యుద్ధం చిందించే రాక్షసత్వానికి ప్రతినిధులైన నాలుగు పాత్రల నవల THE ENGLISH PATIENT

0
8

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]“ది[/dropcap] ఇంగ్లీష్ పేషంట్” నవలను శ్రీలంకలో జన్మించిన కెనెడా రచయిత మైఖెల్ ఆన్డాట్జె రాసారు. దీనికి ఎన్నో అవార్డులు లభించాయి. 1992లో ఈ నవల బూకర్ ప్రైజ్ గెలుచుకుంది. నాలుగు దేశాలకు చెందిన నలుగురు భిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులు యుద్ధసమయంలో ఒకే భవనంలో కొంత కాలం కలిసి జీవించవలసిన వస్తుంది. యుద్ధం కారణంగా మానసికంగా, వ్యక్తిగతంగా సామాజికంగా పొందిన అనుభవాల ద్వారా వారి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అన్నది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇటలీ లోని ఒక విల్లాను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక హాస్పిటల్‌గా మార్చవలసి వస్తుంది. అక్కడే ఈ నలుగురు వ్యక్తులు కలుస్తారు. 

హానా కెనడా దేశస్తురాలు. నర్సుగా పని చేస్తూ ఉంటుంది. పూర్తిగా శరీరం కాలిపోయి ప్రాణాలతో కొట్టుకుంటున్న ఒక వ్యక్తిని వీరి హాస్పిటర్‌లో చేరుస్తారు. అతనికి తన పేరు గుర్తులేదు. అతను మాట్లాడుతున్న యాసను బట్టి అతను ఇంగ్లీషువాడయి ఉండవచ్చని అనుకుంటారు. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ప్రారాచూట్ సహాయంతో ఎడారిలో దూకుతున్నప్పుడు అతను పూర్తిగా కాలిపోతాడు. ఆ స్థితిలో ఎడారిలోని తెగ ప్రజలు అతన్ని హాస్పిటల్‌కు చేరుస్తాడు. హానా అతనిని సేవ చేస్తూ ఉంటుంది. అప్పుడే యుద్ధం ముగిసిందని తెలిసి అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం మొదలెడుతుంది. కాని హానా ఆ ఇంగ్లీష్ పేషంట్ కదలలేని స్థితిలో ఉన్నాడని, కదిలించడం ప్రమాదమని, అతన్ని చూసుకుంటూ తాను ఆ విల్లాలో ఉండిపోతానని చెప్పి ఒక్కతే ఆ పేషంట్‌తో ఉండిపోతుంది. గతం కొద్ది కొద్దిగా చెబుతూ తనతో మాట్లాడుతున్న అతనికి పుస్తకాలు చదివి వినిపిస్తూ అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పేషంట్ దగ్గర ఒక్క చరిత్రకు సంబంధించిన పుస్తకం ఉంటుంది. ఆ వాక్యాల మధ్య తన జీవిత కథ కొంత వరకు రాసుకుంటాడు అతను. దాన్ని చదువుతూ అతనెవరో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది హానా.

కెరావాగియో హానా తండ్రి స్నేహితుడు. ఒక దొంగ. ఎటువంటి ఇంట్లోనయినా జొరబడగల నైపుణ్యం అతని సొంతం. సైన్యంలో ఒక గుడాచారిగా పనిచేస్తాడు. అతన్ని జర్మన్లు పట్టుకుని యుద్ధ రహస్యాలు చెప్పమని నానా బాధలకు గురిచేస్తారు. అతని వేళ్ళు విరిచేస్తారు. తెగిపోయిన చేతులతో అతను హాస్పిటల్‌లో చేరతాడు. చేతులు అతికించబడ్డా బొటనవేళ్ళూ పోగొట్టుకుంటాడు. ఇక పాత వృత్తి చేయలేడు. యుద్ధసమయంలో ఇంగ్లీషు వాళ్ళూ అతన్ని ఒక వ్యక్తిని ఎడారిలో కనుక్కొవలసిన పని అప్పజెప్పుతారు. ఆ పనిలో ఉండగా యుద్ధం ముగుస్తుంది. అయితే ఒక మారుమూల విల్లాలో ఒక ఇంగ్లీషు పేషంటుని పెట్టుకుని ఒక నర్సు ఉండిపోయిందని సైనిక హాస్పిటల్‌లో విన్నప్పుడు అతను హానాని గుర్తు పడతాడు. అలాగే ఆ ఇంగ్లీషు పేషంటు తాను వెతుకుతున్న వ్యక్తి కావచ్చనే అనుమానం కూడా అతనికి కలుగుతుంది. అందుకే అతనూ ఆ విల్లా చేరుకుంటాడు. ఆ ఇంగ్లీషు పేషంటుతో పరిచయం పెంచుకుంటాడు. తమ శారీరిక భాధలు భరించలేక మార్ఫిన్ తీసుకోవలసిన అవసరం ఇద్దరికీ ఉంటుంది. అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. 

కిర్పాల్ సింఘ్ భారతీయ సిక్కు. బ్రిటీష్ సైన్యంలో సాపర్‌గా పని చేస్తూ ఉంటాడు. అతని పని యుద్ధకాలంలో శత్రువులు భూమిలో పాతిపెట్టిన బాంబులను కనిపెట్టీ వాటిని పని చేయకుండా చేయడం. ఆ విల్లా చుట్టూ ఎంతో మందు గుండు సామాను పాతి పెట్టబడి ఉందని తెలిసి సైన్యం అతన్ని అక్కడకు పంపిస్తుంది. అతను చెసేది ప్రతి నిముషం ప్రాణాలతో చెలగాటమాడే పని. అయినా అమాయకుల ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణలడ్డుపెట్టీ పని చేస్తూ ఉంటాడు. విల్లా లో హానా పియానో వాయిస్తున్నప్పుడు అక్కడికి వస్తాడు. విల్లా చుట్టూ మందు గుండు సామాను చాలా ఎక్కువగా ఉందని అర్థం అయి దాన్ని నిర్వీర్యం చేయడానికి పని చెస్తూ ఉంటాడు. హానా అతనికి దగ్గరవుతుంది. ఇంగ్లీషు పేషంటుతో కూడా అతనికి స్నేహం కలుగుతుంది. అతనికి బాంబుల గురించి గన్ల గురించి చాలా విషయాలు తెలిసినందువలన ఇద్దరూ ఆ విషయాలపై మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇంగ్లీషు పేషంటు మెల్లిగా తన కథ చెప్పుకొస్తాడు. అతను ఒక కార్టొగ్రాఫర్. అంటే మాప్లు తయారు చేయడం అతని పని. ఆఫ్రికాలో ఎడారి ప్రాంతాలలో దార్లు కనుక్కునే పని చేస్తూ ఉంటుంది అతని బృందం. అతని బృందంలో కొత్తగా పెళ్ళి అయిన ఒక క్లిఫ్టన్ అనే ఒక ఇంగ్లీషు వ్యక్తి భార్యతో సహా చేరతాడు. మొదటి చూపులోనే అతని భార్యతో ప్రేమలో పడతాడు ఆ ఇంగ్లీషు పేషంట్. కేతరిన్ కూడా అతన్ని ప్రేమిస్తుంది. భర్త లేని సమయంలో అతన్ని కలుస్తూ ఉంటుంది. కాని భర్తకు అన్యాయం చేస్తున్నానేమో అన్న ఆలోచన ఆమెకు కలిగి అతనితో సంబంధం మానుకుంటుంది. కాని క్లిఫ్టన్‌కు వారి గురించి తెలిసిపోతుంది. వారిద్దరిపై కోపం పెంచుకుని ఇంగ్లీష్ పేషంట్‌ను చంపాలని అతనిపై విమానంతో దాడి చేస్తాడు. కాని విమాన ప్రమాదం జరిగి అతను మరణిస్తాడు. ఇంగ్లీష్ పేషంట్ తప్పించుకుంటాడు. అయితే విమానంలో కేథరీన్ కూడా ఉంటుంది. ఆమె అ ప్రమాదంలో తీవ్రంగా  గాయపడుతుంది. గాయాల బాధ మధ్యే తాను నిజంగానే ఇంగ్లీషు పేషంట్‌ని ప్రేమించానని, తన పెళ్ళి కారణంగా నిస్సహాయంగా అతని వదులుకున్నానని చెబుతుంది. ఇంగ్లీష్ పేషంట్ ఆమెను కాపాడాలి అనుకుంటాడు. ఆమెను ఒక గుహలో పెట్టి సహాయం కోసం ఎడారి బైటకు వస్తాడు. కలిసిన సైనికులకు తన పేరు చెబుతాడు. అతను హంగేరీ దేశస్తుడు. పేరు ఆల్మ్సె. ఆ పేరు విని అతను ఇంగ్లీషువాడు కాడని ఇంగ్లీషు సైన్యం అతన్ని అరెస్టు చేస్తుంది. వారి నుండి తప్పించుకోవడానికి జర్మన్లకు సహాయపడి వారి కాంగో ఎడారి దాటడానికి సహయం చేస్తాడు ఆల్మ్సె. చివరకి కొన్ని నెలల తరువాత కేతరీన్ ని ఉంచిన గుహకు చేరతాడు. అప్పటికే కేథరిన్ మరణిస్తుంది. ఆమే శవంతో ఒక హెలికాప్టర్‌లో ఎడారి దాటి ప్రయత్నంలో ఆ ప్లేనుకి నిప్పంటుకుని అది కాలిపోతుంది. ప్లేను నుండి క్రిందకి దూకుతున్నప్పుడు అతని శరీరానికి నిప్పు అంటుకుని అతను గాయపడతాడు. ఎడారి తెగల మనుష్యులు అతన్ని హాస్పిటల్‌కు చేరుస్తారు. ఆల్మ్సే కథ విని కరావాగియో తాను వెతుకుతున్నది ఇతన్నే అన్నది అర్థం అవుతుంది. జర్మన్లకు ఆల్మ్సే సహయం చేయవలసిన పరిస్థితులను తెలుసుకుని అతను మౌనంగా ఉండిపోతాడు.   

ఒక రోజు రేడియో లోజపాన్ లోని హీరోషిమా, నాగసాకీ లపై బాంబులు వేసి ఆ దేశాలను ధ్వంసం చేసారన్న వార్త వింటాడు కిర్పాల్. అంత కిరాతకంగా బాంబులు వేసి అంతమంది ఆసియన్లను చంపిన యూరోపియన్లపై అతనికి కోపం వస్తుంది. కిర్పాల్ అన్న భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పని చేస్తూ ఉంటాడు. ఇంగ్లీషు వాడి ద్వంద్వ వైఖరి గురించి తమ్ముడిని చెబుతాడు. మొదటి సారి అన్న మాటలలోని నిజం కిర్పాల్‌కు అర్థం అవుతుంది. ఒక పక్క యూరోప్ లోని బాంబులను వెలికి తీసే ప్రయత్నంలో తన లాంటి వారు పని చేస్తూ ఉంటే ఆసియాపై తెల్లవాని వైఖరి అతనిలో కోపాన్ని కలిగిస్తుంది. ఒక తెల్ల దేశంపై యూరోప్‌లో మరో దేశం పై ఇలా బాంబులు వేయగలరా తెల్లవారు అని ప్రశ్నిస్తాడు. కారియాగో కూడా తెల్లవాడు ఎన్నడు మరో తెల్లదేశంపై ఇలా బాంబులు వెయడని చెప్పడంతో ఒక ఆసియా వాడిగా కోపంతో రగిలిపోతాడు కిర్పాల్, తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు.

హానా తండ్రి యుద్ధ సమయంలో ఒంటరిగా ఒళ్ళు కాలి చూసే వారెవ్వరూ లేక మరణిస్తాడు. తండ్రి మరణం హానాను కలిచి వేస్తుంది. అందుకే ఈ ఇంగ్లీషు పేషంటుకి సేవ చేయడానికి అంత కష్టపడుతుంది. యుద్ధం దూరం చేసిన ఆ తండ్రి ప్రేమను ఇలా సేవ ద్వారా పొందే ప్రయత్నం చేస్తుంది. తండ్రి మరణం గురించి సవతి తల్లికి కూడా చెప్పదు. చివరకు సవతి తల్లి వద్దకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని ఆమెకు ఉత్తరం రాస్తుంది. కిర్పాల్ భారతదేశం వెళ్ళిపోయి అక్కడ వైద్యవృత్తి అభ్యసించి డాక్టరవుతాడు. వివాహం చేసుకుని ఇద్దరి పిల్లల తండ్రి అవుతాడు. హానా అతనికి అప్పుడప్పుడు గుర్తుకువస్తూ ఉంటుంది. 

ఈ నవలను హాలీవుడ్ లో సినిమాగా తీసారు. సినిమాగా కూడా ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిత్రం అది. అయితే సినిమాలో కిర్పాల్సింగ్ పాత్రను కుదించేసారు. హీరోషిమా, నాగసాకీలపై బాంబు అతను లేవనెత్తిన ప్రశ్న సినిమాలో ఎక్కడా రాదు. యుద్ధంలో కూడా చేపే జాతి వివక్షతపై ఇంత ఘాటు ప్రశ్నని సినిమా విస్మరించి కిర్పాల్ పాత్రను అసహజంగా ముగించడం యూరోపియన్ హిపోక్రసి అనిపిస్తుంది. ఒక పాత్రను అంత ఇష్టంగా, ఆలోచనాత్మకంగా సృష్టించిన రచయిత ఈ విషయంలో మిన్నకుండిపోవడం కూడా నాకు ఆశ్చర్యపరిచిన విషయం….అందుకే ఆ సినిమాను నేను ఆస్వాదించలేకపోయాను. ఎన్ని పై పై ప్రేమలు చూపినా కొన్ని విషయాలలో తెల్లవారి స్వార్థం కనిపిస్తూనే ఉంటుంది. సినిమా దీన్ని ఒక ప్రేమ కథలాగే చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. కాని క్రిర్పాల్ పాత్రకు జరిగిన అన్యాయం, అతని ప్రశ్న మాత్రం భారతీయురాలిగా నా మనసులో తిరుగుతూనే ఉండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here