ఆకాశం రంగు నీ మనస్సు చెప్పిందే : The sky is pink

0
5

[box type=’note’ fontsize=’16’] “వొక నిజ జీవిత గాథను ఇంతకంటే మెరుగ్గా తీసి వుండవచ్చు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

ఈ చిత్రం నేను చూడడానికి కారణం ఇది శోనాలి బోస్ దర్శకత్వంలో వచ్చిందని. ఈమె ఇదివరకు తీసిన మార్గరిటా విత్ అ స్ట్రా గుర్తుండే వుంటుంది. ఎంచుకునే వస్తువు, రాబట్టే నటనలు, కథ చెప్పే తీరు ఇవన్నీ ఆమె పేరును మరిచిపోకుండావుండేలా చేస్తాయి. కాని ఈ చిత్రం ఆ స్థాయిలో లేదు. కాని మానవ సంవేదనలను, జీవితం మనిషిని తోసేసే లోయల్లోకి వో దృష్టి సారించడానికి అవసరమే.

వొక చోట తల్లి కొడుకుతో ఫోనులో మాట్లాడుతుంది. కొడుకు ఫిర్యాదు చేస్తాడు, ఈ రోజు మా టీచర్ అందరి ముందూ నన్ను అవమానపరచింది, వో మూల నిలబెట్టింది అని. ఎందుకు అని అడుగుతుంది తల్లి. డ్రాయింగ్ వేయమంది అందరినీ, నేను ఆకాశం రంగు లేత ఎరుపు వేశాను. ఎక్కడన్నా ఆకాశం ఆ రంగులో వుంటుందా, నీలి రంగులో గాని అంది, అందరూ నవ్వారు; నన్ను వెక్కిరించారు, టీచర్ నన్ను పనిష్ చేసింది, ఏడుస్తూ చెబుతాడు. అప్పుడు తల్లి అంటుంది, ఎవరన్నారు ఆకాశం నీలి రంగులోనే వుంటుందని, ఎవరి ఆకాశాలు వారివి, ఎవరి ఆకాశం వారికిష్టమైన రంగులో వుంటుంది. నువ్వు బాధపడకు, దబాయించి ఇదే మాట చెప్పు అంటుంది.

ఇక కథ వో బిడ్డను కోల్పోయిన తల్లి దండ్రుల హృదయ విదారక బాధ గురించి. ఇది స్పాయిలర్ కాదు, కథ చెప్పేదే ఆ చనిపోయిన పాప. మనం మహేశ్ భట్ తీసిన “సారాంశ్” చూశాము. విదేశానికి వెళ్ళిన కొడుకు తిరిగి వచ్చేది అస్థికల రూపంలో. ఆ బాధను ఎలా భరించారో రోహిణీ హత్తంగడి, అనుపం ఖేర్ లు బాగా వ్యక్తపరిచారు; మహేశ్ భట్ కూడా గుండెలు పిండేసేటట్టు కథ చెప్పాడు. అయితే ఇక్కడ కథ ఎక్కడ తేడాగా వుంటుందంటే, పాప పుట్టిన క్షణం నుంచే ఆమె చనిపోబోతుందని, జీవితం స్వల్పమని తెలిసీ దక్కించుకోవడానికి ఆ తల్లి దండ్రులు ఎన్ని అష్టకష్టాలు పడతారో, ఎంత వేదనకు గురి అవుతారో అన్నది కథ. ఈ కథ వో నిజ జీవితంలో జరిగిన కథ. పాప బ్రతకదనీ, ఆయుష్షు తక్కువే అనీ తెలిసీ పద్దెనిమిదేళ్ళు ఆ తల్లిదంద్రులు పడ్డ మానసిక యాతన తలచుకుంటేనే మనసు ఏదోలా అయిపోతుంది.

నిరేన్ (ఫర్‌హాన్ అఖ్తర్), అదితి (ప్రియాంక చోప్రా) లు భార్యా భర్తలు. మొదట వో అమ్మాయి పుట్టి చనిపోతుంది. వీళ్ళిద్దరి DNAలు లక్షమందిలో వొక జంటకు వచ్చే విచిత్రమైనవి. దాని కారణంగా పుట్టే పిల్లలకు వైకల్యం వచ్చే అవకాశం ఎక్కువ. అదే కారణంగా పాప చనిపోతుంది. రెండో కానుపులో అబ్బాయి ఆరోగ్యంగానే పుడతాడు. అనుకోకుండా మూడోసారి అదితి గర్భం దాలుస్తుంది. తమ పరిస్థితి తెలిసీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అలా జరిగిపోతుంది. మొదటి పాప పోయాక అదితి క్రైస్తవం పుచ్చుకుంటుంది. క్రైస్తవం ప్రకారం అబార్షన్ చేయించుకోవడం పాపం. కాబట్టి ఆ పని చేయలేనంటుంది. మన పరిస్థితి తెలుసు కదా, బిడ్డకు రాగల ప్రమాదం కూడా తెలుసుకదా అని నచ్చచెప్పబోతాడు నిరేన్; కాని ఆమె వినదు. అమ్మాయి ఐషా, అంటే అర్థం జీవితం అని, పుడుతుంది. కాని దురదృష్ట వశాత్తు ఆ పాపకు SCID అనే అరుదైన జబ్బు చేస్తుంది. అలాంటి పిల్లలు బ్రతకడం జరగదు. అయినా బిడ్డను బతికించుకోవాలని, బంధు మిత్రుల ఆర్థిక సహాయంతో పాపను లండన్ తీసుకెళ్తారు వైద్యం చేయించడానికి. బ్రతికే అవకాశాలు తక్కువైనా, వొక చికిత్స వుంది కానీ చాలా ఖర్చవుతుంది అంటాడు అక్కడి డాక్టరు. రేడియోలో వొక పాటల ప్రోగ్రాం మధ్య నిరేన్ తన బాధను చెప్పి ఆర్థిక సాయం కోరుతాడు శ్రోతలనుంచి. కదిలిపోయిన శ్రోతలు అతనికి అవసరమైన దానికంటే రెట్టింపు విరాళాలు ఇస్తారు. పాపకు రోగ నిరోధక శక్తి శూన్యం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జనాల సమ్మర్ధంలో అస్సలు తీసుకెళ్ళకూడదు, ఇల్లంతా పూట పూటకీ మందులతో శుభ్రపరుస్తూ వుండాలి. ఇలాంటి ఘోరమైన స్థితిలో ఆ జంట ఎన్ని కష్టాలు పడ్డదీ, పాపను అనుక్షణం ఆనందంగా చూడడానికి ఎన్ని అవస్థలు పడ్డదీ కథ. ముఖ్యంగా ఐషా పదిహేడు, పద్దెనిమిదో యేళ్ళలో. ఎందుకంటే అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి పోయి వుంటుంది. ఇక ఆమె జీవితంలో ప్రతి క్షణం ఆనందం పొందేలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆమె కూడా ఆ క్షణాలు జీవిస్తుంది. అయితే ఆమె సంరక్షణలో పాపం ఆ పిల్లవాడిమీద అవసరమైన ఫోకస్ వుండదు. పాప చనిపోయాక ఆమె గదిలోని ఆమె జ్ఞాపకాలను చూడలేనని నిరేన్, అవి వుండాల్సిందే అని అదితి కొట్లాడుకుంటారు. అయితే నువ్వుండు, నేను లండన్ వెళ్ళి పోతానంటాడు. చివరికి వాళ్ళు ఎలా వొక ఒప్పందానికి వస్తారు, వొక్కటవుతారు అన్నది మిగిలిన కథ.

ముందు తల్లీ కొడుకుల సంభాషణ చర్చించాను కదా. ఈ చిత్రం శీర్షిక ను అది పూర్తింగా సమర్థించదు. అందునా కథ చెప్పేది ఆ తల్లి కొడుకుల్లో వొకరు కూడా కాదు. ఎందుచేతనో కథను చనిపోయిన ఐషా చేత చెప్పిస్తారు. అదీ వొక రకంగా పర్లేదు అనుకుంటే కథంతా ఆ జంట బిడ్డను బతికించుకోవడానికి పడ్డ యాతనే చూపిస్తారు. ఆ అమ్మాయి బొమ్మలు వేస్తుంది, తన మ్యూజింగ్స్ లాంటి కథనాలు వ్రాసి పుస్తకం వేస్తుంది. ఇలాంటి ప్రత్యేకతలు వున్నాయి. తన శారీరిక రుగ్మత తెలిసి, చావు తప్పదు అన్న విషయమూ తెలిసి ఆమె పడ్డ యాతన మీద ఎక్కువ కథ వుండాల్సింది. అలా లేదు. అలా కానప్పుడు నేరేటర్ గా కొడుకును పెట్టినా బాగుండేది. సినిమా మొత్తం నైరాశ్యం యెక్కువ పరచుకుంది, అందునా నిడివి రెండున్నర గంటలు. వొక నిజ జీవిత గాథను ఇంతకంటే మెరుగ్గా తీసి వుండవచ్చు.

నటనలో ఫరాన్, ప్రియంకా, జైరా వాసిం లు బాగా చేశారు. పాటలు నాకు సంతృప్తిగా అనిపించలేదు. అరిజిత్ గొంతు బాగుంటుంది, పాడే స్థాయి కూడా గొప్పదే; కానీ ఎక్స్ప్రెషన్ నాకు సరిపోలేదు. అవన్నీ సరిగ్గా కుదిరితే ప్రేక్షకుడిని కథకు ఇంకా దగ్గర చేసే వీలుండేది. ఇంకా వ్రాయడానికి ఏ విశేషమూ లేదు. నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here