థ్రిల్లర్ & హారర్ చిత్రం – ‘ద ప్రీస్ట్’ (మలయాళం)

0
12

[dropcap]మ[/dropcap]లయాళం సినిమా చిత్రరంగంలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘ద ప్రీస్ట్’ చలన చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు. మిమ్మల్ని కొన్ని సీన్లు విపరీతంగా భయపెడతాయి. మొత్తం మీద మొదటి చిత్రంతోనే దర్శకుడు జోఫిన్ టీ చాకో మంచి చిత్రాన్నే తీశాడు అని చెప్పవచ్చు. కథ , కథనం, ఎడిటింగ్, కెమెరా, సంగీతం ఇలా అన్నీ రంగాలలో సరి అయిన సమన్వయం కుదిరి 147 నిమిషాల ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది.

దాదాపు ఇంటర్వెల్ వరకు థ్రిల్లర్, ఆ తరువాత కరుణ రసంతో కూడిన హారర్ జానర్‌తో పొయెటిక్ జస్టిస్‌తో కూడిన ముగింపుతో కూడి ప్రేక్షకులను నిరాశపరచదు.

మమ్ముట్టి తన వయసుకు తగిన పాత్ర ఎన్నుకున్నాడు. విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వటం వల్ల కబాలి చిత్రం ఎదుర్కొన్న లాంటి పరిస్థితి ఎదుర్కొంది ఈ సినిమా అంతర్జాతియంగా. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువయి, మమ్ముట్టీ ఫాన్స్ నిరాశపడ్డారు. అదే విధంగా విపరీతమైన హారర్ సీన్లను ఆశించిన విమర్శకులను కూడా రంజింపజేయలేకపోయింది. కథకి పెద్ద పీట వేసి, కథనానికి ప్రాముఖ్యతని ఇవ్వబడింది. ఏ విధమైన అంచనాలు లేకుండా చూస్తే నిరాశకలగదు. ఏది ఏమైనప్పటికీ విపరీతమైన కలెక్షన్లను రాబట్టటంతో సూపర్ హిట్టు అనే అనాల్సొచ్చింది విమర్శకులు సైతం.

మార్చ్ 11 2021 న థియేటర్లలో విడుదల అయిన్ ఈ చిత్రం కేరళలో సంచలనమే సృష్టించింది ఇటీవల.  తెలుగు వెర్షన్ లేదు. అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు.

తొంభయ్యవ దశకంలో ‘కంకణం’, ‘సూర్య’, ‘అధిపతి’, ‘జానీ వాకర్’, ‘దళపతి’ తదితర చిత్రాల రోజుల నుంచి మమ్ముట్టి అభిమానిని. ‘స్వాతి కిరణం’, ఇటీవలి ‘(పాద)యాత్ర’ లలో నేరుగా నటించి ఆయన ఎందరో తెలుగు అభిమానుల్ని స్వంతం చేసుకున్నాడు.

నేను ఎటువంటి అంచనాలు లేకుండా చూశాను. నన్ను ఏ మాత్రం నిరాశపరచలేదు. బలమైన కథ, కథనాలు, మోతాదు మించని హారర్ దృశ్యాలు ఇవనన్నీ మిమ్మల్ని కూడా ఆకట్టుకుంటాయి.

కథ విషయానికి వస్తే:

ఒక వర్షం రాత్రి సెయింట్ మేరీస్ అనే ఆసుపత్రికి, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక స్త్రీని ఆంబులెన్స్‌లో తీసుకురావటంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

అదే ఆసుపత్రిలో అదే సమయంలో నెలలు నిండిన అనాథ అయిన ఒక పేద స్త్రీ ఒంటరిగా వచ్చి చేరుతుంది. రెండు ఆపరేషన్లు ఏకకాలంలో ప్రారంభం అవుతాయి.

ఈ దృశ్యం ఈ సినిమాకి ఆయువు పట్టు. నేను సస్పెన్స్ విప్పనుగాక విప్పను.

తెరపై టైటిల్స్ ప్రారంభం అవుతాయి. ప్రధాన పాత్రధారి అమేయా గేబ్రియల్ అనే పదకొండేళ్ళ చిన్నపిల్ల. కథ యావత్తు ఈ పిల్ల చుట్టే తిరుగుతుంది. నటనలో ఈ పిల్లకి నూటికి నూరు మార్కులు ఇవ్వచ్చు. ఒక క్రైస్తవ అనాథ శరణాలయంలో ఉంటూ, చదువుకుంటూ ఉంటుంది ఈ పిల్ల. టైటిల్స్ వస్తున్నంత సేపు, పిల్లల క్రైస్తవ ప్రార్థనలు ఒక వైపు, ఈ పిల్ల ఉదయం నిద్ర లేవడం, హాస్టల్ కాంటిన్‌కి వచ్చి ఉదయం అల్పాహారం తీస్కోవటం గట్రా ఇంకో వైపు చూపిస్తారు.

ఇక ఈ పిల్లకి చదువు అంటే చిరాకు, దైవ ప్రార్థనలంటే చిరాకు. ఎవరితో ప్రేమగా మసలుకోదు. అందర్నీ కసరుకుంటు, ఒంటరిగా కాలం గడపటానికి ఇష్టపడుతూ ఏకాంతంగా ఉంటుంటుంది. చదువులో అత్తెసరు మార్కులు తెచ్చుకుంటూ టీచర్లందరితో తిట్లు తింటూ ఉంటుంది.

ఒకరోజు ఈ పిల్ల ఎకాఎకిన స్కూలు బ్యాగు రోడ్డుపక్కన పారేసి ఆ అనాథాశ్రమం నుంచి పారిపోతుంది. అలా పారిపోయిన ఈ పిల్లని ఒక మల్టీ మిలియనీర్ అయిన సీఈఓ ఒకావిడ జాలిపడి తనింటికి తీస్కుపోతుంది.

ఇంకో వైపు, మమ్ముట్టి ఫాదర్ కారెమన్ బెనెడిక్ట్ అనే పాత్రలో కనిపిస్తాడు. ఆయన చాలా దయామయుడు. ఎలాగూ చర్చ్ ఫాదర్ కాబట్టి ఆయన్ని అందరూ విపరీతంగా గౌరవిస్తుంటారు. పోలీసులు, రాజకీయ నాయకులు ఇలా ఒకరేమిటి, అందరూ ఆయన్ని చాలా గౌరవిస్తుంటారు. మీదు మిక్కిలి, ఆయన ఆత్మలతో సంభాషించగల నేర్పరి. ఆయనకున్న అపరిమితమైన లాజికల్ థింకింగ్ కారణంగా పోలీసు శాఖ వారు ఆయన సాయం తీసుకుని అనేక మిస్టీరియస్ కేసుల్ని సులభంగా పరిష్కరించి వారు కీర్తి, ప్రమోషన్లు పొందుతుంటారు. ఇంచుమించు ఈయన జీతం తీస్కోని ఒక డిటెక్టివ్. పోలీసు శాఖ వారు కేసు పరంగా ఈయనకు ఏ సాయం కావాలన్న అందజేస్తారు, అది ఆయన స్థాయి.

ఒక యువతి ఆయన్ని కలుస్తుంది. ఆమె చెబుతుంది “ఫలానా పెద్ద పారిశ్రామిక వేత్తల కుటుంబం గూర్చి మీకు తెల్సు కద, వారింట్లో అనుమానస్పదంగా సీఈవో స్థాయి వ్యక్తులు, ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇలాగే కొనసాగితే ఆ వంశం కూలిపోతుంది, ఆ వ్యాపార సామ్రాజ్యం కూడా అంతరించిపోతుంది, మీరేంటి ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవటంలెదు, నేను ఆ వంశస్థురాలినే, మీ సాయం అర్థిస్తున్నాను” అని ఆయన్ని కోరుతుంది.

ఆయనది అసలే దయార్ద్ర హృదయం కద. ఇక ముందుకు కదిలి చిటికేలో ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. యథాప్రకారం ఆ డీఐజీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంశలు కూడా అందుతాయి.

ఇందాక చెప్పుకున్నాం చూడండి పదకొండేళ్ళ చిన్నపిల్లని ఒక సీఈఓ స్థాయి మహిళ జాలి పడి తనింటికి తీసుకువెళుతుందని, ఆ మహిళ అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. మమ్ముట్టి ఎంటర్ అయ్యేటప్పటికి ఆ విగతజీవురాలున్న గదిలో ఈ పదకొండేళ్ళ అమేయ నిశ్శబ్దంగా కూర్చుని ఉంటుంది.

ఈ వరుస ఆత్మహత్యల కేసులను పరిష్కరించటం ద్వార మమ్ముట్టి తెలివి తేటలని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. అదే విధంగా ప్రధాన పాత్రధారి అయిన ఆ పిల్లని మమ్ముట్టిని కలపటానికి ఈ కేసు ఉపయోగపడుతుంది.

దర్శకుడికి మొదటి చిత్రం అవటం వల్లనుకుంటాను, దాదాపు మొదటి ఇరవై, ఇరవైఅయిదు నిమిషాలు సాగతీయబడింది ఈ వరుస హత్యల కేసు.

అనాథ శరణాలయం సిస్టర్ చెబుతారు, ఆ పిల్లకు తరచు ఇలా పారిపోవటం మామూలేనని.

వరుస అనుమానాస్పద మరణాలు ఒక వైపు, ఈ పిల్ల తరచు ఈ పిల్ల పారిపోవడం ఒక వైపు. సంఘటన స్థలంలో ఈ పిల్ల మమ్ముట్టికి తారసపడటంతో ప్రేక్షకులు తెగ ఉత్కంఠకి గురవుతారు.

ఆ తరువాత సంఘటనలు ప్రేక్షకులని వేరే లోకాలకి తీసుకువెళతాయి, సస్పెన్స్, హారర్, కరుణ, హింస, ఇలా అనెక అంశాలు మనల్ని కలవరపెడతాయి. ఇక కథ వేగం పుంజుకుంటుంది.

ఈ స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ జెస్సీ (నిఖిలా విమల్) మొదటి చూపులోనే ఈ పిల్లకి దగ్గరవుతుంది. ఈ పిల్ల ఈ టీచర్ ఎన్నో జన్మలనుంచి పరిచయం ఉన్నవారా అన్నట్టు కలిసి పోతారు. ఎవ్వరిమాటా వినని ఈ పిల్ల ఈ టీచర్ కి మాలిమి అవుతుంది. ఆ తరువాత, పండగ శెలవులకు ఆ టీచర్ వెంబడి, టీచర్ వాళ్ళ ఊరికి మారం చేసి మరీ వెళుతుంది ఈ పిల్ల. టీ ఎస్టేట్‌ల మధ్య మంచుతెరల నడుమ ఉన్న లంకంత ఇంట్లో అనుకోని ఉపద్రవాలు ఏర్పడతాయి.

ఆ తరువాత అక్కడ జరిగే అనేక సంఘటనలు, మలుపులు ఇవన్నీ తెరపై చూడాల్సిందే. ఇదీ స్థూలంగా కథ.

మమ్ముట్టి నటన బాగుంది. తన వయసుకు తగిన పాత్ర ఎన్నుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ , డాన్సులు, పాటలు, ఫైట్లు లాంటి చాదస్తాలు పెట్టుకోలేదు. కథకి అనుగుణంగా ఒక్కోసారి తను తెరపై దాదాపు ఒక అరగంట కనపడడు. మిగతా పాత్రల మధ్యనే నడుస్తుంది కథ. ఇలాంటి ఆరోగ్యకరమైన లక్షణాలు మన తెలుగు దర్శకులు, హీరోలు అలవరచుకోవాలి.

కాకపోతే దర్శకుడు హారర్ దృశ్యాలని ఎలా నడపాలో దిక్కు తెలియక కొన్ని సార్లు నవ్వు తెప్పించాడు. మమ్ముట్టి ఏవో నాలుగు ఇంగ్లీష్ వాక్యాలు చెప్పి ఆత్మలని బెదరగొడతాడు. అదే విధంగా కంప్యూటర్ మానిటర్‌కి నాలుగు కేబుల్స్ తగిలించి దెయ్యాల చరిత్ర మొత్తం రాబడ్తాడు, వాక్యూమ్ క్లీనర్ లాంటి ఒక ఉపకరణం వాడి, దెబ్బకు ఆత్మని వదలగొడతాడు. 4X4 ఇంపోర్టెడ్ ఎస్.యూ.వీ లాంటి జీపొకటి వేసుకుని దర్జాగా తిరుగుతూ ఉంటాడు. మాట్లాడితే చాలు ఆపిల్ లోగో కనిపిస్తూ ఉండగా ఫోన్లో సంభాషిస్తూ కనిపిస్తాడు.

కేరళలో క్రైస్తవం ఎంతగా పాతుకుపోయిందో ఈ చిత్రం అడుగడునా తెలుస్తూ ఉంటుంది.

ఒకనాటి హీరోయిన్ మంజూ వారియర్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపిస్తుంది. ఆమె చాలా కీలకం ఈ కథలో.

నేను ఇటీవల ‘ద రూమ్’ అనే ఆంగ్ల థ్రిల్లర్, ‘మై క్లయింట్స్ వైఫ్’ అనె హిందీ చిత్రం చూసి తీవ్రమైన నిరాశకి గురి అయి ఉన్నాను.

“ఆడ్ ఇన్ఫినిటమ్” తరువాత ఇటీవలి కాలంలో మంచి సినిమా చూడాలి అనే నా దాహాన్ని ఈ సినిమా తీర్చింది.

భయానకం సుఖపరం
గర్భేచ కరుణో రసః
అద్భుతోంతే సుక్లుప్తార్థో….
.
అని సాగే ఈ శ్లోకం అగ్నిపురాణంలోనిది. ఒక చక్కటి కథ ఎలా ఉండాలి అన్న విషయం ఈ శ్లోకంలో చెప్పబడింది.

అష్టాదశ పురాణాల్లోని ‘అగ్నిపురాణం’లో ప్రస్తావించబడ్డ ఒక శ్లోకం గూర్చి పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన శ్రీ గోపాలకృష్ణ గారు తన డాక్టరేట్‌కై సమర్పించిన పరిశోధనా గ్రంథంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు.

భయానకమైన సంఘటనతో ప్రారంభం అయ్యి, కరుణ రసం పొంగి పొరలుతూ కథనం సాగాలి. ఊహకందని అద్భుత ఘట్టాలతో నడుస్తూ, క్లుప్తమైన చిక్కటి సంభాషణలతో నడుస్తూ, ప్రేక్షకులను/పాఠకులను ఉద్విగ్న పరచాలి అని చెప్పబడింది.

నాకు తెలిసి ఈ చిత్ర దర్శకుడు అగ్నిపురాణం చదివి ఉంటాడని అనుకోను.

కానీ ఒక మంచి కథకు కావాల్సిన దినుసులు అన్నీకుదిరాయి ఈ కథలో. చివర్లో సత్యమేవ జయతే అన్న విధంగా పొయెటిక్ జస్టిస్ జరగటం ప్రేక్షకుడిని తృప్తి కలిగిస్తుంది.

ఆద్యంతం కథకి, స్పష్టతతో కూడిన కథనానికి పెద్ద పీట వేయటం దర్శకుడి పరిణతకి సూచన. ఇలాంటి లక్షణాలు హిందీ దర్శకుడు మహేష్ భట్ క్యాంపు నుంచి వచ్చే ప్రతీ చిత్రంలో ఉంటాయి. రాంగోపాల్ వర్మ సినిమాలో ప్రధాన లోపం ఇదే. టెక్నిక్‌కి పెద్ద పీట వేసి, గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చి, కథని, కథనాన్ని తుంగల్లో తొక్కే దర్శకులు ఈ చిత్రాన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు.

ఇటీవల ఎన్నో సందర్భాలలో ఎస్.ఎస్. రాజమౌళి గారు ఇదే చెప్పారు. టెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్ ఇవన్నీ నా కథని ఎలివేట్ చేసే విధంగా చూసుకుంటాను తప్ప డామినేట్ చేయకుండా చూసుకుంటాను అని.

ఈ అంశాలన్నీ నూటికి నూరుపాళ్ళు సమపాళ్లలో సరిపోయిన సరిపోయిన కరుణ రసాత్మక హారర్ చిత్రం ఈ ‘ద ప్రీస్ట్’. దెయ్యాలనంగానే భయపడాల్సిన పని లేదు, అవేమి హాని చేయవు, వాటి బాధలు వాటికి ఉంటాయి అన్న భావన కలిగి ‘ఈ సారి ఎక్కడన్న దెయ్యాలు తారసపడితే వాటికి సాయం చేద్దాం బాబు’ అనిపిస్తుంది చివరికి వచ్చేటప్పటికి.

దెయ్యాలకు కూడా ఆవేశమే తప్ప అలోచన ఉండదబ్బ అని సున్నితంగా విసుక్కుంటాం ఒక దశలో. మమ్ముట్టి అంతటి వాడు లేకుంటే మనకు దిక్కెవ్వరబ్బా ఇలాంటి దెయ్యాలతో అని కూడా అనిపిస్తుంది.

అంటే, చల్ నిజంగా దెయ్యాలుంటాయా పాడా అని కూడా మనల్ని ఆలోచించనీయకుండా, లాజిక్ కూడా మిస్ అయి మనం కథలో పూర్తి స్థాయిలో లీనమయ్యేలా కథనాన్ని నడిపిన దర్శకుడికి జోహార్లర్పించవలసిందే.

ఈ సినిమాని సకుటుంబంగా చూడొచ్చు. చిన్న పిల్లలు, బలహీన మనస్కులు, భయపడే అవకాశాలు ఉన్నాయి కొన్ని సీన్లలో. ‘అవి చాలలేదు ఇంకా మాకు’ అని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో కొందరు నేషనల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులు పేర్కొన్నారు. మరి వారు ఏమి ఆశించారో తెలియదు. ఇవి చాలు నా వరకు నాకు.

ఈ చిత్రానికి నిర్మాతలు వీ.ఎన్. బాబు, ఆంటో జోసెఫ్, బీ ఉన్ని కృష్ణన్.

సంగీతం రాహుల్ రాజ్

ఫోటోగ్రఫీ అఖిల్ జార్జ్

దర్శకత్వం: జోఫిన్ టీ చాకో      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here