అత్యాచారానికి గురయిన పసి పిల్లల మానసిక స్థితిని చూపెట్టిన నవల THE GATHERING

0
8

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ఐ[/dropcap]ర్లాండ్ దేశస్తురాలు ‘ఆనీ ఎన్‌రైట్’ రాసిన పుస్తకం THE GATHERING కు 2007లో మాన్ బూకర్ ప్రైజ్ వచ్చింది. బూకర్ ప్రైజ్ వచ్చిన పుస్తకాలన్నీ చాలా గొప్పగా ఉండవని ఈ పుస్తకంతో అర్థం అయ్యింది. ఇది మంచి నవల కాదు అనలేను కాని బూకర్ ప్రైజ్‌కి ఎంపికవ్వడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఇది చివరి దాకా చదవడం చాలా కష్టం. పెద్ద సాగతీతగా అనవసరపు వ్యాఖ్యానాలతో నవల మందకోడిగా సాగుతుంది. ఆనీ ఎన్‌రైట్ గొప్ప రచయిత్రి. ఈ నవలకు ఆవిడ ఎన్నుకున్న విషయం, వాడిన భాష, కథను నడిపించిన పద్ధతి చాలా బావుంటాయి. కాని నవల సాగింపులో చాలా అనవసరపు ప్రసంగాలునాయి. అవి కథను అర్థం చేసుకోవడానికి సహకరించకపోగా మనలను అయోమయంలో పడేస్తాయి. అందువలన పాత్రలు కూడా అర్థం అయీ అవనట్లు ఉంటాయి. ఈ శైలి ఆవిడ కావాలనే ఎన్నుకున్నట్లు అర్ధమయినా నవలలో ప్రస్తావించిన సమస్యను జటిలం చేసి పాత్రల విశ్లేషణకు అడ్డం వస్తుంది.

వెరోనికా హెగార్టి ఒక 39 సంవత్సరాల స్త్రీ. ఐర్లాండ్‌లో డబ్లిన్ నగరంలో జీవిస్తుంటుంది. ఆమె సోదరుడు లియామ్ హెగార్టీ ఇంగ్లాండ్ లోని బ్రైటన్ నగరంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కబురు వస్తుంది. అతని శవాన్ని తీసుకుని, ఆ దేశపు పోలీసులతో ఫార్మాలిటిలు పూర్తి చేసుకుని అతని మృత శరీరాన్ని ఇంటికి తీసుకురావడానికి వెరోనికా ఇంగ్లండు వెళుతుంది. ఇవన్నీ చేస్తున్నపుడు తన గతంలోకి వెళుతుంది. తన చిన్నతనాన్ని, లియామ్‌తో గడిపిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. లియామ్‌తో వెరోనికాకి మంచి అనుబంధం వుంటుంది. వారిద్దరి మధ్య ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉన్న కారణంగా కలిసి బ్రతికారు ఇద్దరూ. లియామ్, వెరోనికా తల్లి తండ్రులకు మొత్తం పన్నెండు మంది సంతానం. తల్లి ఈ పన్నెండు పురుళ్ళతో ఏడు అబార్షన్లతో నిత్యం ప్రసవ వేదన పడుతూనే జీవించింది. ఇంటి నిండా పిల్లలు ఉన్న కారణంగా వారికి పెద్దవారికి మధ్య చాలా దూరం ఉండేది. లియామ్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు వెరోనికాతో పాటు అమ్మమ్మ అదా ఇంట గడిపుతాడు. అదా భర్త చార్లీతో ఒక అద్దె ఇంట్లో ఉండేది. చార్లీ పెద్ద సంపాదనాపరుడు కాదు పైగా గుర్రప్పాందాల పిచ్చి కూడా. ఆ ఇంటి యజమానీ లాంబ్ నుజెట్ ఎక్కువగా వీరితో గడిపేవాడు.

లియామ్ చనిపోయిన తరువాత అతని జీవితాన్ని విశ్లేషిస్తూ అతని మరణానికి వెనుక కారణాన్ని వెతికే ప్రయత్నం చేస్తుంది వెరోనికా. లియామ్ ఒక తాగుబోతు. ఆడపిల్లలతో తిరిగేవాడు కాని ఎవరితో మనస్ఫూర్తిగా బంధాన్ని ఏర్పరుచుకోలేకపోయాడు. ఎప్పుడు ఒంటరే చివరికి అలా ఒంటరిగా మరణించడాన్నే కోరుకున్నాడు. ఇద్దరు పిల్ల తల్లిగా ఇప్పుడు వెరోనికా సోదరున్ని అర్థం చేసుకోగలుగుతుంది. అతని ఆత్మహత్య వెనుక, అతని నిరాశాపూరిత జీవితం వెనుక చిన్నతనంలో అమ్మమ్మ ఇంట్లో జరిగిన సంఘటన కారణం అని ఇప్పుడు ఆమెకు బలంగా అనిపిస్తుంది.

వెరోనికా చిన్నతనాన్ని గుర్తుకుతెచ్చుకుంటుంది. ఆమె సోదరుని అంతక్రియలకు సిద్దపడుతూనే మధ్య మధ్యలో గతంలో జారుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు గుర్తు కొచ్చే గతంలోని సంఘటనలను మళ్ళీ తానే మార్చి అలా జరిగిందా ఏమో అని కూడా ఆశ్చర్యపడుతూ ఉంటుంది. వెరోనికా అమ్మమ్మ కథతో ఆమె గతం మొదలవుతుంది. అదాతో నుజెంట్ మొదటి సారి కలిసినప్పుడు ఆమెను కోరుకుంటాడు. కాని అదా నుజెంట్ స్నేహితుడు చార్లీని వివాహం చేసుకుంటుంది. అదా జీవితం అంతా అయోమయంగానే వెరోనికా గతంలో కనిపిస్తుంది. ఆమె జీవితంలో ఏ విషయంలో స్పష్టత ఉందదు. నుజెట్ అదాని మోహిస్తాడు. మరి వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉండిందో అన్న దాన్ని రచయిత్రి మన కల్పనకే వదిలేస్తారు. అదాకి మతి చలించిన ఒక కొడుకు నిత్యం పిల్లలను కనే ఒక కూతురు ఉంటారు. ఆమే వెరోనికా తల్లి. ఈ ఇద్దరి పిల్లల మానసిక స్థితి కూడా ప్రశ్నార్ధకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలుండవు.

ఇక అప్పుడు వెరోనికా అసలు విషయానికి వస్తుంది. చిన్నప్పుడు నూజెంట్ లియామ్‌పై లైంగికంగా అత్యాచారం జరిపాడని. దాన్ని ఆమె చూడడం అనుకోకుందా జరిగిందని కాని జీవితమంతా దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ గడిపానని. లియామ్‌పై జరిగిన ఆ అత్యాచారాన్ని నలుగురికి చెప్పి అతనికి జరిగిన అన్యాయానికి తోడబుట్టిన సోదరిగా ప్రతిక్రియ చూపకపోగా మౌనంగా ఉండి అతన్నిఒంటరివాడిని చేయడం వలనే లియామ్ మానసికంగా ఆరోగ్యవంతుడిగా జీవించలేకపోయాడని. అత్యాచారం కన్నా తాను అతన్ని ఒంటరిని చేయడమే అతన్ని జీవితాంతం ఒంటరివాడిని చేసిందని ఆమెకు అప్పుడు అనిపిస్తుంది. ఆమెకు తన జీవితంపై, భర్త పై, పిల్లల పై మమత చనిపోతుంది. భర్త తో సంసార జీవితానికి దూరం అవుతుంది.

చిన్నతనంలో పిల్లలపై జరిగే అత్యాచారం వారిని జీవితాంతం వెంటాడుతుందని, ఆ పసిమొగ్గలు ఎప్పటికీ మామూలు జీవితాన్ని జీవించలేరని, వారి చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు ఏర్పరుచుకోలేరని, దీని కారణంగా వారితో కలిసి ప్రయాణించేవారందరూ ఆ విషాదాన్ని అనుభవించవలసి వస్తుందని చెప్పడం రచయిత్రి ఉద్దేశం అని స్పష్టమవుతుంది. తన జీవితంలో విషాదానికి కారణమేమిటో, తామెందుకు మామూలు వ్యక్తులుగా జీవించలేకపోతున్నామో తెలుసుకోలేక ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించవలసిప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది. ఈ విషయాన్ని లియామ్ పాత్ర ద్వారా రచయిత్రీ చెప్పే ప్రయత్నం చేసారు.

ఇంత భయంకరమైన సమస్యను ప్రస్తావిస్తూ ఈ నవలలో కొన్ని అనవసరమైన వివరణలతో నవలకు క్లిష్టతను చేర్చారు రచయిత్రి. సెక్స్‌కి సంబంధించిన వివరణలతో కొంత విసుగు కలుగుతుంది. అలాగే వెరోనికా చిన్నతనపు జ్ఞాపకాలన్నీ అస్పష్టంగానే ఉంటాయి. అందువలన కొన్ని అత్యవరమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. లియామ్ ఒక్కడి పైనే ఈ అత్యాచారం జరిగిందా? వెరోనికా కూడా అత్యాచారానికి గురు అయ్యిందా? లియామ్ వెరోనికాల మధ్య బంధం ఎలాంటిది? వారిద్దరి మధ్య శారీరిక సంబంధం ఏర్పడిందా? వెరోనికా తల్లి మేనమామ కూడా ఇలాంటి అత్యాచార భాదితులేనా? అందుకే వారు మానసికంగా దెబ్బతిన్నారా? ఇలాంటి సందేహాలు కలిగిస్తూ కూడా జవాబులు ఇవ్వరు రచయిత్రి. వెరోనికా తన జ్ఞాపకాలలోకి వెళూతూ చాలా వివరణ ఇస్తూ చివరకు ఇది ఇలా జరగలేదేమో అంటూ మనలను అయోమయపరుస్తుంది. అంటే చిన్నప్పటి చేదు అనుభవాలు ఒక పట్టాన గుర్తుకు రావని, గుర్తుకువచ్చినా అవి కల్పనతో కలగలసి ఉంటాయని చెప్పడం రచయిత్రి ఉద్దేశం కావచ్చు. ఆ విషయాన్ని స్పష్టపరచడానికి ఈ శైలి రచయిత్రి ఉపయోగించి ఉండవచ్చు. కాని చదివేవారికి మాత్రం, చాలా విసుగు కలిగిస్తుంది.

కథనంపై మంచి పట్టు ఉండి రచయిత్రి ఇలా రహస్య శోధన పద్దతిలో ఈ విషయంపై రాయడం వలన నవల రుచించదు. చిన్నపిల్లలపై అత్యాచారాలు కుటుంబాలను నాశనం ఎలా చేస్తాయో ఆవిడ చెప్పాలనుకున్నా ఆ అత్యాచారం తరువాతి విషాదం పట్ల వారి బాధ అర్థమవుతున్నా, నవలగా చదువుతున్నప్పుడు ఈ శైలి ఇలాంటి కథావస్తువుకు నప్పలేదని అనిపిస్తుంది. అదా వ్యక్తిత్వం అంతా అర్థం కానట్టుగానే ఉంటుంది. ఆమెకు ఇంట్లో జరుగుతున్నదంతా తెలుసా? జీవితంలోని ఆర్థిక సమస్యలను అతిక్రమించడానికి అన్నీ తెలిసినా మౌనంగా ఉందా? ఇది మరో పెద్ద ప్రశ్న, దీనికి ఈ నవలలో జవాబు దొరకదు.

నవలకు మాన్ బూకర్ ప్రైజ్ వచ్చిందంటే చాలా రకాల పరీక్షలకు గురి అయి వుండవచ్చు. కాని ఎందుకో ఇది ఆ స్థాయి రచన కాదేమో అన్న అభిప్రాయం మాత్రం కలిగింది. ఇందులో ప్రస్తావించిన సమస్యను మాత్రమే పరిగణలోకి తీసుకుని బహుమతి ఇచ్చారేమో అన్న ఆలోచన మాత్రం వదలడం లేదు. ఏమైనా ఇటువంటి రచనలు చదవడం వలన వివిధ రచనా శైలులతో పరిచయం మాత్రం గట్టిపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here