ఇన్ సిండ్రోమ్ ఉన్న పాత్ర అది అని తాను కనుక్కున్న విషయాన్ని గొప్పగా చెప్తాడు.

తన స్థితిలో కూడా ఒక ఆనందం ఉందని. కలలో ఆఖరిదాకా ఊండిపోగలిగే అదృష్టం తనను వరించిందని అనిపిస్తుందని చెప్పుకుంటాడు. నిజజీవితంలోని ప్రాక్టికాలిటి కలలను చంపేస్తుందని కాని తన ప్రస్తుత స్థితిలో ఆ కలల మధ్యే తాను శాశ్వతంగా గడపగలుగుతానని అంటాడు. తన చుట్టూ చేరే నర్సుల, డాక్టర్ల పరీక్షలను తాను ఎంజాయ్ చేసేవాడట. ప్రపంచంతో తన సంబంధం రోజువారి జీవితంలో వారే పరీక్షలే అయినప్పుడు వారి ఉనికిని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని అంటాడు. వారిని తన భాషలో తిట్టుకుంటూ ఆ తిట్లు వారికి వినిపించవని ఆనందపడేవాడట. తన స్థితిలో మరో గొప్ప గుణం ఉందంటాడు. తాను ఏడ్చినా అది ఎవ్వరికీ అర్థం కాదని మరొకరు తన ఏడుపు వినకుండా ఏడవగలగడం తనకు మాత్రమే సాధ్యమని చెప్పుకుంటాడు. ఎవ్వరి మీదా అతిగా కోపాన్ని చూపకుండా తనను తాను నియంత్రించుకోవడం ఇప్పుడే నేర్చుకున్నాననీ చెప్పుకున్నాడు. అతని సెల్ప్ కంట్రోల్‌కి ఫిదా అవ్వాల్సిందే. తాను తన అనుకున్నవారెంత అపరిచితులో ఇప్పుడే తనకు అర్థం అయ్యిందనీ చెప్పుకున్నాడు. ఇదే జీవితపు ఆఖరి సత్యం అన్నది తనకు అర్థం అవుతుందనీ రాసుకున్నడు.

ఆ స్థితిలో కూడా అతనికి కొన్ని మంచి రోజులుండేవట. తన శరీరానికి అమర్చిన మషిన్ లోని అలారం అదే పనిగా మోగుతున్నప్పుడు, తన స్వేదం తన కుడి కన్నుని బంధిచిన టేప్ పై జారి నొప్పి కలిగిస్తున్నప్పుడు, తన యూరిన్ కాథెటర్ లీక్ అయ్యి బెడ్ అంతా తడిసిపోయినప్పుడు టీవీ స్క్రీన్ పై “మీరు అదృష్టవంతులు కారా” అన్న వాక్యం చూసి అతను నవ్వుకోగలగడం అతను సాధించిన పెద్ద విజయాలలో ఒకటి అనిపిస్తుంది ఈ పుస్తకంలో ఆ సంఘటన చదువుతుంటే. తన పిల్లలను తాను గుండెకు హత్తుకోలేకపోవడం బాధిస్తుంటే, తన స్నేహితులు తన స్థితి గురించి తన ముందే మాట్లాడుకుని వెక్కిరిస్తుంటే, అతను చూస్తుండి పోయేవాడు. తనకొచ్చిన మెయిల్స్‌లో తాను ఎప్పూడూ పెద్దగా ఆలోచించని వ్యక్తులు, ప్రాధాన్యత ఇవ్వని మనుష్యులు తన స్థితిని గురించి మానవీయమైన ప్రశ్నలు వేస్తుంటే మానవత్వంతో స్పందిస్తుంటే, తాను ఆశ్చర్యంతో తన శ్రేయోభిలాషులను గుర్తించడానికి తనకీ పరీక్ష అవసరమేమో అని నిట్టూర్చడంలో అతని బాధ అర్థం అవుతుంది.

తన జీవితంలో గడిచిపోయిన మంచి రోజులను ఈ పుస్తకం ద్వారా గుర్తుకు తెచ్చుకుంటాడు. తాను వదిలేసిన అవకాశాలను గురించి బాధపడతాడు. చివర్లో తన జీవితాన్ని లాగేసుకున్న ఆక్సిడెంట్ గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఈ పుస్తకం చదివాక ఒక బాధకు గురి అవుతాం. కాని ఆ స్థితిలో కూడా మరణానికి దగ్గర అవుతూ ఒకో పదానికి రెండు నిముషాలు వెచ్చించి 200,000 సార్లు కనురెప్పలు కదిలించి ఆ కదలికతో కూర్చిన పదాలతో ఉన్న ఈ పుస్తకాన్ని అబ్బురంగా చూస్తాం. ఈ పుస్తకం ప్రచురణ చూడకుండానే బౌబీ మరణించాడు. తరువాత ఇవి మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి. ఎన్నో భాషల్లో దీన్ని అనువదించారు. ఇప్పుడు మనం చూస్తుంది ఆంగ్లంలో వచ్చిన ఈ పుస్తక అనువాదం. జీన్ డామ్నిక్ బౌబీ జీవితం, పోరాటం మనకు ఎన్నో నేర్పిస్తుంది. కనురెప్పల కదలికలతో కూర్చిన పదాలతో రాయబడిన ఏకైక పుస్తకం “ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై”. ఈ పుస్తకం అమెజాన్‌లో దొరుకుతుంది. వెల 980. జీవితాన్ని అర్థం చేసుకుని, ప్రతి క్షణం గెలుపు కోసం పోరాడటమే జీవితం అనే సత్యాన్ని మనకు చెప్పగలిగే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆస్వాదించడం జీవితంలో మనం పొందగలిగే గొప్ప అనుభవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here